పుస్తక రాతలతో, నవలలతో, ఆఫీస్ పనులతో సమయం లేక “రస వర్ణనలు” కాస్త పక్కన పెట్టానే కానీ.. వదిలెయ్యలేదు.. ఈ మధ్య కొన్ని వర్ణనలు చూసాను.. ఎందుకో వాటిల్లో జీవం లేదు అనిపించింది.. మనసుతో కాకుండా AI చేత రాసినట్లు అనిపించింది.. నాకు అయితే మనసుతో, మనస్పూర్తిగా రాయడమే అలవాటు.. ఆస్వాదన లేని రచన ప్రాణం లేని శవం తో సమానం అని నేను బలంగా నమ్ముతాను.. అందుకే చాలా రోజుల తరువాత “నీలాంబరి” రాస్తున్నాను... ఇందులో ఉత్ప్రేక్ష, ప్రబంధం, కొంచం గజగమన వంటి ఘాటైన వర్ణనను చిల్కరింపుగా వ్రాసాను.. కేవలం దీన్ని సాహిత్య దృక్పథం తో ఓ వర్ణనగానే చూడమని చిరు అభ్యర్ధన.
నీలాంబరి..
*********
సు శ్రావ్య సౌందర్య సుధారస సిక్తమానసీ..
తమో మథన తేజోరాశి స్మితామృత లలనా।
చందన సుగంధి లలిత కపోల నిశితనేత్ర కమలముఖీ,
భావనాతీత రూపిణీ నీలాంబరమోహినీ నమోస్తుతే..॥
ఓ పడతీ..
నీ దేహమే.. కదిలే ఓ రసరాజనం
నీ అడుగే .. నడిచే ఓ ఛందస్సు
నీ ఊపిరే.. శ్వాసించే ఓ రాగతాళం
ఏమాటకామాటే నే .. ఏమా లావణ్యము!
ఏమా, సౌందర్య ఉద్దీపనము..!
ఓ సుమవదనా...
నీ చిరునవ్వే.. నాలో విరిసిన ఓ అక్షర మందారం
నీ చూపుల విన్యాసమే.. నా మదిలో సాగే ఓ అనంతమైన పల్లవి!
నీ సౌందర్య వీక్షణలో క్షణకాలపు కనురెప్పలు వాల్చుట కూడా ఓ అపరాధమేనే!
నీ కేశపాశములు, సాంద్ర నీల వర్ణపు మేఘమాలికలు
ఆ విశాలమైన నొసను దిద్దిన కస్తూరి తిలకం అష్టమి చంద్రుని పోలికలు
నీ అచంచలమైన కలువ రేకుల అంచున కాటుక అద్దిన ఆ నయనములు
లోకాన్ని కట్టిపడేసే మన్మధ బాణాల మధుర సమ్మోహనాలు
సంపంగి మొగ్గరీతిన రస రాజసాన్నిచ్చే ఆ నాసిక ముఖారవిందాలు
వేల భావాలను కురిపించే మధుర మకరంద భాండాగారాల దోర అధరములు
శంఖము వంటి కంఠము
లేత చిగుర్లు వంటి బాహువులు..
మకరంద నిలయాల వంటి బాహుమూలాలన,
కస్తూరి గంధపు చెమ్మ పరిమళమ్ము లిడువేళ!
కంచుకమున ఒదగలేక ఉరకలెత్తు,
బిగుతు బింకములు అధర స్పర్శకై తహతహలాడు వేళ!
ఇంద్రధనస్సు వంపును ధిక్కరించే నెలవంక నడుమొంపున,
నత నాభీయ సరస్సులో మకరంద తేనెలూరెడి వేళ!
తామర తంతువుల వంటి ఊరువుల పెనవేతలో,
రసజగత్తులో మధుర తాళములు మ్రోగించు వేళ!
లత్తుక మిసిమితో రంజిల్లు నీ పాదాంగుష్ఠము,
అంగజ ధ్వజాగ్రముపై మణిప్రవాళములా శోభిల్లు వేళ!
వారిజనేత్రియగు ఓ నీలాంబరీ..
చిరుస్వేదపు సుఖముల మధ్యన, ఆత్మలు ఏకమై తేలియాడక..
ఇక పొద్దుల తో పనేముంది?
కాలము సైతం కదలిక, వదలక మరిచి,
నీ దేహశిల్పమున బందీ అయ్యేవేళ!
సాగెను ఆ మదన మథనము.. అక్షరాల సాక్షిగా..
అనంతమైన ఓ సుఖంబులిడుగగన్!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:
Post a Comment