Monday, March 30, 2026

శతాబ్దపు గర్జన ...


 ఆవేశపూరితమైన ఓ విప్లవ రచన చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో .. “అక్షరం”, “కావ్యం”, “యుద్ధం”, “రక్తం”, “సత్యం”, “చీకటి”, “సూర్యోదయం”, “శబ్దం”, “శతాబ్దం” అనే చిన్న చిన్న పదాలను కూడా గంభీరమైన భావాలుగా గర్జించేలా మలిచాను. రచయితలు అందరూ వారి వారి రచనలను ఎంతో అత్యద్భుతంగా రాస్తున్నారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే వారికి నా నమస్సులు.. వారి అంత కాకపోయినా మన రచయితల కోసం రాసిన ఈ “శతాబ్దపు గర్జన” మీకు నచ్చుతుందని ఆశిస్తూ.. మీ సమాధానాలకోసం వేచి చూస్తున్నాను.


శతాబ్దపు గర్జన
*************

కాలపు గర్భంలో నిశ్శబ్దం పేలిన శబ్దం.. నా అక్షరం!
అన్యాయపు పునాదులపై నేను ప్రకటించిన యుద్ధం.. నా కావ్యం!

గడిచిన ప్రతి దశాబ్దం ఒక సాక్షి..
మనుషుల ముసుగుల వెనుక దాగిన కుళ్ళిన నిజాలకి!
రాబోయే ప్రతి శతాబ్దం ఒక వేదిక..
నా కలం విదిల్చిన రక్తం రాసే అక్షర సత్యాలకి!

నన్ను మౌనంలో బంధించాలనుకున్న ప్రతి సంకెళ్లు
నా పదాల అగ్నిలో తామే కరిగిన క్షణాలే నా చరిత్ర!
నా గొంతు ఒక మనిషిదే కావచ్చు..
కానీ దానిలో గర్జించేది యుగాలుగా నలిగిన జనసమూహాల నిశ్వాస!

నేను రాసేది కవిత కాదు
గాయపడిన గుండెల గొంతుకి దొరికిన ప్రతీకారం!
నేను పలికేది పదం కాదు
దోపిడీ గోడలపై విసిరిన అగ్నిముద్ర!

చీకటి తమ రాజ్యమని గర్వించినవారికి
నా అక్షరం సూర్యోదయం ముందు వినిపించే తొలి హెచ్చరిక!
మోసాన్ని ధర్మమని ముద్రించిన వక్రబుద్ధులకు
నా కావ్యం సత్యమై గర్జించి నిలిచిన ఓ సాక్ష్యం!

వాళ్లు కట్టిన సింహాసనాలన్నీ
బలహీనుల ఎముకలతోనే మోపినవని నాకు తెలుసు!
వాళ్లు ధరించిన విజయాలన్నీ
ఎన్నో అనాథ రోదనలని మూసిన బంగారు ముసుగులని నాకు తెలుసు!

అందుకే
నా కలాన్ని, సిరాతో రాయట్లేదు
మానవ వేదనల మరిగిన రక్తంతోనే
లిఖిస్తున్నాను!
నన్ను కవి అనొద్దు..
నేను కాలం గొంతులో ఇరుక్కుపోయిన అరుపుకి ప్రతిరూపం!
నన్ను రచయిత అనొద్దు..
నేను రాబోయే తరాల రక్తనాళాల్లో దాచిన తిరుగుబాటు జ్వాలకి మరోపేరు!

నా ప్రతి వాక్యం వెనుక ఒక వేదన ఉంది..
నా ప్రతి విరామం వెనుక ఒక విప్లవం ఉంది..
నా ప్రతి అక్షరం వెనుక ఒక అంతిమ నిర్ణయం ఉంది..
కూలిన గుడిసెల పొగలోనూ,
తుడిచిపెట్టిన బతుకుల బూడిదలోనూ,
కనిపించకుండా పోయిన నిజాల సమాధులలోనూ
నా క్షరం అక్షరమై ఉదయిస్తూనే ఉంటుంది!

ఒకప్పటి రచయితల ప్రస్థానం మళ్ళి మొదలైన రోజు
సింహాసనాలన్నీ కంపిస్తాయి..
చీకటి చట్టాలన్నీ చిరుగుతాయి..
మానవత్వం మళ్లీ తన రక్తంతో తానే తన బావుటా ఎగురవేస్తుంది!
ఆ రోజు
నా కావ్యం కేవలం చదవబడదు..
జీవించబడుతుంది!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment