ఓ నల్లనివాడా..
ఏమా అందం!
కారుమబ్బుల నలుపును
మేను కాంతిగా మార్చుకున్న నీలమేఘ శ్యాముడా..!
ఆ కురులపై ఊగుతున్న నెమలి పింఛం..
ప్రకృతి ఈ విశ్వకర్తకు సమర్పించిన ఒక మౌన కిరీటం!
నొసటన మెరిసే ఆ కస్తూరి తిలకం..
చీకటి ఆకాశంలో ఉదయించిన ఏకాంత నక్షత్రం!
చూడు
ఆ నిలువు నయనాలు ఎంత అందంగా ఉన్నాయో,
కరుణను, తన తుంటరితనాన్ని
ఏకకాలంలో కురిపించే ప్రేమ సరోవరాలవలె!
పెదవులపై విహరించే ఆ వేణువు చూడు..
అది నిర్జీవమైన వెదురు బొంగు కానే కాదు,
జగత్తునంతటినీ తన రాగపాశంతో
బంధించే ఓ దివ్య మంత్ర దండం!
ఆ చిరునవ్వు చూడు
వెన్నెల కూడా వెలవెలబోయేలా చేసే
ఓ అమృత ధారలా ఉంది!
అంతటి చిరునవ్వు వెనకాల
తొలి పొద్దు పొడుపులోని
బంగారు కాంతిని పులుముకున్న
తప్తకాంచన గౌరాంగి ఉంది! ఆమెనే రాధ!
తన కనురెప్పల చాటున దాగున్న చూపులు..
నల్లని తుమ్మెదలు విడిచిన ప్రణయ బాణాలు.
తన నుదుటన మెరిసే ఆ సింధూరం..
నల్లనివాడిపై ఆమెకున్న అనురాగానికి ఒక నిత్య సాక్ష్యం!
తన నడకలో..
యమునా తరంగాలు కూడా ఓడిపోయి
నిశ్చలంగా నిలబడిపోతాయి.
తను కట్టుకున్న పట్టు వస్త్రం..
వసంత కాలపు సంధ్యా రాగరంజితం..
తన మౌనంలో.. వేయి వేణువుల గానం వినిపిస్తుంది,
తన త్యాగంలో.. కృష్ణ తత్వమంతా లీనమై కనిపిస్తుంది!
ఆయన శ్యామ వర్ణం
తనలోని తేజస్సును అక్కున చేర్చుకుంటే..
తన ఆరాధన ఆయన దివ్యత్వాన్ని సంపూర్ణం చేస్తుంది.
ఒకరు 'స్వరం' అయితే..
మరొకరు 'సంగీతం'..
ఒకరు 'దేహం' అయితే..
మరొకరు ఆ దేహాన్ని నడిపించే 'ప్రాణం'..!
రాధాకృష్ణుల రూపం కళ్లతో చూసేది కాదు.
మనసు అనే అంతరంగ దర్పణంలో దర్శించాల్సిన అద్భుత దృశ్యం!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:
Post a Comment