Wednesday, January 31, 2018

కవిని చూద్దామని అతని ఊరెళ్ళాను...



కవిని చూద్దామని అతని ఊరెళ్ళాను 
నా ఆలోచనల పునాదుల్ని కుదిపేసినవాడు 
ఆవేశపు అలజడిని కన్నీటితో కరిగించినవాడు.. 

ప్రశాంతమైన నిద్రలేని రాత్రుల్ని వరంగా అందించినవాడు 
అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపకశక్తి ప్రసాదించినవాడు 
అతడెలా ఉన్నా .. ఆ కళ్ళలో వెలుగును చూద్దామని వెళ్లాను..

ఆనందం అనుభూతి ప్రధానమని 
సూదిమొనకు సున్నితత్వం అద్దేవాడ్ని 
ప్రేమను పదాలతో పంచేవాడ్ని 
దయను ఆర్ద్రం చేసేవాడ్ని 
కానరాని వరాలను గుప్పిట అందించే 
రూపం చూడ్డానికి ... వెళ్లాను. 

కళ్ళను చూపుతో తడుముదామని.. 
చేతిని చేతితో కలుపుదామని 
ఇతనూ మనలాంటివాడే కదా అనుకున్నప్పుడు 
నామీద నాకు గౌరవం పెరిగింది.. 
కవిని కనుగొనాలని దిగంతాలలోకి దూకగలనా .. 
వెలుగుని వెతుక్కుంటూ చీకటి బాట పట్టగలనా.. 
అగ్గిని జల్లే ఆకాశాన్ని చుట్టుకున్న వాడ్ని నేను 
చల్లబరిచే సమీరాన్ని చేరాలని కోరుకునేవాడ్ని 
కలల భస్మపు రాశితో బాటలు పరిచేవాడ్ని 
గమ్యం చేరలేని దారని తెలిసినా 
భుజం తట్టే చేతికోసం అలుపెరుగక ప్రవహిస్తున్న వాడ్ని 
కవి సముద్రమో కాదో.. జట్టు కట్టిన సంతోషంలో తేలి 
సాటి నదిలా కలిసి పారి... తనలాంటి జీవితంతో సంగమిద్దామని 
అన్నిరుచుల మట్టినీ ముద్దాడుతూ కథ ముగిద్దామని వెళ్లాను
రేపటి నూతన ప్రస్థానానికి.. !!

Written by : Bobby Nani

నాకే గనుక చేతనైతే ...



నాకే గనుక చేతనైతే ... 

పసిపిల్లల పిప్పర్మేంట్ నౌతా 
తీయ తీయగా కరిగిపోతా.. 

చిన్నారుల బ్యాగు నౌతా 
పుస్తకాలు మోసి పెడతా 

కన్నె పిల్లల కోరిక నౌతా 
కన్నవారి కానుకౌతా 

మగపిల్లల మీసమౌతా 
తెలుగువారి రోషమౌతా 

యుద్దవీరుని గన్ను నౌతా 
భారతమాత వెన్ను నౌతా 

మరుమల్లెల దండ నౌతా 
దేశభక్తుని దండమౌతా 

ఆప్తమిత్రుని దరహాసమౌతా 
అనాధకు విలాసమౌతా 

ఆర్తురాలికి అన్న నౌతా 
నిరుపేదకు అన్నమౌతా 

శ్రమజీవికి పాన్పునౌతా 
నిండుచూలాలి కాన్పునౌతా 

ముసలవ్వకు చేయూత నౌతా 
అవసరమైతే కొడుకు నౌతా..

Saturday, January 27, 2018

ఎడబాటు


నా
తలపుల్లో నిలిచి వున్నది 
నీవై నప్పుడు 
ఎడబాటుకు అర్ధమేముంది ??


ఎద ప్రతిధ్వనించెనా 
అడుగు అడుగులో మెదిలే సవ్వడై 
ఒంటరితనమే నా చిరునామా..

పగలైనా రేయైనా నీ ఊహే 
నన్ను నాకు వివరించేది.. 
నను నిలువరించి వరించేది

యుగాల విరామంలో క్షణాలు గడుస్తున్నాయి 
అంతరంగాల్లో మనోభావాలే 
జ్ఞాపకాల కూనిరాగాలై నిలుస్తున్నాయి..

ఆకాశం చలి కాగుతుంది 
నా ఊపిరిలోని వెచ్చదనానికి
నిను జీవితంలా శ్వాసించని

ఈ నేలపై 
నా అడుగుల తడబాటు 
నీ ఊహల్లో నేను నేనుగా ఉండాలనే 
ఆవిర్లు విరజిమ్మే ఈ గుండె చప్పుడు 
ఆగేలోగా మరోసారి 
మరొక్కసారి 
నినుచేరాలనే 
ఆశ 
నా ఈ ప్రయాస..!!

Written by : Bobby Nani

ఓ మిత్రుడు ఆడిన ప్రశ్న ..



ఓ మిత్రుడు ఆడిన ప్రశ్న .. 
శ్రీకృష్ణుడు ఒక్క అర్జునునికే ఎందుకు భగవద్గీతను బోధించాడు మిగతావాల్లెవ్వరూ అందుకు అర్హులు కాదా అని.. 
దానికి నా చిరు సమాధానం.. 
చాలా రోజులతరువాత నిక్కార్సైన ధర్మ సందేహం.. 
ప్రశ్న అడిగిన మిత్రునికి కృతజ్ఞతలు తెల్పుకుంటూ.. 

శ్రీకృష్ణుడు కాని, భాష్యకారులు కానీ, ఆ తరువాత వచ్చినవారు కాని కాదు.. అర్జునుడు మధ్యమాధికారి అయినట్లయితే శ్రీకృష్ణుడు ఆయనకు యోగశాస్త్రం బ్రహ్మవిద్య అయిన గుహ్యశాస్త్రాన్ని చెప్పేవాడేకాదు... పాండవ రాయబారిగా వెళ్ళి హస్తినాపురంలో భీష్మ, దృతరాష్ట్రులున్న కొలువులో విశ్వరూపాన్ని ప్రదర్శించాడే కాని అక్కడ బ్రహ్మ విధ్యను బోధించలేదు .. ఆ సభలో విదురుడు, సంజయుడు, ధౌమ్యుడు ఇత్యాది మహానుభావులు ఉన్నప్పటికీ అర్జునుని అర్హతను గుర్తించినందువల్ల, అతని గుణగణాదులను తెలుసుకున్నందువల్ల బ్రహ్మవిద్యా స్వీకారానికి కావలసిన అర్హతతో కూడిన సద్గుణ సంపత్తి కలవాడు అని శ్రీకృష్ణుడు గుర్తించినందువల్ల అన్జునిలో విషాదాన్ని పోగొట్టటానికై చెప్పిన గీత భగవద్గీత.

తత్వోపదేశానికి బీజభూతమైన అద్వైతం అనే అమృతపు జల్లును పదునెనిమిది కలశములనే అధ్యాయాల ద్వారా చల్లడం జరిగింది.. భగవద్గీతలో పదునెనిమిది అధ్యాయాలు ఉన్నాయి.. 

1. అర్జున విషాదయోగం 
2. సాంఖ్యా యోగం 
3. కర్మ యోగం 
4. జ్ఞాన యోగం 
5. కర్మ సంన్యాస యోగం 
6. ఆత్మ సంయమన యోగం 
7. విజ్ఞాన యోగం 
8. అక్షర పరబ్రహ్మ యోగం 
9. రాజవిద్యా రాజగుహ్య యోగం 
10. విభూతి యోగం 
11. విశ్వరూప సందర్శన యోగం 
12. భక్తి యోగం 
13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం 
14. గుణత్రయ విభాగయోగం 
15. పురుషోత్తమ ప్రాప్తి యోగం 
16. దైవాసుర సంపద్విభాగ యోగం 
17. శ్రద్ధాత్రయ విభాగ యోగం 
18. మోక్ష సంన్యాస యోగం 

భగవద్గీతలో ప్రతీ అధ్యాయం ఆఖరున ఈ విధంగా ఉంటుంది 

“ఇతి శ్రీ భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం 
యోగశాస్త్రే. శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ
యోగేనామ త్రయోదశ అధ్యాయం” !!

దీన్ని ఉదాహరణకు మాత్రమే ఇవ్వడం జరిగింది.. శ్రీ కృష్ణార్జునుల సంవాదం ఇది.. ఉపనిషత్తులతో సమానమైనది. యోగశాస్త్రం అంటే అప్రాప్త మైనదాన్ని ఇస్తుంది.. ఈ విధంగా ప్రతీ అధ్యాయానికి అన్వయం చేసుకోవాలి .. 

ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’.

భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు... అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ?? 

“భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు”

అనేవాళ్లతో సమానం. గీత ఒక్క హిందువులది మాత్రమే కాదు భారతీయులు అందరిదీ.

ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి. ఇలాంటి కోట్ల ప్రశ్నలకు నీకు గీతలో సమాధానం దొరుకుతుంది.. 

గీత అంటే కేవలం పుస్తకం కాదు నువ్వేంటో నువ్వు తెలుసుకునే ఓ మర్మ శాస్త్రం.. 

Written by : Bobby Nani

Friday, January 26, 2018

జీవితం అంటే లేక్కలేనివారికి, జీవితం అంటే వ్యర్ధం అనుకునేవారికి అసలు జీవితం విలువ తెలుసా ??


జీవితం అంటే లేక్కలేనివారికి, జీవితం అంటే వ్యర్ధం అనుకునేవారికి అసలు జీవితం విలువ తెలుసా ?? 

ఒక బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆ తల్లి పురిటి నొప్పులు దాకా ఎంత నలిగి ఉంటుంది.. దానితో పోల్చుకుంటే జీవితంలో మీరు నలిగేది ఒక లెక్కా.. 

జ్ఞానం లేని చీమలు సైతం తమ తమ సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటున్నాయి.. ఇంత జ్ఞానం, ఇంత అవకాశం వున్న మానవుడెందుకు పిరికివాడైపోయి, ఆత్మహత్యను శరణువేడుతున్నాడు .. ఓ చిన్న ప్రేరణ ఒక్కరికైన వసంతాన్నందివ్వగలదనే నమ్మకంతో వ్రాసాను.. చదివి మీ అభిప్రాయం చెప్పండి.. __/\__


జీవితమనే భారీ రధ చక్రాల క్రింద 
నిరంతరం నలిగే ఘర్మజల శ్రామికులం..!!

మన జీవితాల్లో మార్పు ఉండదు, ఉండబోదు 
అవకాశాలు అరుదుగా వస్తుంటాయి... కానీ 
వాటిని అందుకునేందుకు ఊతము దొరుకుటే కష్టం.. !!

ఎవరూ ఎత్తుకుతీసుకుపోయి కూర్చో పెట్టరు 
ప్రతీ మెట్టూ నువ్వే ఎక్కాలి.. 
ప్రతీ చెమట చుక్కకూ సమాధానం చెప్పి తీరాలి.. !!

తూర్పు, పడమరల మధ్యన 
సూర్య, చంద్రుల ప్రయాణాలు సాగుతూనే ఉంటాయి.. 
వెలుగు, చీకట్లు నేల రాలుతూనే ఉంటాయి.. 
అమాస, పున్నమిలు వస్తూ, పోతూనే ఉంటాయి.. 
కానీ 
నీలో, 
నీ జీవితంలో 
అదే ఓటమి, 
అదే నిస్సహాయత 
పాదాలు భూమిలో కూరుకుపోతున్నట్లు, 
బాహువులపై గోవర్ధనగిరి మోస్తున్నట్లు, 
కదలకుండా ఒకేదగ్గర సంకెళ్ళేసి నిను బంధించినట్లు, 
గుర్తుతెలియని వ్యక్తి ఎవరో నీపై పడి తొక్కుతున్నట్లు అనిపిస్తుంది
నీ ఊపిరే నీకు భారమై తోస్తుంది.. ఆ సమయంలో..!!

రక్తం సలసలా కాగుతోంది.. 
స్వరం ఒక్కసారిగా మూగబోతుంది.. 
కళ్ళలో ఎరుపు ఎకసెక్కాలాడుతుంది .. 
విశృంఖల వీర విహారం చేసే 
అమానుష, అమానవీయ రాక్షసత్వానికి లొంగి 
సలాములు చేసే దశ నీలో వచ్చిందనిపిస్తుంది.. 
కానీ 
లొంగిపోకు, 
వంగిపోకు, 
ఎదురులా నిక్క నీల్గి ఎదుర్కో.. !

ఆకాశం కాని సముద్రం కాని అలసిపోయినట్లు కనిపించట్లేదు.. 
మరి నీలో ఎందుకీ అలసట .. !

జీవితం ఒకే రాట్నం చుట్టూ దారప్పోగులా తిరుగుతూనే ఉంటుంది.. 
ప్రస్తుత సమయం నీది కాదు అంతే... !

నీ జీవితంలో వసంతం దానంతట అదే రాదు 
ఉగాదుల్ని నీవే ఆర్జించుకోవాలి,
బ్రతుకు పోరాటాల్ని ఎదుర్కొని, 
నీకు నీవే విజయాన్ని సాధించుకోవాలి..!!
లే 
పైకి లే 
రాలుతున్న కన్నీటి చుక్కలే రేపటి నీ 
విజయ గర్వానికి ములకలవ్వాలి..!!

Written by : Bobby Nani

మిత్రులకు “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు...



మిత్రులకు ముందుగా “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు...

“N - న్యూస్” అనే చానల్ సర్వే చేసిన వీడియో ఒకటి చూసాను.. ఆ సర్వే ఏంటంటే అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? ఈ విషయాన్ని ఎంతమంది విద్యార్ధులు చెప్తారు ??

నిజానికి ఆ వీడియో చూసాక ఎవరైనా ఓ డబల్ బ్యారల్ గన్ తీసుకుపోయి ఆ సమాధానాలు చెప్పేవాళ్ళను కాల్చిపారేయ్యాలనిపిస్తుంది ..

ఒకడేమో జనవరి 26 ప్రేమికుల రోజు అంటున్నాడు.. 
ఇంకొకరేమో జనవరి 26 గాంధీ జయంతి అంటున్నారు.. 
మరొకరేమో జనవరి 26 హాలిడే కాబట్టి ఎంజాయ్ చేసే రోజు అంట..

ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చాలా దారుణంగా సమాధానాలు ఇస్తుంటే .. 
నిజంగా వీళ్ళు మన భారతీయులేనే ?? అనిపిస్తుంది ...

ఇదేనా మనం గొప్పగా చూస్తున్న సువిశాల భారతదేశం ... 
అంతెందుకు ఇది చదువుతున్న మీరే మీ మనసాక్షిని అడగండి.. ఎంతమందికి “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? అన్న విషయం తెలుసు..

ఒక సినిమాకు ఇచ్చే విలువ కూడా మనం మన దేశానికి ఇవ్వలేకపోవడం శోచనీయం..

స్కూల్స్ లో “గణతంత్ర దినోత్సవం”నాడు జెండా పట్టుకొని, చాక్లెట్స్ తీసుకొని, కాసేపు గీతాలు పాడుకొని, ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ వుంటే అవి చూసి ఇంటికి రావడమే మనం తెలుసుకున్నాం.. ఆ స్కూల్స్ లో ఒక్క ఉపాధ్యాయుడు అయినా ఒక చిన్న ప్రసంగాన్ని చేసి అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ఎప్పుడొచ్చింది ? .. 
ఎందుకొచ్చింది ? .. 

ఈరోజుకు ఎన్ని సంవత్సరాలు అయింది అనే విషయాలను తెలియజేసి వుంటే నేడు విద్యార్ధులకు ఈ దుస్థితి పట్టేది కాదు.. 

దయచేసి ఇకనుంచి అయినా విద్యార్ధులకు ఒక స్పష్టతను, అవగాహనను కలిగించమని ప్రార్ధిస్తున్నాను..

ఇకపోతే మన భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 అనేది గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన రోజు ఈ “గణతంత్ర దినోత్సవం” ... . భారత దేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15, 1947 లోనే వచ్చింది.. కానీ, ఈ జనవరి 26, 1950 న భారత రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు తొలి రాష్ట్రపతిగా భాద్యతలు స్వీకరించి మన దేశం పూర్తి గణతంత్ర దేశం అయిన రోజు ఈ రోజు.. 
ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం అయింది.. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు ఈ 'గణతంత్ర రాజ్యం' ఏర్పడినది. 'గణతంత్ర రాజ్యం' అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు....

"ఏ దేశమేగినా,ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"

అని ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

మన ముందు తరాల త్యాగ ఫలాలు భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి ఏటా ఈ గణతంత్ర దినోత్సవమును జరుపుకోడానికి కాస్త తీరిక చేసుకుంటే చాలు అని మనవి చేసుకుంటూ ..

దేశం కోసం నాటి నుంచి నేటి వరకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు అశ్రునివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడను ప్రార్దిస్తూ..

మిత్రులకు మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ...

జైహింద్ ___/\___

Written by : Bobby Nani

Thursday, January 25, 2018

మారని రాతలు వారివి.. !! మార్పులేని బ్రతుకులు మనవి..!!


దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి, తండ్రి పడే వేదనఇది. వారికేం తక్కువ చేసాం?? అన్నీ సమకూర్చాం కదా..!! అని మీరు అనుకోవచ్చు.. వృద్దాప్యంలో వారికి కావాల్సింది ఒక్కటే కాసింత అనురాగం, ఆప్యాయత, మాటా మంచి పంచుకునే మీరు, అల్లర్లు చేస్తూ ఆడుకునే మనవళ్ళు, మనమరాళ్ళు.. మూడు పూటలా తిండి లేకున్నా ఉండగలరు కానీ, మూడు రోజులకు ఒక్కసారి కూడా మీతో మాట్లాడకుంటే ఉండలేరు.. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ.. __/\__

అవునలాగే ఉంటాయ్ పరిస్థితులు..!!
నువ్వూ, నేను అంటే లెక్కుండదు ... !!

మనమెక్కి తొక్కిన మంచాలూ, 
చూసి చూసి విసుగెత్తిన దూరదర్శన దుర్భిణీ యంత్రాలూ, 
నమిలి నమిలి వదిలిన పట్టు వస్త్రాలూ, పసిడి కాంతులూ
రాసి పారేసిన ఆత్మకథా సరిత్సాగరాలూ, 
వాసన చూసి విసిరేసిన మల్లెపూలూ, 
మదన కామరాజు కథలూ కావాలి వాళ్ళకి.. !
నువ్వూ, నేను లెక్కుండదు.. !!

మనం సరిగ్గా గాలి పీలుస్తున్నామా ?? 
మనం ఒక్కపూటైనా భోజనం చేస్తున్నామా ??
నిత్య యుద్దాల మధ్య కల్లోలితమౌతున్న మన మనసులు 
సేద తీరుతున్నాయా ?? లేదా ఇవేమీ
వాళ్ళెవ్వరికీ పట్టవు.. !!

మన చీము, నెత్తురు పరీక్ష చేస్తారే తప్ప 
మన అంతరంగాల్ని స్పృశించే ప్రయత్నం ఏనాడు చెయ్యరు..!!

అవునలాగే ఉంటాయ్ మరి పరిస్థితులు...
వెదజల్లే విచిత్ర భాస్వరాలు 
నీ స్వార్ధం నీది, 
నా స్వార్ధం నాదంటుందీ ప్రపంచం బ్రతికినన్నాళ్ళూ
నువ్వూ, నేను అంటే లెక్కే ఉండదు ... !!

చనిపోయాక మాత్రం పెద్ద పెద్ద గోరీలు కడతారు 
నడిబజార్లో కాంస్యవిగ్రహాల్ని నిలబెడతారు.. 
పత్రికల్లో సంవత్సరీకాలు ప్రచురిస్తారు 
రాబోయే మరణానంతర భోగాలను ఊహించుకుంటూ 
ప్రస్తుతం మనం వాళ్ళను క్షమించాల్సిందే.. 
సంధ్యలో బీభత్సాన్ని ఆనందంగా అవలోకించాల్సిందే ..
బ్రతికినన్నాళ్ళూ మనం ప్రతీ జీవపదార్ధాన్ని క్షమించాల్సిందే .. 
ఘాడంగా ప్రేమించాల్సిందే.. !!
మారని రాతలు వారివి.. !!
మార్పులేని బ్రతుకులు మనవి..!! 

Written by : Bobby Nani

Friday, January 19, 2018

ఆటో దిగి చూచితిని నొక చిన్నదాన్ని..!!



ఆటో దిగి చూచితిని నొక 
చిన్నదాన్ని..!!

కలల అలలు రేపు 
మత్తుకళ్ళు దానివి..!!

కార్పొరేట్ రోడ్డుపై 
ముంజేతి మునివేల్లుతో, 
ముంగురులను సవరించుకుంటూ,
ఆర్తిగా నను చూస్తూ నవ్వింది.. 
చల చల్లని లోయల వె 
చ్చని గాడ్పులు రువ్వింది..!!

ఉరు జఘనము బిగువు ఎద 
సరితూగగ నడిచింది..
వేల మన్మధులను కలచి 
వేయు శరము విడిచింది..!! 

మేయి వంపులతో వలపుల
మెరుపువోలె మెరిసింది 
నాలో ఒక భావ వసం
తమ్మును నాటిపోయింది..!!

మరపురాదు, మరువలేను 
మళ్ళి జన్మలోనై నా 
నే పొందిన ఆ మహానుభూతి..!!

అచ్చట వెన్నెల లేదు.. కానీ నిత్య పున్నమి 
అచ్చట గాడ్పులే లేవు .. కానీ నిరంతర పరిమళంబులు 
అచ్చట ప్రకృతే లేదు.. కానీ అందాలకు కొదవే లేదు...!!

వెన్నెల మధుపానమ్మున 
మిన్నంటిన ఆ ఎద శిఖరాగ్రములు, 
నఖశిఖపై తేలియాడు 
బరువైన ఉఛ్వాసనిశ్వాసావిర్లు ..!!

ఊపిరుల ప్రణయఘాడ 
పరవశలై లాస్యమాడు 
కోటి కోటి లతికలు
మధు“రతి” కుసుమ హస్త ముద్రలతో,
పూలతోడ, విదుద్దీ
పాలతోడ పరిమళించు 
దేహంబులు కావివి ప్రకృతి 
గుండియ లనిపించునవి..!!

యువ కలయికులకు స్వర్గము 
నవతకు పెట్టని దుర్గము 
రాగముగల ప్రతివానికి 
రసలోకమునకు సుగ మార్గము..!!

Written by: Bobby Nani

Saturday, January 13, 2018

కవిత్వం ఎక్కడ పుడుతుంది ??



కవిత్వం ఎక్కడ పుడుతుంది ??
అక్కడా, ఇక్కడా అని ఎలా చెప్పను 
ఎక్కడ పడితే అక్కడ, 
ఎలా పడితే అలా
ఓ భావావేశం ఉన్నట్లుండి 
హృదయాన్ని తాకుతుంది 
ఇక అంతే అప్పటివరకు కనిపించిన ప్రపంచం 
కవి నేత్రంతో రంగులమయం అవుతుంది 
రాలిన ప్రతీ భావాన్ని 
కలములోని సిరాలో బంధించి 
రమణీయమైన అక్షరాలను 
రమ్యంబుగ ప్రసవిస్తాడు కవి.. !!


కవిత్వం ఏ ఒక్క భావానికీ అతీతం కాలేదు 
తొంభై ఏళ్ళ ముదుసలి మోము మడతలలో 
అనుభవాల సౌందర్య సారాన్ని ప్రస్తావించనూగలడు..!!
పందొమ్మిదేళ్ళ పడతి యెవ్వన ప్రాయంలో
పరిణేత అధరాల ఆటలో నీల్గి బొటనవ్రే
లంచున నిలిచే మధుర క్షణాన్నీ రాయగలడు.. !!

అరుణోదయం చూడని పేదరికాన్నీ, 
గంజి ముట్టని పెద్దరికాన్నీ, 
ప్రసవవేదనలోని తల్లి అంతరంగాన్నీ, 
తొలిసంధ్యా వెచ్చని కిరణాన్నీ,
వేకువ కుసుమపు పరిమళాన్నీ, 
హృదయం పగిలిన వేదననీ 
ఒక్కటేమిటి 
ప్రతీ భావనలో కవిత్వం జనియిస్తూనే ఉంటుంది.. 
నవీన ఊపిర్లు ఊదుతూనే ఉంటుంది.. !!

Written by : Bobby Nani

Friday, January 12, 2018

పాదాలా అవి.. ఊహు పద్మాలే..




పాదాలా అవి..
ఊహు పద్మాలే.. 
ప్రత్యూష వేళలో రాలిన పారిజాత కుసుమాలు.. 
దోర గోరింట అంటిన మధుర హస్తాగ్రములు.. 
మతుండే చేసాడో 
లేక మత్తెక్కించేలా చేసాడో ఆ బ్రహ్మ..
నవనీతపూతలనద్ది,
పున్నమి సౌందర్యాన్ని పొదిగి.. 
వెండి వెలుగుల అందియలను చుట్టి 
చుంబనాభిషేకములకు అనువుగా మలిచాడు.. !!

యెర్రెర్రని అధర మధురిమలకన్నా రమ్యంబగు ఈ 
కోమలి పాదఁబులు క్షణకాల వీక్షణ కలిగినా చాలునునే 
హృదయ తన్మయత్వముతోడ నర్తించగన్..!!

Written by : Bobby Nani

Thursday, January 11, 2018

అక్షర కిరణం ...


నేటికి నా అక్షరారణ్యం అనే బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం ఆరు మాసములు కావస్తోంది.. ఇన్నిరోజులూ నా అక్షరాలను మోస్తూ తనలోనే ఇముడ్చుకుంది.. ఎందరో పాఠకులకు ఓ వేదికలా మారింది.. మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించింది.

ఎన్ని రాసినా, ఎంత రాసినా ఇంకా ఏదో లోటు .. నిన్న ట్విట్టర్ లొ చూస్తే ముఖపుస్తకాన్ని ట్విట్టర్ తో జత చేసినప్పటినుంచి నిన్నటిదాకా 3,897 పోస్ట్ లు అని చూపించింది .. ఈ మధ్య రాసినవే అన్ని ఉంటే గడచిన 5 ఏళ్ళుగా ముఖపుస్తకంలో వ్రాసినవి ఎన్ని ఉండాలి.. 12 వ ఏటనుంచి కాగితాలలో రాసినవి మరెన్ని ఉండాలి..

నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది.. నేను ఇన్ని రాసినందుకు కాదు.. తెలుగు భాషలో 16 అచ్చులు, 38 హల్లులు ఉన్నాయి.. నకార పొల్లు మరియు నిండు సున్న తో కలిసి 56 అక్షరములు ప్రస్తుత మన మనుగడలో ఉన్నాయి.. అలాంటి 56 అక్షరములను నేను ఇన్ని వేల అక్షరాలుగా మలచగలిగానా అనే ఆశ్చర్యం .. ఆ ఆశ్చర్యంలో చిరు ఆనందం కూడా కలుగుతోంది..

తెలుగు ఇప్పుడిప్పుడే మళ్ళి బ్రతుకుతుంది అనడంలో అతిశయోక్తి లేదు .. ఎందుకంటె ముఖపుస్తకం వేదికగా మారింది.. ఎందరో కవులు, రచయితలు ఇక్కడ కొలువుతీరారు.. వారి అక్షరాలకు జీవం పోస్తూ ఇందులో అనంతమైన అక్షర మాయా లోకంలోకి వారు మనల్ని తీసుకువేళ్తున్నారు .. చిరు రచయితలు వారి అక్షరాలను పదును పెంచుకుంటూ పోటా పోటీగా ముందుకు దూసుకుపోతున్నారు.. ఇదంతా ఈ ముఖపుస్తకం వల్లే సాధ్యం.. మనం మంచిగా ఉపయోగిస్తే రంగులమయమే అవుతుంది.. ఎలా ఉపయోగించాలో మనచేతుల్లోనే ఉంది..

వీటన్నిటినీ పురస్కరించుకొని అక్షరాలపై నా చిరు కవిత..

అక్షర కిరణం 
************

విధి విరామంలేని సమయాల్లో కూడా 
పెల్లుబుకుతాయి నాలో ఊహాగానాలు..
మనసులో పేరుకున్న అనుభవాల మంచుగడ్డలు,
ఆవేదనావేడి కిరణాలకు కరిగి అక్షర రూపంలో,
భావతరంగాల ఎగుడు దిగుడు లోయల్లో ప్రవహించి, 
ప్రశాంత పరిసరాలకు చేరుకున్న, 
కవితా వాహినే నా ఈ “అక్షరారణ్యం” ..!!

అరుణకాంతి రేఖల్లో, 
మెరుపుతీగల చణుకుల్లా,
నా ప్రతీ కవనంలో ఉంటూనే ఉంటాయి 
కొన్ని తళుకులు.. బెళుకులు..!!

ప్రతీ పుట, 
ప్రతీ అక్షరం, 
మెరుపు తీగలే అయితే,
కవ్యాకాశం కాగలదా ఆకర్షనీయం..!! 
కవితకు అంశాలు, సమకాలీనం కావాలి ..
సమాజ జీవితం అందులో అడుగడుగునా ప్రతిబింబించాలి.. 
వ్రాసింది సామాన్యునికి అర్ధం కావాలి..
ఊహల ఛాయా చిత్రం కవిత వెలుగు నీడలకు 
రంగులు దిద్దడమే అవుతుంది కావ్య చిత్రపటం 
అనుభవాలకు అద్దంలో అర్ధం చూపడమే కవనం.. !!

కవితా ఉత్పత్తికి కారణం, 
హృదయ వీణాతంత్రులను సవరించి మీటడం.. 
నివురుగప్పిన భావాలను విసిరి రగిలించడం..
ఎగిరే ఊహా విహంగాలకు, 
కలం సిరా దారాలతో ఉచ్చులు వేయడం.. 
ఏదో చెప్పాలనే మంచుపొరల ఆవేదనలను 
అక్షర కాంతితో ద్రవింపజేయడమే నిజ కవిత్వం.. !!

Written by : Bobby Nani

Tuesday, January 9, 2018

గతనిశీధి జ్ఞాపకాలు..



స్త్రీ, పురుషుల మధుర సంగమము ఇది..

సున్నితమైన మనస్కులు కాస్త దూరంగా ఉండటం శ్రేయస్కరం అని విన్నవించుకుంటున్నాను.

విశృంఖలమైన సంయోగమును నేను ఇక్కడ రాయలేదు.. ఓ స్త్రీ ఎన్నో కలలు కని తన పరిణేత వద్దకు వస్తుంది.. అలానే ఓ పురుషుడు తన కోమలాంగిని గురించి ఎన్నో కలలు కని ఉంటాడు.. అలాంటి ఓ దంపతుల మధ్య జరిగే ప్రయాణాన్ని, శృంగారాన్ని కలిపి ప్రణయశృంగార వర్ణనను ఇక్కడ పొందుపరిచాను.. పెళ్ళి చూపుల్లలో పరిచయమైన కళ్ళు చివరి ఘట్టం దాకా ఎలా వున్నాయో వివరించాను.. అన్యదా భావించకుండా సాహిత్యపరంగా చూడమని మనవి.. 

గతనిశీధి జ్ఞాపకాలు..
*****************

మొదటసారి నే చూచిన ఆ కళ్ళు 
ఇంకా నాకు గుర్తున్నాయి...!!
నల్లని కాటుకతో, 
నేరేడు కనుపాపలతో, 
తుమ్మెద కనురెప్పలతో, 
ముచ్చటైన ముంగురులతో, 
నను ఆర్తిగా చూసిన ఆ కళ్ళు 
నాకు ఇంకా గుర్తున్నాయి..!!

పచ్చిక మీద నీ ఒడిలో పడుకున్నప్పుడు 
నా తల మీద అదే పనిగా నీ చూపుల వర్షం కురిసేది.. !!
నీ నవ్వుల స్వరం విన్న ప్రతీసారి అలసిన నా హృదయం 
పదే పదే నను పలకరిస్తూ వుండేది.. !!
దూరాన్నించి నీ అడుగుల సవ్వడి విని 
ఓ పరిమళం నీకన్నా ముందొచ్చి ముద్దిలిచ్చేది..!!

ఈ అస్తమయకాలపు పున్నమి నాకు కనిపిస్తోంది.. 
నక్షత్రాల కాంతితో, ఆకాశం విస్తృతమౌతూ
మనకు మరింత దగ్గరగా వస్తోంది..!
మనకోసమే అన్నట్లు పూసిన ప్రతీ పువ్వు 
నల్దిశలా తన అనుభవానుభూతి సువాసనల్ని 
వెదజల్లుతూ ఉన్నాయి... !!
అవును 
నీ ప్రతిబింబం నిశ్చలంగా నన్నే చూస్తూ ఉంది.. 
ఆనాటి కాంతి నీ కళ్ళలో ఇంకా వెలుగుతూనే ఉంది.. 
మంటల మధ్య ఇనుప ముద్దల్లా నీ రెండు పెదవులూ 
ఇంకా వణుకుతూనే ఉన్నాయి.. 
ఈ రాత్రి 
నెమ్మది నెమ్మదిగా ..నీలోకి నేను ప్రవేశిస్తున్నాను .. 
సముద్ర తరంగాల మధ్య రేగే నురగల మీంచి 
నా కాగితపు పడవ ఇంకా నీ ఎదపై 
ప్రణయ ప్రయాణం చేస్తూనే ఉంది..
చిట్ట చివరి మన సమర శృంగారం నడిఝామున
నీ పాదాలను ముద్దాడుతూ గడిచిపోతుందని నాకు తెలుసు.. !!

నాకనిపిస్తోంది నే నొక పూ .. తోటలోనికి ప్రవేశించానని 
అక్కడంతా ఎప్పుడూ చూడని ఆనందమేదో తాండవిస్తోంది..
దారి తెలియక దిక్కులెతుకుతూన్న నాకు ఓ చెయ్యి దారి చూపింది.. 
పూ ..తోట తలుపులు మాత్రం ఎవరో మూసివుంచారు.. 
మునివేళ్ళతో మీటుదామనుకున్నా,
మునిపెదవులతో తాకుదామనుకున్నా, 
ఈ ముదిత కనుసన్నల కోసం ఆర్తిగా ఎదురు చూసాను.. 
ఆపాటికే ఆమె నా వెచ్చని ఆవిర్లు మధ్యన 
లతలా అల్లుకుంటూ కొవ్వొత్తిలా కరిగిపోతూ ఉంది.. !!

వేకువ మంచులా వొళ్ళంతా చెమట.. 
కళ్ళలో సుఖాక్షరాల పరస్పర స్పర్శావేశాలు 
నన్ను నువ్వు, 
నిన్ను నేనూ, 
ఆక్రమించుకున్న గతనిశీధి జ్ఞాపకాలు.. 
గదిలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ నిట్టూర్పుల ఊపిరి ఆవిర్లు 
సర్పబంధ రహస్యాన్ని చేధిస్తూ 
మంచు పొగలా కమ్మిన ఒక అలౌకిక ఆనందం.. 
వేళ్ళలోకి వేళ్ళు తన్నుకుంటూ 
ఒకర్నొకరు సున్నితంగా స్పృశించుకుంటున్న 
రెండు అనాది జీమూతముల రహస్య ఆక్రందన 
ఆపాదమస్తకపు అగ్ని సరస్సులో నురగలా 
కరిగిపోతున్న రెండు దేవతా వస్త్రాలు 
బింబం ప్రతిబింబాల్లా 
నీలోకి నేనూ,
నాలోకి నువ్వూ 
ఏకమైపోతున్న 
ఒకే ఒక్క ఆధ్యాత్మిక సందర్భమది..!
ఆనందఖేలి శృంగార ఘట్టమిది..!!

Written by : Bobby Nani

Thursday, January 4, 2018

ఈ చలిలో..



ఈ చలిలో.. 
పెదవులు రెండూ ఓ వెచ్చని స్పర్శ కోసం 
పరితపిస్తున్నాయి.. !!

చేతులు రెండూ 
దేన్నో అందుకోవడానికి 
ఆరాటపడుతున్నాయ్ .. !!

మనసేమో తన రాకకై 
తన పరిష్వంగములకై 
ఉవ్విళ్ళూరుతుంది ..!!

ఎంతకీ తను రాదే.. 
ఏంచేస్తుంది ?? 

తెల్లని పాల సొగసులలో... 
తనువంతా కరిగిపోయి .. 
తపనల తమకంతో...
నిలువెల్లా ఒదిగిపోయి.. 
వెచ్చని ఊపిరి ఆవిర్లతో.. 
మునివేళ్ళ మధ్య, 
బిగుతైన కౌగిలితల మధ్య నలుగుతూ..
అరచేతిలో ఇమిడిపోయి.. 
పై పైకి ఎగబాకి 
రెండు పెదవుల మధ్యకు 
ఆర్తిగా వచ్చి 
తియ్యగా, వెచ్చగా హత్తుకుంది..
నవనాడులు జివ్వుమని 
దేహమంతా పులకరించి 
కన్నులు రెండూ తన్మయత్వముతో 
రెప్పలు వాల్చెను .. !!

నిజంగానే ఆ సమయాన 
స్వర్గానికి బెత్తెడే ... బెత్తెడు దూరం.. !!

ఏది ఏమైనా కాఫీ చాలా బాగుంటుందబ్బా.. ;) :P 

Written by : Bobby Nani

Wednesday, January 3, 2018

ఓ కావ్యమా, నువ్వైనా చెప్పు తనకు..


చిరు జల్లులు నను తాకాలని మీద మీదకు వాలుతుంటే..
చెంతనున్న చకోరి .. తన కొంగు గూటిలో నను బిర బిర చేర్చుతుంటే.. 
తన పెదవుల వెచ్చని ఊపిరి .. నా చెక్కిలిని తీపిగా ముద్దాడుతుంటే ... 
రెప్పలు రెండూ తమకమునొందు సమయమున, 
తన ఎద చప్పుడు చెప్పాలనేదో ఆరాటపడుతుంటే,
మౌనం మా మధ్య నాట్యమాడే వేళ..
చిటపటమని రాలుతున్న చిరు చినుకులు చెప్పే 
సప్త స్వరాలే మా యీ ఏకాంత కావ్యం.. !!

తన రూపం నిజంగానే సమ్మోహనమే..
తన నవ్వులో ఎప్పుడూ నూతనత్వమే.. 
తన మువ్వల చప్పుడు ఏనాడూ వినలేదు.. కానీ 
తన అడుగుల చప్పుడు నా మదికెప్పుడూ దగ్గరే.. 
మట్టి గాజుల గలగలలు ఏనాడూ చూడలేదు .. కానీ 
తన మునివేళ్ళ కౌగిలింతలు ఎప్పుడూ నా అక్షరాలతోనే.. 
చిగురుటాకు వెనుక దాగిన నీటి చుక్కలా తన సిగ్గు ఎంత బాగుంటుందో... !
నింగి నుంచి నేలకు వంగిన ఇంద్రధనువులా నవనీతమద్దె నెలవంక నడుము..,
లాగి ఎక్కుపెట్టిన ధనస్సులా.. తన చూపుల శరములు.. 
ఒక్కొక్కటిగా నాపై వాలటం .. మరెంత బాగుంటాయో.. 

ఓ కావ్యమా,
నువ్వైనా చెప్పు తనకు..
మునివేళ్ళ మధ్యన కలం కలవర పడుతోందని ..!

ఓ కనకమా,
నీ పచ్చని సొగసులు తన దేహ సౌందర్యానికి సోబగులని 
నువ్వైనా చెప్పు ..!

హృదయ కవాటాల మధ్యన బిగుసుకున్న ఓ జ్ఞాపకానివై 
నా మస్తిష్కానికే ప్రేమ పాఠాలు నేర్పుతూ వ్యసనమైపోయావే..
నువు రాల్చిన ఒక్కో గడియ యుగాలై సాగెను.. 
ఇక క్షణము కూడా తాళలేను ..
బిర బిర నను చేరగ రావా ... నా 
ఎద తలుపులు తెరిచి ఉంచా.. !!!

Written by : Bobby Nani

Tuesday, January 2, 2018

ఒకమనిషి నుంచి ఇష్టాన్ని కాని, ప్రేమను కాని, స్నేహాన్ని కాని తీసుకోవాలంటే వందేళ్ళు కావాలా.. ??



ఒకమనిషి నుంచి ఇష్టాన్ని కాని, ప్రేమను కాని, స్నేహాన్ని కాని తీసుకోవాలంటే వందేళ్ళు కావాలా.. ??

ఒక్క క్షణం చాలదా.. ?? 

ఆ ఒక్క క్షణం వారున్నా, లేకున్నా వందేళ్ళ జ్ఞాపకంగా పదిలమవ్వడం సరిపోదా.. !!

అలాంటిదే ఓ ఇద్దరి మిత్రుల స్నేహం.. 

ఆకాశం సూర్యుణ్ణి తాకగలదా ?? 

రవి కిరణం వెలుగును చూడగలదా .. ??

ఒకరికొకరు చూడకుండానే ఇన్నేళ్ళ వారి స్నేహం నభూతోనభవిష్యతి ... !!

2002 వ సంవత్సరం యాహు మెసింజర్ ఓ ఊపు ఊపుతున్న రోజులవి.. అనుకోకుండా ఓ మెసేజ్ వారి ఇద్దరి మధ్య స్నేహమనే వారధిని నిర్మించింది.. అది ఓ అమ్మాయి నుంచి వచ్చిన మెసేజ్... ఎవరా అని ఆలోచించే లోపే.. మరో మెసేజ్ "పొరపాటుగా పంపానండి ఏమనుకోకండి" అంటూ... 
అసలు మీరు ఎవరండి..?? 

ఎవరనుకోని నాకు పంపారు అంటూ వారి మధ్య మాటలు కలిసాయి.. అలా వారి స్నేహానికి కొన్ని నెలల వయస్సు ఏర్పడింది.. అప్పట్లో మొబైల్ వాడకం చాలా తక్కువగా వుండేది.. అలాంటి సమయంలోనే రిలయన్స్ ఫోన్లు మార్కెట్ లో అడుగు పెట్టాయి... ఇక వాటికి అడ్డు, ఆపు లేకుండా హాల్ చల్ చేస్తుండేవి.. 

నీ నెంబర్ ఉంటే ఇవ్వు .. ?? ఓ సారి మాట్లాడుతాను అంటూ అవతలివైపు నుంచి ఆ అమ్మాయి మెసేజ్.. 

నిజానికి వీడిదగ్గర ఎలాంటి మొబైల్ లేదు.. కానీ మాట్లాడాలి..!! తను పనిచేసే సంస్థలోని తోటి స్నేహితునికి ఓ నోకియా 1100 మొబైల్ వుండేది.. వాడది సెకండ్ హ్యాండ్ అని కొన్నాడు.. కాని పదో హ్యాండ్ అని ఆ మొబైల్ చూస్తేనే అర్ధమయ్యేది ... గట్టిగా చేతులతో ఎవరన్నా పట్టుకుంటే ఎక్కడివి అక్కడ ఊడిపోయే పరిస్థితి ఆ మొబైల్ ది.. ఎవ్వరినీ తాకనిచ్చేది కాదు.. మహా సాధ్వి.. దాన్ని చాలా సున్నితంగా డీల్ చెయ్యాల్సిన గత్యంతరం వారిపై ఎప్పటికప్పుడు పెనుభారంగా పడుతూ వుండేది.. 

దానికి ఆ ఫోన్ గల్లోడు ఇచ్చే బిల్డ్అప్ అంబాని కూడా ఇవ్వడేమో ...
ఎలాగోలా వాడిని ఒప్పించి ఆ నెంబర్ ఆమెకు ఇచ్చాడు... 

ఆమె చెప్పిన ప్రకారం ఆ సమయానికి కాల్ లో మాట్లాడేందుకు ఈ అబ్బాయి సిద్దంగా ఉన్నాడు... ఇన్నిరోజులుగా చాట్ చేస్తున్నా కలగని అలజడి తనతో మాట్లాడబోతున్నాను అనే భావన ఆ అబ్బాయిని ఏంతో అలజడికి గురి చేస్తూ వుంది.. ఆ అమ్మాయిలో కూడా అదే భావన కలుగుతూ వుంది.. ఎన్నోసార్లు ఒక్క రూపాయి కాయిన్ బాక్స్ లో కాయిన్ వేసి తన నెంబర్ కొట్టి కాయిన్ ను కిందకు కొట్టేస్తుంది ... అలా కాయిన్ వెయ్యడం మళ్ళి తీసుకోవడం .. ఇలా పలుమార్లు చేసిన తరువాత .. కొన్ని నిమిషాలకు ధైర్యం తెచ్చుకొని ఎట్టకేలకు కాల్ చేసింది... 

మొబైల్ రింగ్ అవుతోంది... ఈ అబ్బాయి గుండె వేగం తారాస్థాయికి చేరుకుంది... బొటనవేలు కాల్ ఎత్తేందుకు సహకరించక పోగా కాస్త వణుకుతూ ఇతడిని మరింత చిక్కుల్లో పడేసింది... !!

ఊపిరి కాస్త గట్టిగా తీసుకొని బొటనవేలుపై పట్టు సాధించి కాల్ చివరికి ఎత్తాడు.. 

అవతలనుంచి ఎలాంటి శబ్దం కూడా లేదు.. ఈ అబ్బాయి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు... 

ఆమె ఊపిరి స్పష్టంగా వినపడుతోంది.. 

ఇతడే ధైర్యం చేసి "నువ్వేనా" అంటూ ఓ వణుకుతున్న స్వరంతో అడిగాడు.. 
ఇంకా అవతలనుంచి మౌనం అలానే వుంది.. ఈలోపు కాయిన్ వెయ్యమని ఒకటే సౌండ్ ... 

చివరి క్షణంలో ఆమె మరో కాయిన్ వేసింది... అలా మరికొన్ని క్షణాలు గడిచిన తరువాత "హా" అనే పదం మాత్రమే ఆమె నోటినుంచి రాలింది.. 

అలా మొదటి మాట వారు కలిపాక .. ఇక మాటలకు కొదవేలేకుండా పోయింది.. మంచి సన్నిహితులు అయ్యారు.. ఇద్దరూ ఒకరి అడ్రెస్ లు మరొకరు తీసుకున్నారు... ప్రతీ సంవత్సరం వచ్చే రాఖీ పౌర్ణిమ రోజున ఓ ఖరీదైన రాఖీ ఈ అబ్బాయికి తను పంపేది.. అలానే ప్రతీ సెప్టెంబర్ మాసంలో తన జన్మదినం నాడు ఆ అమ్మాయికి ఓ మంచి గిఫ్ట్ ఇతడు పంపేవాడు.. కొన్ని సంవత్సరములు గడిచాయి ... 

ఇద్దరూ ఎవరి చదువుల్లో, కెరియర్ లతో బాగా బిసీ అయిపోయారు ... ఒకరికొకరు మాట్లాడక, చాట్ చెయ్యక కొన్ని ఏళ్ళు గడిచినా కూడా ప్రతీ సంవత్సరం ఒకరికొకరు గిఫ్ట్ లు మాత్రం పంపించుకునేవారు.. మరి కొన్ని సంవత్సరములకు అది కూడా జరగలేదు..ఇద్దరిలోనూ ఒకరి గురించి మరొకరు మర్చిపోయారనే ఆలోచన వుండేది.... కాని అది నిజం కాదు అని తెలిసేసరికి ఆర్కుట్ అనే సోషల్ నెట్వర్క్ లో ఆమెనుంచి మరో మెసేజ్... 
ఇప్పటికి గుర్తొచ్చానా అంటూ ఈ అబ్బాయి ప్రశ్న... 

మళ్ళి మొదలు... 

అలా కొన్ని రోజులు గడిచాక .. నాకు పెళ్లి కుదిరింది అని తన సంతోషాన్ని ఈ అబ్బాయితో పంచుకుంది... అందుకు ఆ అబ్బాయి కూడా ఎగిరి గంతులేస్తూ కనీసం పెళ్ళిలో అయినా నిన్ను చూడాలి అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.. 

పెళ్ళికి తనని పిలవలేదు..

ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు... అలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి .. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి .. ఎవరి పాటికి వారు బిసీ బిసీ జీవితాలతో గడుపుతున్నారు... 

2016 వ సంవత్సరం ఆఖరులో అనుకోకుండా అదే పేరు హోమ్ టౌన్ ఊరు వున్న అమ్మాయి ఈ అబ్బాయికి ముఖపుస్తకంలో కనిపిస్తుంది... మెసేజ్ చెయ్యమని మనసు ఒకటే రుస రుస లాడింది.. ఇక తట్టుకోలేక మీరు పలానా వారేనా అంటూ ఓ మెసేజ్ పెట్టాడు.. 

వారం రోజుల తరువాత హా నేనే ఎలా వున్నావ్ అంటూ ఆమెనుంచి ఆప్యాయంగా ఓ మెసేజ్... మొట్ట మొదట తను చేసిన మెసేజ్ లో ఎలాంటి మాధుర్యం అయితే వుందో ఇన్ని సంవత్సరములు గడిచినా కూడా ఇంకా అదే మాధుర్యం కనిపించింది ఆ అబ్బాయికి.. కళ్ళల్లో ఒక్కసారి వెచ్చని నీటి బిందువులు బిర బిరా నేల రాలాయి... మసకబారిన కీబోర్డ్ అక్షరాలను వెతుక్కుంటూ టైప్ చేసిన ఈ అబ్బాయికి .. ఆశ్చర్య పరిచే మెసేజ్ ఆమెనుంచి వచ్చింది.. " ఏంటి ?? నువ్వు కూడా ఏడుస్తున్నావా ?? " అని ... 

సరేగాని ఇప్పటికైనా నన్ను చూడాలని అడగవా అని ఆ అమ్మాయి మెసేజ్... 
నువ్వు అడగలేదుగా నన్ను చూస్తానని .. మరి నేనెలా అడగనూ అంటూ ఆ అబ్బాయి సమాధానం... 

అలా అన్నాడో లేదో ఓ ఫోటో కళ్ళముందు ప్రత్యక్షమైంది... 

తను, తన భర్త, తన ఇద్దరు పిల్లలు కలిసి ఉన్న ఫోటో.. 

అలానే తన ఫ్యామిలీ ఫోటో కూడా ఇతడు పంపాడు.. ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నారు... ఇన్ని సంవత్సరముల రూపంలేని వారి స్నేహానికి ఎట్టకేలకు తెర పడింది.. !!

ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు... !!

నిజంగానే ఒకరికొకరు చూసుకోకుండా ఈరోజుల్లో జరుగుతుందా అనే మీ ప్రశ్నకు ఇదే సమాధానం ... 

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మంచి మిత్రులుగా ఉండగలరా అనే మీ సందేహాలకు ఇదే ఓ తార్కాణం .. 

ఏదో ఆశించి చేసేది స్నేహం కాదు.. .....కాకూడదు.. !!

ఎన్నో స్నేహాలు వికసిస్తుంటాయి.. వికటిస్తుంటాయి .. కాని స్వార్ధరహిత స్నేహం ఇలా ఎప్పటికీ నిలిచిపోతుంది.. వీరికి కావాల్సింది రూపం కాదు.. నాలుగు సోది మాటలూ కాదు.. వ్యామోహం అంతకన్నా కాదు.. ఒకరిపై మరొకరికి వున్న ఆత్మ గౌరవం, విలువలు, నిజాయితీ, కల్మషం లేని కబుర్లు.. అవే వారిని ఈ స్థాయికి చేర్చాయి.. శిఖరం అంచున నిలబెట్టాయి... నిజ స్నేహానికి అద్దం పట్టే ఇలాంటి వారిపై ఈ ఆర్టికల్ రాస్తున్నందుకు గర్విస్తున్నాను... 

Written by : Bobby Nani