Tuesday, March 24, 2026

అక్షర వనవాసం ముగిసింది.. ఇక 'విశ్వగమనం' మొదలైంది...


 అక్షర వనవాసం ముగిసింది.. ఇక 'విశ్వగమనం' మొదలైంది

********************************************
ఒక పుస్తకం రాయడం అంటే కొన్ని పేజీలను అక్షరాలతో నింపడం కాదు.. అది ఒక రచయిత తన ఆత్మను విచ్ఛిన్నం చేసి కాగితంపై పరిచే ఓ మహా 'అక్షర యజ్ఞం'. బయటి ప్రపంచానికి రచయిత నిశ్శబ్దంగా కనిపిస్తాడు కానీ, అతని నిశ్శబ్దం వెనుక ఒక మహా సముద్రమంత అలజడే దాగుంటుంది.

నిజానికి, పుస్తకం రాయడం అంటే ఒక 'స్వచ్ఛంద వనవాసాన్ని' స్వీకరించడం. ప్రపంచం వేగంతో దూసుకుపోతుంటే, రచయిత మాత్రం కాలాన్ని ఆపి, తన లోపలి శూన్యంలోకి ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యేవి పదాలే కాదు.. వేదనలు, విప్పలేని ఎన్నో చిక్కుముడులు. ప్రతి వాక్యం వెనుక ఒక నిద్రలేని రాత్రి ఉంటుంది, ప్రతి పేజీ వెనుక ఒక కన్నీటి చుక్కో లేదా ఒక నిట్టూర్పో దాగి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా నేను కూడా అలాంటి ఒక 'ఏకాంత యుద్ధం' లోనే ఉన్నాను. సోషల్ మీడియాకు, సమాజపు పలకరింపులకు దూరంగా.. నన్ను నేను అక్షరాల్లో వెతుక్కునే ప్రయత్నం చేశాను. ఎందుకంటే, ఒక రచయిత పాఠకుడికి ఏదైనా ఇస్తున్నాడంటే, అది తన ప్రాణం కంటే విలువైనదై ఉండాలి.

కొన్నేళ్ళ మౌనం తర్వాత, నాలోని అన్వేషణ ఒక అద్భుతమైన రూపం సంతరించుకుంది. అది కేవలం నా అక్షరం కాదు.. అది ఒక 'విశ్వమంత ప్రయాణం'. ఆ ప్రయాణ విశేషాలను, ఆ అక్షర నిధిని మీ ముందుకు తెచ్చే సమయం మరింత దగ్గర పడింది.

పుస్తకం అనేది రచయిత సమయాన్ని మాత్రమే కాదు, అతని జీవితాన్ని కూడా అడుగుతుంది. రాత్రి నిద్రపోయినా ఆ ఆలోచన వెంటాడుతుంది. ఉదయం లేచినా అదే మొదటి ఆలోచన అవుతుంది. రోడ్డుమీద నడుస్తున్నప్పుడు, మనుషుల్ని గమనిస్తున్నప్పుడు, ఒక చిన్న సంభాషణ వినిపించినప్పుడు, ఒక పిల్లవాడి నవ్వు చూసినప్పుడు, ఒక ముసలి మనిషి నిట్టూర్పు విన్నప్పుడు రచయితలోని పుస్తకం ఆ అనుభవాలన్నిటినీ తనలోకి లాక్కుంటుంది. బయటికి చూస్తే రచయిత సాధారణ జీవితమే గడుపుతున్నట్టు అందరికీ కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం ఒక అద్బుత ప్రపంచం క్రమంగా నిర్మితమవుతూ ఉంటుంది.

రాసేటప్పుడు ఓర్పు కూడా ఆ రచయితను ఎంతో పరీక్షిస్తుంది. మొదట రాసినది చివరిదిగా ఉండదు. ఎన్నో పేజీలు రాసి చింపేయాల్సి వస్తుంది. కొన్ని వాక్యాలు చాలా అందంగా అనిపించినా, మొత్తం రచనకు అవి ఉపయోగపడకపోవచ్చు. కొన్ని పాత్రలు మొదట అనుకున్నట్టు నడవవు. కొన్ని సన్నివేశాలు తిరిగి తిరిగి మలచాల్సి వస్తుంది. చాలా సార్లు రచయిత తన రాతలపై తానే అసంతృప్తి చెందుతాడు. “ఇది నేను అనుకున్నట్టుగా వస్తుందా?”, “నా భావం పాఠకుడికి చేరుతుందా?”, “ఇంకా మెరుగ్గా రాయలేనా?” అనే ఎన్నో సందేహాలు అతడిని వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఆ అనిశ్చితుల మధ్య కూడా ముందుకు నడుస్తూ ఉండడమే ఓ రచయిత రచనా క్రమశిక్షణ అని నేను బలంగా నమ్ముతాను.

పుస్తకం పూర్తవడం కూడా ఒక విశేష అనుభూతే. బయటికి చూస్తే అది ఆనందించాల్సిన క్షణంలా కనిపిస్తుంది. నిజానికి అది అలసట, ఉపశమనం, శూన్యం, తృప్తి, భయం ఇలా వీటన్నిటి మేళవింపు. ఎంతో కాలం మనలో వున్న భావాలు ఒక్కసారిగా పేజీల్లోకి వెళ్లిపోయిన తర్వాత, రచయితలో ఒక విచిత్రమైన వెలితి పుడుతుంది. అదే సమయంలో ఒక ప్రశాంతత కూడా ఉంటుంది. ఎందుకంటే, తనలో మగ్గిపోయిన ప్రపంచాన్ని చివరకు అందరిముందు పెట్టగలిగాడు అనే ఓ తాత్విక భావన. ఒక తల్లి తన బిడ్డను మొదటిసారి చూసుకున్నప్పుడు కలిగే అనుభూతి కంటే అది తక్కువేమీ కాదు.

పుస్తకం అనేది రచయిత గుండె చప్పుడు. ఆ చప్పుడును మీ గుండెలకు చేరవేయడమే నా ముఖ్య లక్ష్యం.

త్వరలోనే..
మన అక్షర ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment