Saturday, April 9, 2022

ఇంతకీ ఎవరామె..?

 

తన మౌనాల శూన్యాన్ని వ్రాయాలనుకున్నప్పుడు
మనుష్య ప్రపంచాన్ని వీడి మనో ప్రపంచంలోకి వెళ్తుంటాను
రూపం అగుపడని ఓ పిలుపేదో నన్ను పదే పదే స్పృశిస్తుంటుంది
ఆ పిలుపులోంచి వెయ్యి వీణలు, వేల వేణువులు
ఒక్కసారిగా మ్రోగినట్లుంటుంది
తొలి ఆషాడ మేఘసందర్శనమేదో
గొంతు విప్పినట్లు అనిపిస్తుంటుంది...!!

ఇంతకీ ఎవరామె..?
ఎలా వుంటుందామె ?
యుగాలు ఎదురు చూడాలేమో
తనని చూడాలంటే..!
అందుకే మనోనేత్రాలతో దర్శిస్తున్నాను..!!

నిజంగా “స్త్రీ” అనే భావన ఎంతటి అలౌకికమైనదో
ఆమె కన్నులు మాట్లాడే కలువల భాషకు
మహాకవులకు సైతం అవగతమగదు.. అందుకే
తను విచ్చుకుంటుంది శ్వేత మధుకము వోలె
తను వికసిస్తుంది నవ కుసుమము వోలె
తను నర్తిస్తుంది నటరాజుని అందియ వోలె
తను పరిమళిస్తుంది మనసైన మగని చేతిలో మల్లెమొగ్గ వోలె..!
ప్రళయమూ తానె, ప్రణయమూ తానె
ప్రకృతి తానె వికృతి తానె
మాతృత్వమూ తానె, రసికత్వమూ తానె..!!

నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆమె వదనం నిండా కన్నీరే
ఎన్ని చీకటి రాత్రుళ్ళను దిగమింగిందో
ఎన్ని అమాస నిశీధములను కలకంఠి కంఠముతో త్రాగిందో
ముసిరిన కారుమబ్బుల మాటున
నిర్జీవమైన మానుకి జారగిలి
ఇంకా నాతో ఏదో చెప్పాలని
దిగులుతో కంటినిండా నీరుతో ఆమె..!!

ఎన్నటికీ పూర్తి కాని రెండు వేరు పుస్తకాల జీవితాలు
ఎన్నటికీ జవాబురాని ఒకే ఒక్క తెలియని ప్రశ్నతో
ఆమె ఎప్పటికీ అలా ఎదురుచూస్తూనే ఉండిపోతుంది..
భూమ్యాకాశములు కలిసినట్లు వున్న దిక్చక్రపు జీవితం నాది.
కనిపించినంత అందంగా ఉండదీ జీవితం.
అందుకే కవికి దగ్గర కాకు..
పొరపాటున అయితే.. మాత్రం
అలుపెరగని కెరటాల కన్నీళ్ళే మిగుల్తాయి..!!

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985