Monday, March 23, 2020

ఎన్ని కన్నీటి బిందువులను రాల్చితే మీ రుణం తీర్చుకోగలం..



ఎన్ని కన్నీటి బిందువులను రాల్చితే మీ రుణం తీర్చుకోగలం..
తల్లి తన గర్భంలో బిడ్డను దాచినట్లు 
మీరు మన దేశాన్ని పొత్తిళ్ళలో దాస్తున్నారు.. 
కుల, మత, ప్రాంత, బేధాలు మరిచి 
మీరు చేస్తున్న ఈ సేవ న భూతో న భవిష్యతి..!!

కుల, మత, ప్రాంతాలతో విర్రవీగే ప్రతీ ఒక్కరికి ఇది ఓ చెంపపెట్టు.. 
సిగ్గుచేటు ఇలా ఆలోచిస్తున్నందుకు..!!
మరణం అంచున నిలబడినప్పుడే 
సత్యాన్ని, యదార్ధాన్ని దర్శించగలం 
ఇప్పటికైనా మీలో మార్పు అనేది వస్తే 
రేపటి భవిష్యత్తు రంగులమయం అవుతుంది.. !!
లేకుంటే ఎటు చూచినా దుర్ఘంధపు శవ పీనుగులే..!!

మన దేశం కోసం,
మన జనం కోసం, 
మన కుటుంబం కోసం, 
మన కోసం, మనమంతా స్వచ్చందంగా ఇంట్లోనే ఉందాం..
ఒకరి నుంచి మరొకరికి తరలించే వ్యక్తులుగా మనం మారకుండా 
మనల్ని, మన దేశాన్ని మనమే రక్షించుకుందాం.. 
సేవచేసే వైద్య బృందానికి మన వీలైనంత మేర మన భారాన్ని తగ్గిద్దాం.. !!

సేవచేసే ప్రతీ వైద్యుడు పితృసమానుడే..!! 
ప్రతీ వైద్యురాలు మాతృ సమానురాలె..!!

Please don't be a carrier that you can pass on to others.. __/\__

Written by : Bobby Nani

Saturday, March 21, 2020

సరదా దండకం.. సరదాగానే తీసుకోండి..

సరదా దండకం.. సరదాగానే తీసుకోండి..
*************************************
శ్రీ మన్మహారాజ కవితేశ్వరా నిన్ను ఈ
రీతిన తలచంగ ఓ రోజు ఉంటుందనీ నా
కెపుడు ఊహన్ కూడ ఆలోచనన్ లేదు.. కాని
నేడు నీదు బర్తడే అని అందరున్ చేస్తున్న ఈ
చిత్ర విచిత్ర హడావిడిన్ నే చూస్తున్న...
నిన్నున్ పెద్ద పెద్ద వ్యాసాల
రూపాలలో స్తుతిస్తూ...
ఈ సోషల్ నెట్ వర్కింగుల.. సైట్ ల ...లో......
పిచ్చి పిచ్చిగా నిను కవ్వించి, పోస్టులుగా
రాసేటి పెద్దలన్, బుడతలన్ జూసి
నాకు రాయాలని బుద్దిపుట్టి
ఛందస్సు లేకుండా రాసేటి ఈ
పిచ్చి రాతను కవితా హృదయంతో
వినమని కో....రేదన్ ... !!!
అయ్యా ..! కవితేశ్వరా ..
పోయెట్రీశ్వరా అని ఎందరు పోగిడినన్,
వేడినన్.. లెక్కసేయ్యక
పనికిమాలిన కపితా విన్యాస వ్యాసాలను
వినిపించు పాపాత్ములనుద్దరించంగ
నీ సహనమున్, అసహనమున్ సైతం
పక్కకు నెట్టి .. నెత్తి బొప్పి కట్టేవరకు
వారిచేతన్ కపిల వ్రాతలు వినిపించుకునే మీ
ఔదార్య మనసుకున్ .......!
ఎన్ని దండాలు పెట్టినన్... ఆఁ
ఎన్ని దండాలు పెట్టినన్...
తప్పు .... లే... దయా.. !!!
సంధ్యాస్తమ సమయానికి
తలపోటుతో, తలబొప్పితో
వున్న నిన్నున్ విడువక
గుక్క తిప్పుకోక వ్రాసేటి ఈ
వ్రాతలకున్ భయపడి
గృహంబునకేగి ...,
ఇల్లాలు కవితారమణి చేత
అతి దుర్లభమగు నట్టి
ఈనాటి దుఃఖమును వెలిబుచ్చలేక
చాటుగా ఔషదముతో నీకు నీవుగా మర్దనా
చేసుకును నీ బిక్క మోమునున్ జూచి
మరలా ఏడాది వరకు వచ్చు నీ
నొప్పులన్, బాధలన్ తలుచుకొనిన్
వెక్కి వెక్కి వెక్కుళ్ళు తెచ్చుకొని
వచ్చే ఏడాదికైనన్ నీ
తల బొప్పికట్టించకుండునట్లు
ప్రమాణమాచారిస్తున్నాం ... ఓ
కవితేశ్వరా .. మహా ప్రభో...
నమస్తే.. నమస్తే.. నమః
Written by : Bobby Nani

ఒకడేమో “పోయెట్రీ దినం” అంటున్నాడు.. ఒక వరలో రెండు కత్తులు పెట్టకు.. అదైనా రాయి.. ఇదైనా రాయి.. ఈ సగం సగం యవ్వారాలు మనకు వద్దు..
“ప్రపంచ కవితా దినోత్సవం” అంటే ఒక్కరోజు గుర్తుపెట్టుకోవల్సినది కానే కాదు... ఓ అద్బుతమైన కవిత మనసును తాకినప్పుడు అది ఆఖరి శ్వాస వరకు గుర్తుంటుంది.. ఇది ఒక్కరోజుతో పోయేదా.. ??
అందుకే ఇలా వ్యంగ్యంగా వ్రాయాల్సి వచ్చింది.. దోషజ్ఞులు, అనుభవజ్ఞులు సరదాగా తీసుకోవాలని కోరుతున్నాను...
స్వస్తి __/\__

Thursday, March 12, 2020

మజిలీ..



మజిలీ.. 
****** 
భావాలే కరువౌతున్నాయి 
ఇక భావ కవిత్వం ఏం రాయమంటావ్ ..? 

నువ్వు, నేను 
ఒకే కాలంతో పరుగులు తీస్తున్నాం.. 
కానీ మన ప్రయాణాలే వేరు 
లేనిపోని పెద్దరికాలు తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది.. 
అయినా సాధించింది ఏమీ లేదు. 
అలాగని కాలంతో పరుగు మాత్రం తప్పట్లేదు.. 
అయినా మనసైన సమయాలలో మనమూ, 
మనం కదలని సమయాలలో కాలమూ, 
ముందుకెళ్తూనే వుంది..!! 

ఎప్పుడూ చీకటిని చూసే మనసు 
ఒంటరితనంతో చంద్రుణ్ణి చూస్తూ, 
వెన్నెలను ఆస్వాదించే సున్నితత్వం 
మరిచానేమో అనిపిస్తుంది.. 
నిజమే బ్రతుకు పరుగులలో 
భావజాలాలు, వయస్సులు, అన్నీ 
గప్చిప్గా మారిపోతుంటాయి..!! 

ఇన్నేళ్ళు గడిచినా 
ఇప్పటికీ మార్పేదైనా మనలో ఉందా అని చూసా.. 
ఆలోచనల్లో లేదు కానీ, 
ఒకరికొకరం సమయం కేటాయించడంలోనే వచ్చింది.. 
రాకేం చేస్తుంది .. ఎదురుగానే వున్నా 
సంద్రానికి అటువైపున నీవు, 
ఇటువైపున నేను కదా..!! 

అయినా.. 
అవే కాలం కొలతల్లో, 
నువ్వూ...!! నీతో నేను సమాంతరంగా 
ప్రయాణిస్తున్నాము కదా.. !! 

చూడు.. నిశితంగా !! 
వెచ్చని వెలుతురును, 
చిక్కని నిశీధము కప్పుతూ వస్తుంది.. 
నువ్వు కూడా నిశీధమనే మలుపుదగ్గర 
రాతిరి మజిలీ కోసం వెళ్తున్నావు కదా..!! 


అసలు మనమెక్కడైనా కలుస్తామా.. ? 
ఇలానే అంతం అవుతామా.. ? 
మనకంటూ నెమరేసుకోవడానికి 
కొన్ని జ్ఞాపకాలైనా ఉంటాయా.. ? 
ఏమో .. నేను చాలా నిర్లక్ష్యంగా ఉంటాను.. 
రేపటి కోసం... రేపు ఏంటి మరో నిమిషం గురించి 
ఆలోచించలేని నిర్లక్ష్యం నాది..!! 

ఆ చున్నీ పట్టుకు లాగి 
నీకు చొరవ నేర్పి దారి చూపించాలని ఉంటుంది.. 
ఎందుకో నువ్వు ఎదురుపడితే 
మనసు మౌనంగా మారిపోతుంది.. 
నిన్ను ఎవరైనా చూస్తే కోపం, 
నువ్వు ఎవరితోనైనా మాట్లాడితే బాధ.. 
ఏంటో ఇవి .. భలే ఉంటాయి తల్చుకోవడానికి..!! 

ఇప్పటికి కూడానా అని అనకు.. 
ఇప్పటికీ ఎప్పటికీ అవే భావాలు నీపై.. 
అవి చెరగనివి, చెరిగిపోనివి...!! 
నిను చూడాలని ఉంటుంది. 
చందమామను ఓ కన్ను గీటి అల్లరి పట్టించాలని వుంది 
పండు వెన్నెల్లో తడవాలని వుంది 
చెయ్యి పట్టుకుని నీతో నడవాలని వుంది.. 
ఈ కోరికల్ని ఇలానే ఉంచనీ 
ఎందుకంటె నువ్వేగా నా తొలి, ఆఖరి మజిలీ..!!

Written by: Bobby Nani