Monday, March 1, 2021

కక్షావైక్షకుడు...


 కక్షావైక్షకుడు

***********

ఉల్లిపాయకు లానే కవికి కూడా ఒంటరితనం కేంద్రస్థానమేమో
అన్నీ కలిసినట్లే వున్నా పొరలు పొరలు గా వేరుగా వుంటాయి..
ఒంటరితనం నింపడం కోసమేమో
తనకీ, లోకానికీ మధ్య సమన్వయం కోసం
రకరకాల అనుభవాల్ని, రంగు రంగుల మాటల్ని,
నిరీక్షణ గా ఏరుకుంటూ వుంటాడు ..
వెలుగు, చీకట్లను తెగ త్రాగి
ఏక ఉదుటున సప్తవర్ణాలు చిమ్ముతాడు..!
ఉల్లిపాయ లానే అడక్కుండా నేరుగా ఇంట్లోకి,
నీ వొంట్లోకి రాగలిగిన వాడు కవి ఒక్కడే..!!

స్వప్నంలో విహరించడం అతడికిష్టం
మరణం అతడికి కొత్త కాదు
రాపిడికీ రాపిడికీ మధ్యన మరింత కాంతివంతమగు వజ్రంలా
ఆకాశంలో ప్రతీ రాత్రీ పొడిచే వేగు చుక్కలా
మళ్ళి మళ్ళి కొత్తగా కళ్ళు తెరుస్తూనే ఉంటాడు
మరణాన్ని తన శరీరంతో హత్తుకుంటూనే ఉంటాడు..!!

ఉత్తరాన స్మశానోద్యానవనం గాలి గోడల మీంచి
గుంపులు గుంపులుగా దుముకుతున్న
జీవాత్మల మహాక్రందన
అతడి చెవుల్ని తాకినప్పుడల్లా
జూలు విదిల్చిన సింగములా చెలరేగిపోతాడు
అక్షరపు కొరడాను సమాజంపై విసురుతూ గర్జిస్తాడు
మానవుడు పలికే వాక్యం అతడి నోట్లో పడగానే
ఒక మహాకావ్యమై అది పెల్లుబుకుతుంది..!
దుఃఖ సముద్రాల మీదుగా అతడి ప్రయాణం ఈనాటిది కాదు
అతడి గాయాలను అతడే మాయం చేసుకోగల
మంత్ర విద్యను అభ్యసించాడు..
అందుకే అతడు “కవి” అయినాడు
భౌతిక ప్రపంచాన్ని అధిగమిస్తూనే
ఏకాంతంలో అంతరంగాన్ని ప్రక్షాలితం చేస్తుంటాడు..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985