Wednesday, April 28, 2021

నీకన్నీ తెలుసు.. అవును నీకు అన్నీ తెలుసు..!



ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్య..”కరోన” కాదు.. “నిర్లక్ష్యం”
కుటుంబంలో ఒక నిర్లక్ష్యపరుడు వుంటే ఆ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లుతుంది.. అలాంటిది దేశం మొత్తం నిర్లక్ష్యపరులు వుంటే ఇక దేశమెలా బాగుపడుతుంది.. దేశానికి చీడపురుగులు రెండే రెండు స్వార్ధం, నిర్లక్ష్యం. ఈ రెండూ మనిషిలో ఉన్నంతవరకు కరోన కాదు రేపు మరోటి వచ్చినా కట్టడి చెయ్యడం మనిషి వల్ల కానిపని.

వ్యక్తిగత భాద్యత చాలా ముఖ్యం.. ఇది ఒకరు చెప్తేనో, నేర్పితేనో వచ్చేది కాదు.. ఎవరికి వారు స్వతహాగా తెలుసుకోగలగాలి..

దూరం దూరంగా వుండండి అంటే వినరు,
జాగ్రత్తలు పాటించండి అంటే పట్టించుకోరు
మీలో సమస్య వుంటే ఇంట్లోనే వుండండి అంటే వుండరు.
కాస్త ఓపిగ్గా వుంటే చాలు బయటకువచ్చి తిరిగెయ్యడం మరో వంద మందికి అది అంటించడం.. అదేమంటే మాకేం కాదు అనే ధీమా.. అవును నీకేం కాదు.. నీ నుంచి సోకినవారు పొతే నీకేంటి.. ఎంతో జాగ్రత్తగా భాద్యతాయుతంగా ఉన్నవారు కూడా నీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. నీకు అర్ధమౌతోందా ..!!

ఓ వారం రోజులు ఇంట్లో వుంటే నీదేం పోతుంది...
నీ ప్రాణాలు ఎలాగో నీకు లెక్కలేదు.. కనీసం చిన్న పిల్లలు, పెద్దవారికైనా విలువ లేదా..

మన భవిష్యత్తు రేపటి పిల్లలు
గతాన్ని చూసివచ్చిన మన పెద్దలు.. మనందరి మార్గదర్శకాలు.. వీరిద్దరూ మనకు ఎంతో ముఖ్యం. వీళ్ళకు ముందు నిలబడి కాచుకోవాల్సిన మనమే వారిని చంపేసుకోవడం శోచనీయం.

నీలో ఈ నిర్లక్ష్యం ఉన్నంతవరకు నీకు, నీ కుటుంబానికే కాదు నీ చుట్టూ ఉన్నవారికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
చిన్న ఉదాహరణ : రోడ్ లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం, దాన్ని బండ్లు తొక్కడం, ఇంట్లో పిల్లలు వాటిని తెలియక ముట్టుకోవడం అది ఇంటిల్లిపాదికి సోకడం వారినుంచి మరో ఇంటికి ఇదే జరుగుతోంది.. మూలం ఎవరు ఇక్కడ అర్ధమౌతోందా ..!!

నీకు సోకినా కూడా నీ పనులు మాత్రం అస్సలు ఆగకూడదు.. పక్కోడు ఏమైపోతే నీకేంటి.. ఆ పక్కోడి ఇంట్లో వృద్దులు ఉండొచ్చు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉండొచ్చు.. పసిపిల్లలు ఉండొచ్చు నీ వల్ల వారు అకాలమరణం చెందుతున్నారు..నీకు అర్ధమౌతోందా ..!!
మనిషిగా పుట్టినందుకు మనం ఇతరులకు మంచి చెయ్యకున్నా పర్వాలేదు కానీ మనవల్ల ఇతరులకు చెడు మాత్రం జగరకూడదు అనే ఆలోచన లేకపోయింది ఈ రోజుల్లో..

నేడు మానవత్వం అంటే సాయం చేసేటప్పుడు తీసుకునే నాలుగు ఫోటోలు, అది చూసి పదిమంది నిన్ను స్తుతించే నాలుగు ప్రశంసా మాటలు..

నీకన్నీ తెలుసు.. అవును నీకు అన్నీ తెలుసు..!
ఎలా ఉండాలో తెలుసు
ఎలా ఉండకూడదో కూడా తెలుసు
కానీ నిర్లక్ష్యం.. ఎవరేమంటారులే అని..!
పాడి మొయ్యడానికి కూడా నలుగురు కావాలి..అలాటిది కళ్ళముందే ఇద్దరు భయంభయంగా తీసుకెళ్ళి సామూహికంగా తగలెట్టేస్తున్నారు .. మన దేశంలో పుట్టుక కన్నా చావుకు ఎంతో విలువ వుంది.. పది శుభకార్యాలకు పోకపోయినా పర్వాలేదు కానీ.. మనిషి ఆఖరి చూపుకు వెళ్ళాలి వారి మరణాన్ని మనం గౌరవించాలి అని భావించే నా దేశంలో ఈ దుస్థితికి కారకులు ఎవరు .. అర్ధమౌతోందా నీకు..!!

ప్రస్తుత పరిస్థితి మన చేయి దాటిపోయింది..
మిత్రులు పాజిటివ్ న్యూస్ నే పంపండి అని అంటున్నారు మంచి ఆలోచనే కానీ నెగటివ్ న్యూస్ లు జనాలను ఇంత భయపెడుతున్నా కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు కదా.. భయపడేది ఇంట్లో ఉన్నవారు మాత్రమే.. బయట విచ్చలవిడిగా తిరిగేవారు ఎవ్వరూ భయపడట్లేదు..ముందు అది గుర్తుపెట్టుకోండి..!!

దయచేసి అర్ధం చేసుకోండి.. మన నిర్లక్ష్యం విలువ కొన్ని ప్రాణాలు కావచ్చు..
నీకన్నీ తెలుసు.. అవును నీకు అన్నీ తెలుసు..
కాస్త జాగ్రత్త వహించు..!!

స్వస్తి.. __/\__

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985

Friday, April 16, 2021

వాసంతిక



ఉగాదితో మొదలైన వసంతఋతువది
తెల్లవారు ఝాము వేళలు ఎంతో అందంగా ఉన్నాయి
తోటల్లో ఏతపు కొయ్యలను త్రొక్కుతూ తోటమాలులు
మధుర గీతాలను ఆలపిస్తూ జానపదులు
వారి పాటలకు నీటిలో మునిగే కుండ
భుంభుమ్మని ధ్వని చేస్తూ
జానపద వాద్యమైన గుమ్మెట మ్రోగినట్లుంది..!!

పాటలీ వృక్షాల క్రింద రాత్రి రాలిన పువ్వులు
దూరంనుంచి వార్తలను మోసుకొచ్చే పిల్లగాలికి
గుట్టలు గుట్టలుగా పేరి వున్నాయి..
మడవలలో నుండి నీరు ప్రవహిస్తుంటే
తడసిన నేల వాసనను రెట్టింపుచేస్తూ
యీ పూల సువాసనలు ఏసరేఁగుతున్నవి..!!

వారి పాటలు,
యీ సువాసనలు,
ఏతపు బాన చేసే వాద్యధ్వనులు
అన్నీ కలిపి యీ ప్రాతఃకాలమును
సొగసుగా చేస్తున్నవి..!!

దూరాన్నుంచి అందియల చప్పుడు
ఘల్లుఘల్లుమనుచు
గుండెను పూదండతో లాగినట్లుగ
అటుప్రక్కగా తిరిగి చూసాను
మలయపవనమున
పింఛము విప్పిన మయూరములా
పారాణి అంటిన పాదాలతో లేలేత
హిరణ్మయ రశ్మిని ముద్దాడుతూ
చెంగు చెంగుమనుచున్నది..!
నెమలిలా నడిచే ఆమె నాట్యానికి
వాయునందనుడే మద్దెల వాద్యకాడైనాడు..!!

నల్ల కల్వలవలె చక్కనైన కనుపాపలు
అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించు ఫాలము
అమృత రసాన్ని నింపిన కెంపుల కలశస్తనాలు
బంగారు కాంతితో మెరిసే ధగధగల ఉదరభాగం
భగభగల మంటలను జిహ్వతో చల్లార్చు నత నాభీ సరస్సు
నిజంగా ఆమెది సహజత్వమైన సౌందర్యం..!!

దగ్గరకొచ్చిన ఆమె
కెంపారు నేత్రాలలో
కోటి సూర్యోదయాల్నిఒక్కసారిగా దర్శించాను
మకరికల లేపనం దేహానికి పట్టించిందేమో
మంత్రించినట్లుగా నాసికనదరగొడుతూ
గుప్పున తాకే గంధపు, కస్తూరి పరిమళములు
సమ్మోహించు ఆమె ఉచ్వాస నిశ్వాసాలు
ఆమె శరీర సౌష్టవం ముందు
పండువెన్నెల సైతం వెలవెలబోతుంది..!!

తమకముతో బరువుగా రెప్పలు వాలుస్తున్న
నా నేత్రాలు నన్ను ఉయ్యాలలూపుతాయి
ఆమె నయనావీక్షనాలు సాగి లాగి విడిచిన బాణాల్లా గురిచూసి
నా గుండెల్ని తాకుతున్నాయి
లేతాకు మీది వర్షపు చినుకులా,
కొమ్మనుంచి సున్నితంగా వ్రేలాడే పిందెలా
నడుస్తూ, నాట్యమాడే మయూరి విప్పిన
వేయికళ్ళ వసంతోద్యానవనంలా
ఆమెను చూసిన నా కళ్ళు మంత్రించి వేశాయి..!!

Written by: Bobby Aniboyina

Friday, April 9, 2021

హంసయాన


 

హంసయాన
**********

వెదురు కర్రను వేణువుగా మార్చి
వేణుగోపాలున్ని వెర్రిగోపాలున్ని చేస్తివి
వేణువై, విపంచివై,
నాదమువై, నిస్వనమువై
నను లాలించగరావే నా భావగీతికవై..!!

రాగాలు పలికించు పెదవంచున
పిల్లనగ్రోవిగ నను జేసి
కోకిల రావాల కిలకిలల ఆమనివై
మొహనివై, కల్యాణివై,
హరివిల్లువై, కలహంసవై
నను మురిపించి మైమరిపించగరావే
నా మధుర గీతికవై..!!

కలువ
కన్నుల చూపులతో కనికట్టు నొనరించి
నోటి మాటలతోనే మంతరించుచుంటివి
పిలువకుండనే ఎదలో పీటేసి కూర్చుంటివి..!!
ఏమనుచు చెప్ప నా గాధ ..
ఎదనేమో పడరాని ఈ బాధ..!!

బుగ్గపై చిటికేసి
ముంగురుల నెగదోసి
జాలి చూపుల రాలు
నీలాలు వెలబోసి
దోర పెదవి రాల్చు
మాట మాటల్లో
నా మనసంత కోసేసి
నవ్వుతూ నవ్వించి
కొంటెగా కవ్వించి
సమ్మోహించే కలువ కన్నులతో,
శీతల చందన మలరిన నునుబుగ్గల సిగ్గులతో,
బేడిస చేప చంచలములతో,
ఒయ్యారి హంసయాన రసచుంబన కైంకర్యములతో,
నెలవంకల భంగిమలతో,
లేత సంపెంగ తీగల భుజ బాహువులెత్తి
చంకన చనుగుబ్బలు
గుండ్రని పూబంతుల ఎద సొత్తులై
విరాజిల్లు వేళ,
కుచ సౌందర్య మొనలపై
మిశ్రిత వర్ణపు బొండు మల్లియలు
నిక్క బొడిచి నీల్గిన వేళ,
నత నాభీయమున
నిత్య హోమము జరిగెడి వేళ
అవ్యక్త భొతిక ద్రవ్యాలతో నీ దేహం
సమ్మోహన పరిమళాలు ప్రసవించు వేళ
నఖశిఖ పర్యంతం నిను
కన్నులతో ఆఘ్రాణించు వేళ
నీ ఆధర చుంబనారాధితుడనై
మైమరిచి వినీలాకాశ వీధుల్లో
విహంగమై విహరించు వేళ
నీ అణువణువునా అందములే,
అంద చందములే !
ఆనంద నందనములే..!!
అరటాకు నడుమొంపును
ఊగి ఊగి ముద్దిచ్చే ఆ తడి కురులు
చవితి చంద్రుని వంటి ఆ నితంబ పీఠములు
ఏమాటకామాటే
ఆమెలోని సాత్విక సౌష్టవములు జూచి
నా మానస ప్రవృత్తి
కందళ తాళ ఆనంద నాదములతో మున్గి తేలుతూ,
చతుర్ధావస్థతో ప్రతిధ్వనులు గావిస్తున్నాయి..!
ఏమనుచు చెప్ప నా గాధ ..
ఎదనేమో పడరాని ఈ బాధ..!!

Written by: Bobby Aniboyina