ఒకప్పుడు పేపర్, న్యూస్ ఛానల్స్ లో మాత్రమే కనిపించే వార్తలు, ఈ మధ్య మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాం. దానికి కారణాలు ఎన్ని వున్నా, 'లైకుల' కోసం, 'వ్యూస్' కోసం ఒక మనిషి ఆత్మగౌరవాన్ని బజారున పెట్టే నేటి వికృత ధోరణి మాత్రం చాలా బాధాకరం. సోషల్ మీడియాను ఒక 'వధశాల'గా చేసి మీ చేతిలోని ఫోన్‌ను ఒక 'ఆయుధం'గా మార్చి, వారిపై మీరు రాస్తున్న ఈ రాతలు ఓ మానసిక హత్యాకాండతో సమానం.
మనమంతా ఈ మధ్య ఒక ప్రమాదకరమైన అలవాటుకు బానిసలమైపోతున్నాం. నిజం తెలుసుకోవడం కంటే ముందే తీర్పు చెప్పడం, పరిస్థితిని అర్థం చేసుకోవడం కంటే ముందే అవమానించడం, ఒక మనిషిని సరిదిద్దడం కంటే ముందే అతన్ని నాశనం చేయాలని తొందరపడటం.
ఇది సమాజం ఎదుగుదల అస్సలు కాదు, ఇది మనిషి మనిషిపై చూపిస్తున్న ఒక కొత్త క్రూరత్వం.
అతను లేదా ఆమె తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడం మాని, ఆ తప్పును అందరికీ చేరేలా వైరల్ చేసి ఆనందించే ఈ సమాజపు ద్వంద్వ నీతిని ఏమని ప్రశ్నించాలి ?
కేవలం కొన్ని లైకుల కోసం వాళ్ల ఆత్మగౌరవాన్ని బజారున పెట్టే ఈ డిజిటల్ రాక్షసత్వం పై ఏమని రాయాలి?
సమాజంలో ప్రశ్నించే ధోరణి లేకపోగా, ఓ తప్పును మరింత ముందుకు తీసుకెళ్లడం లో మీరు చూపిస్తున్న ఈ తాపత్రయాన్ని ఏమని పిలవాలి?
నేటి కాలంలో ఓ మనిషి తన ఇమేజ్ కోసం ఎంత ప్రాకులాడుతున్నారో ఈ సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన విషయమే, కానీ తన ఇమేజ్ కోసం మరో మనిషిని ఒక పావులా మార్చి ఇంత దారుణంగా అవమానించడం మాత్రం చాలా బాధాకరం.
స్క్రీన్ మీద మీరు చూస్తున్నది తప్పు చేసిన వారి వీడియోనో, ఫోటోనో కావచ్చు.. కానీ దాని వెనుక వారిని అప్పటివరకు ప్రాణప్రదంగా ప్రేమించే ఓ కుటుంబం ఉంటుందని ఎందుకు మర్చిపోతున్నారు? మీ ఫోన్ నోటిఫికేషన్ ఇచ్చే ప్రతి శబ్దం.. ఆ కుటుంబం అవమాన భారంతో కుంచించుకుపోయి వాళ్ళ గుండెల్లో ఒక మహావిస్ఫోటనం బ్రద్దలౌతుందని మీకు తెలుసా?
ఒక తప్పును సరిదిద్దడం అంటే పది మందికి పంచిపెట్టడం కాదు. కానీ నేడు వైరల్ చేయడమే ధర్మంగా, ట్రోల్ చేయడమే వీరత్వంగా భావిస్తున్న ఈ సమాజం, ఒకరి కన్నీటిని పెట్టుబడి గా మార్చుకుంటోంది. లైకులు పెరిగే కొద్దీ మీ అహంకారం తృప్తి చెందుతుందేమో కానీ, మీలోని మనిషి మాత్రం మీకొచ్చే ప్రతి కౌంటు కు మరింతగా దిగజారిపోతున్నాడు. ఒకరి పతనాన్ని చూసి వికృతానందం పొందే ఈ ధోరణి.. రేపు నీ ఇంటి గుమ్మం ముందుకు రాదని గ్యారెంటీ ఏముంది?
ఇది విమర్శ కాదు.. నైతికంగా పతమవుతున్న ఈ సమాజంపై ఓ 'అక్షర ఆవేదన'.
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

No comments:
Post a Comment