Wednesday, February 7, 2024

అభినవ సత్య…!


 ప్రత్యూషవేళలు అనేకం వికసిస్తూ ఉంటాయి..
ససంధ్యమ సమయాలు అనేకం ముగుస్తూ ఉంటాయి..
కానీ
మనసెప్పుడూ భావాల పల్లకిని మోస్తూనే ఉంటుంది..
శ్వాసెప్పుడూ ఉత్ప్రేక్షాపరిమళాలను వెదజల్లుతూనే ఉంటుంది..
నాకూ తెలియదు
ఎన్నడూ చూడని ఓ పరవశం
తనని చూడగానే నాలో కలుగుతుందని.. !!
రూపంలో సుగాత్రి
గాత్రంలో వాగ్ధేవి
వదనంలో కలువకంటి
తత్వములో పద్మముఖి..!!
ఒక సముద్రం ఉప్పొంగినట్లు
ఒక జలపాతం పరవశించినట్లు
ఒక ఝంఝూనిలం వికసించినట్లు
తనని చూడగానే అనిపించే భావన అది..!!
మొదటిసారి తనని చూసినప్పుడు
అక్కడ వెన్నెల లేదు .. కానీ నిండు పున్నమిని ఆస్వాదించాను
అక్కడ గాలులే లేవు.. కానీ సమ్మోహన పరిమళాలను శ్వాసించాను
అక్కడ మయూరమే లేదు .. కానీ పురివిప్పియాడు మధుకమును చూసాను
అక్కడ ప్రకృతే లేదు… కానీ రస తనువంతా శోభిల్లే సొబగులను దర్శించాను
వెన్నెల మధుపానమ్ములతో మిన్నంటిన ఆ ఎద శిఖరాగ్రములను
ఎద శిఖల పై తేలియాడు బరువైన ఉఛ్వాస నిశ్వాసావిర్లను..
నిక్క నీల్గినప్పుడు దందశూకములా సాగే రస మధురిమలను
దర్భపోచవంటి పచ్చని దేహ కాంతితో విరాజిల్లే ఆ పసిడి కాంతులను
కుసుమంలా విచ్చుకున్న నాభీయములో చలములూరే మగువ రసమ్ములను
ఏ ప్రవరాఖ్యుడు సౌఖ్యింపగలడు.. మరేసమ్మోహనుడు వాటిని శాంతింపగలడు..!!

తుమ్మెద రెక్కల వంటి ఆ కనురెప్పలు..
కలువలవంటి ఆ నేత్ర త్రయములు...
లేత వెన్నపూస వంటి ఆ మకరికల చెక్కిలి..
మరగ కాగినట్టి ఆ పాల మీగడ సొగసు.
లేత చివుర్లు వంటి ఆ ముంజేతి వేళ్ళు .
వీణానాదము వంటి మృదు మధుర గాత్రము ..
చూసి చూడగానే నెలవంక నడుముతో సమ్మోహించే ఆ రూపం
సంధ్యా సమయమున విచ్చుకునే మల్లెలై పరిమళిస్తుంది..!!

కోపమొస్తే ప్రళయమూ తానె
ప్రేమ కలిగితే ప్రణయమూ తానె
అందుకే అది నా అభినవ సత్య..!!

~ ~ త్రిశూల్ ~ ~

Mobile: 9032977985
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr