Thursday, March 26, 2026

నిశీధి కావ్యం...

 


సూరీడు నిదురోయే వేళ..
విశ్వం తన అసలైన ముఖాన్ని ఆవిష్కరిస్తుంది!
నల్లని కంబళి కప్పుకున్న పుడమి,
నక్షత్రాల ముత్యాలను తన శిగలో తురుముకుంది!
దూరంగా వినిపించే తుమ్మెద ఝంకారం..
నిశ్శబ్దపు వీణపై పలికిన ఆఖరి రాగంలా ఉంది!

ఆకాశమనే అనంతమైన నల్లని క్యాన్వాస్ పై,
చందమామ ఒక వెండి సిరా చుక్కలా రాలి,
వెన్నెలనే అక్షరాలతో రాత్రి కావ్యాన్ని మౌనంగా రచిస్తోంది!

మెరుస్తున్న ఆ తారకలు..
కాలపురుషుడి పాదాలకు తగిలిన మెరుపు మువ్వల్లా,
విశ్వపు నిశ్శబ్ద నృత్యంలో
లయబద్ధంగా నాట్యం చేస్తున్నాయి!

కొండకోనల మధ్య పారుతున్న ఆ సెలయేరును చూడు..
చీకటనే కారుమబ్బును చీల్చుకుంటూ
ఎంత సౌమ్యంగా పారుతోందో!
గాలికి ఊగుతున్న ఆ నిశ్శబ్ద అరణ్యాన్ని చూడు..
తనలోని రహస్యాలన్నీ బయటకు చెప్పలేక,
చీకటి పుస్తకంలో దాక్కున్న పురాతన శ్లోకాల్లా
ఎలా గుసగుసలాడుతోందో!

ప్రతి పువ్వురేకుపై వాలిన ఆ మంచు బిందువును చూడు..
ఆకాశం రాల్చిన ఓ ఆనంద బాష్పంలా ఎంత హుందాగా వుందో!
అర్థరాత్రి వేళ వినిపించే ఆ గూబ అరుపు చూడు
నిద్రపోతున్న లోకాన్ని మేల్కొలిపే,
ఒక అతీంద్రియ హెచ్చరికలా ధ్వనిస్తోందో!


ఈ నిశీధిలో..
ప్రకృతి తన ముసుగును తొలగించి,
ఒక నగ్న సత్యంలా మన ముందు నిలబడుతుంది!
దాన్ని మనం మనసుతో చూడగలగాలంతే!

ఇంటి ముంగిట నిలబడి చీకటినంతా చూస్తుంటే
రాత్రి అనేది భయానకంగా కనిపించొచ్చు, కానీ
రోజంతా అలసిపోయిన లోకానికి
ప్రకృతి పరచిన నిశీధి .. ఓ నిశ్శబ్దపు ఓదార్పు!
సృష్టి తనను తాను పునర్నిర్మించుకుంటున్న,
ఒక మహా మౌన దర్పణం!

పగలు.. మనిషి ముఖాన్ని చూపిస్తే,
రాత్రి .. అతని మనసును చూపిస్తుంది.
పగలు దాచిన బాధలు,
నవ్వుల్లో మునిగిన ఒంటరితనాలు,
మాటల మధ్య చనిపోని కలలు
ఇవన్నీ
రాత్రి ఒడిలోనే
తమ నిజస్వరూపాలతో మేల్కొంటాయి!
అందుకే
సూరీడు నిద్రపోయిన వేళ
ప్రకృతి నిద్రించదు...
తను మరింత మెలకువగా ఉంటుంది.
ప్రతి ఆకు పై తనదైన ఓ జ్ఞాపక సంతకం చేస్తుంది!

కళ్ళతో కాదబ్బా..
ఈ హడావిడి జీవితాన్ని కాస్త పక్కన పెట్టి..
మనసుతో చూడు..
నువ్వు చూసే ప్రతీ ఫ్రేమ్ లో ఓ అందం!
నువ్వు ఆస్వాదించే ప్రతీ శ్వాసలో ఓ అద్బుతం దాగుంటుంది!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment