నిశ్శబ్ద యుద్ధం..
అందరి జీవితం ఒకేలా ఉండదు .. అందులోను ఓ మధ్యతరగతి వారి జీవితం మరీ దారుణంగా ఉంటుంది..
తగ్గి బ్రతకడం చేతకాదు... అలా అని ఖరీదుగాను ఉండలేడు.
జేబులో రూపాయి లేకున్నా పౌరుషంతో బ్రతికేస్తాడు.. ఓ మాటంటే పడలేడు.. ఆత్మాభిమానంతో బ్రతికేస్తాడు..
అందుకే మధ్యతరగతి వాడు మధ్యరకం వాడిగానే మిగిలిపోతాడు.. ఎల్.బి. శ్రీరాం గారు నటించినటువంటి “అమ్మో 1వ తారీఖు” చిత్రం లో లాగే.. 1వ తారీఖు వస్తుందంటే గజగజ వణికిపోతుంటాడు.
తలకుమించిన భారాన్ని ఎవరూ మోయాలనుకోరు.. కానీ పరిస్థితుల రీత్యా వాడు మోయాల్సి వస్తుంది.. అలాంటి భారాన్ని మోసే ఒక సగటు మధ్యతరగతి వాడి ఆవేదనకు దర్పణమే నా ఈ ఆర్టికల్ ..
వాడికి ఎన్నో కలలు వున్నాయి.. కానీ ప్రతి ఉదయం వాడు లేచేది మాత్రం అందరి బాధ్యతలను నెరవేర్చడానికి. ఎవరికీ వాడి బాధ కనిపించదు, అక్కర్లేదు కూడా. తన కుటుంబం నవ్వుతుంటే వాడికి చూడటం మాత్రమే ఇష్టం. దానికోసం ఏడవడానికీ, బాధపడటానికి కూడా సమయం లేకుండా పరుగులు తీస్తుంటాడు..
వాడికీ ఓ కల వుంది.. సొంత బిజినెస్ పెట్టి, తన కష్టంతో ఎదగాలన్న ఆశ. కానీ ఎప్పుడూ ఆ కలలు ... క్యాలెండర్ పేజీల వెనుక చిక్కుకుని వుంటాయి.. ప్రతి నెల రెండవ తేదీ వచ్చే జీతం, కొన్ని గంటలలోనే బిల్లుల అగాధంలో గప్చిప్ గా మాయమౌతుంది. రెంటు, కరెంటు, పిల్లల ఫీజులు, పెద్దల మందులు ఇలా ప్రతి రూపాయి వాడికో బాధ్యతగా మారిపోయింది.
వాడి జీతం కేవలం ఒక నంబర్ మాత్రమే, కానీ ఆ నంబర్ వెనుక వాడు గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రులు, మౌనంగా భరించిన ఆందోళనలు, రహస్యంగా ఎడ్చుకున్న క్షణాలు ఎన్నో వుంటాయి.
జీతం వచ్చిన మూడోరోజే వాడి ఖాతాలో “బాలెన్స్ జీరో” అని కనిపించినప్పుడు, “నేను కూడా జీరో” అనే వేదన వాడి కళ్ళనుంచి ఎగసిపడుతుంది.
అవును వాడు పోరాడుతున్నాడు.. పరిస్థితులతో, కాలంతో, తన అసహాయతతో.
వాడి యుద్ధానికి ఆయుధాలు లేవు, కానీ తట్టుకునే తపన ఉంది.
చుట్టూ ఉన్నవారు “ఉద్యోగం ఉంది కదా” అంటారు,
కానీ ఎవ్వరికీ తెలియదు ఆ ఉద్యోగం వెనుక వాడి మనసును... వాడు ఎంతలా చంపుకున్నాడో..
తన భార్య, పిల్లలు చిరునవ్వుతో .. వాడిలోని అలసట ఆ క్షణం మాయమౌతుంది.
అయితే అదే సమయంలో మరో ఆలోచన వెంటనే గుచ్చుతుంది.
“వారికోసం ఇంకా ఎక్కువ కష్టపడాలి .. ఇంకా ఏదో చెయ్యాలి”
ఆ ఆలోచన వాడి హృదయంలో ప్రతి రోజూ ఒక చిన్నపాటి యుద్దాన్నే మొదలుపెడుతుంది.
ఆ యుద్ధం లో రక్తం కారదు కానీ మనసును కాల్చేస్తుంది..
ఆ యుద్ధం లో గెలుపు కనిపించదు, కానీ ఓటమి భయపెడుతుంది..
ఆ యుద్ధం తన కోసమేమీ కాదు, తనని నమ్ముకున్న వారిని నిలబెట్టడానికే.
వాడి వేదననకు పేరు లేదు.. వాడి కలలకు వాయిదా పడ్డా, వాడి బాధ్యతలు మాత్రం వాయిదా వేయడు..వాడి త్యాగం “హీరోయిజం” కాదు, “నిత్యజీవిత పోరాటం”.
ఇది దేశం మొత్తంలో లక్షల మంది కథ.
కార్యాలయాల్లో నిశ్శబ్దంగా కూర్చున్న,కుటుంబాల కోసం ప్రాణం త్యాగం చేస్తున్న సాధారణ మనుషుల గాథ.
వాళ్లు సైనికులు కాదు, కానీ ప్రతీరోజూ యుద్ధం చేస్తారు కాలంతో, పరిస్థితులతో, వారితో వారే.. అలాంటి ఓ యోధులకు నా ఈ అక్షర నీరాజనం.. __/\__
మీ..
~~ త్రిశూల్ ~~
Bobby Aniboyina

No comments:
Post a Comment