Friday, May 22, 2026

నచికేతుడు (1వ అధ్యాయము)

 


మన పురాతన ఉపనిషత్తుల అనంత జ్ఞాన సముద్రం నుండి సేకరించిన కొన్ని విషయాలను, ఒక తాత్విక వ్యాస రూపంలో నేను ఇక్కడ మీ ముందుంచుతున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లోని గందరగోళపు ఆలోచనల్లో బ్రతుకుతున్న నేటి తరం అత్యంత అవసరంగా చదివి అర్ధం చేసుకోవాల్సిన పరమ సత్యాలివి.

ఆ ఉపనిషత్ గర్భంలో దాగి ఉన్న సంస్కృత శ్లోకాలను యథావిధిగా ఇక్కడ పొందుపరిస్తే, అవి అందరికీ అంత సులభంగా అర్థం కాకపోవచ్చు. అందుకే, ఆ శ్లోకాల వెనుక ఉన్న లోతైన అంతరార్థాన్ని, నాదైన శైలిలో వాటికి భావుకతను అద్దుతూ, చదువుతున్న మీ కళ్ళముందు కదలాడే ఒక సజీవమైన సన్నివేశంగా సృష్టించి మీ ముందుకు తీసుకువచ్చాను.

ఇది మీ అంతరంగాన్ని మీరు దర్శించుకోవడం కోసం నేను చేసిన ఒక చిన్న అక్షర ప్రయోగం. చదివి, మీ గుండెకు తాకిన ఆ అనుభూతిని నాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.

నచికేతుడు (1వ అధ్యాయము)
************************
ఆ రోజు… ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష చతుర్దశి… సంధ్యా సమయం నెమ్మదిగా అరణ్యంపై తన చీకటి రెక్కలను విప్పుతోంది. యజ్ఞవాటిక మధ్యలో మండుతున్న అగ్నికుండం…దాని నుంచి పైకెగసే పొగ… ఆకాశంలో మౌనంగా కదిలే మేఘాలతో కలిసిపోతోంది.

వాజశ్రవసుడు యజ్ఞంలో భాగంగా తన వద్ద ఉన్న సంపదను దానం చేస్తున్నాడు. కానీ…అతడు దానం చేస్తున్న ఆవులు వృద్ధమైనవి…పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. అది గమనిస్తున్నాడు అతని కుమారుడైన నచికేతుడు. అతని వయసు చిన్నదే… కానీ మనసు మాత్రం అనేక ప్రశ్నలతో నిండిన అరణ్యంలా ఉంది.

అతని కళ్లలో భయం లేదు…ఒక చిత్రమైన ఆలోచన మాత్రమే ఉంది.

దానం అంటే… మనకు పనికిరానిదాన్ని ఇచ్చేయడమా? ఈ ప్రశ్న అతని గుండెలో ముల్లులా గుచ్చుతోంది. తన తండ్రి దగ్గరకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాడు.

తండ్రీ ..

వాజశ్రవసుడు యజ్ఞకార్యాల్లో నిమగ్నమై ఉన్నాడు.

ఏమిటి నచికేతా?

మీరు అన్నీ దానం చేస్తున్నారుగా… మరి నన్ను ఎవరికి దానం చేస్తారు?

ఆ మాట వినగానే… చుట్టూ ఉన్న ఋత్వికులు ఒక్కసారి అతని వైపు చూశారు. వాజశ్రవసుడు మొదట నవ్వాడు. బాలుడి అమాయక ప్రశ్న అనుకున్నాడు. కానీ…నచికేతుడు మళ్లీ అడిగాడు.

తండ్రీ… నన్ను ఎవరికి ఇస్తారు?

ఈసారి అతని స్వరంలో అమాయకత్వం కన్నా సత్యాన్ని వెతికే తపన కనిపించింది.
ఆ ప్రశ్న… యజ్ఞాగ్నికంటే ఎక్కువగా వాజశ్రవసుడి అంతరంగాన్ని కాల్చింది.

కోపంతో అతని ముఖం మారిపోయింది.

నిన్నా?…కొన్ని క్షణాలు మౌనం తరువాత మృత్యువుకే ఇస్తాను! పో! అన్నాడు
ఆ మాట అరణ్యంలో చుట్టూ ప్రతిధ్వనించింది. గాలి కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమైనట్లు అనిపించింది.

కానీ ఆశ్చర్యం ఏమిటంటే… నచికేతుడు భయపడలేదు. అతడు ఆకాశం వైపు చూశాడు. సంధ్యారాగం పూర్తిగా చీకటిలో కలిసిపోతూ కనిపించింది. అతని చిన్న మనసులో మాత్రం…తన తండ్రి అన్న మృత్యువుకే ఇస్తాను అనే ఒక మహా ప్రశ్న మెదుల్తూనే ఉంది.. మరణం అంటే నిజంగా ఏమిటి? అని ఆలోచించ సాగాడు.

కాసేపటికల్లా ఆకాశమంతా కృష్ణవర్ణ మేఘాలతో నిండిపోయింది. దూరంగా అరణ్య మధ్యలో వినిపించే రాత్రిపక్షుల అరుపులు…చెట్ల కొమ్మల్ని తాకుతూ ప్రవహించే చల్లని గాలి…యజ్ఞవాటికలో మెల్లగా ఆరిపోతున్న అగ్ని… అన్నీ కలిసి ఆ రాత్రిని మరింత చీకటిగా మార్చేశాయి. కానీ…ఆ నిశీధిలో నిద్రపోలేకపోయింది మాత్రం నచికేతుడి మనసే. తండ్రి కోపంలో అన్న మాటను అతడు శాపంగా తీసుకోలేదు… ఒక ప్రశ్నకు తెరచుకున్న ద్వారంలా స్వీకరించాడు.

మృత్యువుకే ఇస్తాను…ఆ మాట అతని చెవుల్లో పదేపదే మార్మోగుతోంది.
అతడు ఆశ్రమం వెనుకనున్న సరస్సు దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు.

ఆ నీటిమీద చంద్రబింబం గాలి తాకిడికి అలలు కదిలినప్పుడల్లా కదులుతోంది.…ఆ చంద్రుడు విరిగిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. నచికేతుడు చాలాసేపు ఆ దృశ్యాన్నే చూస్తూ నిలబడ్డాడు. అప్పుడతని మనసులో ఒక చిత్రమైన ఆలోచన కలిగింది.

చంద్రుడు నిజంగా విరిగిపోయాడా? లేక నీరు కదలడం వల్ల అలా కనిపిస్తుందా?
ఆ ప్రశ్నతోనే అతని అంతరంగంలో మరో ప్రశ్నపురుడుపోసుకుంది.. అయితే… మరణం కూడా అంతేనా?

శరీరం అనే నీరు కదలడం ఆగిపోతే… అందులో కనిపించే జీవం అనే ప్రతిబింబం మాయమవుతుందా? ఇలాంటి ఆలోచనలు అతని చిన్న హృదయంలో అలల్లా ఉప్పొంగుతున్నాయి.

అప్పుడే…

వెనుకనుంచి ఒక స్వరం వినిపించింది.

నచికేతా…

అతడు వెనక్కి తిరిగి చూశాడు.

ఆశ్రమంలోని వృద్ధ ఋషి నిలబడి ఉన్నాడు. తెల్లని జటాలు భుజాలపై జారుతున్నాయి. అతని కళ్లలో వయసు కనిపించట్లేదు …ఏదో లోతైన ప్రశాంతత మాత్రమే ఉంది. ఈ అర్ధరాత్రి ఇక్కడ ఒంటరిగా ఏమి చేస్తున్నావు? అడిగాడు .. నచికేతుడు కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు.

గురుదేవా… మరణం గురించి ఆలోచిస్తున్నాను… ఆ వృద్ధుని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు పూసింది.

మరణమా? అది పెద్దవాళ్లను కూడా భయపెట్టే ప్రశ్న కదా.. నీ వయసులో ఉన్న పిల్లలు ఆటల గురించి ఆలోచిస్తారు…నువ్వెందుకు మరణం గురించి ఆలోచిస్తున్నావు? నచికేతుడు సరస్సులోని చంద్రబింబాన్ని చూపించాడు. ఇప్పుడే అది విరిగిపోయినట్టు కనిపించింది గురుదేవా…కానీ నిజానికి చంద్రుడు ఏమీ కాలేదు. అప్పుడు నాకు అనిపించింది…మనిషి చనిపోయినప్పుడు కూడా…నశించేది అతడా? లేక అతడు కనిపించే ఈ శరీరమా?

ఆ ప్రశ్న విన్న వృద్ధ ఋషి కళ్లలో ఒక్కసారిగా ఆశ్చర్యం.. కొన్ని క్షణాలు అతడు మాట్లాడలేదు. అరణ్యం కూడా ఆ రాత్రివేళ మౌనంగా మారింది.. చివరకు అతడు నెమ్మదిగా అన్నాడు:

నచికేతా… నీ మనసులో పుట్టిన ఈ ప్రశ్న…సాధారణ ప్రశ్న కాదు. ఈ ప్రశ్నే ఎన్నో ఋషులను అరణ్యాలకు నడిపించింది. ఈ ప్రశ్నే ఉపనిషత్తులను పుట్టించింది. అంటూ అతడు కాసేపు ఆకాశం వైపు చూశాడు.

శరీరం…కాలంతో కలిసి మారిపోతుంది. బాల్యం… యౌవనం… వృద్ధాప్యం… చివరకు మట్టి కూడా .. కానీ… ఈ మార్పులన్నిటినీ గమనిస్తున్న ఏదో ప్రత్యేకమైనది ఒకటి నీలో దాగి ఉంది. అదే ‘నేను’ అనే అనుభూతి. అది మాత్రం మారలేదుగా? నచికేతుడు నిశ్శబ్దంగా వింటున్నాడు. “ఆ ‘నేను’ ఎవరో తెలుసుకోవడమే… జీవితంలోని గొప్ప అన్వేషణ. సరస్సు మీద గాలి మళ్లీ అలలను పుట్టించింది. చంద్రబింబం మళ్లీ విరిగిపోయినట్టుగా కనిపించింది.

నచికేతా…ఈ లోకంలో చాలామంది జీవిస్తారు…కానీ చాలా తక్కువమంది మాత్రమే నిజంగా ‘జీవితం’ గురించి ప్రశ్నిస్తారు. ఆహారం కోసం, సంపద కోసం, పేరు కోసం పరుగెత్తే మనుషులు అనేకమంది. కానీ… ‘నేను ఎవరు?’ అని తమ అంతరంగాన్ని ప్రశ్నించే వారు మాత్రం అరుదు.

నచికేతుడు మౌనంగా విన్నాడు.

ఆ వృద్ధుని స్వరం ఇప్పుడు అరణ్యంలో ప్రవహించే గాలిలా మృదువుగా పలికింది.. గుర్తుపెట్టుకో నచికేతా…

మరణం గురించి భయపడేవాడు జీవితం అర్థం చేసుకోలేడు. మరణాన్ని ప్రశ్నించగలిగినవాడే… జీవిత సత్యానికి దగ్గరవుతాడు.

ఆ మాటలు విన్న క్షణం…నచికేతుడి చూపు మళ్లీ సరస్సుపై పడింది.

ఇప్పటికే అలలు ప్రశాంతమయ్యాయి. నీటిమీద చంద్రబింబం మళ్లీ సంపూర్ణంగా కనిపిస్తోంది.

అతని హృదయంలో ఏదో తెలియని నిశ్చలత్వం ఆవహించింది.

ఆ రాత్రి… మొట్టమొదటిసారి అతడు గ్రహించాడు.. మనిషి జీవితంలో గొప్ప ప్రయాణాలు బయటి ప్రపంచంలో ప్రారంభం కావు…ఒక ప్రశ్న పుట్టిన క్షణంలోనే అంతరంగంలో ప్రారంభమవుతాయి.దూరంగా యజ్ఞాగ్ని పూర్తిగా ఆరిపోయింది. కానీ… నచికేతుడి అంతరంగంలో మాత్రం ఒక కొత్త అగ్ని అప్పుడే వెలిగింది. అది సాధారణ జిజ్ఞాస కాదు… ఉపనిషత్తులు “ఆత్మ విచారణ” అని పిలిచే ఆ అనంత అన్వేషణకు తొలి జ్వాల.

ఆ చిన్న బాలుడు ఇంకా తెలుసుకోలేదు… త్వరలోనే తాను మృత్యుదేవుడి గడప దాటి వెళ్లబోతున్నాడని…

కాలాన్నే ప్రశ్నించబోతున్నాడని…ప్రపంచానికి శాశ్వతంగా నిలిచిపోయే ఒక మహా సత్యాన్ని తీసుకురాబోతున్నాడని.

కానీ…ఆ రాత్రి అరణ్యం మాత్రం అతని గురించి ముందే తెలుసుకుంది.

అందుకే కాబోలు …ఆకాశంలో దాక్కున్న చంద్రుడు మళ్లీ మేఘాల వెనుకనుంచి బయటికి వచ్చి… నచికేతుడి ముఖంపై తన వెన్నెలను మౌనంగా కుమ్మరించాడు.

~~ త్రిశూల్ ~~

Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Friday, May 15, 2026

మౌన హత్యలు..


 మౌన హత్యలు..

**************

నిన్న మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన ఒక చేదు నిజం నా మనసును తీవ్రంగా గాయపరిచింది. ఒక 18 ఏళ్ల చిరుప్రాయపు అమ్మాయి, కేవలం ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి తాను అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో, ప్రకృతి ధర్మాన్ని (ఋతుక్రమాన్ని) బలవంతంగా ఆపడానికి మెడిసిన్స్ వాడి తన ప్రాణాలు కోల్పోయింది.

ఈ వార్త చదివినప్పటి నుండి నా గుండె భారమైంది. మనం ఎంత ఆధునిక కాలంలో ఉన్నా, పూర్తిగా తెలుసుకోకుండా సగం సగం తెలుసుకున్న మన ఆచారాల పేరిట, పద్ధతుల పేరిట ప్రాణాలను పణంగా పెట్టే స్థితిలో ఉండటం ఎంతో బాధాకరం. ఆ ఆవేదన నుండే, సమాజాన్ని ప్రశ్నించాలని నా కలం నుండి వెలువడిన అక్షర రూపమే ఈ వ్యాసం.

ఇది కేవలం రచన మాత్రమే కాదు, మరెందరో ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటూ చేస్తున్న ఒక ఆర్తనాదం.

ముందుగా ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఒక 18 ఏళ్ల అమ్మాయి తన ఇంట్లో శుభకార్యం ఉందన్న ఉద్దేశంతో, పీరియడ్స్ రాకుండా ఉండటం కోసం ఆమె హార్మోన్ టాబ్లెట్లు వాడింది. కేవలం మూడు రోజులు ఆ టాబ్లెట్లు వాడిన తర్వాత, ఆమె కాళ్లలో విపరీతమైన వాపు మరియు నొప్పి మొదలయ్యాయి. కొద్దిసేపటికే ఆమె కుప్పకూలిపోయి మరణించింది.
తన మరణానికి కారణం ఏమిటి?

వైద్యులు వివరించిన దాని ప్రకారం, ఆ అమ్మాయి మరణానికి కారణం Deep Vein Thrombosis (DVT).

పీరియడ్స్ ఆలస్యం చేయడానికి వాడే హార్మోన్ టాబ్లెట్లలో ప్రొజెస్టిరాన్ లేదా ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టేలా చేస్తాయి.
కాళ్లలోని నరాల్లో రక్తం గడ్డకట్టి, ఆ గడ్డ రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు లేదా మెదడుకు చేరుకున్నప్పుడు (Pulmonary Embolism), ఊపిరి అందక మనిషి తక్షణమే మరణించే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం..

సాధారణంగా ఈ టాబ్లెట్లు అందరికీ ప్రాణాపాయం కలిగించవు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇవి రిస్క్ అవుతాయి డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాపుల్లో నేరుగా కొని వాడటం ఎంతో ప్రమాదకరం. వాటివల్ల వచ్చే సమస్యలు తెలియకుండానే అంతర్లీనంగా రక్తపోటు (High BP) లేదా రక్తం గడ్డకట్టే సమస్యలు ఉండటం. సరైన డోసేజ్ తెలియకపోవడం ముఖ్య కారకాలు.

ఇక పోతే హిందూ ధర్మశాస్త్రాల పరంగా దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాం..

శాస్త్రాల ప్రకారం ఋతుక్రమం సమయంలో పూజలు చేయకూడదు అనడానికి ప్రధానంగా రెండు రకాల కారణాలు కనిపిస్తాయి.

మనుస్మృతి 5వ అధ్యాయం లోనూ, ప్రాచీన గృహ్యసూత్రాలలోనూ రజస్వల స్త్రీ గురించి చెప్పింది ఒకటే

శారీరక స్పర్శ తగ్గించాలి , కొన్ని ఆచారాలలో పాల్గొనకూడదు, యజ్ఞకర్మలకు దూరంగా ఉండాలి

అలానే ప్రాచీన గ్రంథాల్లో చాలాచోట్ల “విశ్రాంతి” భావన వచ్చేలా ఉదాహరించి వున్నారు.

కానీ మనం వీటిని చూడగానే అమ్మో అది తప్పు, మహా పాపం లా అనుకుంటాం. కానీ నిజానికి దీనివెనుక ఉన్న ముఖ్య కారణం శాస్త్రం చెప్పిన ఆచార పరిమితిని సమాజం ఎప్పుడో తప్పుద్రోవ పట్టించింది.

ఆధ్యాత్మిక కోణంలో పూజ లేదా ధ్యానం చేసేటప్పుడు ప్రాణశక్తి 'ఊర్ధ్వముఖంగా' (పైకి) ప్రవహిస్తుంది. కానీ ఋతుక్రమం సమయంలో మహిళా శరీరంలోని ప్రక్రియ 'అధోముఖంగా' (క్రిందికి) ఉంటుంది. ఈ విరుద్ధ ప్రవాహాల వల్ల మహిళా ఆరోగ్యానికి, గర్భాశయ శక్తికి విఘాతం కలుగుతుందని శాస్త్రం చెప్పింది. ఇదే నిజం..

అలాగే పూర్వ కాలంలో గృహిణులు శారీరకంగా చాలా కష్టపడేవారు. బావుల నుండి నీళ్లు తోడటం, రాతి బండల్లో దంచడం వంటి ఎన్నో కఠినమైన శారీరక పనులు ఉండేవి. కనీసం ఆ మూడు రోజులు అయినా ఆ మహిళకు పూర్తి విశ్రాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతో 'మడి' అనే పేరుతో పక్కన కూర్చోబెట్టేవారు.

రానురాను సమాజం దాన్ని ఎలా మార్చింది అంటే.. ఆమెకు విశ్రాంతి, గౌరవం ఇవ్వాల్సిన చోట అవమానించడం, అంటరానితనం లా మార్చేసారు.. ధర్మం అంటే జీవన సమతుల్యత. ప్రకృతిని అర్థం చేసుకోవడం. ఒక సహజ జీవ ప్రక్రియను “అపవిత్రం” అని చెప్పే ఈ సమాజం పైకి చెప్పలేని భయం మరియు అజ్ఞానంతో బ్రతుకుతోంది.

ఆడవారే కాదు.. దీనికి ముఖ్య కారకులు మగవారు కూడా..

తల్లిని గౌరవించని పూజలెందుకు?

శుభకార్యం లో నువ్వు పక్కన కూర్చోకపోతే ఇల్లు అపవిత్రం అవుతుంది. అని ఆమె నరనరాల్లోకి ఎక్కించి ఈ సమాజం చేసిన చేస్తున్న ఎవరికీ తెలియని మౌన హత్యలు ఇవి.

చివరగా ఒక్క మాట.. ముహూర్తాలు మళ్లీ వస్తాయి…కానీ పోయినవారు తిరిగి రారు. దయచేసి మీ ఇంట్లో వారిని ఇలా శుభకార్యాల పేరుతో వారిని బలి చెయ్యకండి.

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Saturday, May 2, 2026

నవనీత చోర (మొదటి అధ్యాయం)...


ఆ రోజు… మాఘమాస శుక్ల తృతీయ...

వేకువ వెలుగులు ఇంకా గోకుల వీధుల గుమ్మాల దాకా చేరకమునుపే… యమునాతీరపు మబ్బుల్ని చీల్చుకుంటూ ఒక నిశ్శబ్ద ఉదయం మెల్లిగా పుట్టుకొస్తోంది. గోవుల ఊపిరిలోంచి లేచే ఆవిరి, పచ్చిక మీద జారిన మంచుబిందువులు, మట్టివాసనతో కలిసిన వెన్నసుగంధం అన్నీ కలసి ఒక మృదువైన గీతంలా ఆ ప్రాతఃకాలాన్ని ఎంతో అందంగా అలంకరిస్తున్నాయి.

ఇంటి ఆవరణలో యశోద మజ్జిగ మథనంలో నిమగ్నమై, తన చేతుల్లో చిలకరించే మథనదండం లయబద్ధంగా తిరుగుతుండగా, ఆమె పెదవులపై నెమ్మదిగా జారే గీతం ఆ ఇంటి ఆవరణానికి ప్రాణం పోస్తోంది. కుండలో పెరుగును చిలికే ప్రతి చక్రం ఆమె ప్రేమను వెన్నగా మలుస్తున్నట్లుగా ఉంది ఆ కమనీయ దృశ్యం.

అప్పుడే… గుమ్మం వెలుపల చిన్న చిన్న అడుగుల శబ్దం. చిలిపి నవ్వులు. గుసగుసల కేరింతలు
వాటి మధ్యలో చిన్నగా మెరుస్తున్న బంధూక పుష్పము వంటి నయనాలు..

అతడు ఎవరో కాదు కన్నయ్య..

రోజూ కంటే ఆ రోజు అతడి చూపుల్లో చిలిపితనం ఎక్కువ అయింది. ఇవాళ అందరి ఇళ్ళలో కుండలు ఖాళీ చేయకపోతే నా పేరు కృష్ణుడే కాదు అన్నట్టుగా తన స్నేహితులకు కళ్లతోనే సైగ చేసాడు. చెట్ల నీడల్లో దాక్కుంటూ, గోడల వెంట జారుకుంటూ, నిశ్శబ్దాన్ని కూడా మోసం చేస్తూ వాళ్లు అందరూ ముందుకు కదిలారు. ఓ ఇంటి చూరు మీద వేలాడుతున్న కుండలు ఆకాశంలో తారల్లా మెరుస్తున్నాయి. కింద నిలబడ్డ పిల్లలు ఒకరిపై ఒకరు ఎక్కి మానవ గోపురం కట్టారు. చివరగా పైకి ఎక్కింది మాత్రం ఆ నల్లనివాడే.. అతని వేళ్లు కుండను తాకిన క్షణం… ఆ మట్టి పాత్రలో దాగి ఉన్న సుగంధం అక్కడి గాలంతా పరుచుకుంది.

దూరంగా ఎవరో ఓ గోపిక ఇదంతా గమనించి .. అయ్యో… అయ్యో.. మళ్లీ నీ అల్లరి మొదలుపెట్టావా .. అంటూ పరుగు తీసింది. కానీ ఆమె మాటలో కోపం కన్నా కన్నయ్యను గట్టిగా పట్టుకోవాలనే ఆశే ఎక్కువ.

కృష్ణుడు కుండను పగలగొట్టకుండా మెల్లగా తెరిచాడు. లోపలున్న వెన్నను చూస్తూ… ఒక క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఆ వెన్న తెల్లగా కాకుండా అది గోపికల ప్రేమతో నిండిన చంద్రబింబంలా కనిపించింది.

అతను ఒక ముద్ద తీసుకున్నాడు. మరొకటి తన కింద ఉన్న స్నేహితుడికి అందిచ్చాడు.

మరొక ముద్దను కిందకు విసిరాడు కోతులు కూడా ఆ అల్లరిలో భాగమయ్యాయి.
అంతే అక్కడ భళ్ళుమని నవ్వులు విరిసాయి. వారి అల్లరికి అక్కడి గాలి కూడా పువ్వులా వికసించింది. అప్పటికే ఆ ఇంటి గుమ్మం దగ్గర గోపికలు అందరూ చేరుకున్నారు.. ఇక ఒక్క క్షణంలో కన్నయ్య, వారి స్నేహితులు తలోదిక్కూ వెళ్ళిపోయారు.

ఇదిగో… అమ్మా.. యశోదా మళ్లీ వచ్చేశాడు నీ కొడుకు! అంటూ ఆమెకు మొరపెట్టుకున్నారు.

యశోదమ్మ బయటికి పరుగెత్తుకుంటూ వచ్చింది.. కృష్ణుడు ఏమి ఎరుగని అమాయకుడిలా ఇంటి వెలుపలనుంచి అమ్మ వెనుకనే నిలబడ్డాడు.. పెదవులకు అంటిన కమ్మటి వెన్న ఇంకా అలానే ఉంది. అది చూసిన యశోద అతడిని గట్టిగా పట్టుకుని ..

కృష్ణా! అని గట్టిగా పిలిచిన ఆమె స్వరంలో కోపం ఉన్నా…అందులో దాగి ఉన్న ప్రేమను మాత్రం గోకులమే వినగలిగింది.

పట్టుబడ్డానని గ్రహించిన కృష్ణుడు ఒక్కసారిగా తప్పించుకుని పరుగెత్తాడు.
వెనక నుంచి యశోదమ్మ.

ఆ దృశ్యాన్ని చూసిన చుట్టూ ఉన్న గోపికల నవ్వులతో ఆ బృందావనం మారింత అందంగా మారిపోగా చివరకు యశోదమ్మ అతడిని పట్టుకుంది. పెదవులకు అంటివున్న వెన్నను చూసి కోపంగా అడిగింది..

ఇది ఎవరి వెన్న?

కృష్ణుడు మౌనంగా ఆమెను చూసాడు. అతని కళ్లలో ఒక చిలిపి వెలుగు. ఒక నిర్దోషి నవ్వు రెండూ కనిపించాయి.

అమ్మా… ఈ వెన్న నాది కాదు…కానీ నాకోసమే అక్కడ పెట్టారు..

ఆమాటతో యశోదమ్మ కోపం కరిగిపోయింది. అతని చెంపలపై ఉన్న వెన్నను తన చీర కొంగుతో తుడుస్తూ…కన్నయ్యా.. మన ఇంట్లో ఇంత వెన్న ఉండగా వాళ్ళింట్లో వెన్న మనకెందుకయ్యా !

ఆ మాఘమాస శుక్ల తృతీయ ఉదయం…గోకులం ఒక అల్లరిని చూసింది. కానీ ఆ అల్లరిలో దాగి ఉన్నది మాత్రం ..ప్రేమను దొంగిలించే పరమాత్ముడి లీల...

ఇది ఇంకా ఇలానే కొనసాగాలంటే మీ అమూల్యమైన మాటలను అక్షర రూపంలో తెలపండి..

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

Friday, May 1, 2026

నాలోనేనే.. నాతో నేనే..


 నాలోనేనే.. నాతో నేనే..

నా అంతరంగం ఒక విచిత్రమైన యుద్ధ క్షేత్రం. అక్కడ ఇద్దరు వ్యక్తులు నివసిస్తుంటారు. ఒకడు వాస్తవాల పునాదులపై లోకాన్ని విశ్లేషించే 'రచయిత' అయితే.. మరొకడు భావాల రెక్కలపై అనంత లోకాలకు విహరించే 'కవి'. ఈ ఇద్దరి మధ్య నిరంతరం ఒక నిశ్శబ్ద సమరం సాగుతుంటుంది. రచయిత అడుగులు వేయాలని ప్రయత్నిస్తే, కవి ఆ అడుగుల కింద పూలు పరిచి అక్షరాలను నాట్యం చేయిస్తుంటాడు. రచయిత ఒక వాక్యాన్ని నిర్మించాలని చూస్తే, కవి ఆ వాక్యం చుట్టూ భావుకత అనే ప్రాకారాన్ని కట్టి, దానిని ఒక అనుభూతిగా మార్చేస్తుంటాడు.

సాధారణంగా రచయిత అనేవాడు భూమి మీద నిలబడి మాట్లాడతాడు. సమాజం, రాజకీయాలు, మనుషుల ప్రవర్తన వంటి ఇతివృత్తాలను విశ్లేషించేటప్పుడు అక్షరాలు పదునుగా, స్పష్టంగా ఉండాలని అతడు కోరుకుంటాడు. కానీ, నాలోని రచయిత కలం పట్టిన ప్రతిసారీ, నాలోని కవి తన ఉనికిని చాటుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఆ రచయితను తన పదాల నీడతో కప్పేసి, ఒక పొడి వాక్యాన్ని సైతం ప్రేమలేఖ లాగానో లేదా వేదాంత వ్యాసం లాగానో మార్చేస్తూ ఉంటాడు. ఇది అతగాడి ఆధిపత్యం.

ఒక ఉదాహరణ చెప్తాను చుడండి.

నేను మరణం గురించి రాస్తున్నప్పుడు నాలోని రచయిత అది జీవక్రియ ఆగిపోవడం అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ వెంటనే కవి అడ్డుపడతాడు. అది మరణం కాదు.. అలసిన ప్రాణం కాలమనే ఒడిలో తలవాల్చి నిద్రపోవడం అని అక్షరాలను ముద్దు చేస్తాడు. రచయితకు వాస్తవం ముఖ్యం అయితే, కవికి ఆ వాస్తవంలోని భావుకత ముఖ్యం. రచయిత సూర్యోదయాన్ని చూసి వెలుగు పరుచుకుంది అంటాడు. కానీ కవి ఆ వెలుగును ఆకాశమనే కాన్వాస్ మీద సృష్టికర్త వేసిన తొలి వర్ణచిత్రం అని అభివర్ణిస్తాడు. ఈ ఆధిపత్యం వల్ల నా రచనల్లో వాస్తవాల కంటే వాస్తవికత తాలూకు లోతు ఎక్కువగా ఉంటుంది. ఇది నాకు బలమో, బలహీనతో ఆర్ధం కాదు.

కానీ వీల్లిద్దరితో నేను వేగలేకున్నా ..

ఇంకా చెప్తాను ఉండండి ..

రచయిత ఒక వృక్షం అయితే, కవి ఆ వృక్షాన్ని చుట్టుకున్న పూలతీగ. తీగ చెట్టును పెరగనివ్వదు అనుకుంటాం కానీ, ఆ తీగ పూసిన పువ్వులే ఆ చెట్టుకు అందాన్ని, సుగంధాన్ని ఇస్తున్నాయని నా మనసుకు నేనే సర్ది చెప్పుకుంటున్నా.. నాలోని రచయిత కవి చేతిలో ఎప్పుడూ ఒక బందీనే. ఆ బందీఖానా ఎంత అందంగా ఉంటుందంటే, అక్కడ నుంచి విడుదల కావాలని ఆ రచయితకు కూడా అనిపించదు. అదే విచిత్రం అంటే..ఆ కవి తన అక్షరాలతో అంతలా సమ్మోహనం చేస్తాడు మరి.
నేను ఒక సామాజిక వ్యాసం రాసినా, అందులో తెలియకుండానే ఒక కవితాత్మక ధోరణి ప్రవహిస్తుంది. ఒక తాత్విక చింతన రాసినా, అది ఒక గేయంలాగా మారిపోతుంది. రచయిత పచ్చి సత్యాలను చెప్పాలనుకుంటే, కవి వాటికి భావుకత అనే తియ్యని మందు పూసి పాఠకుడి గుండెల్లోకి నేరుగా పంపిస్తుంటాడు. నాలోని కవి ఎప్పుడూ రచయితను 'డామినేట్' చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే, కవి లేని రచయిత కేవలం ఒక యంత్రం, కానీ కవిత్వం తోడైన రచయిత ఒక 'సృష్టికర్త'...అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలనేది నా బుద్ది నిర్ణయించాలి. .. అందుకే దానిపై పట్టు సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాను.

ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నేను చేసిన రచనల్లో పాఠకుడు కేవలం సమాచారాన్ని మాత్రమే కాకుండా... తనను తాను చూడగలుగుతాడు.. రచయిత ఇచ్చిన మెదడుకు మేతను చదువుతూనే, కవి అందించిన హృదయస్పందనను మనసారా అనుభవిస్తాడు. ఈ ఇద్దరి కలయికే నా అక్షర విహారం.. అదే నా నిజమైన ఆత్మ ..ఇకపోతే నా కలం పేరు తెలుసుగా.. త్రిశూల్ గుర్తుపెట్టుకోండి మరి. రాబోయే రోజుల్లో మీ చెవిన పడొచ్చేమో..

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==