Saturday, September 22, 2018

పసిడిమనస్సులు


పసిడిమనస్సులు 
************


ఎత్తుగా, 
ఒత్తుగా, 
పెరిగిన పంటచేలలో..
గుంపులు గుంపులుగా పనిచేస్తున్న 
ఆడ కూలీల రంగు రంగుల చీరలు, రవికలు 
పాలపిట్టల్లా ఎగురుతున్నాయి..
రకరకాల పిట్టలు, పిచుకలు, 
పంట గింజలను నోట కరవాలని 
కూని రాగాలు తీస్తూ, 
పంట చేలను కోచే గాజుల గలగలలకు 
శ్రుతులు కలుపుతూ కొత్తరాగం వినిపిస్తున్నాయి
చుట్టూ గట్లపై పెరిగిన చెట్లు పూలతో, కాయలతో,
వంగి వంగి పంటకాలువతో ఊసులాడుతున్నాయి 
చెట్ల కొమ్మలకు కట్టిన ఊయలలోని పసిపిల్లలు 
ఎగిరే పక్షుల పాటలతో కేరింతలు కొడుతున్నారు 
శ్రమకు పట్టిన చెమట గుత్తులు చల్లగాలికి ఆరుతూ 
పంటచేల కొత్త వాసనలతో కలిసి 
నవీన పరిమళములు విరజిమ్ముతున్నాయి
వంకా, వాగు నిత్యం వారివెంటే కదులుతుంటాయి 
కష్టంతో సగం కడుపు నిండుతున్నా, 
మిగిలిన సగం విచ్చుకున్న పంటచేలు నింపుతున్నాయి 
సూర్య చంద్రులు నిత్యం వారి గుడిసెలు మీదగానే 
పయనించి మంచీ, చెడులను తెలుసుకుంటూ ఉంటారు 
సూలింతలకు రుచి చూపించే చింతా, మామిడి 
బాలింతకు పథ్యంగా నిలుస్తాయి 
వారి శ్రమకు పల్లవించిన ప్రకృతి 
పంటపొలమై వారివెంటే కదులుతుంది 
ఆడకూలీలని జీతం తక్కువిచ్చినా 
పనిలో బేధం చూపని పసిడిమనస్సు వారిది 
రేపటి పొద్దులో ఆ బేధం కరిగిపోతుందనే చిరు ఆశతో 
నిత్యం కాలిబాటలో వారు వేసే అడుగులకు 
పులకించిన నేల రాత్రి అయితే జీవన రాగం పాడుతూ వుంటుంది..!!

Written by : Bobby Nani

Friday, September 21, 2018

నిశీధిలో నిశ్శబ్దాన్ని అన్వేషిద్దాం.. !!నీ 
ముఖసౌందర్యపు ప్రవాహంలో 
చలించే చేపలవంటి ఆ కన్నులలో 
కుడినేత్రము సూర్యుడై పగటికాలాన్ని,
ఎడమ నేత్రము చంద్రుడై రాతిరి నిశీధిని పూయిస్తూ, 
ఫాలనేత్రాగ్నితో ఉభయ సంధ్యలను ప్రసవించుచున్నవి
ఆ నేత్రములు విశాలములై, మంగళకరములై, 
కృపారధార కలిగిన మధురములై, అగాధములై 
కల పుణ్యక్షేత్ర విజయంతో శోభించుచున్నవి..!!

నీ శ్వాస, నిశ్వాసములకు 
ఆకర్షించబడిన తుమ్మెదలు 
పారిజాతమ్ములను వొదిలి 
సంభాషించే ఆ అధరములపై వాలి
అంగిలి మకరంధమును మధురముగ
గ్రోలుచున్నాయి..!!

నీ చేయి తాకితే ముళ్ళు పూలుగానూ,
అమావాస్య పున్నమి గానూ, 
పగిలిన పెదవులు చివుర్లుగానూ మారుతున్నాయి..
ఇంద్రనీలమణి వంటి నీలవర్ణము 
దర్భపోచ వన్నెవంటి పచ్చని దేహకాంతి ముందు
పచ్చ పసుపు నల్లబడి వెలవెలబోయింది.. !!

నీ బాల్యం ఎప్పుడు చేరిగిపోయిందో 
చుస్తున్నంతలోనే మొగ్గ పుష్పమైనట్లు 
వికసించి పరిమళించింది సుగంధాల పన్నీరు ప్రవాహమై..!!

బాల్యమేమో దేహాన్ని తిరస్కరిస్తుంది..
యవ్వనమేమో శరీరాన్ని ఊపిరాడక హత్తుకుంది..
నేత్రాలు కాంతిరాగాలను చూడటం నేర్చాయి,
అరమోడ్పున కన్ను మదిరాక్షి యౌవన పారవశ్యముతో 
కన్నులు మూతపడటం తన్మయత్వంతో చవిచూసింది 
కనుబొమ్మలు నలుపెక్కి దళసరి కావటం ప్రారంభించింది 
వక్షమందు రొమ్ములు ఎరుపెక్కి కొమ్ములు చూపడం మొదలయ్యాయి 
గుండ్రని నాభి, భగ భగ మండే హోమగుండం లా మారింది 
బ్రహ్మ ఆమె దేహాన్ని పసిడికాంతులతో చేస్తే 
యవ్వనం ఆ కాంతులకు గంధపు పూత పూసి మరింత 
సౌందర్యవతిగా మలిచింది..!! 

బలమైన భుజస్కంధాల పరిణేతుడు 
చొరకత్తుల చూపులతో, 
తన తనువంత అన్వేషించి
రహస్య శృంగార స్థావరాలను స్ప్రుశించుచూ 
ఒక కరమున నడుమును చుట్టి 
మరు కరమున కుచమును పట్టి 
శంఖపు మెడపై మధుర సంతకములతో
బరువెక్కిన మధువు అధరములను 
మునిపంటిన నొక్కుతూ,
నీలి ధాతువులను మునివేళ్ళన మీటుతూ, 
నీల్గిన మచ్చికలను పెదవుల మధ్యన నలుపుతూ, 
నాభి సరస్సున జిహ్వతో సలుపుతో, 
నాగులా ఎగిరెగిరి పడు నడుమును 
లతలా పెనవేసుకుంటూ.
ఆకాశంలో కోటి తారలు తళుక్కుమనేలా 
నీవూ, 
నేనూ ఏకమై 
నిశీధిలో నిశ్శబ్దాన్ని అన్వేషిద్దాం.. !!

Written by: Bobby Nani

Saturday, September 1, 2018

లలన..


లలన..
*******

ఈ సుదిన ఉదయాన 
నా సదన ఉద్యాన వనములో 
మెల్లని గమనముల 
ఒయ్యారముల చిలుకు 
సింధూర తిలకముల ముదిత 
హాసముల నెన్నెన్నో చూచితిని
సందేహము లేదు
ఆమె లలనే..!!

ఓ లలనా..!!
వెన్నెల వేళ 
తీయని ఏలపదాలూదు గాలిలో, 
గంధర్వుల గానకళా కౌసల్యము 
నీకోసమే నేర్చితిని..
వెన్నెలైతే వచ్చింది కానీ 
నీవే ముంగిట లేవు..!!

చైత్రములో “వసంతము” వై,
వైశాఖమున “అక్షయము” లా,
జ్యేష్ఠములో “ఏరువాకము” వై, 
ఆషాడమున “ఏకాశి ఎడబాటు” లా, 
శ్రావణంలో “వరలక్ష్మి” వై, 
భాద్రపదమున “చవితి చంద్రోదయం” లా,
ఆశ్వయుజములో “దుర్గ” వై, 
కార్తీకమున “దీపము” లా 
మార్గశీర్షములో “తులసీ దళము” వై,
పుష్యమున “సంగీత నాదము” లా,
మాఘములో “భగ భగల భోగిణి” వై, 
ఫాల్గుణమున “చలి కౌగిలి”లా, వచ్చి వెళుతుంటావు.. 
చేమంతి విరులు విదజల్లు అల్లుకొను రీతిన 
చంద్రికలు రాలిన పచ్చికలనేలపై పరుండిన
తళుకుజిలుగులుజేయు మిణుగురులవలె 
నీ పద్మపు పాదాలకు బంగారు మువ్వల్లా కనపడుతున్నాయి..!!

ఏమాటకామాటే కానీ 
అసలు ఏముంటావో, 
లేత మంచు బిందువుల ముసుగులో మల్లె మొగ్గ వలె,
నును లేత దుకూలముల జలతారు విరులవలె,
జల జలా రాలు వేవేల చేమంతి రెబ్బల వలె,
పాలకడలి కెరటాల తరకల వలె 
పూర్ణిమా చంద్రికా తరంగములు ఉప్పొంగి పారును 
నీ రూప లావణ్యముల సౌందర్య నాయనా వీక్షణములకు..!!

Written by: Bobby Nani

Friday, August 24, 2018

నల్లశాలువా


మహానగరాలలో యదేచ్చగా జరుగుతున్న కొన్ని పరిణామాలలో .. ఈ సిటీ బస్సుల స్వైర విహారం కూడా ఒకటి.. ప్రతీ ఏటా వేల ప్రాణాలు ఈ భారీ చక్రాల కింద నలిగిపోతున్నాయి.. నల్లని రోడ్లు నెత్తురోడుతున్నాయి.. మధ్యతరగతి వాడి వెన్నును విరుస్తూ, అవినీతి, లంచం అనే రెండూ పురుగులు రాజ్యమేలుతున్నాయి..ఆలోచించే నాధుడు, ఆచరించే మాధవుడు ఇద్దరూ కనుమరుగే.. !

కొన్ని రోజుల క్రితం కళ్ళముందు జరిగిన ఓ సంఘటన యధాతధంగా అక్షరాలుగా మలిచాను.. ఒక్కరైనా ఈ నిర్లక్ష్య ధోరణిని మారుస్తారేమోనని ..!!

నల్లశాలువా
*********

చలికి సూర్యుడికి కప్పిన ఎర్ర శాలువా 
తూర్పు సంధ్య తొలగించి మేల్కొలిపింది.. 
తను లేవకమునుపే నిద్రలేచి నడుస్తున్న 
లోకాన్ని చూచి 
జాలిపడ్డాడు సూర్యుడు 
విద్యుక్త కార్యానికి ఉద్యుక్తుడయ్యాడు 
దేశ సంపద అరవై కుటుంబాలకే హస్తగతమైనట్లు 
నగర వాసుల ప్రాణాలు 
సిటీ బస్సుల చక్రగతమై పరిభ్రమిస్తున్నాయి 
చక్రాలే కానీ బ్రేకుల్లేని బస్సుల మధ్య 
ప్రాణాలు ఇనప్పెట్టెలో దాచుకున్నా 
ఫలితం దక్కకుండా ఉంది..
భవిష్యత్తును బ్యాగులో దాచి 
మరణ మృదంగాల మధ్య 
అక్షరాభ్యాసం కోసం జనారణ్యంలో 
అడుగులు వేస్తున్న బాలుని బ్రతుకు 
అదుపుతప్పిన బండికింద 
అర్ధాంతరంగా ముగిసి
నల్లని తారురోడ్డు మందారంలా మారింది..!!

జన నియంత్రనే లక్ష్యమై రవాణాధికార్లు
నగరాన్ని నేరస్తులకు అంకితం చేసిన పోలీసు యంత్రాంగం 
తప్పొప్పుల పట్టికలో, 
ఒప్పుల కిరీటం తప్పులకు కట్టబెట్టి మెల్లిగా జారుకుంది..!!
మనఃక్లేశాన మరణించిన సూర్యుడిపై నల్లశాలువా కప్పి 
పడమటి సంధ్య గుక్కపెట్టి రోధిస్తూ ఉంది..
చనిపోయిన బాలుని శవం 
అంతిమ యాత్రకు బయలుదేరగా 
చిదిమేసిన బస్సు 
స్వైర విహారానికి కదిలి ఎదురైంది...!!

Written by : Bobby Nani

Wednesday, August 15, 2018

ఆమె సామాన్య స్త్రీ కాదు...ప్రతీ స్త్రీ మూర్తిలోనూ ధర్మత్వం, దైవత్వం, మాతృత్వం, రసికత్వం, వ్యక్తిత్వం ఇలా ప్రతీ కోణంలోనూ ఆమె వికసిస్తూ ఉంటుంది.. ఆమె అంతరంగాన్ని చూడగలగాలే గాని తనని మించిన దైవం ఉండదనిపిస్తుంది .. అందుకే ఓ కవి ఇలా అన్నాడు బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయితివి ....కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన బార్యవైతివి....పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.. కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి....విజయంలో వెనకుండి ....ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ... వారిని వర్ణించడం, సత్కరించడం తుదకు నమస్కరించడం కూడా మనకు తెలిసుండాలి అని విన్నవిస్తూ, ఈ చిరు సత్కారం..!!

ఆమె సామాన్య స్త్రీ కాదు
బ్రహ్మచే పంపబడిన ఒకానొక సౌందర్య శక్తి 
ఆమె మేను ఎర్రని లేత చిగురు కాంతి లా, 
చక్కగా వికసించిన మోదుగు పువ్వులా
ఎర్రనైన వంపుతిరిగిన ఆమె అధరములు 
కుంకుమ కాంతిని వర్షిస్తుంటాయి..!!

కుచముల మొదలు నాభి సరస్సు వరకు 
ఆమె నూగారులు నల్ల త్రాచు పిల్లలవలె, 
చలిచీమల బారుల వలె నాచుతీగలవలె 
అత్యంత రసికత్వాన్ని రంగరిస్తూ 
లోకోత్తర లావణ్యరూపిణిలా 
మధుకము వంటి నడకలతో, 
పూర్ణవికసిత బంగారు పద్మముల వంటి పాదాలతో, 
కోకిల స్వర మాధుర్యాన్ని అధిగమిస్తూ, 
ఒక్కింత గర్వమును, 
ఒక్కింత సరస రసమును 
కటీరములపై ఒలకబోస్తూ, 
తుమ్మెద వరుసల వంటి శిరోజాలను 
లయబద్దముగా నాట్యము గావిస్తూ 
నర్తించు ఆమె సొగసులు 
సాధువునికి సైతం మనఃపలకముపై 
చెరగని ముద్రను చిందించగలవు...!!

ఆమె నడుముకు చుట్టిన గంటల మొలనూలు, 
ఆ పాదాలకు అంటిన రత్న భూషణములు, 
ఆమె వక్షఃస్థలముపై ముక్తాహార విందములు, 
నాభిన వ్రేళ్ళాడు సౌందర్య ముత్యపు పుట,
పాదాలకు అంటిన అందియల హారములు, 
ఆమె నఖశిఖ పర్యతము మైనపు పూత పొదిగిన
కనకాంబరపు కాంతులను వేవేల వర్ణములు గావించినా 
తనివితీరదెందుకనో..!!

Written by : Bobby Nani

Thursday, August 9, 2018

ఓయ్ నిన్నే వింటున్నావా.. !!నీ 
తలంపు తగిలితే చాలే 
ఓ తియ్యనైన అనుభూతి నా 
లోలోన దూరిపోతుంది. 
రోజూ చూచే నక్షత్రాలు 
ఈ రోజు మరింతగా మెరుస్తున్నాయి 
ఏనాడూ కనిపించని ప్రేమ చేపలు 
పడవ అడుగున తమకముతో ప్రేమించుకుంటున్నాయి 
పిల్లల ముఖాలపై దోబూచులాడే నిర్మలత్వం 
చూసిన ప్రతీ చోటా నాకు కనిపిస్తుంది.. 
ఆ రెండు జడలతో 
కళ్ళముందే తోరణాలు కట్టే నీ మందహాసము 
నా నరాల్లో ప్రాణాన్ని, 
నా కలంలో సిరాని నింపుతూ ఉంటుంది. 
నీ సమ్మోహన రూపం దర్శించిన ప్రతీ సారి 
హృదయం చమర్చి 
నా కళ్ళను కడుగుతూ ఉంటుంది.. !! 

నీ పాదాలకంటిన నూరు అందియలలో 
నేనో అందియనైనా కాకుంటినే 
నీ అడుగుల సరిగమలకు 
నే గమకములు పలికేందులకు. 
ఓయ్ 
జానపద సాహిత్యం లాంటి నిన్ను 
నా భావకవిత్వ సాహిత్యంతో ఏలుకోవాలని ఉంది.. 
అలంకారాల ముళ్ళు లేని 
వాస్తవ కుసుమం లాంటి నిన్ను 
నా స్వప్నాల గుండెల్లో తురుముకోవాలని ఉంది..!! 

నీ పెదాల మీద నేనో కళ్యాణ రాగమై 
నీ వక్ష వృక్షం పై నేనో విహంగమై 
కళలు కన్నులు విప్పిన ఆ కనుబొమ్మల మధ్యన 
కాంతి పుంజమై, అరుణారుణ తిలకమై, 
శాశ్వతముగా నిలవాలని ఉంది. 
ఓయ్ నిన్నే 
వింటున్నావా.. !!

Written by : Bobby Nani

Saturday, July 28, 2018

చల్లారిపోతున్న ప్రేమలు..
చల్లారిపోతున్న ప్రేమలు.. 
***************** 

మీరు మీ పిల్లలకోసమే జీవిస్తున్నానని అంటున్నారు.. 
వారికోసమే ఇంత కష్టపడుతున్నామని, వారికోసమే ఇదంతా చేస్తున్నామని అంటున్నారు.. 

నిజంగానే వారికోసమే మీరిదంతా చేస్తున్నారా.. ?? 
నిజంగానే వారు మీ భవిష్యత్తా ?? 
ఓసారి ఆత్మపరిశీలన చేసుకోండి.. 

ఉదయం పిల్లలు నిద్ర లేవకమునుపే ఉద్యోగానికి వెళ్లే తండ్రి .... రాత్రి వారు నిద్రపోయాక వస్తే వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు ?? 

శుక్రవారంనాడు కలర్ డ్రెస్, శనివారంనాడు తెల్ల యూనిఫారం వెయ్యాలన్న సంగతి కూడా మర్చిపోయి ప్రతీరోజూ యూనిఫారంలో తమ తల్లి పంపుతుంటే ఎదుటి పిల్లలను చూస్తూ పసి మనసులు ఎంతటి గాయాలౌతున్నాయో ఊహించారా.. ?? 

దొరికిన ఒక్క ఆదివారాన్ని తండ్రి స్నేహితులతో బయట గడిపేస్తూ, 
తల్లేమో సీరియల్స్, మొబైల్ అంటూ వాటితోనే సంసారాలు నెట్టుకొస్తుంటే, 

ప్రేమ లేని వారి భవిష్యత్తు సమాజంలో ఇమడలేక, వారి బాధేంటో వారికే అర్ధం కాక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒంటరి జీవితానికి అలవాటుపడి, చెడు వ్యసనాలకు బానిసపడి మార్గదర్శి లేని జీవితాన్ని, భాద్యతారాహిత్యపు మనుగడను అలవరుచుకుని సమాజానికి ప్రమాదకారులుగా మారుతారు.. మారుతున్నారు.. 

బాగా చూసుకోవడం అంటే అన్నీ కొనిచ్చి పడెయ్యడం కాదు.. 
ఒడిలో కూర్చోబెట్టుకుని ఓ ముద్ద తినిపించడం, ఏది మంచి, ఏది చెడు అని ప్రేమగా వారికి తెలియ చెప్పడం, 
వాళ్ళకు మీ దగ్గర ఏదైనా చెప్పే స్వేచ్చ కల్పించడం, వారితో కలిసి అల్లరి చెయ్యడం, 
వారిలో ప్రతిభను ప్రోత్సహించడం, అభినందించడం ... 
మానవ మనుగడకు అంతిమ దశలో ఉన్నామనడానికి ముఖ్య సంకేతం ఏంటో తెలుసా.. 
బంధాలు, బంధుత్వాల మధ్యన ప్రేమలు చల్లారిపోతాయి.. 
వావి వరుస మరిచిపోవడం, ఒకరికొకరు కొట్టుకు చావడం .. వాటిలో అన్నీ దాదాపుగా జరిగిపోతున్నాయి.. అంటే దాని అర్ధం మానవ మనుగడ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని.. 

రెప్పపాటు జీవితం మనది.. రాత్రి పడుకుంటే తెల్లవారున లేస్తామో లేదో తెలియని పరిస్థితి. 

ఉన్నంతలో మీ పిల్లలతో, మీ కుటుంబంతో గడపండి.. అవసరం మేరకు వస్తువులను వినియోగించండి.. మనుషులతో ఎక్కువ మాట్లాడండి.. మీ ఎదుటి మనిషితో మీరెంత మాట్లాడితే అంత ఎక్కువ కాలం బ్రతికేస్తారు.. ముఖ్యంగా మీ పిల్లలతో.. వారేంటో మీరు తెలుసుకోండి.. !!

Written by : Bobby.Nani

Friday, July 27, 2018

అభివర్ణించలేని లావణ్యము తనది..
వెన్నెల చీరగట్టి నెరవిచ్చిన రెల్లు తురాయి వెట్టి, మెల్లిన 
సన్నజాజి పువుటెత్తుల గ్రొమ్మడి చుట్టి, యేటివాల్ తిన్నెల 
నెచ్చెలుల్ వెదకి తీయగ, వెన్నెలవత్తు లాడుచున్, 
పున్నమిరేయి దోచు విరిబోణి విహంగిని మలచు ఓ 
చిత్రకర్ముడా వందనం, అభివందనముల్ __/\__ 

వెన్నెల వంటి చీరగట్టి, తురాయి, సన్నజాజి కలిపి అల్లినటువంటి మాలను గుత్తుగా చుట్టి, యేటి గట్టున అల్లరి ఆటలు ఆడుతున్న కోమలాంగులలో పున్నమి రేయిని దోచుకునే అందాల భరిణెను తన ఊహల్లో మన ఊహకందని విధంగా మలచిన ఈ చిత్రకారునికి ముందుగా శిరస్సు వంచి ధన్యవాదములు తెల్పుతూవున్నాను.. __/\__ 

అలానే అందరిలోనూ ప్రతిభ ఉందన్న విషయాన్ని గుర్తించి, అందరూ కలిసికట్టుగా ఉండాలన్న దృక్పధంతో ఓ చిరు ప్రయత్నంగా నా సోదరీ శ్రీమతి రూపసాహిత్య గారి అభీష్టము మేరకు నా ఈ చిరు కవితా మాల .. J 

ఏ పూర్వ శతాబ్దంలో 
ఏ రసోద్భవ సన్నివేశంలో 
జన్మించినదో ఈ ముదిత 
ఏ సరసుడూ, 
ఏ రసికుడూ, 
ఏ కవీ, 
తమ తమ అర్ధనిమేలిత నేత్రాలతో వీక్షించినా, 
తన్మయత్వ హృదయములతో పలికించినా, 
అభివర్ణించలేని లావణ్యము తనది..!! 

ఇంతకీ ఎవరీ జాణ?? 
మనుమసిద్ది దర్బారులో 
ఆమె నృత్య హేలా విలాసములు చూచి 
తిక్కన చిత్రించిన సై రంధ్రీ రూపాంతరమా ?? 
లేక 
కేతన దశ కుమారులతో, 
జూదములాడించిన 
శతాబ్దాల శృంగార మంజరీనా ?? 

ఎచ్చటినుంచి వచ్చిందీమె ?? 
ఉల్లాసరాశిలా, 
తొలకరిజల్లులా, 
దూరవన చంపక సౌరభమువలె వచ్చి నిల్చుంది..!! 

శ్రీనాథుడితోనో, 
అంతకన్నా ఉద్దండపండిత కవితలతోనో 
సరసాలాడిందా ఏమి...? 
అణువణువునా కవితా ధారలు 
సొగసున ఇంపుగా నింపుకుని ఉంది.. !! 

ఈమె విరహిణి కాదు, 
ముగ్దా కాదు, 
రమ్య అలంకారములతో నున్న 
వాసవసజ్జిక, 
ప్రౌఢ, 
శాస్త్రకోవిద, 
కళాచతుర్విధ..!! 

పాల్గుణ పౌర్ణమిలో, 
రంగని తిరునాళ్ళలో, 
నృత్య మంజీర గాథలా, 
సరసానికి సరసిజలా, 
ఏ మేఘ మేదుర శ్రావణ సంధ్యయందో 
పరీమళపులకింత చైత్ర నిశీథముననో 
జ్యోత్స్నా విహ్వాల శారద పూర్ణిమనో 
ఆనందాంతరంగిణియై ఆర్ధభరిత అక్షరములో 
ఇమిడి సౌష్టవ కీర్తి పతాకముపై 
లలితాంగిణిలా నవ్వుతూ నిల్చుంది 
నా హృదయ వేదికపై..!! 

ఎందులకో నా కవితా ముగ్ధను 
తట్టి లేపిందీ కిన్నెరకంఠి 
బహుశా ఆమెకు తోడునీడగా 
నా కవితా ఘురి ఉండగలదను 
నమ్మికతోనేమో..! 

ఇద్దరి చెలిమిని చూస్తూ 
ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాను.. 
ఇంతటి ఈమె రూపురేఖా లావణ్యమును 
కవితలోనైనా నాకు చిక్కిందని 
సంతుష్టి చెందాను.. !!
Written by : Bobby Nani

Wednesday, July 25, 2018

కక్షావైక్షకుడను నేను..నేను ఒంటరినని ఎవరన్నారు.. ??

నా రెండు చేతులు చాచిన ప్రతీసారి 
ప్రేయసి పిల్లగాలై నా బాహులతికలను అల్లుకుపోతుంది... 
నే కాలు కదిపిన ప్రతీసారి 
పచ్చని పచ్చిక ఆర్తిగా నా పాదాలను స్పృశిస్తుంది .. 
నేను కళ్ళు మూసిన ప్రతీసారి 
చిరుగుటాకంచున వర్షపు చినుకు చిరు చెక్కిలిని ముద్దాడుతుంది... 
నే రెప్పలార్పిన ప్రతీసారి 
వెలుగు, చీకట్లు నను గిలిగింతలు పెడతాయి.. 
నే నవ్విన ప్రతీసారి 
నా చెక్కిలిపై సప్త వర్ణాలు ఇంద్రచాపమై పూస్తాయి .. !!

నా గళ మాధుర్యములలో సరిగమల గమకములు 
మువ్వలు కట్టుకొచ్చి నర్తిస్తాయి ..!
నే ఆస్వాదించే ప్రతీ అనుభూతిలో 
నా భావాలు పరికిణీలతో పరుగులు తీస్తాయి.. !
నే విడిచే ప్రతీ అక్షరములో 
నా ఊపిరి ఉదయిస్తూనే ఉంటుంది.. !

నేనా ఒంటరి ??

ఒక నేత్రమున అస్తమించి 
మరు నేత్రమున ప్రకాశించే 
కక్షావైక్షకుడను నేను..!! 

Written by : Bobby Nani

Friday, July 20, 2018

ప్రణయ మంత్రం..


ప్రణయ మంత్రం
***********


చెలియా..
నీ నఖశిఖ పర్యంతం 
నాకో సౌందర్య కళా పుస్తకం 
ఎన్నిమార్లు చదివిననూ
తనివితీరని చాపల్య కేంద్రము..!!

నవరస నాట్య భంగిమలలో
సుధా రసంబు చిందించు శిల్ప సుందరిలా, 
గానకళా రసమయ మనోహర సౌగంధి
అపురూప చిత్ర కళా ముగ్ధరూపిణిలా 
అసాధారణ హృదయ సౌందర్య కళారాజ్ఞిలా, 
చుక్కలనే వెక్కిరించు, ఆ 
చూపులు రువ్వే కళ్ళు ..!
వేయి వసంతాల రవళిని,
వ్యంజించే సుమధుర గళము..!
కలబోసిన నిన్ను అలా చూస్తూ 
కవితా మాలలు అల్లుతున్నాను.. !!

వసంతఋతువున ఘుమఘుమల పొంగు 
శశిరేఖ తళుకు బెళుకుల సొగసు, 
హిమాద్రి శిఖరాగ్రి నుండి జలజలా పారు 
గంగా సముత్తుంగ తరంగ విభ్రమ లావణ్య 
మలయమారుతా వీచికా శీతల సౌరభగంధి 
సుప్రభాత సముజ్జ్వల సూర్యకిరణ సౌందర్య స్వరూపిణీ 
ఏమని వర్ణించను, 
మరేమని కీర్తించను..!

చంద్రోదయ వేళ పాలసముద్రపు 
ఉత్తుంగ విన్యాస విభ్రమ వసంత 
పుష్పమాలికా సౌందర్య రసోద్బవ మాలికలా 
నను సమ్మోహన పరుస్తుంటావు
కటిక చీకట్లను సిగలో ముడిచి 
కలువ కన్నులు వెలిగిస్తావు..
మేను మీద స్వర్గాలను దాచిపెట్టి 
కొంటెనవ్వును కోమలివై విసురుతావు 
తడబడినట్లే అడుగులు వేస్తూ, 
వెన్న చిలుకు కవ్వములా నీ 
నడుమును కదిలిస్తూ, నడుస్తావు
కులుకుతావు, ఉలుకుతావు 
ఓపలేని నా చూపుల ఊహలెన్నో చిలుకుతావు
మౌనంతోనే నాకు ప్రణయ మంత్రం నేర్పుతావు 
ఓ చెలీ
నా మరణం ఎక్కడో లేదు
నీవు విడిచే ఒక్క కన్నీటి బొట్టులోనే ఉంది..!!

Written by: Bobby Nani