నీకు గుర్తుందా!
నా భుజంపై నీ తలవాల్చినప్పుడు
ప్రపంచపు కోలాహలమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైనట్లు
అలసిన మేఘం, పర్వతముపై ఒదిగినట్లు
నీ సర్వస్వాన్నంతా నా భుజములపై మోపి,
ఒక నిశ్చింత లోకి నువ్వు జారిపోయిన ఆ ఘడియ
నీకు గుర్తుందా!
నీ నీలాల కురుల నుండి
జాలువారే ఆ కస్తూరి సుగంధం
నా ప్రాణవాయువు లో లీనమై
నన్నొక సమ్మోహనంలోకి నడిపించేది!
నీ శ్వాసల వెచ్చదనం నా మెడను తాకుతుంటే,
నా గుండె లయలో, నీ మౌనపు ప్రతిధ్వని వినిపించేది.
మనం మాట్లాడుకోనక్కర్లేని ఆ నిశ్శబ్ద భాష్యంలో..
వేవేల కావ్యాలు ఒక్కసారిగా ఆవిష్కృతమయ్యేవి!
నీ చిరుచెంపల వెచ్చదనం, నను తాకినప్పుడల్లా
చలికాలపు వేకువలో,
తొలి కిరణం ముద్దాడిన పూల మొక్కలా
వికసించిపోతుంటాను!
ఆ స్పర్శలోనే కాదే..
నీ అడుగుల సవ్వడిలో,
నీ కనుబొమ్మల వంపులలో,
నీ పెదవంచుల నవ్వులలో,
ప్రతి అణువూ ఓ నూతన పరిమళమై
నన్ను చుట్టుముట్టేవి!
మన ఊపిరి రాపిడ్ల మధ్యన,
ఓ అలౌకిక ప్రశాంతత రాజ్యమేలిన వేళ,
నా తనువొక వృక్షమై,
నీ మేనొక లతయై
పెనవేసుకునే ఆ ఆత్మీయ ఆలింగనం
నీకు గుర్తుందా!
నీ కనుపాపల లోతుల్లో
నా ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు,
ప్రపంచమనే మాయాజాలం కనుమరుగైన వేళ
నీ కనురెప్పల అంచున దాగిన
ఆ నిశ్శబ్దపు శబ్దాన్ని, నే చూస్తున్నా!
ఓయ్
నీకు గుర్తుందా!
నక్షత్రాల వెలుగులో మనం అల్లుకున్న ఆ మధుర స్వప్నాలు..
అంతరంగాన గూడు కట్టుకున్న ఆ అమృత స్మృతులు..
నిశీధి వేళ ఏకమైన మన మౌనాలు..
గుసగుసలతో, చిలిపి కలహాలతో,
అనిర్వచనీయ అనురాగ ధారలతో,
కాలమనే మహా సముద్రాన్ని
ఒక చిన్న బిందువులా మార్చిన
ఆ సమయాలు మళ్ళి వస్తాయంటావా!
నీవు దూరమైన క్షణం
ఈ ఏకాంతపు ఎడారిలో..
చీకటిని వెలుగుతో మేళవిస్తూ,
నీ రూపాన్ని ప్రాణవాయువులో వెతుక్కుంటున్నాను!
నిశ్శబ్దపు రాత్రులను నిట్టూర్పులుగా,
వెన్నెల కాంతిని విరహపు తాపాలుగా
ఆరగిస్తూ గడుపుతున్నాను!!
ఓయ్
కొంచం అర్ధం చేసుకోవచ్చుగా..!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:
Post a Comment