Saturday, October 26, 2019

ఓ అసురసంధ్య వేళలో..!!



ఓ అసురసంధ్య వేళలో..!!

వీధిగుమ్మానికి వ్రేలాడు 
ఎండిన మావిడాకులా
స్తబ్దుగా నే నిలబడి చూస్తున్నా..!!

చూరుకింద 
చినిగిన పడకలమీద 
జానడు డొక్క .... లోన కెళ్ళి
ఎనిమిది పదులు దాటిన ముసలమ్మ
అర్ధాకలితో పడివుండటం నే చూస్తున్నా..!!

ఇంకా జీవితం చూడని 
పసి మనస్సు ఖటినమైన తన 
దినచర్యలో భాగంగా
ఒళ్ళంతా కమిలిన గాయాలతో 
గుక్కెడు పాలకోసం ప్రాణం పోతుండడం నే చూస్తున్నా..!!

చిరిగిన చొక్కా తగిలించుకుని 
బాధ్యతల తువ్వాలు భుజానేసుకొని 
బ్రతుకుదెరువు కోసం, 
నాల్గు మెతుకులకోసం,
కన్నీరుని అదిమిపెట్టి వీధినెక్కిన తండ్రిని నే చూస్తున్నా..!!

ఆమె బ్రతుకు 
ఉషోదయమెరుగని విషాద జీవచ్చాయ
మల్లెలెన్ని తురిమినా పరిమళం చిందని జీవచ్ఛవం
కన్నీటి తెరల చాటున, కామాందుల కబంధ హస్తాలలో 
విటుల కౌగిట నలుగుతున్న ఆ ఆడతనాన్ని నే చూస్తున్నా..!!

అన్నం ముద్ద 
నోట్లోకి దిగనంటూ, 
గొంతున అడ్డం పడుతూంది..!
రుధిరం 
నా నరాల తీగల్లోకి 
వేగంగా ప్రవహించి 
నిశ్శబ్దంగా మరుగుతూంది..!!

స్పందించని పీనుగుల హృదయాలు 
ముఖాలపై అందమనే కంబళి కప్పుకుని 
కాళ్ళు బారసాచి కులాసాగా వాలుకుర్చీలో 
ఊగుతూ ఉన్నంత కాలం వారి జీవితాలు మారుతాయంటావా..!!
ఈ రాతలు వారిలో వెలుగులు పుట్టిస్తాయంటావా ..!!

Written by: Bobby Nani

Friday, October 25, 2019




నిన్నటినుంచి ఓ గీతం నా 
చుట్టూ పరిభ్రమిస్తూ వుంది.. 
మృదంగ వాయిద్యమేదో నా 
శ్రవణములకు వినిపిస్తూ వుంది.. 
కళ్ళలోంచి కలల్లోకి సాగే నా 
ప్రయాణాన్ని శాశ్వతం చేస్తోంది, 
ఎక్కడినుంచో వచ్చిన ఓ సంగీత స్వరం.. !! 

అధరముల మధ్యన 
స్వరాలు స్వర్గ దారాలై తెరుచుకున్నాయి 
ఉచ్చ్వాస నిశ్వాసాల మధ్యన స్వరితమేదో 
కమ్మని వేణుగానాన్ని పల్కుతోంది..!! 

పల్చని కాగితంలా నా శరీరం గాల్లో తేలిపోతుంది.. 
ఏంటో కూడా తెలియని ఔత్సుక్యపూరిత శృంగారం 
నా కనుబొమ్మల మీద కసరత్తు గావిస్తోంది.. 
నాలో ఏవేవో రేకులు విచ్చుకోవడం నాకు తెలుస్తోంది.. !! 

నిజమే 
పున్నమినాటి చంద్రోదయం మరి నీ రూపం.!! 

మొదటిసారి నిన్ను చూచింది 
నీలవర్ణపు వస్త్రాలలో ... 
వాహ్యము పైనే.. !! 

కోనేటివంటి లలాటముతో, 
కోటేరు వంటి నాసికతో, 
క్రీగంటి వలపు చూపులతో 


ఎరుపెక్కిన చెక్కిలితో, 
దానిమ్మ గింజల పలు వరుసతో, 
దో...దోర ద్రాక్ష అధరములతో, 
శంఖము వంటి కంఠంబుతో, 
సమ్మోహన స్వరముతో, 
పసిడి కుచములతో, 
నత నాభీయముతో, 
బరువెక్కిన నితంబపీఠములతో, 
అరమోడ్పు నడుముతో, 
శృంగారిణివై, 
సౌందర్య కన్యకవై, 
మాయావృతమైన ఈ రంగుల ప్రపంచంలో 
నాకంటికో స్వప్న సౌదామినిలా 
కనిపించీ, కనిపించక 
నను 
కవ్వించీ కవ్వించక 
క్షణకాల వీక్షణములో 
విలక్షణ సవ్వడుల్ని నాలో పలికించి, నా 
తనువంతా విద్యుత్కాంతిలా అల్లుకుపోయావ్.. !! 

అందుకే .. నీ కొరకై 
వేకువ సంధ్యలు మరచి 
ధగధగల కాంతి వస్త్రాన్ని నే.. నేస్తున్నా.. 
మరణం నను తాకే వరకు 
వెచ్చని నీ బహువులలో 
ఊపిరి తగిలేంతగా నీలో ఒదిగిపోతా..! 
నీలో ఉండిపోతా..!!

Written by: Bobby Nani

Tuesday, October 22, 2019

ఇది శాస్త్రం.. ఇదే ధర్మం..!!


“The Big Bang Theory” ఇది అందరికీ తెలుసు.. 
మన సృష్టి ప్రారంభం మరియు మన మనుగడ ఇదే..!

మహావిస్పోటనం (బిగ్ బ్యాంగ్) జరిగినప్పుడు ఓ శబ్దం ఆవిర్భవించిందని ఎందరో శాస్త్రవేత్తలు నిర్ధారించారు.. 

ఆ శబ్దం “ఓం” అనే శబ్దంతో మొదలైందని ఎన్నో రుజువులు ఇప్పటికే వున్నాయి.. 

సృష్టి ఆవిర్భావం “ఓం” అనే ప్రణవనాదముతో మొదలైందని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.. 

ప్రపంచాన్ని ఒక శబ్దం ద్వారా సూచించాలి అంటే ఆ శబ్దము ఓంకారమే..! 

ఏదైనా ఒక వస్తువుగురించి చెప్పదలుచుకున్నప్పుడు దాన్ని ఎంతవర్ణించినా ఒక్కోసారి దాని స్వరూపం మనకు అర్ధం కాదు.. అదే మనం దానిపేరు కనుక చెప్పినట్లయితే తేలికగా అర్ధమవుతుంది .. ఉదాహరణకు ఆవు .. దీన్ని వర్ణించి చెప్పేదానికన్నా దాని పేరు చెప్తే తేలికగా తెలుస్తుంది.. అలాగే ఈ జగత్తుకు అతీతమైనదాన్ని త్రికాలాతీతమైనదాన్ని గురించి తెలుసుకోవడానికి దానికి పెట్టిన పేరే ఈ ఓంకారము.. ఇది సమస్త కాలములకు, జగత్తుకూ ప్రతీక.. భగవంతుని దృశ్యరూపం ఈ విశ్వము అయితే.. శబ్ద రూపం మాత్రం ఓంకారమే.. 

ఉపనిషత్తులు ప్రకారం.. 

కనిపించే ఈ జగత్తంతా పరబ్రహ్మస్వరూపమే.. అంటే పైకి కనిపించేది.. కనిపించనిది కూడా బ్రహ్మమే అని అర్ధం .. ఆత్మకు నాలుగు పాదాలు వున్నాయి.. అందులో మొదటిది “వైశ్వానరుడు” దానర్ధం విశ్వంలోని నరులందరిలో సమానుడు అని.. వారందరి ప్రతినిధి. జాగ్రదావస్థ ఇతని స్థానం. బాహ్య విషయాలను మాత్రమే ఇతను గ్రహిస్తాడు.. తేలికగా చెప్పాలంటే మన జీవాత్మయే ఈ వైశ్వానరుడు.. ఇతడికి ఏడు అంగములు, పంతొమ్మిది నోళ్ళూ ఉంటాయి.. 

అంగములను సప్తాంగములని కూడా అంటారు.. 

స్వరము అనగా శిరస్సు 
సూర్యుడు అనగా కన్ను 
వాయువు అనగా ప్రాణం 
ఆకాశం అనగా శరీరం 
జలం అనగా మూత్రస్థానం 
భూమి అనగా పాదాలు 
ఆహవనీయాగ్ని అనగా నోరు 

అలాగే పంతొమ్మిది నోళ్ళు అనగా 

జ్ఞానేంద్రియాలు ఐదు (అందరికీ తెలిసినవే)
కర్మేంద్రియాలు – ఐదు 
పంచ ప్రాణాలు – ఐదు 
అంతఃకరణ చతుష్టయము అనగా మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము ఇవి నాలుగు.. 

వీటన్నిటి ద్వారానే ఇతడు బాహ్యజగత్తును అనుభవిస్తాడు.. 
ఇక రెండవది “తైజసుడు” దీన్నే తేజోవంతుడు, లేదా మానసిక స్థితి అంటారు.. స్వప్నావస్థ ఇతని సంచార స్థానం.. కలలో చూచే విషయాలు గ్రహిస్తాడు కాబట్టే అంతర్ముఖమైన చేతన గలవాడు.. ఇతనికి కూడా పైన చెప్పినవే ఉంటాయి కాకపోతే వైశ్వానరుడు స్థూలవిషయాలను అనుభవిస్తే ఇతడు సూక్ష్మ విషయాలను అనుభవిస్తాడు.. 

నిద్రించినప్పుడు ఏ కోరికలు లేని స్థితిని సుషుప్తి అంటారు అదే గాఢనిద్ర .. సుషుప్తావస్థలో సంచరించే ప్రాజ్ఞుడే ఆత్మ యొక్క మూడవ పాదం.. అంటే “ప్రాజ్ఞుడు”.. ఈ స్థితిలో భేదభావాలు వుండవు.. 

ఇక నాల్గవది తురీయ రూపం .. ఇది కంటికి కనిపించదు.. శాంతి స్వరూపము.. అదే భగవంతుని రూపం.. ఆనందమయం.. అద్వైతం.. అలాంటి ఆత్మను గురించే తెలుసుకోవాలి.. ఓంకారమే ఆత్మ రూపం.. ఆత్మ అక్షరాన్ని ఆశ్రయించినప్పుడు ఓం అనే ఆత్మను ఒక శబ్దంగా చెప్పినప్పుడు ఆత్మతోతాదాత్మ్యం పొందుతుంది.. ఓంకారాన్ని కనుక అకార ఉకార మకారాలుగా విభజిస్తే, అవే ఆత్మయొక్క పాదాలు.

ఏ ఉపనిషత్తు అయినా తనంతట తానుగా, మనకు ఇష్టం ఉన్నా, లేకున్నా బలవంతంగా మనలను ఈడ్చుకువెల్లి పరమాత్మ సన్నిధికి చేర్చదు .. ఎవరైతే ప్రపంచంలో తిరుగుతూ వారి వారి వాసనల కనుగుణంగా వ్యవహరిస్తూ, సుఖ, దుఃఖాలను పొందుతూ . ఏదో ఒక నాటికి నిత్యమైనదేమిటో - అనిత్యమైన దేమిటో తెలుసుకొని, అనిత్యమైన ప్రాపంచిక విషయాలపట్ల, భోగాలపట్ల, వైరాగ్యం చెంది, నిత్యమైన, శాశ్వితమైన, ఆనంద స్వరూపమైన పరమాత్మ పట్ల ఆసక్తికలిగి, ఆ పరమాత్మ కొరకు తపిస్తూ, సాధనలు చేస్తారో అట్టి వారినే ఉపనిషత్తులు పరమాత్మ సన్నిధికి చేర్చేది. సాధనలు అంటే ఏదో ఠాలాఠోలీ సాధనలు కాదు.. ఏదో చేశామంటే చేశామనే రకం కాదు.. చేసి చేతులు దులిపేసుకోవడం కానే కాదు..

పైవిషయాలను నమ్మడం, నమ్మకపోవడం అనేది మీ ఇష్టం..
కాని ఇది శాస్త్రం.. ఇదే ధర్మం..!!

Written by: Bobby Nani

Wednesday, October 16, 2019

A stage in a journey (ప్రయాణములో ఒక దశ)




అభిమానించే వారిని కాదు.. 
మనమంటే గిట్టనివారిని మెప్పించగలగడమే గొప్పవిషయం.. 

గడచిన ఎన్నో సంవత్సరముల నుంచి ప్రశంసలు ఎన్ని అందుకున్నానో 
విమర్శలు కూడా అన్నే స్వీకరించాను.. 

ప్రశంసలు పక్కనపెడితే విమర్శలలో మాత్రం కొన్నిటిని పరిశీలిద్దాం.. 
ఆత్మ పరిశీలన చాలా గొప్పదబ్బా... 

ఏంటి నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా..? వారిని పెడత్రోవ పట్టిస్తున్నారే.. 
స్త్రీ ని ఎక్కడా వదలకుండా ఇంత దారుణంగా వర్ణిస్తూ రాస్తారా.. ?? 
ఛి ఛి ఎప్పుడూ ఆ కవితలేనా .. మరీ ఇంత ఘాటైన వర్ణనలా.. 
విశృంఖలత్వాన్ని ప్రభోదిస్తున్నారా ఏమి ?? 
ఆడవారే మీ కవితా వస్తువులా.. మగవారు అందుకు తగిన వారు కాదా.. 
వారిపైనే నా మీ వర్ణనలు .. మగవారు పనికిరారా.. 
ఆడవారిని ఎప్పుడూ అందలము ఎక్కిస్తున్నారే .. అప్పుడప్పుడు మగవారిని కూడా ఎక్కించండి.. 
మీకు వారి బాధలు, కన్నీళ్ళే కనిపిస్తాయా.. మగవారివి కన్నీరు కాదా.. 
వారేనా సౌందర్యవంతులు మీ దృష్టిలో.. వారికన్నా సౌందర్యం ఈ సృష్టిలో ఎంతో వుంది.. వాటిపై కూడా రాయండి.. 
అంత ముక్కుసూటిగా వుంటే ఎలా మీరు.. భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు.. 
నిజంగా మీరే రాస్తున్నారా .... లేదా అందరిలానే కాపీ నా 
చాలా లోతైన పదాలు ఎప్పుడూ వినని పదాలు రాస్తుంటారు.. అవి మీరే రాస్తారా.. నాకెందుకో వృద్ద వయస్సు గలవారు అవి మీకు అందిస్తున్నట్లు అనిపిస్తుంది.. 
ఇంత చిన్న వయస్సులో ఇంత పరిపక్వతతో రచనలు చెయ్యడం అసాధ్యం అసలు.. ఇంతకీ ఆ చిత్రంలో వున్నది మీరేనా లేక ఆరుపదులు దాటిన ముసలోడా.. 
అసలు కవిత్వం అంటే మీకేం తెలుసు.. నోటికొచ్చింది రాస్తున్నారే 
అన్నీ తెలుసు అనే గర్వమా మీకు .. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరే.. మా పోస్ట్ లకు కామెంట్ లు అస్సలు పెట్టరే .. 

ఉఫ్ఫ్ .... ఇలాంటివి కోకొల్లలు.. 

భగవంతుడే ఇక్కడ అందరికీ నచ్చట్లేదు.. ఒక్కొక్కరు ఒక్కోలా వారికి నచ్చేలా భావిస్తూ స్తుతిస్తూ వున్నారు. 
అల్పులం మనం, మన రాతలు అందరికీ నచ్చాలని లేదు.. కానీ ఈ విమర్శలు మోడుబోయిన కత్తిని సైతం అత్యంత పదునుగా చెయ్యగలవు.. 

కొండను ఎక్కుతూ ఎక్కుతూ .. మధ్యలో కాసేపు ఆగి వెనక్కు తిరిగి చూస్తే... నేను నడిచి వచ్చిన బాట అంతా మెలికలు తిరిగిన ఒక పెద్ద చారలా కనిపించింది.. 
అబ్బ..! 
ఇంతదూరం నడిచానా.. అనిపిస్తుంది.. 
ఇక నడవ వలసిన దూరము కంటే నడిచి వచ్చినదే ఎక్కువని తోస్తుంది.. అలాగే జీవితము కూడానూ ..!!

వయస్సు పెరిగే కొలది అనుభవసారము, జ్ఞానము పెరుగుతూ పోతాయి.. వాటిని తెలిపే ప్రక్రియే జుట్టు నెరవడం, తోలు ముడతలు పడటం.. పళ్ళు రాలిపోవడం.. వెన్ను వంగిపోవడం.. ఒకటి కావాలంటే మరొకటి త్యజించాల్సిందే.. 

స్టేడియం లో ఓ రన్నింగు రేసు జరుగుతూ వుంది.. పందెము ప్రారంభమైన రెండు నిమిషాలలోనే ముగ్గురు విద్యార్ధులు ముందుకు సాగారు.. గెలుస్తున్న ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి అవలీలగా ముందుకు సాగిపోయాడు.. రెండవ వ్యక్తి గట్టి ప్రయత్నం చేస్తూ ముందు వెళ్ళే అతనిని సమీపించాడు.. మూడవ వ్యక్తి మరీ దూరాన వున్నాడు.. కానీ ఇంకా పరిగెత్తుతూనే వున్నాడు.. మొదటి ఇద్దరూ గమ్యస్థానానికి చేరగా.. అందరూ ఆ ఇద్దరినీ పేరుపెట్టి పిలుస్తూ హర్షధ్వానాలు చేసారు.. మూడవ అతను ఇంకా పరిగెత్తుతూనే వున్నాడు.. అతన్ని చూచి అందరూ చప్పట్లు కొడుతూ హేళన చేస్తున్నారు.. కానీ అతను అవన్నీ లక్ష్య పెట్టక ఇంకా పరుగెత్తుతూనే వున్నాడు.. చివరికి గమ్యస్థానానికి చేరుకొని కుప్పకూలిపోయాడు.. గబగబా అతని దగ్గరకు వెళ్లి అతని ప్రక్కన కూర్చుని అతని చేయి నా చేతుల్లోకి తీసుకున్నాను.. ఆయాసంతో వగురుస్తూ కళ్ళు మూసుకొనివున్న అతను నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.. ఆ చిరునవ్వు నాకో గుణపాఠం అయింది.. 

జీవితమే ఒక విశ్రమించని పరుగుపందెం.. అందరికీ మొదటి రెండు స్థానాలు ఎలా వస్తాయి ?? మూడవ బహుమతి లేదాయే.. కానీ యత్నము ముఖ్యము.. ఫల మెలా పరిణమించినా మనము పాటింపకూడదు అని తెలుసుకున్నాను.. ఏది చేసినా చాలా బాగా చెయ్యాలి.. మనస్సునుంచి కృషి చెయ్యాలి.. మన కృషి ఎంతో అందంగా వుండాలి.. కౌశల్యంతో చేసిన కృషే యోగమనిపించుకుంటుంది.. ఒక్కొక్కప్పుడు ఎంతటి తీవ్రమైన కృషీ, ఎంతో మనసారా చేసిన శ్రమా ఫలించకపోవచ్చు.. కానీ మనం బాధ పడకూడదు.. కొండ విరిగి శిరస్సున పడ్డా లక్ష్య పెట్టకూడదు.. 

నీవు వెళ్ళాలనుకున్న గమ్యం నీకు బాగా తెలుసుండాలి.. 
మార్గం మారినా గమ్యం చేరగలగాలి .. 
ముందు గమ్యం తెలుసుకొని మార్గాన్ని అన్వేషించు.. 

స్వస్తి __/\__

Written by: Bobby Nani

Saturday, October 12, 2019

జీవంలేని స్పటికం...


జీవంలేని స్పటికం
************

ఓ.. 
ఒంటరి మేఘమేదో 
నడినెత్తిన వాలి 
తన విరహ బాధలన్నీ నాతొ చెప్పి, 
నను నిలువెల్లా ముంచెత్తి.. నా లోలోని
జ్ఞాపకాలని ప్రేరేపించి వెళ్ళింది..!!

జ్ఞాపకం అంటే మొదట జ్ఞప్తికొచ్చేది 
నీ శ్వాస తేమలోని వెచ్చదనం 
ఆ పెదవుల ముద్దులోని తియ్యదనం 
చిలిపి కౌగిలింతలోని తన్మయత్వమే ..!!

నిశ్చల నిశీధిలో 
నిశితంగా వినాలేకాని 
నీ నిశ్శబ్దపు పలుకులు 
అనుక్షణం నాకు వినిపిస్తూనే వుంటాయి..!!

కాలాలు కరిగిపోతున్నా 
అప్పుడెప్పుడో నీ 
నుంచి నేల రాలిన 
జ్ఞాపకాలన్నీ పోగేసుకొని 
తనివితీరా తడిమి అతి జాగ్రత్తగా 
వాటిని నా చొక్కా జేబులో 
పొదువుకుంటుంటాను...!!

ఒంటరిగా కూర్చుని 
పాత పుస్తకాల్లోంచి
ఎండిన ఆకుల్ని 
ఒక్కొక్కటి బయటకు తీసి 
దుమ్ముపట్టిపోయిన మన 
జ్ఞాపకాల తోటల్లో .. 
ఏనాటికైనా ఓ పువ్వు పూస్తుందనే 
ఎదురుచూస్తూ దోసేళ్ళ కొద్దీ 
గతించిన మన గతాన్ని నెమరేసుకుంటున్నాను..!!

నా చుట్టూ 
శబ్ధమయంగా అనిపించే
నిశ్శబ్ద ప్రపంచమే వుంది...
అందులో అర్ధమయ్యే మాటలుండవు,
నెలవంక నవ్వులుండవు 
అందుకే ఓ నవీన నిశ్శబ్ధం కోసం పరితపిస్తున్నాను..!!

నవ్వడం మర్చిపోయానే
ఏడవడం చేత కావట్లేదు...!!
కానీ నిరంతర కన్నీటి ధార నా 
చెంపపై చారను ఎర్పరిచింది.. 
కల్తీ నవ్వులతో.. 
ముఖానికి రంగులను పులుముకుని .. 
అందరితో బ్రతికేస్తున్నా.. 
జీవంలేని ఓ స్పటికం లా..!!

Written by: Bobby Nani

Monday, October 7, 2019

దారుణమైన మరణాలను ఆపే ప్రయత్నంలో మీరు భాగం పంచుకుంటారని ఆశిస్తూ ..




నాకు బాగా తెలిసిన వారు కొందరు ఆత్మహత్య చేసుకున్నారని విని వారి వారి ఇళ్ళకు వెళ్ళి చూసాను.. ఆ తల్లి, తండ్రి పడే ఆవేదనను చూసి తట్టుకోలేకపోయాను.. నాకు తెలియకుండానే నా కళ్ళలో కన్నీరు వచ్చేసింది... ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు అనే ముఖ్య ఉద్దేశ్యంతో నా ఆవేదనను అక్షర రూపాలుగా మలచి ముఖ్యంగా యువతరం గురించి చిరు సందేశాన్ని అందించదలచి అక్షరాలతో కాకుండా స్వరంతో రూపొందించాను..

ఈ ఒక్కడి ఆవేదనకు మీరు జీవం పోసి ఇలాంటి దారుణమైన మరణాలను ఆపే ప్రయత్నంలో మీరు భాగం పంచుకుంటారని ఆశిస్తూ ..

మీ Bobby Nani