Tuesday, March 17, 2026

నిశ్శబ్దపు గాయం...


అదో..
ముగింపు లేని సుదీర్ఘ రాత్రి!
ప్రపంచమంతా నిద్రిస్తున్నా..
నా గదిలోని ఏకాంతం మాత్రం
నన్ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది!

నీ మౌనం..
అంతుచిక్కని శూన్య సమయం!
నీ మాటల ప్రవాహం ఆగిపోయిన చోట..
నేను ఒక నిర్జీవ శిలలా మిగిలిపోయాను!
అది కేవలం ఓ నిశ్శబ్దం కాదు,
అది నా గుండె పొరలను కోస్తున్న ఒక రహస్య ఖడ్గం!

ఒకప్పుడు..
మన మాటల వెలుగుతో
నిండిన నా ప్రపంచం..
నేడు దిక్కుతోచని అమాస నిశిలా మారి,
నన్ను తన అదృశ్య సంకెళ్ళతో బంధించింది!

కిటికీ బయట..
ఏకాంతంగా రాలుతున్న ఆ మంచు బిందువులు,
ఆకాశం చిందిస్తున్న అశ్రు కణాల్లా
నేల రాలుతున్నాయి!
కాలం తన గమనంలో..
మన జ్ఞాపకాలను ఒక చెదిరిన కావ్యంలా
గాలిలోకి విసిరేసిందేమో!
నా హృదయ పుటల్లో..
నువ్వు విడిచిన ఆ చివరి సంతకం..
ఇప్పుడు ఒక పదునైన ముల్లులా
నన్ను నిరంతరం బాధిస్తోంది!


నీకోసం కన్న కలలన్నీ..
నేడు ముక్కలైపోయిన స్ఫటిక శకలాలయ్యాయి!
వాటిని ఏరుకుందామని చూస్తున్న నా చేతులకు..
రక్తానికి బదులు వేదనే ధారలుగా కారుతోంది..!

అందరూ ఉన్నా..
ఎవరూ లేనట్లుందే!
నీ మాట వినిపించని ఈ శూన్యంలో..
ప్రతి ధ్వని కూడా ఒక ఆర్తనాదంలా వినిపిస్తోంది.
నువ్వు విడిచివెళ్లిన ఆ నిశ్శబ్దం..
నా మది గదిలో చీకటి తెరలా నను భయపెడుతోంది!
నీ దూరం.. నా అస్తిత్వాన్ని
ఒక చిరునామా లేని ఉత్తరంలా మార్చేసింది..!

నిజంగానే..
మన మాటలు ఆగిపోయిన చోట..
మౌనం కూడా ఒక కాలయముడిలా
మారుతుందని నే ఊహించలేదు
ముగియని పుస్తకంలో ఆగిపోయిన అక్షరంలా..
నీ ఎడబాటు అనే నిప్పుల తివాచీపై
నగ్నపాదాలతో నడుస్తూనే ఉన్నాను! ఉంటాను కూడా!
నాకోసం మళ్ళి తిరిగివస్తావ్ కదూ..!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
 

No comments:

Post a Comment