రాత్రి ఇంకా ముగియలేదు..
పగలు ఇంకా మొదలుకాలేదు..
ఆ రెంటి మధ్య నిలిచిన వేకువలో,
ఉదయసంధ్యల ప్రేమే మొదట మేల్కొంది!
ఎప్పటికీ కలిసే అవకాశమే లేని
రెండు విరుద్ధ సత్యాలు..
ఆ ఒక్క క్షణం
ఒకరినొకరు హత్తుకుని విడిపోవాల్సిన
విధి నిర్ణయించిన అనురాగ విరామమది!
చీకటి
తన నల్లని అలసటను మెల్లగా మడుస్తూ,
వెలుగు
తన అరుణ ముసుగును నెమ్మదిగా చిమ్ముతూ,
ఒకరి ఒడిలో మరొకరు
కొన్ని క్షణాలు మాత్రమే నిలిచే
ఆ దివ్య సంభ్రమమే ఉదయసంధ్య!
ఆ వేళ
గాలి కూడా గట్టిగా వీయదు..
ఆకులు కూడా కలకలం రేపవు..
పిట్టల పలుకులు కూడా
ఇంకా పూర్తిగా, మేల్కొనని స్వరాల్లా
మృదువుగానే విరుస్తాయి!
ప్రకృతికి తెలుసు
అది సాధారణ సమయం కాదని..
అది విడిపోవలసిన రెండు లోకాల
చివరి ఆలింగనమని!
అలానే
కొన్ని ప్రేమలూ ఉంటాయి
అవి శాశ్వతంగా కలిసి ఉండకపోయినా,
కలిసిన ఆ కొద్దిపాటి వెలుగుతోనే
ఒక జీవితం మొత్తం పరిమళింపజేస్తాయి!
వేకువ
సూర్యుడి రాక కోసం తన్ను తాను విడిచిపెడుతుంది..
రేయి
వెలుగుకి దారి ఇవ్వడానికి నెమ్మదిగా వెనక్కి జరుగుతుంది..
ఆ మధ్య పుట్టే ఆ అరుణ క్షణం
నిజానికి, ప్రేమ అంటే ఏమిటో చెప్పే
అత్యంత మృదువైన ప్రకృతి ఉపమానం!
కానీ.. కాలం నిరంకుశమైనది!
ఆ భానుడి రాకతో వారి ఏకాంతపు
మేలిముసుగు తొలగిపోతుంది
కమ్మని ఆ వేకువ స్వప్నాన్ని..
పగలు అనే నిప్పు దహించేస్తుంది..
మళ్ళీ రేపటి వరకు..
ఆ కొద్దిపాటి ఉషోదయ విరామం కోసం,
ఉదయసంధ్యల నిట్టూర్పులే
దిక్సూచులై తపిస్తూ ఉంటాయి!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Friday, March 20, 2026
ఉదయసంధ్య...
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment