ఇది చదవగానే మీకు మొదట గుర్తొచ్చే మీ స్నేహితుడే మీ నిజమైన స్నేహితుడు .. చదివాక మీకు అలా ఎవరన్నా గుర్తొస్తే తప్పక చెప్తారు కదూ..
మజిలీ..
******
ఓయ్ నేస్తమా..
నీకు గుర్తున్నాయా? ఆ రోజులు ..
ఒకప్పటి మన ప్రపంచం అంతా
మన ఇంటి గుమ్మం నుంచి
స్కూల్ కి చేరుకునే దారి లోనే ఉండేది!
నీకు గుర్తుందా?
ఉదయపు చలి చర్మంపై ముల్లులా గుచ్చుకుంటుంటే..
అమ్మ బలవంతంగా స్నానం చేయించి,
కొబ్బరి నూనె తలనిండా రాసి బడికి పంపిన వేళలు!
భుజాన వేలాడే ఆ పుస్తకాల సంచి..
మెడకు వేలాడే నీళ్ల బాటిల్,
చేతిలో పలక,
బ్యాగులో, మూలలు చినిగిన పుస్తకాలు..
చొక్కా జేబులో దాచుకున్న,
చిన్న పెన్సిల్ ముక్క..
అవి సామాన్య వస్తువులు కావు,
ప్రపంచాన్ని తొలిసారి అక్షరాల రూపంలో
తాకబోతున్న బాల్యపు సన్నాహకాలు!
స్నేహితుల అరుపులు..
అవి సాధారణ పిలుపుల్లా కాకుండా
మనసు సంతోషంతో నిండిపోయే పలకరింపుల్లా ఉండేవి!
ఉదయం మేల్కొన్న మన ఊరి గాలిలో
కాలం అల్లిన అల్లరి జ్ఞాపకాలు ఎన్నో దాగుండేవి!
నీకు గుర్తుందా?
ఒకరి పుస్తకాల సంచి మరొకరం లాక్కోవడం
హోంవర్క్ చేశావా? అని అడిగి
సమాధానం వినకముందే నవ్వేయడం,
దారిమధ్యలో ఎక్కడో ఆగి
చింతచెట్టు పైకి ఆశగా చూడడం,
సెలవు గంట గురించి
స్కూల్ కు వెళ్లేముందే కలలు కనడం..
ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటే,
బంగారమో, ముత్యమో కాదు...
మళ్లీ ఎప్పటికీ దొరకని
తిరిగిరాని మన కాలపు మజిలీలు!
గుర్తుందా?
వర్షం పడితే..
మనం వెళ్ళే దారి ఒక అద్భుత లోకమయ్యేది!
చిన్న చిన్న నీటి గుంటలు..
మన పడవలకు సముద్రాలయ్యేవి!
బురద అంటిన నిక్కరు,
తడిసిన చెప్పులు..
అమ్మ తిడుతుందని తెలిసినా,
ఆ వాన చినుకులతో సాగించిన మన స్నేహం..
ప్రస్తుతం మనం ఏసీ గదుల్లో
పొందే సౌకర్యం కంటే అది కోటి రెట్లు మిన్నకదా!
దారి మధ్యలో ఉన్న పాత బావి..
ఎన్ని రహస్యాలకు అది నిలవో!
స్కూలు ఎగ్గొట్టి చెట్ల కింద గడిపిన క్షణాలు,
స్నేహితులతో పంచుకున్న
ఆ 'ఒక్క' చాక్లెట్ ముక్క!
ఇప్పుడు లక్షలు ఖర్చు చేసినా
దొరకని అలౌకిక ఆనందం!
కాలం ఎంత వేగంగా గడిచిందో కదా..
మనం పెద్దవాళ్లమైపోయాం,
కానీ ఆ దారి మాత్రం ఇంకా మన మనసులో..
ఒక చెరగని సంతకంలా అలాగే ఉండిపోయింది!
ఒక్కసారి కళ్లు మూసుకుంటే..
ఇప్పటికీ ఆ స్కూలు గంట వినబడుతోంది,
ఆ మట్టి బాట పలకరిస్తోంది.. కానీ..
ఆ దారిలో నడిచే మన స్నేహితులు మాత్రం,
కాలపు ప్రవాహంలో ఎక్కడెక్కడో
ముసుగులు వేసుకున్న లోకంలో కలిసిపోయారు!
చిన్ననాటి ఈ జ్ఞాపకం
తిరిగి వెళ్లలేని కాలానికి
గుండె రాసుకున్న
అంతులేని ఓ చిరునామా!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:
Post a Comment