మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Thursday, March 12, 2026
రుధిరం...
యుద్ధం అనేది
పుస్తకాలలో చదివిన ఒక పదం కాదు
దాని అసలు స్వరూపం
విస్ఫోటన మోతల మధ్య
ఓ తల్లి ఒడిలో వణికే పసిప్రాణాన్ని అడిగితేనే తెలుస్తుంది..!
నియంతలు
దూర దేశాల గదుల్లో కూర్చొని
మ్యాప్‌ల మీద గీతలు గీస్తూ, వ్యూహాలు రచిస్తూ,
విజయ గణాంకాలు లెక్క పెడుతున్నారు..!
నిప్పులు కురిపించే ఆకాశం..
అది ఒకప్పుడు అపూర్వ పుష్పంలా కనిపించినా,
నేడు, ఆ నింగి చీలికల నుండి రాలే
ఆ మృత్యు విలాపాన్ని ఏ చరిత్ర రాయలేదు..!
అణ్వాయుధ తాకిడికి తల్లడిల్లుతున్న ధరణి ,
తన ఒడిలో ఆడిన పిల్లలను
మృతప్రాయమైన శవాలుగా చూస్తూ
కన్నీటితో వారిని కడసారి హత్తుకుంటోంది..!
రాత్రి అయితే
ఆకాశం నక్షత్రాలతో కాదు
పేలుళ్ల మెరుపులతో వికసిస్తోంది
ఆ వెలుగులో.. అక్కడవున్న వారి కన్నీటి బిందువులు
పగిలిన గాజు పలకల్లా నేల రాలుతున్నాయి..!
ఎక్కడో
శిథిలాల గుట్టపై బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఓ చిన్నారి
దూరంగా మండుతున్న ఆకాశాన్ని చూసి
తన తండ్రిని నిశ్శబ్దంగా ప్రశ్నించింది
మనము కూడా చనిపోతామా నాన్నా?
సమాధానం చెప్పలేని ఆ తండ్రి గొంతు మూగబోయి
కన్నీటితో చిన్నారిని మరింత దగ్గరగా
ఒడిలోకి లాక్కున్నాడు.!
చుట్టూ ఇనుప కవచాలు ఎన్ని ఉన్నా
వారిలోని శాంతి తనని తాను ఒంటరినని తెలుసుకుందో ఏమో
సైరన్ల మోతలో, చిమ్మచీకటి బంకర్లలో
సహాయం కోసం ఆర్తనాదాలు పెడుతూనే ఉంది..!
అనంత శోకంలా నిలబడ్డ ఆ మానవత్వం
రెక్కలు తెగిన పక్షిలా, శిథిలాల కింద చిక్కుకొని
తన గుండెల్లో రగిలే శోకపు చిచ్చును దిగమింగుతూ,
ఎప్పుడో ఒకసారి పరామర్శకొచ్చే శాంతి చర్చలను,
తన విషాద గీతాలతో భయపెడుతూనే ఉంటుంది
ఈ ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఉలిక్కిపడేలా చేస్తూనే ఉంటుంది..!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment