Monday, March 23, 2026

శ్రీమతికి ప్రేమలేఖ...


అదో శరదృతువు, ఆశ్వయుజమాసం..
నిర్మలమైన ఆకాశం,
ప్రకాశవంతమైన వెన్నెల కురిసే కాలమది!

ఓ సంధ్యా వేళ,
అటకపైనున్న పాత అల్మారాలోని
కాగితాలను ఆమె వెతుకుతున్న సమయమది!

కాలపు మడతల మధ్య
నలిగిపోయిన కాగితంపై..
ఆరిపోయిన సిరా చుక్కలు!

అవి చూసిన ఆమె కళ్ళు
బంధూక పుష్పమువలె వికసించాయి!
పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి!
ఆ లేఖను చేతుల్లోకి తీసుకొని
అబ్బా.. ఇన్నేళ్ళు గడిచినా,
ఇంకా అతడి వేలిముద్రల వెచ్చదనాన్ని
ఈ అక్షరాలు మోస్తూనే ఉన్నాయి! అనుకుంది!

పసుపు మరకలు పడిన ఆ కాగితంపై
అతడు రాసిన అక్షరాలు..
మసకబారినప్పటికీ,
ఇంకా ఆమె గుండెకు దారి మర్చిపోలేని
పాత నది మలుపులా ప్రవహిస్తున్నాయి!

కాగితం మడతల అంచుల్లో,
ఏళ్ల దూరం కరిగిపోయినా
నీ అనురాగపు వాసన మాత్రం
ఎక్కడా తగ్గలేదోయ్!
అంటూ చిలిపిగా నవ్వుకుంది!
మెల్లిగా కాగితపు మడత విప్పగనే
మల్లెపూవు పాత పుస్తకంలో ఎండిపోయినా,
తన పరిమళం విడిచినట్టుగా
ఆమె తనువునంతా చుట్టుముట్టింది!

ప్రియమైన శ్రీమతి...
ఈ ఉత్తరం నీ చేతికి చిక్కేసరికి..
నేను నీ దరికి దూరంగా,
కాలం గీసిన సరిహద్దుల అవతల ఉంటానేమో!
కానీ.. ఈ అక్షరాలు మాత్రం
నా గుండె చప్పుడును మోస్తూ,
నీ జ్ఞాపకాల పొలిమేరల్లోనే తిరుగుతుంటాయి!

ఈ లైన్స్ చదివిన మరుక్షణమే
ఆమె కళ్ళలో నిండా కన్నీరు..
వెంటనే ఫోన్ తీసుకొని
ఆఫీస్ కెళ్ళిన తన భర్తకు కాల్ చేసి
ఎంత ప్రేమించావ్ అప్పట్లో
ఇప్పుడేమైంది అంటూ గోముగా అడిగింది!

అప్పుడు అతడు మెల్లిగా నవ్వి
ఏళ్ల తరువాత నీకు దొరికిన ఈ ప్రేమలేఖ
నాకు నిన్ను ఇవ్వడమే కాదు,
నాలో ఎప్పుడో మగ్గిపోయిన
ప్రేమించే సామర్థ్యాన్ని
మళ్లీ నాకు గుర్తు చేసేలా చేసింది అన్నాడు అతడు!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment