Sunday, January 29, 2023

అసమానమైన స్త్రీ తత్వం...

 

మొదటిసారి తనని చూసినప్పుడే అర్థమైంది

తను సామాన్యమైన స్త్రీ కాదని

లక్ష్మి తేజస్సు గల సాత్వికమైన స్త్రీ తత్వం తనది

సత్వ గుణాలు తనలోనే ఉన్నాయి

తన గురించి చెప్పాలంటే

కవులు, ఆ కవులు రాసే అక్షరాలు కాదు

పాటలీ వృక్షాల కింద నడిజామున 

విచ్చుకుని నేల రాలే పువ్వులు మాత్రమే చెప్పాలి..!!


గుండెను పూ దండతో లాగినట్లుగా 

తన ఆగమనాన్ని తనకన్నా ముందు 

తన దేహ పరిమళం చెప్తుంది..!

మలయపవనమున 

పింఛము విప్పిన మయూరములా, 

పారాణి అంటిన పాదాలతో లేలేత 

హిరణ్మయ రశ్మిని ముద్దాడుతూ 

చెంగు చెంగుమనుచున్నది..!

నెమలిలా నడిచే తన నాట్యానికి 

వాయునందనుడే మద్దెల వాద్యకాడైనాడు..!!


నల్ల కల్వలవలె చక్కనైన కనుపాపలు 

చవితి నాటి చంద్రుని వలె ప్రకాశించు ఫాలము 

అమృత రసాన్ని నింపిన కెంపుల కలశస్తనాలు  

బంగారు కాంతితో మెరిసే ధగధగల నడుమొంపు 

నిజంగా తనది సహజత్వమైన సమ్మోహనమైన సౌందర్యం..!!


దగ్గరకొచ్చిన తన

కెంపారు నేత్రాలలో 

కోటి సూర్యోదయాల్నిఒక్కసారిగా దర్శించాను

మకరికల లేపనం దేహానికి పట్టించిందేమో 

మంత్రించినట్లుగా నాసికనదరగొడుతూ 

గుప్పున తాకే గంధపు, కస్తూరి పరిమళములు 

సమ్మోహించు తన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు

తన శరీర సౌష్టవం ముందు 

పండువెన్నెల సైతం వెలవెలబోయింది..!!


తన పెదవుల మధ్య నేనొక పిల్లనగ్రోవిలా 

తమకముతో ఊయలలూగుతున్నాను 

బేడిస చేప వంటి తన విభ్రమ నేత్రాల వీక్షణం 

లాగి విడిచిన బాణమై సూటిగా గుండెను తాకుతోంది 

లేతాకు మీది వర్షపు చినుకులా, 

కొమ్మనుంచి సున్నితంగా వ్రేలాడే పిందెలా 

నడుస్తూ, నాట్యమాడే మయూరి విప్పిన 

వేయికళ్ళ వసంతోద్యానవనంలా 

తనని చూసిన నా కళ్ళు మంత్రించి పోయాయి..!!


వాక్కులకూ ఊహలకు చిక్కదని 

విధిలేక ఒప్పుకుంటాయి విశ్వసాహిత్యాలు..!!

రంగులకూ, రాగాలకూ అందదని

లోకంలోని కళలన్నీ పూ దండలై తన  కంఠమును అలంకరిస్తాయి..!!

ఇంతకన్నా తన గురించి ఇంకేం చెప్పాలి 

కళలన్నీ రంగురంగుల బావుటాలై

సాహిత్యాలన్నీ సరస కావ్య సౌరభాలై

సౌందర్యాలన్నీ మహోజ్జ్వల దీప మాలికలై

ఆనందాలన్నీ విశ్వ స్వాగత తోరణాలై

కందళ తాళ ఆనంద నాదములతో మున్గి తేలుతూ 

చతుర్ధావస్థతో  ప్రతిధ్వనులు గావిస్తున్నాయి.. !!


నిశ్శబ్దంలో ఆరిపోయిన వేవేల గొంతుకలు సైతం 

క్షణకాల తన సమ్మోహన వీక్షణముతో 

వసంత కోయిలలై సప్తగమకములు పలకగలవు... !!

ఇదే తన లక్షణం.. విలక్షణం..!!


Written by: bobby Aniboyina

Mobile: 9032977985

Tuesday, January 24, 2023

నువ్వు చూడగలిగితే ప్రతీది అద్బుతమే...


నువ్వు చూడగలిగితే

ప్రతీది అద్బుతమే
రా మరి
నా కళ్ళతో చూద్దువు కాని..!!

ఆ దూరాన వున్న మామిడితోపు
మేను విరిచి అప్పుడే ఆవులించింది
నాజూకూ పరిమళం ఆ చోటంతా వ్యాపించింది
పూల బరువును కూడా మోయలేని
నా భావన వెయ్యి కవితలుగా మారి
తోటల మీద వాలుతున్న చిలిపి తుమ్మెద అయింది..!!

ఈ చైత్ర మాసపు చ్ఛాయలక్రింద
ఆతిధ్యం ఇచ్చే పువ్వుల కై
నేనో పుప్పొడినై నవ వసంతం కోసం
ఎదురు చూస్తుంటాను
నేల రాలి మట్టిలో కలిసిపోయే
ప్రతీ ఆకు బాధను మౌనంగా చూస్తున్నాను..!!

గాలి మబ్బుల్లో రేగిన చిరు చెలమలో
నక్షత్రాలు చూడు నగ్నంగా ఎలా స్నానం చేస్తున్నాయో
మిణుకు మిణుకు మంటూ
చూస్తూ ఉండగానే
జ్వలించే సూర్య బింబం కాస్త
పశ్చిమానికి దొర్లిపోయింది
రేపటి తూర్పు బుగ్గల మీద
ఊదారంగు రేఖలతో ఉదయించేందుకై..!!

వసంతం అంటే
ప్రకృతి చూపించే ఓ విశ్వరూపం
ప్రతీ మొక్క దాని శరీర సంపదను
సౌందర్యభరితంగా మలుచుకొని
ఆపాదమస్తకమూ పుష్పిస్తున్నాయి
సింహాసనం మీద వున్న రాజుకంటే
ఈ కొమ్మ మీద కూర్చున్న కోకిలే ఇప్పుడు గొప్ప..!!

శోకాన్ని మరిచి
లోకాన్ని మరిచి
పాడే ఆ కోకిల గొంతుకు
నేలలో లీనమైన ఒక్కో ఆకు, ఒక్కో పువ్వు
గత స్మృతులన్నీ నెమరేసుకుంటున్నాయి..!
తిథి, వార, నక్షత్రాలతో నడిచే ఈ కాలమే
కరుణించి మరో అవకాశం ఇచ్చిందేమో
బాధనుఓదార్చి, దుఃఖాన్ని మరిపించి
శ్రవణానంద మహాసౌందర్య దర్శనాన్ని
వసంతం రూపంలో చూపించడానికి..!!

నువ్వు చూడగలిగితే
గడ్డిపోచపై రాలిన మంచు బిందువులో కూడా
బ్రహ్మాండాన్ని చూడొచ్చు..!!
నువ్వు చూడగలిగితే
ప్రతీది అద్బుతమే..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

Wednesday, January 18, 2023

“తామరనేత్రిని” ...



అదేంటో నే
నీ రూపాన్ని చూడగానే నా కనుపాపలో
కోటి కుసుమాలు ఒక్కసారిగా వికసించాయి...!!
అనేక తారలు తళుక్కుమని మెరిసాయి.. !

ముదురు నీలిరంగు చీరలో,
నువు అలా నడుస్తుంటే..
అరణ్యపు మయూరము నా ముంగిట నర్తిస్తున్నట్లు అనిపించింది.. !!

వెన్నెల ఎంతో అందంగా ఉంటుంది..
కాని, నిన్ను చూసాక నా కళ్ళకు ఆ వెన్నెల కూడా వెలవెలబోయింది.. !!

కనురెప్ప వేసే క్షణంలో కూడా నిన్నే,
చూడాలని పరితపిస్తున్నాయి నా నేత్రములు.. !!

శంఖం ఆకృతిలా వున్న నీ కోమలత్వాన్ని చూచుటకు
వెయ్యి నేత్రములైనా సరిపోవే ..!!
ఛందస్సు వదలని సంప్రదాయ పద్యం లా..
సంగీతం లేక కదలని శాస్త్రీయ గేయం లా .. వున్న నన్ను..
వచనా కవిత్వం లా వచ్చి తాకావు..
పల్లవిలేని నీ వలపు పాటలు ..
నియమం లేని నీ పద్య పాదాలు..
అలంకారాలు లేని నీ అమాయక హావా భావాలు..
నన్ను ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. !!

తెల తెల్లవారున పారిజాతపు కుసుమాలు రాలినంత
సుతిమెత్తగా నీ పాదాలు ఆ ధరణినిని ముద్దాడుతుంటే..
నీ దేహం నుంచి గంధపు పరిమళాలు వెదజల్లుతుంటే ..
పిల్లగాలికి నీ కేశములు వెన్నెల వంటి ఆ నడుమును
తాకుతూ గిలిగింతలు పెడుతుంటే...
ఘడియ ఘడియకో మధుర చుంబన “లా”
నా అణువణువునూ స్పృశిస్తున్నాయి...!!

ఒక్కసారి నిను కనులారా చూస్తే చాలే
క్షణాలు కాదు..
యుగాలను సైతం గప్చిప్గా దాటేస్తా .. !!!

Written by : Bobby Aniboyina
Mobile: 9032977985
18.01.2017

Friday, January 13, 2023

“స్వయంప్రభ" గారి “పూలనిప్పులు” కవితా సంపుటిపై నా అభిప్రాయం



"పూలనిప్పులు" పూలు అంటే మనల్ని తాకే ఓ ఆనందం, నిప్పులు అంటే వెన్నంటే వుండే ఓ వేదన.. జీవితం కూడా సరిగ్గా అలాంటిదే.. మానవ జీవితం ఎప్పుడూ దుఃఖ భూయిష్టమైనది. ఆనందం, వేదన రెండూ పొద్దున పూచిన ప్రభాతమై రాత్రి నిశీథ వేదనతో కలిసిపోయేలా రచయిత్రి ఎంతో గొప్పగా నేర్పుగా వ్రాసారు.

కవిత్వం గుండెలను కుదపాలి.
కవిత్వం మనిషిని కదిలించాలి.
సమాజానికి కాంతిదివిటీగా,
క్రాంతి పథానికి దిక్సూచిగా
కవిత ఆవిర్భూతం కావాలి.
మారుతున్న సమాజ విలువలతోపాటు సాహిత్యపు విలువలూ మారాలి.

“మారేది మార్పించేదే సాహిత్యం”

నాటినుంచి నేటి వరకూ సాహిత్య పరిణామ క్రమ వికాసంలో కవితా రంగంలో కవిత్వతత్త్వంలో పరిశీలనలూ, పరిశోధనలు ప్రక్రియా మందారాలు చిగురించిన ఛందో బద్ధ కవిత్వంనుంచి, వచనా కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర పై గంబర కవితాధోరణులు విప్లవ కవితాతరంగాలు.

భావకవిత్వం, అందులో ఎన్నెన్ని కొత్తగాలులు. మరెన్ని కొత్త గొంతులు ఈ రోజున ఎవరు వప్పుకున్నా, ఔనన్నా కాదన్నా భావకవిత్వమహో ద్యమం మూడు పూలూ ఆరు కాయలుగా విరిసి విప్పారింది.

ఆ అలోచన, ఆ మార్పువలన కవితోద్యమంలొ వచ్చింది కనుకనే తిలక్ గారు, దాశరధి గారు, నారాయణ రెడ్డి గారు, ఎల్లోరా గారు, శేషేంద్రశర్మగారు, సోమసుందర్ గారు ఇలా ఎందరో లబ్ధప్రతిష్ఠులు తమకవితాత్మకు ఉత్తమ కవితా సృష్టినే వాహికముగా మలచుకొని ఆవిష్కరించుకొన్నారు.

ఇక రచయిత్రి "స్వయంప్రభ" గారి గురించి చెప్పాలంటే తీరిక సమయాల్లో ఉబుసుపోక తనలో చెలరేగిన భావాలను కాగితం మీద పరుగెత్తించి, తెల్ల కాగితాన్ని నల్లగా చేయటంతో ప్రారంభించిన "స్వయంప్రభ" గారు కృషీవరులై.. నిత్యసాధనతో ... సమాజంలో వీరంగంచేస్తున్న స్త్రీ అన్యాయాల మీద, అక్రమాల మీద మానవ జాతి లోని పరస్పర వైషమ్యాల మీద - తన “పూలనిప్పులు” వర్షం కురిపించి కవితా శంఖం పూరించి సామాజిక స్పృహ, దేశ శ్రేయస్సు ప్రతీఒక్కరి వారి ప్రథమ కర్తవ్యాలని ఎంతో నేర్పుగా - మన చెవుల్లో గింగురుమనిపించారు.

క్షీర సాగర మథనం ద్వారా లోక కళ్యాణమైన ఎన్నో... మరెన్నో..... అద్భుతాలు, వరాలు ప్రసాదింపబడినట్లే మిత్రులు "స్వయంప్రభ" గారు విరచితమైన "పూలనిప్పులు" ద్వారా యీనాటి సమాజానికి, దాని అభివృద్ధికి ఉపయోగకరమైన, అత్యవసరమైన ప్రబోధాలు (ఓ రకంగా హెచ్చరికలని కూడా చెప్పొచ్చు!) వెలువడ్డాయి.

ఒక విధంగా "స్వయంప్రభ" గారి హృదయానికి, మనస్తత్వానికి దర్పణం యీ “పూలనిప్పులు" తనకే కాకుండా ఎదుటి వారికెవరికైనా సరే ఏదైనా అన్యాయం, అక్రమం జరిగితే,.. బాధకలిగితే - అది తనకే జరిగినట్లుగా చలించిపోయి - తన కోపాన్ని, ఉక్రోషాన్ని, బాధను అక్షర రూపంలో తన రచనల్లోనే ప్రస్ఫుటింపచేసే సున్నిత మనస్తత్వం ఆమెది! (భగవత్ప్రసారితమైన సాహిత్యపిపాస తోడయింది కనుక).

తన రచనా పాటవంతో “పూలనిప్పుల” కవితా శంఖాన్ని పూరించిన వాగ్దేవి కలం తనది. "పూలనిప్పులు" లో భావస్పష్టత, వస్తు నాణ్యతతోపాటు - భాషా పరంగా కూడా ఉన్నతంగా వుండి చురకత్తిలా పదునెక్కిందా అనిపిస్తుంది చదువుతున్నంత సేపూ.

“మ(గువ)నో ధైర్యం కోసం” శృంఖలాబద్ధమైన స్త్రీ జాతిని మేల్కొలుపుతుంది.

“రక్షక వలయం” పురుషహంకారాన్ని ప్రస్ఫుటింపజేస్తూ, పురుషజాతి ఆత్మవిమర్శ చేసుకునేదిగా వుంది.

"కూటికోసం" నలిగిపోతున్న జీవితంలో వెలుగు ఎక్కడ అంటూ గొంతెత్తి తన కలం ఎంత శక్తివంతమైందో తెలుపుతుంది.

అమృతతుల్యమైన కన్నతల్లి ప్రేమానురాగాలను “అమ్మా వందనం” అంటూ కనురెప్పల కాపలాతో పోల్చిన వైనం అమోఘం. ఈనాటి యువతరానికి దేశాభిమానం, ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాముఖ్యతను వక్కాణిస్తూ, సమగ్రత దేశమనుగడకు ఎంత అవసరమో చాటి చెప్పటంలోనూ, నిరక్షరాస్యతతో నిస్తేజమైన నేటి సమాజానికి అక్షరాస్యత ఆవశ్యకతను "జీవగీతం" ద్వారా బలోపేతం చేయటంలోను, వెన్నంటి నడిచే వాళ్లకు సారథి అవ్వాలంటూ “విశ్వహారతి”లోనూ రచయిత్రి వర్ణించటం 'అభినందనీయం'. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో .. ఎన్నెన్నో..!

"స్వయంప్రభ" గారి కలంలో నుండి యీ సాహితీ వనంలో ఎన్నో... మరెన్నో సుమాలు సువాసనలు వెదజల్లాలనీ, మరెన్నో విజయ సోపానాలు నిరాఘాటంగా, నిరాటంకంగా అధిరోహించేలా వారు శిఖరాన్ని చేరుకోవాలని మనసారా కోరుకుంటూ భవిష్యత్తులో వారి కలం నుండి సమాజాభివృద్ధికి తోడ్పడే ఎన్నో రచనలు జాలువారాలనీ ఓ మిత్రునిగా, శ్రేయోభిలాషిగా నా కాంక్ష - ఆకాంక్ష!

స్వస్తి __/\__

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

Wednesday, January 11, 2023

అమ్మమ్మ గారిల్లు ...


 “సంక్రాంతి” అంటే పండగ కాదు మన జీవన విధానం .. పట్టణాలు వెలవెలబోతాయి.. పల్లెలు పక్కున నవ్వుతాయి..సంక్రాంతి అంటే ఎందరికో ఎన్నో జ్ఞాపకాల పుస్తకం. నాకు కూడా.. అందులో ఓ రెండు పేజీలు మీకోసం..!!

అమ్మమ్మ గారిల్లు
***************

పెద్ద పండుగ అంటే మొదట గుర్తొచ్చేది
అమ్మమ్మ గారి ఇల్లే
నాకు బాగా గుర్తు
తొలిప్రొద్దు నడి వాకిట్లో
జడ గంటల సవ్వడులతో
పావడాల్ని పాదంపై కెగ్గట్టి
పవిటలు సరి చేసుకుంటూ
రంగులు అంటిన ముఖముతో
మురిసిపోతూ ముగ్గులేస్తున్న వనితలను
అల్లరి బావల నిశబ్దపు నవ్వులతో
కిటికీల మాటున దొంగల్లా చూడటం
నాకు ఇంకా గుర్తుంది..!!

పిన్ని పెట్టిన కుంకుడు కాయ నలుగుకు
కళ్ళని నులుముతూ ఏడుస్తున్న
బోసినవ్వుల చంటి బిడ్డలు..!
గాడిపొయ్యి దగ్గర హడావిడిగా
ఘుమఘుమల నువ్వుల అరిసెలు
కాల్చే పెద్దమ్మ పిండివంటలు..!
ఆరుబయట నులకమంచాలపై
ముందురాత్రి వెన్నెల్లో
మాటల మాలలు అల్లుకుంటూ
సందడి చేస్తున్న పడుచు పిన్నిలు..!
ఇంత హడావిడిలో కూడా
ఇంటి మూలనో చోటు కనిపెట్టి
పెకముక్కల్లో పండుగ వెతుక్కుంటూ
చేయివాటం చూపిస్తున్న మామలు, బాబాయ్ లు..!

సంతకు తీసుకెళ్ళి
లెక్కే లేకుండా అడిగినవీ,
అడగనివీ అన్నీ కొనిచ్చే
బుర్రమీసాల తాతయ్య..!

చెడ్డీ వేసుకుతిరిగే బుడ్డోడు దగ్గరనుంచి
చెంగావి చీరల్లో చుక్కల్లా మెరిసే వాళ్ళ వరకు
చిరునవ్వులు చెరగవు
అందరిదీ వెర్రి ప్రేమ
అంతులేని ఆప్యాయత
అవని నుంచి ఆకాశం వరకు
ఆనందమే అలుముకున్న క్షణాలవి..!

అంతేనా

పసిపిల్లలతో పరుగులెత్తే లే దూడ
గుమ్మం దగ్గర వెన్నుల్లి గప్చిప్గా పేరుక్కెళ్ళే గువ్వలు
గంగిరెద్దుల వాని సన్నాయి మేళం
జంగందేవర శంఖారావం
సాతాని జియ్యరు శ్రీహరి గీతాలు
నీకు తొలిజాము మేల్కొలుపు సంగీతాలు..!

భోగి మంటల అరుణిమ
నుదిటి సింధూరమై మెరయ
అభ్యంగ నావిష్కృత కురులు పైకెగయ
ముదమార ముడివేసి
ముంజేతి గాజులు సయ్యాటలాడ
ముత్యాల ముంగిట
ముత్తయిదువుల ఆహ్వానములు..!

వోర వాకిలి వెనుక
వాలు చూపులు సంధించు
వన్నెలాడుల క్రీగంట పరికించి
మధుర భావాల గుండె చప్పుళ్ళ
పరవశించు కొత్త అల్లుళ్ళు ...
మూసిన ప్రణయ
సౌధపు వాకిళ్ళు తెరచి
అలనాటి తొలిరేయి
వలపు కౌగిళ్ళు తలచి
పరవశించిపోయే
ముదుసలి యెవ్వన మామలు..!
అనురాగపు జల్లుల తడిసి
మగని పులకరింతకు జడిసి
లోలోన మురిసిపోయి
ముసిముసిన నవ్వుకునే ముదుసలి అత్తలు..!

కోడి పందాలు,
కోడెల బలాబలాలు
గంగిరెద్దుల నాట్యాలు
కోలాటముల సయ్యాటలు
భగ భగల భోగి పాయసము
పొంగారు పొంగలి
నూరూరు గుత్తి వంకాయ
కమ్మని గుమ్మడి పులుసు
రోటిలోని వేడి వేడి గోంగూర పచ్చడి
జిడ్డు తేలిన
గడ్డ మీగడ పెరుగు..!

పెద్దలనుంచి పిల్లల వరకు ప్రతీ ఒక్కరిని
ఆప్యాయంగా పలకరిస్తూ, బోసినవ్వులు రువ్వే
పాలమనసున్న అమ్మమ్మ ఇప్పుడు లేకపోవచ్చు
కానీ ఆమె జ్ఞాపకాలతో బ్రతికేస్తూ ఈ చిరు అక్షర జల్లు..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985