మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Wednesday, March 25, 2026
బామ్మ ...
ఇంటి ముంగిట నిలిచిన
పాత తులసిచెట్టు ఆమె!
ఎన్ని వసంతాలు గడిచాయో,
ఎన్ని అవరోధాలను దాటిందో
ఆమె చర్మపు ముడతలే చెబుతాయి!
మన ఇంటికి ఇంకా ఊపిరి మిగిలి వుందంటే
అది ఆమె వల్లే అనిపించే
ఒక మౌనపు ఆశీర్వాదమే బామ్మ!
ఆమె చేతులు చూశావా ఎప్పుడైనా?
కాలం ఎన్నిసార్లు వాటి మీద నడిచి వెళ్లిందో,
ఆ రేఖలు చెబుతాయి!
కానీ చిత్రమేమిటంటే
ఆ చేతులు వణికినా
వాటిలోని మమత మాత్రం
ఎప్పుడూ వణకదు!
అల్మారాలో
అపురూపంగా దాచుకున్న పాత పుస్తకంలా..
ఆమె మౌనం ఎన్నో రహస్యాలను మోస్తుంటుంది.
మనం పరుగు తీస్తున్న ఈ యాంత్రిక లోకంలో..
ఆమె మాత్రం, ఒక నిలకడైన సముద్రంలా,
మన ఆవేదనలన్నింటినీ
తన ఒడి అనే రేవులో నిశ్శబ్దంగా సేదతీరుస్తుంటుంది!
ఆమె కథలు చెప్పడం మొదలెడితే
రాత్రి కూడా కన్ను ఆర్పకుండా వింటుంది.
ఆమె చెప్పే కథల్లో..
కేవలం రాజులు, రాణులు ఉండరు,
కనుమరుగైపోతున్న మానవీయత ఉంటుంది!
ఆమె నవ్వు..
శిశిరంలో రాలిన ఆకులా సున్నితంగా ఉన్నా,
అందులో ఒక వసంతపు ఓదార్పు
ఎప్పుడూ దాగే ఉంటుంది!
ఆమె ఎక్కువగా చదవకపోవచ్చు,
ప్రపంచమంతా చూడలేకపోవచ్చు,
కానీ మనుషుల్ని మాత్రం చాలా లోతుగా చదివేస్తుంది!
ఎవరూ చెప్పకపోయినా
మన బాధను ముందే గుర్తించే కళ్లవి!
ఏమైంది రా? అని అడిగే ముందు నుంచే
మన మౌనంలోని బాధను మొదట చూసే కళ్లవి!
ఆమె మందలింపుల్లో కూడా ప్రేమే ఎక్కువ..
“జాగ్రత్త” అన్న ఓ మాటలో,
చాలా జీవితం దాగి ఉంటుంది!
“తిన్నావా?” అన్న ప్రశ్నలో,
ఆమె ఆత్మంతా దాగి ఉంటుంది!
మనకి అవి చిన్న మాటల్లా అనిపించొచ్చు,
కానీ నిజానికి
ఆ ప్రశ్నలే మనల్ని మనుషులుగా నిలబెట్టే
చివరి మజిలీలు!
ఆమె
మరణం వైపు సాగుతున్న
ఒక ముగింపు కాదు!
మన మూలాల నుండి చిగురిస్తున్న
ఒక అమరత్వపు సంతకం!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment