మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Monday, March 16, 2026
ఓ నూతన వత్సరమా..
ఓ నూతన వత్సరమా..మా పాత సంచిత
దుఃఖములను ధూళిన కలిపి
నవ కిరణమై ఉదయించగ రావే!
చిగురుటాకుల హాసమున్ ధరియించి
వసంత సుగంధమును మోసుకొని
మా ఇంటి ముంగిటకు నవ ఆశల దీపమై రావే!
పాత విరహ వేదనల గాథలన్ని
కాల గర్భమున్ నిద్రింపజేయగ
మా హృదయమ్ములో చిరునవ్వు పూయించగ రావే!
ద్వేష మేఘములను చెదరగొట్టి
స్నేహ సుధను కురిపించి
సమానత్వ భావమును మాలో నింపగరావే!
ఓ పరాభవా..
ధాత్రిపై కొత్త కాంతులు విరజిమ్మగ..
సకల జనుల సౌభాగ్యమును చేకూర్చగ..
ధర్మ ఖడ్గమును ధరియించి.. అవనిని కాపాడగ రావే!
నీతిని మరచిన మాయావుల..
లోకమును పీడించు త్రాష్టుల..
గర్వము నణిచి.. చర్మము లూడదీసి..
అహంకారపు కోటలను కూల్చి..
తగు శాస్తిని జేయుచు.. సత్యమును నిలబెట్టగ రావే!
మనిషి మనిషిపై విసురుతున్న
ద్వేషపు బాణాలను తుంచివేయగ..
డిజిటల్ తెరల వెనుక దాగిన
కుటిల బుద్ధుల పాలి కాలయముడిగ..
సమాజమందున నైతిక విలువల శాంతిని నింపగ రావే!
కష్టాల కారుచీకట్లను పారద్రోలి..
మెరిసి మురిసే సిరి సంపదలతో..
నిండు సంతోషము గూర్చుమా..
మా మానవాళికిన్!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment