Friday, March 13, 2026

ఏకాంత యాత్ర ...

 



తను బ్రతికిన ఆ వాకిలి ముందర
నిశ్చలంగా, నిశ్శబ్దంగా పడుకున్న ఆ దేహం
నాడు క్షణం తీరిక లేక,
ఎదుటి మనిషితో మాట్లాడే సమయం లేక,
పరుగులు తీసినదే!
కానీ నేడు
లోకమంతా తన ముందు నిలబడి ఆవేదనతో పిలుస్తున్నా,
బదులు చెప్పలేని ఒక మూగ శిలలా,
తన సొంత ఇంటి గుమ్మం ముందే,
ఒక అపరిచిత అతిథిలా నిశ్శబ్దంగా పడివుంది..!

నాడు మనుషుల కోసం
సమయం లేదన్న ఆ ప్రాణం,
నేడు అదే మనుషుల మధ్య
ఏకాంతంగా పడుకొని,
కాలం తనపై విసిరిన శ్వేత వస్త్రం చాటున,
అనంత నిద్రలో మునిగిపోయింది..!

నిన్నటి వరకు ఒక పేరు గా పిలవబడిన ఆ మనిషి,
నేడు ఈ గుమ్మం ముందర కేవలం ఒక శవం గా మారిపోయింది
నాడు పరుగెత్తిన ఆ పాదాలు,
నేడు ఆరు అడుగుల అంతిమ ప్రయాణానికి
మౌనంగా సిద్ధమవుతున్నాయి..!

చుట్టూ చేరిన బంధు, మిత్రులు
అశ్రువుల సముద్రాన్ని ఒలకబోస్తుంటే,
ఆ నిశ్చల రూపం మాత్రం ఏమీ ఎరగనట్లు
లోకం నేర్పిన పాఠాలన్నింటినీ మరచిపోయి,
హాయిగా నిద్రపోతున్న ఒక చంటి బిడ్డలా కనిపిస్తుంది..!

పచ్చని వెదురు బద్దలను పేర్చి,
దర్భలతో ముడులు వేస్తూ పాడెను సిద్ధం చేస్తుంటే
ఈ లోకంతో ఉన్న మమకారపు బంధాలన్నీ
ఒక్కొక్కటిగా తెగిపోతున్నట్లు,
ఆ వెదురు దర్భ నిలువెత్తు సాక్ష్యమై నిలుచుంది
అదే జీవితపు అలసటను తీర్చే తన ఆఖరి శయ్య అని గుర్తు చేసింది.!

నాడు పట్టు పరుపుల మీద కూడా
కునుకు పట్టని ఆ దేహానికి,
నేడు ఆ గరుకైన వెదురు బద్దలే
అనంత నిద్రను ప్రసాదించే అమర పీఠాలుగా మారాయి.!
మడత నలగని వస్త్రాల కోసం ఆరాటపడిన తను,
నేడు ఆ నిలువు కర్రల మధ్య నిశ్చల చిత్రంలా బంధింపబడి..
తన ప్రమేయం లేని ఓ మహా ప్రస్థానానికి మౌనంగా తలవొంచుతున్నాడు.!

మమకారాల ముళ్ళను తెంచుకుని..
నలుగురి భుజాల మీద ఊగుతూ సాగే ఆ యాత్ర,
మనుషుల మధ్య పెరిగిన దూరాన్ని కాదు..
జీవితానికి, మృత్యువుకి మధ్య ఉన్న దూరానికి అద్దం పట్టింది.
ఆ నలుగురు మోస్తున్నది కేవలం దేహాన్ని కాదు,
కాలం మిగిల్చిన ఒక బరువైన జ్ఞాపకాన్ని..!

అక్కడ.. ఆ చితిపై పేర్చిన కట్టెల మధ్య,
కడసారిగా కదిలే ఆ మంటల వెలుగులో,
అనంత వీధిలో సాగిపోయే ఏకాంత యాత్ర,
అస్థికల రాశిలో దాగిన ఒక నిగూఢ సత్యమైంది..!
చివరిసారిగా నేలను తడిపే కన్నీటి చుక్క,
జీవన సాగరంలో విలీనమైన ఒక చిన్న తరంగమైంది..!
ఇవన్నీ జీవితం నేర్పిన అంతిమ పాఠాలు.!!
కాలం వేసిన కళాత్మక సంతకాలు..!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment