Friday, June 29, 2018

ఓ గులాబీ కుసుమమా, ఎంత అదృష్టమే నీది... !!



ఓ గులాబీ కుసుమమా .. 
ఎంత అదృష్టమే నీది... 
నీ జీవితకాలం కొన్ని గంటలే .....అయినప్పటికీ.. 
ఎంత మందిని ఆకట్టుకుంటావో, 
ఎంత మందిచే అభిమానింపబడతావో, 
వేకువన వికసించి అస్తమయానికి రాలిపోయే 
క్షణమున కూడా నిండుగా నవ్వుతూ కనువిందు చేస్తావు.. 
కోమలాంగుల కొప్పుల్లలో సొగసుగత్తెలా కూర్చుంటావు .. 
తొలిరేయి తనువుల తమకములలో నలిగి నిట్టూర్పులూదుతావు.. 
చిట్ట చివరి మానుష యాత్రకు ఆఖరి ప్రయాణమై ఓ ఓదార్పువౌతావు .. 
శుభ, అశుభ కార్యాలలో మానసిక సంజీవనివౌతావు.. 
భగవంతుని పాదాల చెంత ఆనంద పారవశ్యమౌతావు.. 
నీలా ఒక్క రోజు కాదు.. 
ఓ ఘడియ బ్రతికినా చాలునే..!!

Written by : Bobby Nani

చూపు పారేసుకున్నాను..



చూపు పారేసుకున్నాను.. 
ఆమెను చూచినది మొదలు.. !! 

వినీలాకాశంలో విలక్షణమైన సౌందర్యం ఆమెది.. 
అసంఖ్యాక నక్షత్ర మండలంలో రెప్పలార్పలేని రూపం తనది.. 
సూర్య చంద్రుల్లా ప్రతీక్షణం వెలిగే ఆ నయనాలు, 
సంపెంగ వంటి ఆ సన్నని నాశికాగ్రహం, 
నల్లని ఆకాశంలోని ఓ తారను తెంచి పెట్టుకున్న ముక్కు పుట, 
గులాబీ రెక్కల్లా మృదుమధురమైన ఆ యెర్రెర్రని అధరములు, 
నవనీతపు ముద్దల్లా సుతిమెత్తని చెక్కిలి 
పసిడి ఛాయవంటి యవ్వన కాంతిమయ దేహం. 
శంఖం లాంటి మెడ 
వెండి తీగలా వున్న సన్నని నడుము. 
ఆమె స్వరంలో ఉషస్సు, 
ఆమె చూపుల్లో యశస్సు, 
కళ్ళతోనే సంభాషించే సమ్మోహనం తనది..!! 

ఆమె ఎదురు పడిన ప్రతీసారి 
మౌనం మాటలకందని అనుభూతిగా మారిపోతుంది.. 
పరిమళాలు వాయువులతో మాలలల్లుకుంటూ వెళ్తుంటాయి.. 
సూర్యోదయం లా విరిసే ఆమె మోముకు 
ప్రాతఃకాల కుసుమములు వికసిస్తుంటాయి.. 
లేతాకు మీది వర్షపు చినుకులా, 
కొమ్మనించి సున్నితంగా వేలాడే పిందెలా 
నడుస్తూ నాట్యమాడే మయూరి విప్పిన వేయికళ్ళ 
ఉద్యానవనంలా నా కళ్ళు ఆమెను చూడగానే మంత్రించి పోతాయి.. 
మొదట రాలిన వర్షపు చినుకు సూటిగా ఆమె నుదుటిపై సంతకం పెడుతుంది.. 
ఆమె చేతి స్పర్శకు నూతన పత్రం కొమ్మ కొమ్మకూ చిగురిస్తుంది .. 
తన ప్రతీ సౌందర్యమూ పదమై, పద్యమై , అనుభవమై 
భవిష్యదాకాశమై గుండె గులాబి పువ్వై ప్రకృతి చిల్కరించే మంచు బిందువులై 
ప్రతీ హృదిలో ఓ పుల్కరింపై నిర్మల అంతరంగంపై ఉప్పొంగి పొరలే సముద్ర కెరటమై 
కాలం కాచి వడపోసే తెనేటి విందై పల్లవిస్తూ ప్రవహిస్తోంది..!! 

Written by : Bobby Nani

Tuesday, June 26, 2018

కవిత్వం వేదననుంచి పుట్టిందని అంటారు.. అది నిజమో కాదో నాకు తెలియదు...



కవిత్వం వేదననుంచి పుట్టిందని అంటారు.. అది నిజమో కాదో నాకు తెలియదు... 

కానీ నా వరకు మాత్రం వేదన నుంచే పుట్టింది.. 

నేను మొదటిసారి కవిత రాసింది వేదనాభరితమైనదే .. అది కూడా శ్మశానంలో ఓ సమాధిపై కూర్చుని.. 

మీకు ఇది వినడానికి నమ్మశక్యం కాకుండా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది.. కాని ఇదే నిజం.. 


అది 1998వ సంవత్సరం నా వయస్సు షుమారు పన్నెండేళ్ళు .. 

మా నాన్నమ్మగారి హటాన్మరణంతో మొదటిసారి శ్మశానాన్ని చూడాల్సి వచ్చింది.. 

అప్పటివరకు ఎంతో బాధ, దుఃఖంతో వున్న నాకు అక్కడకు వెళ్ళగానే చాలా తేలికగా అనిపించింది.. అక్కడంతా చూసేందుకు చాలా జుగుప్సాకరంగా ఉన్నా కూడా ఏదో తెలియని మధురానుభూతి ఎప్పటికైనా ఇదే మన శాశ్విత స్థావరం అని కాబోలేమో.. !! 


ముందురోజు మట్టి పనులు ముగించుకొని ప్రక్కరోజు పాలకొరకు, ఆత్మ శాంతి జరిపేందుకు, తులసి వృక్షం నాటేందుకై అక్కడకు రెండవ సారి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు.. నేనేమో అవన్నీ గమనిస్తూ కాస్త దూరంగా వచ్చి ఓ చింత చెట్టు కింద వున్న సమాధిపై కూర్చున్నాను.. ఏవేవో భావాలు చుట్టుముడుతున్నాయి.. బాధ ఎక్కువైపోతుంది.. భావాలను అక్షర రూపంగా రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మొదలైంది. అనుకున్నదే ఆలస్యం గా జేబులోని రేనాల్డ్స్ బాల్ పెన్ను తీసుకున్నాను.. నా వద్ద పేపర్ లేదు.. అక్కడకు వచ్చిన కొందరు పెద్దవారిని అడిగి ఓ పేపర్ తీసుకున్నాను.. ఆలోచించకుండానే చక చకా రాసేసాను. పేపర్ నిండిపోయింది.. ఇది ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్ధం కాదు.. ఓ విద్యార్ధి 8 మార్కుల ప్రశ్న తప్పక వస్తుందని తెలిసి దాన్ని పదే పదే బట్టి పట్టి నేర్చుకుని వెళ్ళి ఎంత వేగంగా రాసేస్తాడో అదే వేగంతో నేను మొదటిసారే రాయగలగడం నాకే ఆశ్చర్యం కలిగింది.. భావాలను అక్షరరూపం దాల్చడం అదీ మొదటిసారి అంత వేగంగా వ్రాయడం అక్కడవున్న ఓ తెలుగు పండిట్ ను ఆశ్చర్యచికితుడను చేసింది.. వారు ఇచ్చిన స్ఫూర్తితోనే అక్షరాన్ని విడువక తోచిన ప్రతీ భావాన్ని, రాస్తూనే వచ్చాను... 

భావ కవిత్వానికి, వచనా కవిత్వానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ, 

ప్రణయాన్ని, వర్ణనను కూడా కలుపుకున్నాను.. 

ప్రబోధ కవితలను కూడా అప్పుడప్పుడు సంధిస్తూ, పద్య, గేయ రచనలను గావిస్తూ వచ్చాను.. దూషణా కవిత్వం, ఆశుర కవిత్వం మాత్రం గాడితప్పిన మండూకములపై ప్రయోగిస్తూ వచ్చాను.. సాహిత్యం పట్ల సాన్నిహిత్యంగా ఉంటూ, రాసిన ప్రతీ అక్షరానికి కృతజ్ఞత తెలుపుతూ, సంస్కృత, గ్రాంధిక పదజాలంపై కాస్త పట్టు సాధించి మనుగడ కోల్పోయిన, కోల్పోతున్న పదాలను అక్షరీకరిస్తూ నా ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను.. 

వాడుక భాష అందరికీ విదితమే .. కాని రేపటి తరానికి మనుగడ కోల్పోయిన అక్షరాలు చాలా అవసరం..ఎందుకంటె అవి మన పితృ వాఖ్యాలు.. వాటిని మరవడం అంటే వారిని తృణీకరించడమే.. ఎప్పుడైనా మానవ మనుగడకు ముఖ్యమైనది అనుభవం (జరిగిన కాలం) మాత్రమే.. దాని ద్వారానే రేపటి భవిష్యత్తును మనం చూడొచ్చు.. అందుకని గడచిన కాలాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యకూడదు.. 

నేను నమ్మిన సిద్ధాంతాలు 

“తెలిసింది కాదు.. తెలుసుకొని రాయి” అది ఏదైనా సరే.. 

రాసే ఏ భావనలో అయినా సరే రచయితకు స్వేచ్చ ఉండాలి.. అది లేకుండా రాస్తే శవం తో సంసారం లా ఉంటుంది.. 

ఏదైనా సరే ఆస్వాదన చాలా ముఖ్యం .. ఆస్వాదన లేకుంటే మనిషికి మర మనిషికి తేడా ఉండదు.. 

అక్షరం అంటే అమ్మ.. అందుకని దానికి విలువ, గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి.. 

ఒకరి కొరకు, ఒకరి కోసమో ఇష్టాన్ని చంపుకొని రాయను, నాకు నచ్చితేనే రాస్తాను లేకుంటే ముక్కంటి మాట కూడా వినను.. ఇది రచయితకు ఉండాల్సిన ముఖ్య ఆభరణం.. 

ముఖ్యంగా ప్రశంసల కొరకు ఏది పడితే అది రాయడం ఇష్టం లేదు.. అలా రాస్తే అది వ్యర్ధమే అంటారు.. 

పత్రికలకు, ప్రకటనలకు పంపడం నచ్చదు.. ఏదైనా కవిత కాని కావ్యం కాని వాటంతటికి అవి ఎగిరి వెళ్లాలే కాని మనమేంటి దారం కట్టి ఎగరేసేది.. విమర్శను ఒంటరిగా ఉన్నప్పుడే చేస్తాను.. ప్రశంస మాత్రం పదిమందిలో చేస్తాను.. ఇదే నాకు ఇష్టం... 

రాసిన వారికి మాత్రమే తెలిస్తే చాలదా తనని విమర్శించామని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు.. 

ముక్కుతాడులేక బసవన్నలా చిందులేస్తున్న వారిని మాత్రం అందరిముందే ఎండకట్టడం ఇష్టం.. వారితో ముఖాముఖి సంభాషణ సాగించడం ఇష్టం.. 

సమయం లేక ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది.. 

ఈ ముఖపుస్తకం వేదికగా నిలవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.. మహామహులను కలుసుకున్నాను.. వారి గౌరవ అభిమానాలను చోరగొన్నాను.. వారిచే సత్కరించబడ్డాను.. కొన్ని కొన్ని బిరుదులు కూడా స్వీకరించబడ్డాను.. కానీ ఏదో వెలితి ఆత్మసాక్షి అనుక్షణం ప్రశ్నిస్తూనే ఉంది.. నీవు నిజంగానే ఇంత అభిమానానికి అర్హుడవా అని ?? అందుకే విద్యార్ధిగానే ఉంటున్నా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే వస్తున్నా.. ఆత్మీయులు ఎందరో ఈ ముఖపుస్తకం ద్వారా పరిచయం అయ్యారు.. వారిది ఎప్పటికీ నా హృదయంలో ఓ సముచిత స్థానమే.. 

ఇకపోతే కొందరు మిత్రులు ఎంత అద్బుతంగా వ్రాస్తున్నారో.. నిజంగానే వారిలా నేను వ్రాయలేనేమో.. ఆ అక్షర మాధుర్యం వారు తప్ప మరెవ్వరూ వ్రాయలేని విధంగా ఆకట్టుకుంటున్నారు.. చాలా సంతోషంగా ఉంది.. ఈ ముఖపుస్తకంలో తెలుగు వెలుగులను పంచుతోంది.. పూర్వవైభవం కనిపిస్తుంది.. రేపటి భవిష్యత్తుకు తెలుగు అంటే తెలియనిది కాదు తెలుగు అంటే తెలిసినది తల్లితో ఏర్పడ్డ అనుబంధం అది అని అవగతమౌతుందని నమ్మకం ఏర్పడింది.. 

అక్షరానికి వున్న శక్తి అంతా ఇంతా కాదు.. నాకు వారు ఎవరో కూడా తెలియదు పర్సనల్ గా చాలామంది సందేశాలు పంపారు.. మీరెందుకు రాయట్లేదు అని .. అందరికీ ముందు వెనుక అన్నట్లుగా ఈ పదిరోజులనుంచి తిరిగి రిప్లై ఇచ్చాను.. ఒక్కరు చదివితే చాలు అనుకుని మొదలు పెడతాను ఇందరు తెలియకుండానే చదువుతున్నారని తెలియలేదు.. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడను..__/\__ 

మీ కోసం తప్పకుండా వ్రాస్తూనే ఉంటాను.. 

ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటాను.. 


స్వస్తి ___/\___

Written by : Bobby Nani

Saturday, June 23, 2018

దేశమే గొప్పది మనుషులు కాదు.. !!


దేశమే గొప్పది మనుషులు కాదు.. !!
***************************

ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిన కారణంగా దాదాపుగా 50,000 కంటే ఎక్కువ సంఖ్య గల భారీ ట్రక్కులను సిటీ ప్రక్కన నుంచి కాకుండా వేరే దారి మళ్ళించే ఏర్పాటుతోటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఓ బృహత్కార్యానికి ప్రణాలిక వేశారు అదే “Eastern Peripheral Expressway” 



షుమారు 11,000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచ అగ్ర దేశాలతో ఏమాత్రం తీసిపోకుండా, మన దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎక్కడా లేనటువంటి అత్యాధునికమైన సౌకర్యాలతో 135 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల “ఎక్స్ ప్రెస్ హైవే” నిర్మించేందుకు నవంబర్ నెల 2015 వ సంవత్సరములో ఈ తీర్మానం ప్రవేశ పెట్టారు.

తదుపరి ఫిబ్రవరి నెల 2016 వ సంవత్సరములో ఈ కార్యం ఆచరణ యోగ్యంగా మారి నిధులు సమకూరి పనులు జరగడం ప్రారంభమయ్యాయి.. తరువాత ఏప్రియల్ నెల 2017వ సంవత్సరములో దాదాపుగా అరవై శాతం పని పూర్తి కాబడి కాలుష్యం తో సతమతమౌతూన్న ఢిల్లీ ప్రజలకు ఊరట కలిగించే దిశగా మారింది... తదుపరి 2018వ సంవత్సరం ఏప్రిల్ 29 న ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడానికి ఏర్పాటు చేసారు. కాని కర్నాటకలో ఎన్నికల కారణంగా తాత్కాలికంగా ఆరోజు రద్దు కాబడినది.

మే నెల 2018వ సంవత్సరం 31 వ తేదీ లోపల ప్రారంభించాలని భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) కు మన భారతదేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. చిట్ట చివరగా ఇన్నేళ్ళ ఢిల్లీ వాసుల కల 27 మే 2018న మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతులమీదగా “Eastern Peripheral Expressway” ను ఎట్టకేలకు ప్రారంభించడం జరిగింది.. ఈ రహదారి కుంద్లి , సోనిపట్ నుండి, హర్యాణాలోని ఉత్తర ప్రదేశ్ మరియు ఫరీదాబాద్ జిల్లాలో, బాగ్పత్ , ఘజియాబాద్ మరియు నోయిడా జిల్లాల గుండా వెళుతుంది. 

దేశం గర్వించదగ్గ విషయం ఇది.. 

ఈ రహదారిలో ప్రతీ దగ్గర సెన్సార్స్, ఎల్.ఇ.డీ స్, లేసర్స్, పౌంటైన్ ఇలా ఎన్నో అత్యాధునికమైన పరికరాలను అమర్చి రూపొందించారు.. కేవలం ప్రారంభించిన 20 రోజుల్లోనే మన భారతదేశ పౌరులు అక్కడ ఏర్పాటు చేసినటువంటి సోలార్ ప్యానెల్స్, లైట్స్, బ్యాటరీస్, ఆఖరికి పౌంటైన్లలో అమర్చిన టాప్ లను కూడా వదలకుండా పట్టుకెళ్ళి అమ్మేసుకున్నారు.. వీటి విలువ షుమారు వందల కోట్లు.. 

ప్రపంచ దేశాలు దిగ్బ్రాంతి చెంది గాండ్రించి ఉమ్ముతున్నాయి .. 

ఎందుకు మనదేశం అభివృద్ధి చెందకుండా ఇంకా చెందుతూనే ఉందో ఓ చెంపపెట్టు లాంటి ఉదాహరణ ఇది.. 

ప్రతీ భారతీయుడు సిగ్గుతో తలదించుకునే సంఘటన... 

మారాల్సింది దేశం కాదు.. మనం...!! 

స్వస్తి __/\__

Written by : Bobby Nani

Thursday, June 14, 2018

ఓ అందమైన సంధ్యా కాంత

నెల్లూరు లో పెన్నానది ఒడ్డున నిలబడి చూస్తే చాలా బాగుంటుంది.. ఎదురుగా మహోన్నతమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి కోవెల గోపుర ముఖద్వారము కనిపిస్తుంది.. వేకువన భానుని కిరణాల తాకిడికి ఆ నది బంగారు వర్ణం లా మారి మరింత శోభాయమానంగా కనులకు కనువిందుగావిస్తుంది.. మహా మహులకు సైతం ఆ దృశ్యం వర్ణింప శక్యము కాదు .. ఓ చిన్న భావన నన్నావరించిన ఆ సమయాన నా మునివేళ్ళ నుంచి రాలిన అక్షరాలే ఇవి.. :) 


ఓ అందమైన సంధ్యా కాంత 
నీలిగాజు పలకవోలె 
నిర్మల పెన్నా వాహిని 
ఆకసంపు టందాలను 
తనలో చూపిస్తూ 
అలుపెరుగక నాతో చెలిమి 
ముచ్చట లాడుచున్న సమయాన..!!


పై పైకొచ్చి వాలింది 
వగలాడి వర్షధరము 
చిటపట మను చిరు జల్లులతో 
అణువణువునా కురుస్తూ, 
తనువంతా తడిపి వేసింది..!!

చిరు జల్లుల తాకిడికి 
కట్టు వస్త్రాలు విడిచి 
నూతన వస్త్రాలు ధరించిన 
ఆమని కనుచూపుమేర 
ఆకుపచ్చని తివాచీలా మారి 
శోభాయమానమై నిలిచింది.. !!

వరిపైరుల ఊయల లూగి
విరుల పరిమళాలు మధురముగ గ్రోలి
మలయ మారుతాలు నేడు 
మా మధ్యన సవితి పోరై తచ్చాడుతున్నాయి..!!

పచ్చిక బయళ్ళు 
పచ్చ కంబళ్ళను పరచి 
వచ్చి వాలండని 
ముచ్చటగ పిలుచుచుండే ..!!
గున్నమావి చివురులు తిని 
కోయిల అరగక తెగ కూస్తున్నది 
మా ఏకాంతానికి 
తెర దించాలని..
తొంగి తొంగి చూస్తుంది 
నల్లని కళ్ళ నిశీధి 
తెలవారు ఎప్పుడు ముగిసిపోతుందా
వచ్చి వాలుదామా అని..!!

మదువులు పిండే తేనెటీగ 
వ్యధామయ జీవితాన్ని, 
మధురంగా మలుచుకోమంటున్నది 
అణువణువునా కొత్తదనం తొణికిసలాడే 
ఈ ఆమని నాలో నాంది గీతం పల్కుతూ ఒదిగిపోయింది..!! 

Written by : Bobby Nani

Thursday, June 7, 2018

రాలుతున్న చినుకు చెప్పే ఏకాంత కావ్యం..


రాలుతున్న చినుకు చెప్పే ఏకాంత కావ్యం..
*******************************


మట్టికీ, వర్షానికి వున్న అనుబంధం ఎంతో గొప్పది 
పురుడుపోసే మంత్రసాని వలె మట్టి మారగా... 
వాడిపోతున్న పచ్చదనానికి వన్నె తెచ్చే సంజీవనిలా 
వర్షం మారుతుంది.. !!


తల్లికి బిడ్డకు వున్న ఓ వారధిలా 
ఆకాశానికి నేలకు మధ్యన వర్షపు ధారలు… 
ధారులుగా వెండి జలధారగా 
కన్నులకు కనపడే ఓ అద్బుత దృశ్యమాలిక అది..!!


వర్షపు చినుకులు ఒక సమతా సూత్రం లా 
ఆకాశాన్ని, నేలను కలిపి కుట్టే 
నీటి దారాల కండెలా కళ్ళకు కనపడుతూ 
వర్షపు చినుకులు ఆకాశ గుండెను చింపుకుని 
నేల మీద నీటి దీపాలుగా జలజలమని 
రాలుతున్న ఆ కమనీయ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా 
పసి హృదయంగా మారిపోవాల్సిందే..!!


పాయ పాయలుగా పారుతున్న నీటిపై 
ఒక్కసారిగా పడిన వర్షపుచినుకులతో ఏర్పడే 
నీటి బుడగలను ఊహించడం, 
వాటిని అక్షరీకరించడం 
కోవిదునికి కూడా అసాధ్యమే..!!


బీద, ధనిక, గుడిసెలపైన, 
భవంతులపైనా, 
సముద్రము మీద, 
బీడు భూమి మీద, 
చండాలుడి మీద, 
మహా జ్ఞాని మీద కూడా వర్షం ఒకేలా కురుస్తుంది...!!
ఇలాంటి సమాంతర వ్యవస్థ మనుషుల్లో 
ఎప్పుడు వస్తుందో అనే ఆలోచన 
ఈ వర్షాన్ని దర్శించిన ప్రతీ సారి 
నాలోలోన ఉదయిస్తూనే ఉంటుంది..!!


వర్షాన్ని ఈ వేడి తాపపు వేసవిలో 
ఆస్వాదించడం ఒక వరమనే చెప్పుకోవాలి.. 
మట్టి పరిమళాన్ని శ్వాసిస్తూ,
ఒకే గొడుగు క్రింద బసచేసి, 
గుండె బాసలు విప్పుకుంటున్న 
నేటి యువ జంటలకు రాయబారి ఈ వర్షం … !!


“చిటపట చినుకులు పడుతూవుంటే” 
అనే పాట దశబ్దలుగా రంజింపచేస్తూనే ఉన్నా
ప్రేమ జంటలు, 
నవీన దంపతులు ఒకే గొడుగును పంచుకోవడంలో 
కలిగే తడితనమూ, చలితనమూ మధ్య 
స్పర్శతో పుట్టే వెచ్చదనముకు రాయబారిగా 
ఈ వర్షం మారుతుండటం మాత్రం నేటికీ కొత్తేం కాదు.. 
అయినప్పటికీ, 
ఆ తన్మయత్వం, 
ఆ మధురం ఎప్పుడూ క్రొత్తే..
మనలో ఎవరో ఒకరు...ఎప్పుడో ఒకప్పుడు 
తప్పక అనుభవించిన ఓ చిరు జ్ఞాపకమే కదా..!!
ఏమంటారు ?? 

Written by : Bobby Nani

Monday, June 4, 2018

ఓ వాలుజడ ..!!



ఓ వాలుజడ 
ఎంత ధన్యురాలివే నీవు 
ఎన్ని భోగ భాగ్యాలే నీకు 
పడతుల సౌందర్య అభిలాషవు, 
ప్రణయానికి ప్రతిబంధకానివి,
పరిణేతల ప్రాణ సంకటవు,
అందుకే కదా 
ఇన్ని ఒయ్యారాలు పోతావు 
మల్లెల మెడను అంటి పెట్టుకొని
నదిలా వెన్నునంటి, 
బాహులతికలను ఆక్రమించి 
హృదయ గోపురములను ఆర్తిగా స్పృశించు..చూ, 
ఇరుకైన కలుశముల మధ్యన సౌఖ్యముగ నలుగుతూ, 
మొగ్గవంటి నాభి పై మోదుగ పువ్వారులై వికసించి 
అరటాకు నడుమును అర్ధ చంద్రాకార కౌగిళ్ళన బంధించి 
మధుర సైకత కటీరముల మధ్యన నిక్క నీల్గి 
నర్తించు కోమలాంగి పాదమ్ము లయబద్దపు 
సరిగమల గమకములకు కదలాడు 
నవీన భంగిమన్ కల్గు నీ 
జన్మ ఎంత ధన్యమైనదే..!!


ఓ వాలుజడ నిజంగానే 
ఎంత ధన్యురాలివే నీవు 
ఎన్ని భోగ భాగ్యాలే నీకు..!!

Written by : Bobby Nani