Tuesday, March 31, 2026

మదన పంచమి చినుకులు... (అలౌకిక కేశధూమ ప్రణయ కావ్యం)


 ఇందులో ఏ ఒక్క పదములో అశ్లీలత, అసభ్యత ఉండదు. అందుచేత ప్రతీ ఒక్కరు చదవచ్చు..భావ ప్రాధాన్యత ఇందులో ముఖ్యంగా మీకు బాగా కనపడుతుంది.. ఇందులో ఎక్కువగా శబ్దాలంకారాలు, ఘ్రాణానుభూతి, దృశ్య చిత్రణ, తాత్వికత, భావుకత & నాద శిల్పం తో పాటు స్వల్ప వర్ణన, ప్రణయం, రసధ్వని, అలకార శోభ, ఇలా అన్నిటినీ పేర్చి వచనాన్ని, భావాన్ని, సంస్కృత మాధుర్యాన్ని చిల్కరింపుగా గ్రాంధిక సరళిలో కలగలిపి ఈ 'మదన పంచమి చినుకులు'. రాసాను.


అగరు ధూపపు ధూమ రేఖల మాటున.. తడి కురుల నుండి రాలే ఒక్కో జలబిందువు, ఒక అమర కావ్యంలోని అక్షరమైతే.. ఆ సుందర దృశ్యమే ఈ 'మదన పంచమి చినుకులు'. ఇది ఆత్మీయ అనురాగ పరిమళాలతో రాసిన ఓ 'అలౌకిక' మంత్రము!" చదివి మీరే చెప్పాలి మరి..

మదన పంచమి చినుకులు
(అలౌకిక కేశధూమ ప్రణయ కావ్యం)
***************************

అగరు ధూపము వేయు ఓ సుప్రభాత వేళ
తడి కురులకు సాంబ్రాణి పట్టించు సమయాన!

నల్లని కేశారణ్యంలో చిక్కుకున్న ఆ తెల్లని పొగమంచు
కైలాస శిఖరాగ్రాన విహరించే మేఘమాలికలవోలె!
అరవిరిసిన కనురెప్పల మాటున
ధూపపు సెగకు ఎర్రబడిన నీ నయన పద్మాలు,
పుడమిపై ఉదయించిన రెండు సూర్య బింబాలై మెరవగ!
నీలాల కురుల నుండి రాలు ఒక్కో జలబిందువు
నీ దేహపు కాంతికి మదన పంచమి చినుకులై మెరిసెడి వేళ..
అగరు ధూపము లిడు ఆ పరిమళం, నీ తనువంతా
ఓ అదృశ్య కవచమై పరిచెడి వేళ..

మొగ్గ పువ్వై విచ్చుకును
ఆ రేకుల మధ్య దాగిన మకరందపు తడివోలె,
తేనె తుట్టె నుండి జాలువారే పుట్టతేనే తీపి వోలె!
మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వెలుగు..
నీ దేహపు జవ్వాజి గంధంతో
మేళవించిన మధుర శోభన వోలె!

నీ కంఠము నుండి జాలువారే ఆ పంచమ రాగము,
ధూపపు ధూమముతో కలిసి గాలిలో రాసే
ఓ అద్భుత ప్రణయ కావ్యమే కదా!

ఆ అగరు వాసన..
ఆ చెక్కిళ్లపై ఉన్న కస్తూరి గంధం,
రెండూ మేళవించి మదిలో రేపే
ఓ అనిర్వచనీయ పరవశాన్ని ఏ కవి వర్ణించగలడు?

నువ్వు కురులు విదిలిస్తే చాలే..
రాలిన ఆ ధూపపు పరిమళం,
అనంత విశ్వమంతా వ్యాపిస్తుంది!
నీవు కదిలితే చాలే..
ఆ కేశ ధూపపు సుగంధం వెనుక,
నా మనసొక అదృశ్య నీడలా సాగుతుంది!

పుష్పగర్భమున నిదురించే పుప్పొడి చందనమా..
ఏమని వర్ణించనే నిను!
చంద్రచూడామణి వెన్నెలల చీరకొంగుల రీతిగ..
మన్మథ మాధవీలతల పరిమళ నిట్టూర్పుల రీతిగ..
పున్నాగ పూర్ణిమా శ్వాసల సుగంధాల రీతిగ..
అనురాగ అమృతాంశు తారక మెరుపుల రీతిగ..
మధురిమా మంజీరనాదాల చూపు వంపుల రీతిగ..
కోమల కదంబరసాల పలుకు చినుకుల రీతిగ..
సుగంధ సంధ్యారాగపు జడపాయల రీతిగ..
విరహ వేణువుల వెన్నెల గీతాల రీతిగ..
రసకేలి రేణువుల రాగవెలుగుల రీతిగ..
సౌందర్య సుధామేఘాల తేనెతుంపర్ల రీతిగ..
చిరునవ్వు చంద్రికల చందన వీచికల రీతిగ..
మౌన మధుకలశపు ఆర్తి పరిమళాల రీతిగ..
హృదయ హంసగమనపు తామర వెలుగుల రీతిగ..

క్షీరములో దాగిన నవనీత సోయగమా..
మరేమని సముద్భూషించనె నిను!
మదన మల్లికామోదపు చూపు రేఖలు గలుగగా..
రమణీయ రాగమాలికల వొంపు తళుకులు అమరగా..
నవనీత నిశీధి కాంతుల నేత్ర ద్వారాలు తెరువగా..
పంచమ స్వరముల పొదిగిన పెదవి తీరాలు సొగసుగా..
అలకాంజలి జారిన ఆత్మీయ జ్యోత్స్నలు నిలువగా..
శృంగార శశిలేఖల సన్నని వర్ణరాగాలు విరియగా..
సుమసౌరభ నిదురించిన కేశపాశ గర్భాలు తెరువగా..
వీణావిరహిణి వణుకు తాకిన హృదయ కంపనలు వెలుగగా..
మందార మృదులిమల తనువుగర్భ రాగాలు పలుకగా..
అలౌకిక అనురాగాంబరపు నవ్య నీడలు మెరువగా..

రమణీయ రాగవెలుగు స్త్రీ తత్వ సౌమ్యరాగమై,
మధువులో మునిగిపోయిన మధుర పరిమళమై,
లయల కెరటాలపై జముకు జముకు లేస్తూ,
ఝుంఝూమారుత ఝర్ఘరీయధ్వనులై నర్తించు
నీ పాదపద్మాల సౌందర్య వీక్షణం ఓ క్షణమైనా చాలదటే!
నా విభ్రమ నేత్రాలు జ్ఞాపకరత్నాలై మెరిసేందుకు!

ఏమని ముగించను?
నీ పై పలికిన ప్రతి ఉపమానమూ
నీ లోని నిండైన స్త్రీ తత్వపు నీడ మాత్రమే.
నీ పై రాసిన ప్రతి పదమూ
నీ అనురాగ ఆరాధనలో కరిగిన ఓ అక్షరమే!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment