Thursday, December 21, 2023

కలువ కన్నుల రూపసి..!!


తన తడి పెదవుల విచ్చుకతకు 

సొట్టలు పడే ఆ నును బుగ్గల సిగ్గును

ఏ కవి వర్ణించ గలడు ?


సైగలతోనే  కనికట్టు చేయగల వాగ్దేవి రూపంతో 

మనసుని  మెలితిప్పి సమ్మోహించే 

ఆ  కలువ కళ్ళను ఏ శిల్పి మలచగలడు ?


కనుసొగలతోనే  అల్లరిచేసే 

తన కొంటెతనంలో 

చిలిపిగా నవ్వే ఆ ఎర్రని పెదవంచులలో 

తడిసి ముద్దవ్వాల్సిందే కానీ 

తనని వర్ణించడం, తన రూపాన్ని చిత్రించడం 

ఏ  నరునికి  సాధ్యం ??


తన రాకను తనకన్నా ముందే 

తన దేహ పరిమళం మత్తిల్లి హత్తుకుంటుంది 

తను చెప్పే చిరు గుసగుసల సవ్వడికి 

ఆ పెదవులు కదిలే కలివిడికి 

ఏ మనసైనా  అలజడికి ఆహుతి ఆవ్వాల్సిందే..!!


అదేంటో తను మాట్లాడుతుంటే 

అలానే చూడాలనిపిస్తుంది 

అనురాగ సవ్వడులు వినిపించే…

ఆ హృదయ కోవెలనుంచి 

వెచ్చని తన ఊపిరి నా మెడ వెనుక తాకుతుంటే

మనసంతా, తనువంతా ఓ గిలిగింత..!!


వినీలాకాశంలో విలక్షణమైన సౌందర్యం  తనది.. 

అసంఖ్యాక నక్షత్ర మండలంలో రెప్పలార్పలేని రూపం తనది.. 

సూర్య చంద్రుల్లా ప్రతీక్షణం వెలిగే ఆ నయనాలు, 

సంపెంగ వంటి ఆ సన్నని నాశికాగ్రహం, 

నల్లని ఆకాశంలోని ఓ తారను తెంచి పెట్టుకున్నట్లుగా నుదుటిన లలాటీకము, 

గులాబీ రెక్కల్లా  మృదుమధురమైన ఆ యెర్రెర్రని అధరములు,

నవనీతపు ముద్దల్లా సుతిమెత్తని చెక్కిలి 

పసిడి ఛాయవంటి యవ్వన కాంతిమయ దేహం.

శంఖం లాంటి మెడ 

వెండి తీగలా వున్న సన్నని నడుము.

ఆ స్వరంలో ఉషస్సు, 

ఆ చూపుల్లో యశస్సు, 

కళ్ళతోనే సంభాషించే సమ్మోహనం ..!!

సువాసనతోనే హత్తుకునే సమ్మేళనం..!!


ఓ కలువ కన్నుల చిన్మయి,

నీ గురించే ఆలోచించేలా చేస్తున్నావ్... 

ముఖ్యంగా ఆ చెక్కిలి పై వుండే  రెండు పుట్టుమచ్చలు 

కళ్ళజోడు పెట్టుకున్నానే కానీ 

ఏ స్వాప్నిక ప్రపంచమూ కనిపించడం లేదు..

నిను మొదటిసారి చూసినప్పుడు

ఆ కళ్ళలో ఓ తెలియని అద్భుతాన్ని చూశాను

మంత్రించి విడిచిన మహావాక్యంలా 

నిను అలా చూస్తూ నిస్తేజంగా ఉండిపొయాను 

ఎవరినైనా సమ్మోహనం చెయ్యగల అభినవ రూపసివి..!! 


           ~ ~ త్రిశూల్ ~ ~ 


Mobile: 9032977985

Blog: http://bobbynani.blogspot.com/

Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr


Wednesday, December 20, 2023

కవి రాయని కవిత...!!


కవి రాయని కవిత..
****************

నా దేశంలో..
మహా రావణకాష్ఠం నడుస్తోంది 
సందు గొందుకు ఓ రావణాసురుడు 
వాడి రణ వేదిక  స్త్రీ మర్మస్థలం..!
అదే వాడి కామ క్రీడా విలాసం..!!

బ్రహ్మ కానీ, బ్రహ్మంగారు కానీ,
వ్యాసుడు కానీ, వాల్మీకి కానీ, 
ఈ రాతను రాసిన దాఖలా లేదు
దీన్ని పైశాచికమందామా 
లేక బలాత్కార సంభోగమందామా..!!

పెన్నూ, జామెంట్రీ బాక్సూ తీసుకొని 
హడావిడిగా ఇంట్లోంచి
అడుగు బయట పెట్టె ఆ చిన్నారిని 
ఎన్ని కామపు కళ్ళు తడుముతాయో 
ఎన్ని అంగాలు లేచి నిక్కబొడుచుకుంటాయో..!!

కడుపులోని ఆడ బిడ్డకే కాదు
పక్కన పడుకున్న పసి పాపను కూడా 
కళ్ళలో వొత్తులేసుకొని కాపాడుకోవాల్సిందే 
ఏ రాత్రివేళ ఏ మృగం అదును చూసి
మీద పడుతుందేమోననే భయం..!

తన కళ్ళు, తన కన్నీళ్ళు ఆకర్లేదు 
రెండు కాళ్ళ మధ్యన మాత్రమే వాడి పనంతా..! 
రెండే రెండు నిమిషాలు కోసం 
పెద్దా, చిన్నా, 
పసి, ముసలి 
వావి, వరుసలు అక్కర్లేదు వాడికి..!!

తను డాక్టర్ అయితే 
ఎంతమందికి చేయూతనిచ్చేదో 
తను ఇంజనీరు అయితే 
పారే నదులపై ఎన్ని వంతెనలు నిర్మించేదో 
తను వకీలు అయితే 
చట్టం చుట్టూ అల్లుకున్న ఎన్ని కల్లగంతల్ని తీసేదో..!!

కానీ రేయ్ 
నువ్వు చేసిన అకృత్యం వల్ల 
తను సర్వం కోల్పోయి 
జీవచ్చవమైంది..!

ఓ నిజం చెప్పనా..
మానవ చరిత్ర పుస్తకం పై 
తనదృష్టిలో నువ్వో చెరగని 
రక్తపు సిరా మరకవి..!!

       ~ ~ త్రిశూల్ ~ ~ 

Mobile: 9032977985
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr

Sunday, December 17, 2023

అలౌకిక భావాలు...

 


నా లోని భావాలు ఇవాళ చాలానే చెప్పాలోయ్ నీకు 

నిను చూసిన  ఆ క్షణం నుంచి మనసులో ఎన్ని భావాలను దాచుకున్నానో .. నీకు తెలియదు ..

వాటిని  అలా  దాచి దాచి మనసంతా బోలెడు బరువైపోయింది..

చదివిన తరువాత 

ఆ ఎర్ర మూతి, మరి కాస్త ఎర్రబడి కోపమొస్తే నన్ను క్షమించు..!! 

సరే చెప్తున్నాఇక  నా కోసం వింటావు కదూ..!!


అలౌకిక  భావాలు

***************

అగరు దూపము నిండిన ఓ … సు ప్రభాత వేళ

అద్వైత్వపు మయూరము పురివిప్పియాడు రీతిగ

మంచుబిందువుల ముసుగులో మల్లెపూవువోలె..

మదన పంచమి చినుకుల్లో చిగురుటాకు వోలె..

పున్నమి చంద్రిక తరంగాలుప్పొంగు ఆత్మీయ ధనూషము వోలె.. 

రమా రామణీయత్వపు జీరాడు కుచ్చిళ్ళు పారాడు వేళ

తనువొక మందారమై మనసొక విహంగమై  నీవు నర్తించు సమయాన

నే  చూస్తున్నా నీ  రెండు విశాల నేత్రాల మధ్యన నిజమైన సూర్యోదయాన్ని !!


నువ్వెప్పుడూ నాకు ప్రత్యేకమే

ఎందుకో తెలుసా ? 

నీలో నీకే 

తెలియని ఎన్నో అలౌకిక  భావాలను నేను చూస్తుంటాను

ఆడించే అల్లరితనం 

లాలించే అమ్మతనం

కవ్వించే కొంటెతనం  

మురిపించే జాణతనం

ప్రేమించే సహజతనం

జన్మతః నీలో ఏర్పడిన పంచ ధాతువులివి..!!


ఓ " వీణ " సైతం 

పలికించలేని కోటానుకోట్ల భావాలను 

భావోద్వేగాలను  రస రమ్యమైన  నీ లోని స్త్రీ తత్త్వం  

అత్యంత మధురంగా సునాయాసంగా సృశించగలదు

బ్రహ్మకాలమున పుష్పించే ఓ పుష్పం 

ఎన్ని పరిణామాలను మార్పులను

అదిగమిస్తుందో నీ హృదయం కూడా 

అంతకు మించిన భావ ప్రకంపనలను 

రస స్పందనలను కలిగి ఉంటుంది.


చల్లని సాయం సంధ్యా వేళలలో

మట్టి వాసనలలో

గుబురు కొమ్మలలో

చిరు జల్లులలో

ప్రకృతి ఒడిలో

ముఖ్యంగా దీపపు ప్రమిద కాంతులలో

నీ దేహపు సున్నుపిండి వాసనలలో

మేలిమి మీగడ చందనాలలో

మధుర పట్టు పరిమళాలలో

ఇలా నీకే తెలియని ఎనేన్నో అసంఖ్యాక భావాలతో, 

అలౌకిక రాగాలతో, అణువణువు అంగాంగమూ 

ఓ సుందరమైన రాగాన్ని బట్టి, 

ప్రేమించే హృదయాన్ని బట్టి 

పైపైకి ఉప్పొంగుతూ  

తనువూ మనసూ పురివిప్పిన 

శ్వేత మధుకమువోలె నా కంటికి కనిపిస్తుంటావు..!!

నా కనురెప్పలకు 

ఆశల నక్షత్రాలను కొవ్వొత్తులుగా 

అమర్చుకుని మరీ చూస్తున్నాను

నూతనాకాశాల నీడన 

పుష్పించు దివ్య కుసుమములా 

తళుక్కున అలరించావు

వినీలాకాశపు వీధుల్లో 

విహరించు గంధర్వ కన్య లా ఉదయించావు !!


నీ 

పెదవంచుల్లో మొదలైన చిలిపి గాలి 

నా చెవుల్ని సవరిస్తూ వయ్యారాలు పోతుంటుంది 

నీ 

మెడవంపుల్లో  ఉదయించిన ఓ పరిమళం 

నా నాసికను రాసుకుంటూ   సమ్మోహనం చేస్తుంటుంది 

నీ 

దేహానికి తాకిన తియ్యని తేనె సొన

నా ముఖానికి మధురంగా పులుముతుంటుంది..!!

నాలో ఇంత భావుకత ఉబికిందంటే 

ఖచ్చితంగా 

అది నీ  మానసపు నవనీత కాంతులే..!!


నా మనసులో నీ స్థానం ఏంటో నీకు తెలుసా?

క్షీరములో నవనీతపు సోయగం

పువ్వారులో పుప్పొడి చందనం

మధువు లో మధురిమల పరిమళం 

ఝుంఝూమారుత ఝర్ఘరీయధ్వనులు  

జముకు జముకు అలలై, ఎగసే 

లయల కెరటాల రీతి నర్తించు నీ  పాద పద్మాలను 

ఒకే ఒక్క క్షణం నా విభ్రమ నేత్రాలతో కన్నులారా కాంచిన చాలు కదా..!! 

ఈ కాస్త జీవితానికి..!! సరిపడేంత జ్ఞాపకాలు పోగేసుకోవడానికి..!!

ఏమంటావ్?                 

            ~ ~ త్రిశూల్ ~ ~ 


Mobile: 9032977985

Blog: http://bobbynani.blogspot.com/

Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr