మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Monday, March 16, 2026
నాలో నేనే.. నాతో నేనే..
అదో పడమర సంధ్య...
ఆకాశపు నుదుటిపై దిద్దిన ఎర్రని సిందూరంలా
నేలంతా తన వెలుగుల అక్షతలను చల్లుతోంది.
ఆ కిరణాలు మెల్లగా వచ్చి
నా ఇంటి ఎత్తైన బాల్కనీ కిటికీలోంచి
నే రాస్తున్న ఈ కావ్యాన్ని తొంగిచుస్తున్నాయి!
అప్పుడే మొదలైంది
హెచ్చరిక లేని మలయమారుతపు పిల్లగాలి
చిటపటమంటూ మట్టిని ఎగరకొడుతూ
ఆకాశపు నవనీత చినుకులు నేల రాలుతుంటే
ఆ తొలి తాకిడికి పరవశించిన మట్టి..
తన గర్భంలో దాచుకున్న జ్ఞాపకాల పరిమళాన్ని
భూమి అంతా అత్తరులా జల్లుతోంది!
అంతలో మెల్లిగా చీకటి కమ్ముకుంది
జాజితోట నుంచి వీస్తున్న ఆ మత్తు గాలి
నిద్రలోకి జారే చెట్ల ఆకులను నిమురుతూ,
అదృశ్య సీతాకోకలా తన రెక్కలతో
నన్ను మెల్లగా స్పృశిస్తుంది!
శూన్యంలోకి చూస్తున్న నా విభ్రమ నేత్రాలకు..
సాయంత్రం కరిగిపోయే ఆ రాత్రి
ఒక అపురూపమైన మౌన గీతంలా కనిపించింది!
హృదయపు పొత్తిళ్లలో దాచుకున్న
నాలోని పసితనం మరోసారి నిద్రలేచి,
రాస్తున్న కావ్యాన్ని పక్కన పెట్టి,
ఆ వర్షం నిలిచిన సాయంత్రపు చినుకులను
అందుకోవాలని పసిపాపలా దోగాడుతోంది!
అంతలోనే చుట్టూ పరుచుకున్న వెన్నెల
పాలచీర విప్పిన తల్లిలా భూమిని ముద్దాడుతూ కనిపించింది
మౌనం అనే ముత్యపు చిప్పలో,
భావోద్వేగాల చినుకులు పడి,
అవి కన్నీటి ముత్యాలుగా మారే ఒక నిగూఢ ప్రక్రియ అది..!
ప్రకృతి చేసే కనికట్టు అది..!
నిజంగానే..
ఈ ఏకాంతపు అనుభవాలకు మాటలుండవబ్బా!
చదివేసిన పుస్తకాన్ని మరోసారి చదువుతున్నట్లుగా,
నాలో నేనే.. నాతో నేనే..
ఈ ప్రకృతి పరుస్తున్న అక్షర తివాచీపై
మరోసారి పరవశించి పోతున్నాను..!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment