ప్రతి సగటు మగాడి జీవితంలో ఉండే ఒక నిశబ్ద పోరాటం. బయటి ప్రపంచంలో ఒక యోధుడిలా పోరాడి, ఇంటి ముంగిటకు రాగానే తన ఆయుధాలను దించి, కేవలం ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా చిరునవ్వును ఓ వస్త్రంలా ధరించే ఆ వ్యక్తిత్వం నిజంగానే ఒక బాధ్యతల కండువానే, అతడి కన్నీరు కనిపించని మహాకడలే! అందుకే వారిపై చిన్న అక్షర జల్లు.
బాధ్యతల కండువా
***************
అద్దం ముందు నిలబడ్డప్పుడల్లా
అపరిచిత ముఖమేదో నను వెక్కిరిస్తూనే వుంటుంది
అయినా ఏం సాధించానని అసలు?
మూడుపదులు దాటినా..
ప్రతీ ఉదయం బాధ్యత కండువా..
భుజానేసుకొని గడపదాటితే,
మాపటీలకైనా వస్తామా?
తిరిగి అసలొస్తామా?
అనేది ప్రస్నార్ధకమే ఒక్కోసారి!
జీవం పీల్చుకున్న
ఎముకుల మ్రాను కింద
నా ఒంటరితనం
ఎప్పుడూ తచ్చాడుతూ వుంటుంది!
నా గుండె చూరు నుండి
వేళ్ళాడి ఊగే జ్ఞాపకాల కడ్డీలతో
గతించిన యుగాల్ని కొలుస్తున్నాను!
వెయ్యి తుఫాన్లు ముందు కూడా
తలవంచని నా ధైర్యం
ఒక్కోసారి త్రోవ తెలియనితనంతో
నిలువెల్లా నీరు కారిపోతుంటుంది!
క్రూరమైన దినచర్యలో భాగంగా
ఒళ్ళంతా కమిలిన
నా దేహాన్ని నొక్కుకుంటూ
వేగంగా విస్తరిస్తున్న
ఈ నగరాన్ని చూస్తూ
ఉండిపోయానిలా స్తబ్దుగా!
అందుకే మగాడి కన్నీరు కనిపించని మహాకడలి!!
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:
Post a Comment