Saturday, March 21, 2026

కవిత్వాగ్ని...


 

గుండె లోతుల్లోని నిశ్శబ్దాన్ని అక్షర గర్జనగా మార్చే అద్భుతం.. కవిత్వం..
కన్నీటి చుక్కను కావ్యంగా, సామాజిక గాయాన్ని ఆయుధంగా మలిచే అక్షర యజ్ఞం..
కలం ఆగిపోవచ్చు, కవి వెళ్ళిపోవచ్చు.. కానీ గాలిలో కలిసిన 'భావం' అమరం..
అక్షరమే ఆయుధంగా లోకాన్ని శాసించే కవులందరికీ.. కవితా దినోత్సవ శుభసంతోషాలు..

కవిత్వాగ్ని
********

ఒకానొక సందర్భంలో
మనిషి తన గుండె బరువును తానే మోయలేక
నిశ్శబ్దం అంచున కూలిపోయిన వేళ
అప్పుడు పుట్టిందే ఈ కవిత్వం!

కవిత్వం..
పుష్ప గుచ్ఛాల్లో దాచుకునే మృదుత్వమే కాదు..
ప్రళయ మేఘాల్ని చీల్చేవిద్యుత్‌ రేఖకూడా అవుతుంది!
పసిబిడ్డ నవ్వులో జారే మాధుర్యమే కాదు..
యుగాల అన్యాయాన్ని ఛేదించే, శాసనం కూడా అవుతుంది!

మనిషి ఎక్కడ తనని తాను కోల్పోయాడో..
అక్కడ కవిత్వం చిగురించింది!
మనిషి ఎక్కడ ప్రేమించడం మొదలుపెట్టాడో..
అక్కడ అది పరిమళించింది!
మనిషి ఎక్కడ తన గాయాలతో నలిగిపోయాడో
అక్కడ అది రక్తాక్షరమై నిలిచింది!
మనిషి ఎక్కడ తిరుగుబాటు చేశాడో..
అక్కడ అది అగ్ని రేఖలా జ్వలించింది!

కవిత్వం..
ఖడ్గం కాదు, కానీ సామ్రాజ్యాలనే కదిలించింది!
రాజదండం కాదు, కానీ యుగాల మనసులను శాసించింది!
రక్తపాతం కాదు, కానీ విప్లవాలను ప్రసవించింది!
నిశ్శబ్దమే అయినా,
లోకమంతా తలెత్తి వినేలా చేసిన
అఖండ స్వరతరంగమది!

అందుకే కవిత్వమొక అగ్నిధార..
దాస్య శృంఖలాలను తెంచే నిప్పు రవ్వ..
సమాజపు కళ్ళకు పట్టిన
పొరలను తొలగించే అరుదైన శస్త్రమది!
కన్నీటి చుక్కను కూడా
విప్లవ జ్వాలగా మార్చే అద్భుత రసాయనం!

మా గొంతుకలు నొక్కేయొచ్చు..
మా కలాన్ని విరిచేయొచ్చు..
కానీ..
మేము వదిలిన భావం అమరం!
అది గాలిలో కలిసిపోయి,
ప్రతి శ్వాసలో నిండి,
రేపటి తిరుగుబాటుకు
కొంగ్రొత్త ఊపిర్లు పోస్తూనే ఉంటుంది!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment