"బ్రహ్మోత్సవం" ఈ చిత్రం గురించి చెప్పాలంటే శ్రీకాంత్ అడ్డాల గారు గొప్ప సాహసమే చేసారు అని చెప్పొచ్చు... ఎందుకంటె ఒక ఫ్రేమ్ లో హేమా హేమీ లాంటి నటీనటులను అందరినీ ఒకోచోట కలిపి వాళ్ళకు క్యారక్టరైజేషన్ ఇవ్వడం అనేది ఒక సాహసమే.. ప్రతీ క్యారెక్టరూ అద్బుతమే కాని వారి అందరినీ వాడుకొని ప్రజల మనసులో చోటు సంపాదించడంలో శ్రీకాంత్ అడ్డాల గారు విఫలం అయ్యారని చెప్పొచ్చు.. సహజంగానే వారు అందరూ గొప్ప నటులు కాని వారి నటన ఈ చిత్రంలో ఏమీ కనపడలేదు... "ఓ మంచి మాట చెప్పు" అనే అంశాన్ని తీసుకొని కుటుంబ విలువలను వారి వారి భావనలను, ఆప్యాయతలను, ఒకరి మధ్య ఒకరికి ఉన్న చనువును, భాద్యతను, భందాలను, ప్రేమను, ఆత్మీయతను చక్కగా చూపించారు... ఆనందం అంటే అందరం కలిసి మెలసి ఉండాలాన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.. కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కాదని, మూడు తరాల మనుషులు ఒకేతాటిపై కలిసి మెలసి జీవించడమే నిజమైన కుటుంబం అని ఒక సందేశాన్ని అందించారు.. కథ, కధనం బాగుంది... కాని తీసే విధానం, ప్రజలకు చూపించే విధానం, వారి మనసుకు హత్తుకునే విధానాలను అందించడంలో పూర్తిగా విఫలం అయ్యారు...
ముగ్గురు కథానాయికలు ఉన్నప్పటికీ ఒక్కరిని కూడా సరిగా వారినుంచి వారి నటనాప్రతిభను ప్రజలకు చూపించలేక పోయారు.. సత్యరాజ్ గారి గురించి చెప్పడానికి ఏమి లేదు.. కట్టప్ప పాత్ర ద్వారా ఆయనేంటో చూపించేశారు ... హావాభావాలు వారి నటనావిన్యాసం ఈ చిత్రానికి ప్రత్యేక అలంకారణ... ఇకపోతే రావు రమేష్ గారు ఆయన నటన పరకాయ ప్రవేశం లాంటిది. ఎందులో అయినా తనదైన శైలిలో అల్లుకుపోతారు... ప్రతికూల (negative) నటనతో ఆకట్టుకున్నప్పటికీ ఏదో వెలితి .. ఇంకొంచం చేసివుంటే బాగుండు అనిపించింది... ప్రణీత మరదలి క్యారెక్టర్ తో ఎప్పుడూ పక్కనే ఉంటున్నా కూడా కధానాయకుని మధ్య, మరదలి మధ్య, కొన్ని సన్నివేశాలు సరిగా లేకపోవడం, కాజల్ తో కెమిస్ట్రీ ని తీయగలిగి ఉన్నప్పటికీ వెంటనే ఆమెను దూరం చెయ్యడం, సమంతాని ఎందుకు వున్నట్లు వుండి వూడిపడినట్లు తీసుకోచ్చారో అర్ధం కాకపోవడం ఈ చిత్రానికి తీరని నష్టాలు... ముగ్గురి కథానాయికల పోటా పోటిలో సమంతా నటన కొంచం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించింది.. తన అల్లరి వేషాలు, ఆ ప్రవర్తన చాలా అందంగా చూపించడంలో సఫలం అయ్యారు... సమంత పాత్రలో స్పష్టతను చూపించలేకపోయారు...
ఇకపోతే సంగీతం విషయానికి వస్తే మిక్కీజే మేయర్ ఈ పేరు వింటేనే బాధగా ఉన్న మనసు అప్పుడే గొంగళిపురుగు నుంచి సీతాకోకచిలుక గా మారిన అనుభూతికి లోనౌతాము.. అంతటి మైమరిపించే సంగీతాన్ని అందివ్వగల మెలోడీ దిగ్గజం ఆయన.. ఈ చిత్రంలో ఆయన సంగీతం ఒక అద్బుతమే.. మధ్య మధ్యలో సన్నివేశానికి తగ్గట్లు అందించినటువంటి సంగీతం మధురాతి మధురం..
ఇక మన కథానాయకుడు మహేష్ .. అతను నిస్సందేహంగా ఓ గొప్ప నటుడు... అందం, నటన, హవాభావాలు అద్బుతం .. ఏమి మాట్లాడకుండానే ఎన్నో మాటలకు అర్ధాలు చూపించేంత మహా నటుడు.. కాని ఈ మధ్య తరచుగా తనని తాను ఎక్కువ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావట్లేదు.. ప్రతీ అమ్మాయి తననే కోరుకుంటుంది అనే అంశాన్ని ప్రతీ చిత్రంలో చూపించడం వల్ల చూసే ప్రజలు చాలా నిరాశకు గురి అవుతున్నారని చెప్పడంలో సంశయమే లేదు... ఒక నటునిగా తన నటనలో నాకు నచ్చిన అంశం .. తండ్రిని దేవునిలా చూడటం.. తండ్రికి చెప్పులు తొడగడం, తండ్రి నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి వుండటం, వాటిని నమ్మడం, భాద్యతలని నిర్వర్తించడం తదితర అంశాలను అద్బుతంగా చిత్రీకరించారు.. తండ్రి, కొడుకుల మధ్య చిన్న చిన్న సన్నివేశాలు మనసుకు హత్తుకున్నాయి.. మొదటి భాగం చిత్రం చాలా బాగుంది.. మొదటి భాగం చివరన సత్యరాజ్ మరణం హృదయాన్ని కలిచివేసింది ... రెండో భాగం మొత్తం ప్రదేశాలు తిరగడం తోనే సరిపోయింది.. కథ సాగలేదు.. మధ్యలో హరిద్వార్, కాశి, పుణ్యక్షేత్రాల పునఃదర్శన భాగ్యాన్ని, స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్నిచూపించి కళ్ళకు ఆనందాన్ని కలిగించారు.. కేవలం ఈ చిత్రంలో చాలా స్వల్ప సన్నివేశాలు మాత్రమే హృదయానికి చేరువ అయ్యాయి.. మిగిలినదంతా ఏదో సాగుతూ పోయింది..
చివరగా : చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వారికి మాత్రమే ఈ చిత్రం నచ్చుతుంది.. నాకు అంత సున్నితత్వం లేదు అని అనుకుంటూ వున్నాను.. ఏది ఏమైనా ఇందులో మనం కేవలం కుటుంబ విలువలు, వారితో మెలిగే విధానాలు, అల్లరి చేసే మనస్తత్వాలు, భాదను పంచే అనురాగాలు ఇలాంటివి మాత్రమే ఈ చిత్రం ద్వారా తీసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.. మిగతాది మనకు అవసరం లేదు... చిత్రం ఎలా వున్నా వాటిలో మనకు కావాల్సిన మంచిని మాత్రమే మనం తీసుకోవడమే ముఖ్యం..
ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు ...
స్వస్తి ___/\___
Bobby Nani
No comments:
Post a Comment