Wednesday, July 13, 2016

ఆస్వాదనామృత ప్రకృతి ఒడి ...

నిజంగా ఊహాలోకం యెంత రమణీయమైనదో కదా.. కావాల్సిన అందాలను లిప్తపాటు కాలంలో .. స్ప్రుసించవచ్చును..

ఆహా ఎంతటి భాగ్యం కలిగించావయ్యా బ్రహ్మయ్యా.. ఈ మానుష లోకానికి...
“ప్రకృతి” అనగానే కనుచూపుమేర ...అంతా కళ్ళకు ఆకుపచ్చని కనువిందులే కదా..
నేటికాలంలో అలా లేనప్పటికీ ఊహా అనేది ...తారాస్థాయికి తీసుకెల్లగలదు ..
కళ్ళకే కాదు మనసుకు కూడా ఆనందాన్ని పంచగలదు..
అంతటి శక్తి ఉన్న ఓ మహత్తర అనుభూతే ఈ ఊహాగానం.. మలినమైన ఈ సృష్టిక్రమంలో ...
అలనాటి అదృశ్యమైన అందాల ప్రకృతిని ఊహాగానంగా.. చెర్చి, కూర్చి మిమ్ములను అందులో అభ్యంగనస్నానమాచరించే చిరు  ప్రయత్నమే ఇది.. మీ మెప్పు పొందగలనా అనే సంశయముతో రాస్తున్నాను.. మీ అమృతతుల్య మాటలు తప్పక చెప్తారు కదూ..

నేనో అడవి మార్గమున ప్రవేశించాను..
అందు ఎక్కడా లేనన్ని రకరకాల,
రంగురంగుల పూలమొక్కలు,
మల్లెలు, మాలతి, మధు మాలతి, రాదామనోహరి,
జాజి, మొదలైన పూ పొదలు,
నేరేడు, మారేడు, మోదుగ, వెలగ, పున్నాగ, నాగలింగ, చంపక,
శిరీష, శివగన్నేరు, కేతికీ, కదంబం, వేప, పనస, అశోక, అశ్వర్ధ, దేవదారు, దేవకాంచన, గోరింట, ఇలా
నానావిధ ఫల, పుష్ప, వృక్షాదులు నా కన్నులకు కనువిందు చేస్తూ వున్నాయి..
వీటన్నిటి వనముల మధ్యన కొంచం కుడిపక్కగా అందమైన కోనేరు..
ఆ కోనేరులో అపురూపమైన ఒక తామరపుష్పం వుంది..
అటువంటి తామరపుష్పం మరెక్కడా లేదు....
ఆ తామరపుష్పాల మధ్యన హంసలు...
వొయ్యారంగా అటు, ఇటూ ఈదుతూ వున్నాయి..
ఆ అడవిలో అదో అందమైన దృశ్యం..
ఆ సంధ్యా కాంతిలో, అటుపక్కనే వున్న నదీసంగమ గర్భంలో ఇసుక తిన్నెలపై
రెల్లుదుబ్బులు బంగారు తీగల్లాగా ధగ ధగా మెరుస్తున్నాయి..
పగలంతా కాసిన ఎండకు వేడెక్కిన ఆ నదీ నీటిని, ఆ ఏటి గట్లను మలయమారుతం శాంత పరుస్తోంది...
ఏటి నీటి కెరటాలపై, ఆఖరి సూర్య కిరణం వివిధ వర్ణాలను కల్పిస్తూ, అలసట మరచి ఆనందంగా ఆడుకుంటోంది..
ఆ రోజంతా తేనెను జుర్రుకొని తాగి తాగి మత్తెక్కిన తేనెటీగలు,
ఈల పిట్టలూ. తుమ్మెదలూ, వాడిపోబోతున్న పూలను అమాంతం బిగుతు కౌగిలింతలతో చుట్టేసి కడసారి మరో కౌగిలి ఇమ్మని వేధిస్తున్నాయి...
కదంబ వృక్షాగృహం నుంచి, ఓ ముక్కుపచ్చలారని చిలుక ప్రేమతో తన ప్రియుణ్ణి పిలుస్తోంది...
ఆరోజు సంధ్య వెలుగులలో ఆ నదీ ప్రవాహం, అక్కడవున్న ప్రకృతి మాత వడి యెంతో శోభాయమానంగా, స్వర్గతుల్యంగా కనిపిస్తుంది..
ఆకాశ మార్గమున చిలుకలు, పావురాళ్ళు, గువ్వలు,
గోరింకలు, చకోరలు, మొదలైన పక్షులు మనసారా పాడుకుంటూ స్వేచ్చగా విహరిస్తున్నాయి...
ఆ పక్షుల స్వరగానం నా మానుష జాతిని మొహింపజేసే దారావాహినిగా హృదయానందంగా వినిపిస్తోంది....

ఆ ప్రకృతిలోని పారవశ్యపు సంగీతనాదాన్ని విని నేను నిశ్చలంగా నిలబడిపోయాను అక్కడే.. అందుకు గల కారణం కనుచూపు మేర నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి..

ఆ మైకంలో వశం తప్పిన నేను కొన్ని ఘడియలు అలానే నిస్తేజంగా నిలబడిపోయాను.. మౌనంగా ఉండిపోయాను..
తేరుకున్న తరువాత ... ఇలా  మీ ముందుకు మళ్ళి పునఃదర్శనం..


స్వస్తి.   ___/\___

Bobby Nani

No comments:

Post a Comment