Tuesday, July 19, 2016

మారాల్సింది ఆడవారి వస్త్రధారణ కాదు దానికి ముందు మగవాడి ఆలోచనలు...






చాలామంది ఆడవారు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు అందుకనే మానభంగాలు జరుగుతున్నాయి అని తెగ గింజేసుకుంటూ వున్నారు ... దీనికి మీరు ఏకీ భవిస్తున్నారా ?? అయితే నేను రాస్తున్న ఈ కొన్నిటికి మీ హృదయం ఏం సమాధానం చెప్తుందో చూడండి ....

ఈ మధ్య మనం చూస్తున్నాం ఒక పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి స్కూటీ మీద అర్ధనగ్న వస్త్రములతో కూర్చొని వుంటుంది.. దాన్ని ఎవడో ఫోటో తీసి సోషల్ నెట్వర్క్స్ లో పెట్టాడు... వాడెవడో పెట్టాడు మరి మన మిత్రుల బుద్ది ఏమైంది... ?? ఆమె చేసింది తప్పే కాని మనం చేస్తున్నదేంటి ?? ఆ తప్పును మరింత తప్పుగా చిత్రికరిస్తున్నాం .. ఇదే ఇంట్లో వారు అయితే అలా ఒక ఆడతనాన్ని నడిరోడ్ లో పెట్టేస్తారా ??

సరే మీరు చేసిందే నిజమని అనుకుందాం... ఇక్కడ నేను అడిగిన ప్రశ్నలకు మీదగ్గర సమాధానం వుంటే తెలియజెయ్యండి...

ఒక వయస్సులోవున్న ఆడపిల్ల బట్టలు సరిగా వెయ్యలేదని, మిమ్మల్ని రెచ్చగొట్టేలా తన బట్టలు వున్నాయని అందుచేతనే మీరు తనమీద మానభంగం చేసారని అనుకుందాం ... మరి మూడేళ్ళ పసి హృదయం మిమ్మల్ని రెచ్చగొట్టేలా చేసిందంటారా ??

తనకు ఆ వయసుకు రెచ్చగొట్టే పరిజ్ఞానం ఉందంటారా ?? లేదు కదా అయితే ఎందుకు తనమీద కూడా మానభంగం జరిగింది ?? జరుగుతోంది ??

మూడేళ్ళ పాప కి అసలు రెచ్చగొట్టే విషయమే తెలియదు. అమ్మా నాన్న వేసిన డ్రస్ తప్ప ఫ్యాషన్ దుస్తులు వేసుకోవచ్చనీ, అందరినీ తనవైపు ఆకర్షించాలనీ తెలియని పసి వయసు. ‘పప్పీ షేమ్’ అని తోటి పిల్లలో, తాతా నాయనమ్మలో ఏడిపిస్తే తప్ప తన వంటి మీద బట్టలు లేవని గ్రహించలేదు. ఏం రెచ్చగొట్టిందని ఆ పాపని రేప్ చేయాలి? దీనికి మీరు అనుకున్న, అనుకుంటున్నా బట్టలే కారణం అంటారా ??

మరో పాపకి పదేళ్ళు. ఆ పిల్లదీ అదే పరిస్ధితి. సొంత మేనమామ, తన పిల్లలతో సమానంగా చూడవలసినవాడు మానభంగం చేశాడు. చిన్న వయసు గనక, మేనమామతో సరసం ఆడిందనడానికి కూడా లేదాయే. కనీసం సరసం ఆడొచ్చని కూడా తెలియని వయసు. పదేళ్ళ వయసులో ఏ డ్రస్సు వేసుకుంటే పురుష వీరులను రెచ్చగొట్టగలదు? కాముకుల మనసు చెదరడానికి పదేళ్ళ పాప ఎన్ని ప్రయత్నాలు చేస్తే సాధ్యం అవుతుంది? మీ దగ్గర సమాధానం ఉందా ??

ఇక 32 సంవత్సరాల విధవరాలు. భర్త చనిపోయిన పాపానికి విధవ గా పేరిడిన సమాజం మానభంగం చేసే పురుషులను కనీసం వెధవ అనయినా పిలుస్తుందా? రాత్రి ఎనిమిది దాటితే స్త్రీలని బైట తిరగకుండా చేయాలని ఢిల్లీ పోలీసులు ప్రతిపాదించారు. ఎనిమిది ముందు జరిగే రేప్ ల నివారణకి ఏం చేయాలో వారు చెప్పలేదు. భర్త లేని స్త్రీ, పొట్ట నింపుకోవడానికి ఏ పని చేస్తే రాత్రి ఎనిమిది దాటకుండా ఉంటుంది? కూలీ నాలీ చేసుకుని బతికేవారు, ఇళ్ళల్లో పాచిపని చేసి బతికేవారూ, రోడ్లు ఊడ్చే కార్మిక స్త్రీలు తాము పగలే పని చేస్తామనీ, చచ్చినట్లు పని ఇవ్వాల్సిందేననీ షరతులు పెట్టి పని సంపాదించగలరా? ప్రవేటు వ్యక్తులనీ, సంస్ధలని వదిలేద్దాం. ప్రభుత్వానికైనా ఆ షరతులని కార్మిక స్త్రీలు విధించి పని సంపాదించగలరా? చెప్పండి ?? దీనికి మీ సమాధానం ??

ఫ్యాషన్ దుస్తులే రేప్ లకి కారణం అన్నారు.
కనిపించేలా డ్రస్ లు వేసుకుంటారన్నారు.
బాయ్ ఫ్రెండ్స్ తో పబ్ లకి వస్తే రేప్ లు చేయరా అనడిగారు.
తాగుతారని నిందించారు.
మగాళ్లలతో కలిసి పని చేస్తే అంతే అన్నారు.

‘ప్రతిసారీ ఆడవాళ్ళదే తప్పు’ అన్నదే నేను గమనించిన ప్రతీ మగవారిలోని ఆంతర్యం.. అదే వారి మాటల్లోని సారాంశం.

కురచ దుస్తులు, వెర్రి తలలు వేస్తున్న ఫ్యాషన్ల ఫలితం. పశ్చిమ దేశాల వెర్రి సంస్కృతిని మక్కీకి మక్కీ కాపీ కొడుతున్న ఫలితం. ఈ సంస్కృతీ పరాధీనతను సవరించడానికి ప్రభుత్వాలు కృషి చేయవలసి ఉండగా అదేమీ జరగడం లేదు. కానీ అమ్మాయిల కురచ దుస్తుల వల్ల మగాళ్లు నీతి తప్పాలా అన్న ప్రశ్న పోలీసు అధికారులు వేయకపోవడమే విచిత్రం.


ఇక్కడ ఎవ్వడూ మగాడి బుద్దిని చూడట్లేదు ... అదే బట్టలు నీ చెల్లో, అక్కో వేసుకుంటే నువ్వు చూస్తావ ?? చూసినా చూస్తావ్ ఎందుకంటె నువ్వు వావి, వరసలను విడిచిన అతినీచమైన చిత్త కార్తివి కనుక ...

అబ్బాయి, అమ్మాయి ఇష్టపడడం, ప్రేమించుకోవడం, దగ్గరవడం అన్నీ ఒక్కటే అన్న అవగాహన నెలకొని ఉండడం ఒక సమస్య. ఇరువురి మధ్య ప్రేమ సంబంధం అభివృద్ధి చెందడంలో సంభవించే వివిధ సున్నిత దశలను ఒకదానికొకటి విభజించుకోవడంలో ఈ రోజుల్లోని యువతీ, యువకులు విఫలం అవుతున్నారు. ఆ విషయంలో చైతన్యవంతమైన అవగాహన కలిగించడంలో సమాజం సఫలం కావడం లేదు. సమాజమే వెనుకబాటు భావాలు కలిగి ఉన్నపుడు స్త్రీ, పురుషు సంబంధాలలోని సున్నితాంశాలు యువకులకు సరిగ్గా అర్ధం కావడం సులభమైన విషయం కాదు. సమాజం పరివర్తనా దశలో ఉన్నపుడు ప్రభుత్వాలు, నిర్దేశక వ్యవస్ధలను సమర్ధవంతంగా నిర్వహించగలగాలి. లేనట్లయితే యువతీ, యువకుల్లో ఏర్పడే అనేక సందేహాలు పరిష్కారానికి నోచుకోక అయోమయంలో అనేక తప్పటడుగులు వేస్తారు. వేస్తున్నారు.. ఈ పరిస్ధితిని గుర్తించడానికి బదులు మొత్తంగా అమ్మాయిల ప్రవర్తనలని తప్పు పడుతూ రేప్ నేరాలకి వారినే బాధ్యులని చేయడం అసంగతం...
వారు అలా బట్టలు వేసుకోవడం తప్పుకాదని నాఉద్దేశం కాదు ... అలా వేసుకోవడం చాలా తప్పు .. కాని కేవలం అలాంటివాటిమీద ఈ దుశ్చర్యలు జరుగుతున్నాయన్నదే పొరపాటు .... ఆడవారు మీరు కూడా కొన్ని కొన్ని నిభందనలు, హద్దులు ఏర్పరుచుకొని మసులుకోవాలని ఆశిస్తున్నాను ... మీరు బయటికి వెళ్ళేటప్పుడు అందరి ద్రుష్టి మీ మీద పడాలని అనుకోకండి.. మనం, మన సాంస్కృతిక, సాంప్రదాయాలు ప్రపంచం నలుమూలలా వెలుగెత్తి చాటవలసిన భాద్యత మనందరిదీను... దయచేసి దాన్ని కాపాడమని నా మనవి ...

అలాగే మగవారు కూడా మన సర్వేంద్రియాలను అదుపులో పెట్టుకొని మసలుకోవాలని చిన్న మనవి .. స్త్రీ, పురుషులు ఇరువురూ వారి వారి నైతిక విలువలను కాపాడుకుంటూ, ప్రవర్తిస్తూ వస్తే మనము, మనదేశం సస్యశ్యామలమైపోతుందని నొక్కి వక్కాణించగలం...

మారాల్సింది ఆడవారి వస్త్రధారణ కాదు దానికి ముందు మగవాడి ఆలోచనలు...


స్వస్తి .. __/\__


Bobby Nani

No comments:

Post a Comment