Friday, April 3, 2026

ఓ సారి గమనించొచ్చు గా ....


 

ఓ సారి గమనించొచ్చు గా
*******************

నీకు నేను..
కేవలం వంటగదిలోని ఓ పనిమనిషినేనా?
మూడు పూటలా వడ్డించే యంత్రాన్నేనా?
ఇల్లుని అందంగా సర్దే..
ఒక ప్రాణం లేని అలంకరణ వస్తువు నేనా?

మంచి బట్టలు ఉన్నాయి
వేసుకోవడానికి నగలు ఉన్నాయి
తినడానికి తిండి ఉంది
ఉండటానికి నీడ ఉంది!
కానీ..
నా చేయి పట్టుకొని
చొరవగా మట్టిగాజులు ఏనాడైనా తొడిగావా?
నా కళ్లలోని భావాన్ని ఎప్పుడైనా చదివావా?
అసలు చదవాలని ప్రయత్నించావా?
నా పెదవుల చాటున దాగున్న మౌనాన్ని
ఏనాడైనా తెలుసుకోవాలని అనుకున్నావా?
నాకంటూ ఓ మనసు ఉంటుందని..
ఆ మనసుకి కూడా కొన్ని భావాలు ఉంటాయని
ఎందుకు తెలుసుకోలేక పోతున్నావ్?

బయట ప్రపంచం నాకు అక్కర్లేదు..
నీ చూపుల్లో చిన్న ఆత్మీయత చాలు నాకు!
వందల మాటలు అవసరం లేదు..
ఏమైంది? అని అడిగే నీ ఒక్క పలకరింపు చాలు!
నువ్వు తెచ్చే ఖరీదైన బహుమతుల కంటే..
నా అలసటను గుర్తించే నీ మాటలు కొన్ని చాలు!

కానీ నీకు..
నేను పడక గదిలో ఓ బొమ్మను కదా..
నాకూ భావాలు ఉంటాయబ్బా..
నాకూ కన్నీళ్లు వస్తాయబ్బా..
అవి కూడా గమనించలేనంత
యాంత్రికంగా ఎలా మారిపోయావు!
నువ్వు నింపిన ఈ భౌతిక సుఖాల మధ్య..
నా ప్రాణం ఒక ఎడారి లా మారిపోయింది!

వంట బాగా చేశావు అనకపోయినా పర్వాలేదు,
కానీ ... ఈ రోజు నువ్వు తిన్నావా?
అని ఏనాడైనా అడిగావా?
బయటి ప్రపంచంతో నువ్వు అలసిపోయి వచ్చావని నాకు తెలుసు
కానీ.. ఇంటి ప్రపంచం నన్నూ అలసట పెడుతుందని
నీకెప్పుడైనా అనిపించిందా?

నేను ఏడిస్తే
అది చిన్న విషయం కోసం కాదు..
చాలాసార్లు.. చాలాకాలంగా ఎవరూ వినని
నా మనసు నలిగిపోయిన ఓ ఆక్రందన!
నేను మౌనంగా ఉన్నానంటే
అది కోపం కాదు ...
ఎప్పుడు ఏమి చెప్పినా వినరని తెలిసిన
ఒక నిస్సహాయత!

నువ్వు బయట ప్రపంచంతో యుద్ధం చేసి వస్తావు,
కానీ..
నేను కూడా ఈ ఇంటి నిశ్శబ్దాలతో
ప్రతి రోజూ ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తాను!

నన్ను
భార్యగా చూశావు,
పిల్లల తల్లిగా చూశావు,
ఇంటి పనులు చూసుకునే మనిషిగా చూశావు
ఒక్కసారి
మనసున్న స్త్రీగా కూడా చూడొచ్చు కదబ్బా!

నాలోనూ కలలు ఉన్నాయి.
నాలోనూ మాటలు ఉన్నాయి.
నాలోనూ గాయాలున్న చోట్లున్నాయి.
నాలోనూ ఎవరితో పంచుకోలేని
వేవేల భావాలున్నాయి!
ఇప్పటికీ నీ ఒడిలో తలపెట్టి
నీ కోసం ఎదురు చూసే
నాలోని ఆ చిన్న పాప ఇంకా మిగిలే ఉంది..
కాస్త గమనించొచ్చు కదా..!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment