హిమ శిఖరాల్లో నా ఆత్మాన్వేషణ (4వ భాగం) *********************************
ఆలయం లోపలికి ప్రవేశించిన ఆ క్షణం… బయట ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయినట్టనిపించింది. గాలిలో చందనం, గంగాజలం, బిల్వదళాల మిశ్రమ పరిమళం… చుట్టూ “ఓం నమః శివాయ” అనే మంత్రోచ్చారణ… వాటన్నిటి మధ్యలో నేను. నా కళ్ల ముందు ఉన్నది సాక్ష్యాత్తు కాశీ విశ్వనాథుడు.. ఆయన దర్శనం ఎన్నో యుగాల భక్తి, ఎన్నో హృదయాల ప్రార్థన, ఎన్నో జీవితాల సమర్పణ ఒకే రూపంలో నిలబడి ఉన్నట్టనిపించింది. నేను నేరుగా శివలింగాన్ని చూసాను. అప్పుడే అక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ శివలింగం చుట్టూ ఉండే కంచె (రక్షణ వలయం) అప్పటివరకు అలాగే ఉంది… కానీ నేను దగ్గరికి అడుగుపెడుతున్న సమయానికే, అభిషేకం కోసం కావచ్చు, ఆ క్షణంలోనే పూజారులు ఆ కంచెను తొలగించారు. ఆ దృశ్యం నా కళ్ల ముందు నిజంగా జరిగిందా… లేక అది నా భ్రమ … నాకు ఇప్పటికీ అర్థం కాదు.
అప్పుడే ఒక అద్బుతం జరిగింది. నేను అక్కడికి చేరుకున్న సమయానికే ఆ అడ్డంకి తొలగిపోవడం. అది యాదృచ్ఛికమా? లేక పిలుపా? అన్న ప్రశ్న కూడా ఆ క్షణంలో నాలో రాలేదు… ఎందుకంటే ఆలోచించే స్థితిలో అప్పుడు నేను లేను. నా చేతులు…నాకు తెలియకుండానే ముందుకు సాగాయి.
శివలింగం చుట్టూ ఉన్న కంచెను నేను దగ్గరకు చేరిన క్షణంలోనే తొలగించారు. ఆ క్షణం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. జనసందోహం మధ్య నేను ఒక్కసారిగా ముందుకు నెట్టబడ్డాను. నాకు ఏమీ ఆలోచించడానికి సమయం కూడా లేకుండా, నా చేతులు నాకే తెలియకుండా ముందుకు వెళ్లి ఆ శివలింగాన్ని అమాంతం తాకాయి. ఆ స్పర్శ… నాలో ఒక శక్తిలా ప్రవహించడం నాకు స్పష్టంగా అనిపించింది. అదే క్షణంలో ఎవరో విభూది ఒక్కసారిగా కుమ్మరించేసారు, ఆ విభూది నా మోచేతుల మీదుగా జారుతూ నా చేతుల్లో ఒదిగి ఉన్న నీలకంఠుడిని నేరుగా అభిషేకించింది.
ఆ క్షణం నాకు ఏమి అనిపించిందో మాటల్లో చెప్పడం అసాధ్యం.. అది ఆనందమా? ఆశ్చర్యమా? భయమా? లేక ఒక పరవశమా? నాకు అర్థం కాలేదు. కానీ నేను అక్కడ నిలబడి ఉండగా, నా చుట్టూ ఉన్న భక్తులు ఒక్కసారిగా నా చేతులను పట్టుకోవడం మొదలుపెట్టారు. నా చేతుల మీద ఉన్న ఆ విభూదిని వారు తమ నుదుటిపై రాసుకున్నారు. అక్కడివారంతా ఏదో హిందీలో నా గురించే మాట్లాడుకున్నట్లు మాత్రం బాగా అర్ధం అయింది.. కొందరు నా చేతులను గౌరవంగా తాకి నమస్కరించారు కూడా. నేను మాత్రం ఏమీ అర్థం కాక, ఒక మౌన స్థితిలో మెల్లిగా ముందుకు కదులుతూ గర్భగుడి నుండి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాను.
దూరంనుంచి కళ్ళారా ఆ శివయ్యను చూసుకుందామని వచ్చిన నాకు స్పర్శ దర్శనమే చేయించాడు. నిజంగా నాకు అంతటి అర్హత ఉన్నదా? నేనేమి కోరుకోకుండానే నాకు ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించాడా? అని నా మనసు పదే పదే వేసే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. కానీ ఆ అనుభూతి మాత్రం నా గుండెల్లో స్థిరపడిపోయింది. ఆ క్షణంలో నాకు ఒక్కటే అనిపించింది…నిన్న రాత్రి అఘోరాలు చెప్పిన “వదిలిపెట్టడం” అనే సత్యం, ఈ రోజు ఇక్కడ “సమర్పణ”గా మారినట్టనిపించింది.
ఆలయం బయటకు వచ్చిన తరువాత కూడా నా అడుగులు నేల మీద పడుతున్నాయా… లేక నేను ఇంకా ఆ గర్భగుడిలోనే నిలబడి ఉన్నానా అన్న తేడా కొద్దిసేపు నాకు అర్థం కాలేదు. నా చేతులపై ఉన్న విభూది ఇంకా అలాగే ఉంది. దాన్ని తుడవాలనే ఆలోచనే రాలేదు. అది ఒక బహుమతి. నిన్న చీకటిలో నేను విన్న సత్యం, ఈ రోజు వెలుగులో నేను అనుభవించిన అనుగ్రహం రెండూ కలిసి ఒకటే సందేశాన్ని చెబుతున్నట్టనిపించింది. వారణాసి నాకు దేవుణ్ని మాత్రమే చూపించలేదు… నాలో నేను దాచుకున్న కోటానుకోట్ల భావాలను గప్చిప్గా వెలికి తీసింది.
ఇక అక్కడనుంచి మెల్లగా ఆ ఇరుకు వీధుల్లోకి తిరిగి నడవడం ప్రారంభించాను. ఉదయం పూర్తిగా మేల్కొన్న కాశీ తన అసలు స్వరూపాన్ని మళ్లీ నా ముందుంచడం మొదలుపెట్టింది. అదే గల్లీలు… అదే రద్దీ… అదే అరుపులు… కానీ ఇప్పుడు అవన్నీ నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి చీకటిలో విన్న సత్యం, ఈ రోజు ఉదయం వెలుగులో అనుభవించిన అనుగ్రహం ఇవి రెండూ నా చూపుని పూర్తిగా మార్చేశాయేమో అనిపించింది.
ఒక వైపు పూల దుకాణాలు తెరుచుకుంటున్నాయి…బిల్వ పత్రం… గంగా జలం…అంటూ పిలుస్తున్న స్వరాలు వినిపిస్తున్నాయి…కొంచెం దూరంలో కమ్మటి నూనె కాగుతున్న వాసన గాలిలో కలుస్తోంది…ఇంకొంచెం ముందుకెళ్తే గోవులు దారి మధ్యలో నిలబడి ఆ దారిని ఆపేస్తున్నాయి…వాటిని దాటుకుని వెళ్తున్న భక్తులు, యాత్రికులు… ఎవరికీ ఎవరు సంబంధం లేకపోయినా, అందరూ ఒకే దారిలో నడుస్తున్నారు. ఇవన్ని దారిపొడవునా చూస్తూ ఆస్వాదిస్తూ, మళ్లీ గంగ ఒడ్డుకి చేరుకున్నాను. ఉదయం గంగామాత మరో రూపంలో దర్శనమిచ్చింది. నిన్న రాత్రి చూసిన ఆ మౌన నది కాదు… ఇప్పుడు ఆమె చలాకీగా, అల్లరి చేస్తూ, నిరంతరంగా కదులుతున్న ఒక ప్రవాహంలా కనిపించింది. కొందరు స్నానం చేస్తున్నారు… కొందరు పూజలు చేస్తున్నారు… ఇంకొందరు నిశ్శబ్దంగా మెట్లమీద కూర్చుని గంగను చూస్తున్నారు.
అయితే అదే గంగ ఒడ్డున ఇంకొంచెం దూరంలో మణికర్ణిక ఘాట్ వైపు నా చూపు వెళ్ళి ఆగింది. అక్కడ మాత్రం ఉదయం, సాయంత్రం, రాత్రి అన్న తేడానే లేదు. అక్కడ ఎప్పుడూ ఒకే దృశ్యం. మంటలు రగులుతూనే ఉంటాయి. కొత్తగా తీసుకొచ్చిన దేహంలా ఉంది, చుట్టూ నిలబడ్డ బంధువులు, మధ్యలో మౌనంగా కాలిపోతున్న ఒక జీవితం. అది చూసిన క్షణం, నిన్న రాత్రి అఘోరి చెప్పిన మాట మళ్లీ నా చెవుల్లో మార్మోగింది.
“మనిషి మరణాన్ని కాదు.. తనదనుకున్నదాన్ని వదులుకోవడానికే భయపడతాడు”
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? అక్కడ ఎవరూ ఆగి ఎక్కువసేపు దుఃఖించడం లేదు. కొద్దిసేపటి తర్వాత వాళ్లు వెళ్ళిపోయారు. మరో దేహం వస్తుంది. మరో మంట మొదలవుతుంది. జీవితం అక్కడ ఆగదు… మరణం కూడా అక్కడ కొత్తగా అనిపించదు. అదే వారణాసి. మరణం కూడా అక్కడ ఒక సాధారణ శ్వాస.
ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడిన నాకు ఇంకొక ప్రశ్న మెల్లగా కదిలింది.
మన జీవితమంతా ఏదో సాధించడానికి పరుగెడుతుంటాం..
ఏదో సంపాదించడానికి తాపత్రయపడుతుంటాం..
ఏదో కోల్పోతామేమోనని భయపడుతుంటాం..
కానీ చివరికి ఇక్కడికి వచ్చాక…అన్నీ వదిలేసి వెళ్లాల్సిందే .. మరి ఇంత తపన ఎందుకు?
అప్పుడే నాకు మరో సత్యం అర్థమైంది.. వారణాసి మనకి సమాధానాలకన్నా మనలో దాగి ఉన్న ప్రశ్నలను మాత్రమే మేల్కొలుపుతుంది.
అక్కడి ప్రతి దృశ్యం,
ప్రతి శబ్దం,
ప్రతి వాసన,
ప్రతి మౌనం,
మనలోని ఏదో ఒక కోణాన్ని తట్టి లేపుతుంది.
ఆ రోజు నేను గంగ ఒడ్డున చాలా సేపు కూర్చున్నాను.
ఏం ఆలోచించలేదు,
ఏం కోరుకోలేదు,
కేవలం చూస్తూ ఉన్నాను అంతే!
ప్రవహిస్తున్న గంగను
కాలిపోతున్న చితిని
నడుస్తున్న జనాన్ని
మెల్లిగా మారిపోతున్న నా మనసును
ఆ క్షణంలో నాకు ఒక్కటే అనిపించింది. నిన్న రాత్రి చీకటిలో అఘోరాలు చూపించిన సత్యం,
ఈ రోజు వెలుగులో శివయ్య అనుభవింపజేసిన అనుగ్రహం, ఇప్పుడు ఈ గంగ ఒడ్డున కనిపిస్తున్న జీవితం.. ఇవి అన్నీ వేర్వేరు కాదు… ఒకటే ప్రయాణం. బయట నుంచి లోపలికి, మనిషి నుంచి మౌనానికి “నాది” అనే భావన నుంచి “నాదేం కాదు” అనే సత్యానికి. నేను వారణాసి దర్శనానికి రాలేదు… నన్నునాకే కొత్తగా పరిచయం చెయ్యడానికి వారణాసే నన్ను పిలిపించుకుంది అనిపించింది.
ఇక్కడి కాశీ విశ్వనాథుడి స్పర్శతో పులకించిన నా మనసు, మణికర్ణిక ఘాట్ మంటల్లో కాలిపోయిన నా అహంకారం వీటన్నిటినీ వెంటబెట్టుకుని నా ప్రయాణం ఇప్పుడు 'ప్రయాగ' వైపు సాగింది.
To be Continued…
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==
#KashiDiaries #teluguwriterscommunity #teluguwriters #SpiritualJourney #spirituality #gangariverview
#prayaga #journey #trivenisangam
fb.com/stars

No comments:
Post a Comment