Wednesday, April 29, 2026

శోకతప్తం...


 చావు కి ఇచ్చే ఆఖరి గౌరవం అంత్యక్రియలు జరపడం. కానీ దానికి కూడా డబ్బు కావాలి. కానీ…బ్యాంకు వారు ఇచ్చిన ఆ సమాధానం చట్టబద్ధం కావచ్చు…కానీ మనసుకు మాత్రం ఇది అమానుషం... మరో మార్గాన్ని వారు అతనికి సూచించి ఉంటే బాగుండు.


ఒడిశాలోని నువాపడా జిల్లాలో, అంత్యక్రియల డబ్బు కోసం తన సోదరి శవాన్ని భుజాన మోసి బ్యాంకు గడప తొక్కిన జీతూ ముండా ఆక్రోశం నన్ను ఎంతో కదిలించివేసింది. నిబంధనల సాకుతో మానవత్వాన్ని ఖననం చేసిన ఆ అమానుష ఘటనను చూసి ద్రవించిన నా హృదయం.. అక్షర రూపం దాల్చిన నిరసనే ఈ 'శోకతప్తం'."


శోకతప్తం
*******
ఆకాశం చిల్లులు పడి అశ్రువులై కురుస్తున్న వేళ..
ధరణి గర్భంలో ఒదిగిన మౌనాన్ని.. మళ్ళీ తవ్వి తీశాడు!
మానవత్వం మట్టిలో కలిసిపోయిన చోట,
అతడు మోస్తున్నది తన సోదరి మృతదేహాన్ని కాదు..
ఈ సమాజపు విలువల నిలువెత్తు అస్థిపంజరాన్ని.!

ఏసీ గదుల్లో కూర్చుని అంకెలను లెక్కించే మేధావులకు..
ఆ శవం నుంచి వీచే మృత్తిక వాసన అర్థం కాలేదు!
నిబంధనల ఇనుప తెరల వెనుక దాగిన అధికార అంధత్వానికి
కొన్ని సిరా చుక్కల సంతకమే సాక్ష్యమట!
అందుకే
ప్రాణం ఉన్నప్పుడు పట్టించుకోని అధికార మదానికి..
ప్రాణం లేని ఆ నిర్జీవ దేహమే ఒక తీర్పు గా మారింది!

కాగితాల మీద సంతకాలే ప్రాణదాతలైన వేళ..
కన్నీళ్లకు వెల లేని ఈ కఠిన లోకంలో..
అతని నడక ఒక సందేశం..
అతని మౌనం ఒక హెచ్చరిక!
శవాన్ని సాక్షిగా నిలబెట్టి..
అతడు వ్యవస్థలోని కుళ్లును వెలికితీస్తున్నాడు!
తన భుజంపై మోస్తున్న ఆ నిశ్చల దేహం
వేల ఏళ్ళ ఈ నాగరికతపై జరుపుతున్నఒక నగ్న నిరసన!

అక్కడ మరణించింది తన సోదరి మాత్రమే కాదు..
అధికారుల గుండెల్లో ఉండాల్సిన ఆర్ద్రత!
డబ్బు కోసం కాదు.. తన ఆత్మగౌరవం కోసం..
శవాన్ని సాక్ష్యంగా మార్చుకున్న ఆ సోదరుని శోకతప్త పోరాటం
చరిత్ర పుటల్లో ఒక కన్నీటి అధ్యాయం.!

గతించిన ఆ దేహానికి ముక్తి దొరికిందేమో కానీ..
నిబంధనల చెరలో చిక్కుకున్న ఈ వ్యవస్థకు ఎప్పటికీ శాపవిమోచనం లేదు!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

#jitumunda #OdishaIncident #nuapada #HumanityDead
#SystemFailure #odishanewstoday

No comments:

Post a Comment