Wednesday, April 8, 2026

హిమ శిఖరాల్లో నా ఆత్మాన్వేషణ (3వ భాగం)...


 హిమ శిఖరాల్లో నా ఆత్మాన్వేషణ (3వ భాగం)

*********************************

కాసేపటి మౌనం తరువాత నేను మరింత ధైర్యం చేసి నా ఎదురుగా ఉన్న అఘోరాలలో పెద్ద వయస్సు ఉన్న వ్యక్తిని ఇలా అడిగాను మీరు మరణాన్ని ఏ విధంగా చూస్తారు? దానికి ఆయన సమాధానంగా నిర్మలంగా పారుతున్న గంగానదిని తదేకంగా చూస్తూ, ఒక్కసారిగా వికటంగా నవ్వాడు. ఆ నవ్వు.. చుట్టూ ఉన్న ఇసుక తిన్నెల మీద ప్రతిధ్వనిస్తుంటే నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఆయన నా కళ్లలోకి నేరుగా చూస్తూ, ఇలా అన్నాడు. మరణమా? అది అంటే మీకు ఒక భయం.. మాకు అది ఒక మహా వైభవం! మీరు బ్రతకడానికి ప్రాకులాడుతుంటే, మేము చావడానికి ఎప్పుడో సిద్దపడి ఉంటాం. ఆ గంగ ఒడ్డున కాలుతున్న ఆ చితిని చూడు.. అక్కడ కాలుతున్నది శరీరం మాత్రమే. మనిషి తనదనుకున్న అహంకారం ఆ మంటల్లో కాలి బూడిదవుతుంటే వచ్చే ఆ వాసనే సత్యం! మౌనంలోనే శివుడున్నాడు... ఆ బూడిదలోనే సత్యముంది... నువ్వు దేన్నైతే 'నేను' అనుకుంటున్నావో, దాన్ని ఇప్పుడే ఈ గంగలో కలిపేయ్.. అది విన్నాక కాసేపు మాట రాలేదు. నిజమే! మనం బ్రతకడం కోసమే ప్రాకులాడుతుంటాం కదా అనిపించింది.

తరువాత మెల్లిగా మీరు బూడిద రాసుకుంటారు… శ్మశానానికి దగ్గరగా ఉంటారు… అది ఎందుకు? అని అడిగాను. ఈసారి ముందు సమాధానం చెప్పిన అతను కాకుండా మరొకరు కొంచెం సూటిగా ఒక్కమాటలోనే జవాబిచ్చారు.. “రోజూ ఈ శరీరం ఏమవుతుందో గుర్తుంచుకోవడానికి” అని.. కానీ ఈ ఒక్క జవాబు ఎంత గొప్పదో ఆ తర్వాత నాకు అర్థమవుతూ వచ్చింది. మనం రోజూ అద్దంలో ముఖం చూస్తాం. వాళ్లు బూడిదలో అంతిమరూపం చూస్తారు. మనం శరీరాన్ని అలంకరిస్తాం. వాళ్లు శరీరం నశ్వరమని గుర్తుంచుకుంటారు. బహుశా వాళ్ళు పట్టుకోవాల్సింది, విడిచిపెట్టాల్సింది రెండూ ఒక్కటేనేమో అనిపించింది.

ఆ సంభాషణ మరింత లోతుకు వెళ్లింది. మాటలు పెద్దగా లేవు. కానీ ప్రతి మాట వెనక ఒక శ్మశాన నిశ్శబ్దం కనిపించింది. నేను అడిగాను వారణాసికి అందరూ మోక్షం కోసం వస్తారు కదా… నిజంగా అది ఇక్కడ దొరుకుతుందా? అని
వారిలో ఒకరు నన్ను తీక్షణంగా చూస్తూ, మోక్షం గంగలో ఉండదు.. మోక్షం నీ పట్టు విడుపుల్లోనే ఉంది. వదిలితే అదే మోక్షం.. అన్నాడు... ఆ మాట విన్నాక గంగను మరోసారి చూసాను. ఇంతసేపు ఆమె ప్రవహిస్తున్న నదిలా కనిపించింది. ఆ క్షణంలో మాత్రం ఆమె వదిలిపెట్టడం నేర్పే ఆదిగురువులా అనిపించింది.

నాతో వచ్చిన హిందీ తెలిసిన మిత్రుడు కూడా ఆ మాటలు వింటూ ఆశ్చర్యపోయాడు. కొంతసేపు అతనూ ప్రశ్నలు అడిగాడు. మీరు కుటుంబాన్ని, ప్రపంచాన్ని, బంధాలను విడిచి ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? అని అడిగాడు.

నిజానికి మేము వేటినీ వదలలేదు, అవి మమ్మల్ని వదిలేస్తాయని ముందే తెలుసుకున్నాం! అంతే.. ఈ రోజు నువ్వు నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అనుకుంటున్నావు.. కానీ మణికర్ణిక ఘాట్ దగ్గర చితి మీద పడుకున్నప్పుడు, నీ వెంట వచ్చే బంధం ఏది? నీవు మోస్తున్న ఈ శరీరం కూడా నీ మాట వినదు, అది అగ్నిలో కలిసిపోతుంది. మరి ఇక నీదంటూ ఏముంది ఇక్కడ? ఈ జవాబు నన్ను ఇంకా లోతుగా తాకింది. ఎందుకంటే నిజంగానే వారణాసి అంతా చూసిన తర్వాత నాకు కూడా అలాగే అనిపించడం మొదలైంది.

మాట్లాడుతున్నంతసేపూ చీకటి క్రమంగా మరింత గాఢమైంది. గంగ పైనుంచి వచ్చే చల్లటి గాలి ఇసుకని మెల్లగా కదిలిస్తోంది. ఈ వైపున ఎక్కడో మసక దీపం తప్ప మరే వెలుతురు లేదు. కానీ ఆ చీకటిలోనే వాళ్ల మాటలు మరింత స్పష్టంగా వినిపించాయి. అఘోరాల దగ్గర కూర్చుని నేను గ్రహించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్లు మరణాన్ని ఆరాధించడం కాదు.. అది జీవితంలో నుంచి తీసేసిన ముసుగని గుర్తుంచుకోవడం. వాళ్లు చీకటిని కోరుకోవడం కాదు.. వెలుగూ చీకటీ రెండూ ఒకే మూలం నుంచి వచ్చినవనే సత్యాన్ని ఒప్పుకోవడం.

వాళ్లలో ఒకరు నన్ను చూసి ఇలా అన్నారు.. ఈ శ్మశానంలో ఉన్న ప్రతి శవం మాకు ఒక పాఠం చెబుతుంది.. 'నీవు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు' అని. ఆ సత్యాన్ని నమ్మిన వాడికి బంధాలను వదలడం కష్టం కాదు, పట్టుకోవడమే వింతగా ఉంది.. ప్రవహిస్తున్న ఆ గంగను చూపిస్తూ ఆ నీటిని చూడు… అది ఎక్కడా ఆగదు, ఏదీ దాని సొంతం కాదు, అందుకే అది స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. నువ్వు మాత్రం ప్రతి దానికీ ‘నా’ అని అంటావ్… అందుకే నువ్వు బరువెక్కిపోతావ్ అన్నాడు. ఆ మాటలు వినగానే నాకు నా జీవితంలో నేను పట్టుకున్న అనేక విషయాలు గుర్తొచ్చాయి. వదలలేకపోయిన జ్ఞాపకాలు, వదిలేయలేని సంబంధాలు, కోల్పోతామేమోనని భయపడి పట్టుకున్న ఆశలు అవన్నీ ఒక్కసారిగా నా కళ్ళముందు కదిలాయి..

కొద్దిసేపటి తర్వాత నువ్వు ఇక్కడికి రావడం యాదృచ్ఛికం కాదు… వారణాసి పిలిచింది, అందుకే రాగలిగావ్! అన్నాడు. ఇంతవరకు ఈ ప్రయాణం నా నిర్ణయం, నా కోరిక అని అనుకున్న నేను, ఆ క్షణంలో అది ఒక పిలుపు అని భావించాను. మనం వెళ్ళే కొన్ని ప్రదేశాలు మనం ఎంచుకున్నవి మాత్రం కావు.. అవే మనల్ని పిలుస్తాయి అన్న భావన నాకు అప్పుడే అర్థమైంది. కొద్దిసేపటికి వాళ్లలో పెద్దవారు మెల్లగా లేచారు. అది మాకు వెళ్లమనే సంకేతంలా అనిపించింది. మేము లేచి వారికి నమస్కరించాము. వారు ఆశీర్వాదం ఇవ్వలేదు, ఎలాంటి ప్రత్యేకమైన మాటలు కూడా చెప్పలేదు. కానీ వాళ్ల మౌనం మాటలకంటే ఎక్కువగా నన్ను కదిలించింది.

పడవ వైపు నడుస్తూ నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాను. ఆ చీకటిలో, ఆ ఇసుకపై, ఆ బూడిద మధ్య వారు మళ్లీ నిశ్చలంగా కూర్చున్నారు.. మౌనంలో కలిసిపోయారు. పడవలో తిరిగి అవతలి వైపుకు వస్తున్నంతసేపూ నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గంగ మధ్యలో పడవ నెమ్మదిగా జారుతోంది. ఆ వైపున ఘాట్‌ల మీద మిగిలిన దీపాలు ఇంకా కొసరి కొసరి వెలిగుతున్నాయి. నాకు మాత్రం ఆ రెండు ప్రపంచాలు ఇప్పుడు వేర్వేరుగా అనిపించలేదు. గంగాహారతిలో నేను చూసింది వెలుగులో సమర్పితమైన ప్రార్థన అయితే, గంగ అవతల అఘోరాల దగ్గర నేను విన్నది చీకటిలో నిలిచిన సత్యం. రెండూ కలిసి వారణాసి నాకు ఒకే సందేశం ఇచ్చినట్లు అనిపించింది.. మనిషి దేవుణ్ని వెలుగులో వెతికినా, చీకటిలో వెతికినా, చివరికి వెతికేది తనను తానే అన్న సత్యాన్ని.

ఆ రాత్రి నేను గదికి తిరిగి వచ్చిన తర్వాత చాలా సేపు నిద్రపోలేక ఇబ్బంది పడ్డాను. గంగ మీద వెలిగిన ఆ దీపాలు, చీకటిలో కూర్చున్న ఆ అఘోరాలు, “మరణమా? అది అంటే మీకు ఒక భయం.. మాకు అది ఒక మహా వైభవం!” అన్న ఆ మాట, “రోజూ ఈ శరీరం ఏమవుతుందో గుర్తుంచుకోవడానికి” అన్న జవాబు ఇవన్నీ నా లోపల మార్మోగుతూనే ఉన్నాయి. అప్పుడే నాకు అర్థమైంది.. నాలో నేనే ఎన్నాళ్లుగానో దాచుకున్న ప్రశ్నల్ని ఒక్కొక్కటిగా ఈ వారణాసి లో ఎదుర్కొంటున్నాను అని.

తెల్లవారుజామునే నా కళ్లను నిద్ర వదిలేసింది. గడియారం చూసే అవసరం లేకుండానే వారణాసిలో ఉదయం మొదలైందని అర్థమైంది. బయట ఎక్కడో మృదువుగా వినిపిస్తున్న మంత్రోచ్చారణ, దూరంగా గంగ దిశగా కదులుతున్న అడుగుల శబ్దం, అప్పుడప్పుడూ వినిపించే గంటారావం.. ఇవన్నీ కలిపి ఆ నగరం మెల్లగా మేల్కొంటోందని నాకు ముందుగానే తెలియజేశాయి. నిన్న రాత్రి చీకటిలో విన్న సత్యం ఇంకా నా లోపల ఉండగానే, ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎక్కువసార్లు శివయ్య దర్శనం చేసుకోవాలని రోజుకు ఎన్నోసార్లు దర్శనం చేసుకుంటూనే వున్నా కూడా.. ఈ రోజు ఉదయం మాత్రం ఎందుకో నా మనసుకు ప్రత్యేకంగా అనిపించింది.
మేము ఆలయం వైపు నడవడం ప్రారంభించాం. ఒకేలా కనిపించే ఆ ఇరుకు వీధులు, రెండు వైపులా గోడలకు అతుక్కున్నట్టు ఉన్న చిన్న చిన్న దుకాణాలు కళ్ళకు చాలా అందంగా కనిపించాయి. ఆ వీధుల్లో నడుస్తున్న ప్రతి మనిషి ముఖంలో ఒక తపన కనిపించింది. కొందరి చేతుల్లో పూలు, కొందరి చేతుల్లో బిల్వదళాలు, మరికొందరి పెదవుల మీద “హర హర మహాదేవ్” అనే నినాదం.. ఆ శబ్దం గాలిలో కాదు, గుండెల్లో వినిపిస్తున్నట్టనిపించింది.

ఆలయానికి దగ్గరయ్యేకొద్దీ జనసందోహం పెరిగింది. క్యూలో నిలబడిన ఆ క్షణం నాకు సాధారణంగా అనిపించలేదు.. నాతోపాటు వందల మంది నిలబడ్డారు. కానీ ఆ గుంపులో కూడా ప్రతి ఒక్కరూ తమ తమ లోకాల్లో ఉన్నట్టున్నారు. ఒకరు కళ్లను మూసుకుని జపం చేస్తున్నారు, ఒకరు నిశ్శబ్దంగా ఏదో కోరుకుంటున్నారు, మరొకరు కేవలం ఆ క్షణాన్ని అనుభవిస్తున్నారు. క్రమంగా క్యూలైన్ ముందుకు కదులుతోంది… ప్రతి అడుగు దగ్గరపడుతున్న కొద్దీ నా గుండె వేగం కూడా పెరుగుతోంది. నేను ఏమి కోరుకోవాలి? ఏమి చెప్పాలి? అన్న ఆలోచనలు ఒక్కొక్కటిగా మాయమవుతూ, చివరికి ఒక ఖాళీ మనసు మాత్రమే మిగిలింది.

To be Continued…

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

#KashiDiaries #teluguwriterscommunity #teluguwriters #spiritualjourney #spirituality #gangariver

fb.com/stars

No comments:

Post a Comment