Friday, April 24, 2026

మన్మథ మోహనం..


ఇక్కడ ఇంతమంది స్త్రీ మూర్తులు వున్నారు.. వారిలో ఎందరో కవయిత్రులు, రచయిత్రులు వున్నారు. కానీ ఏనాడైనా... ఏ ఒక్కరైనా మా మగవాని మీద ఓ కవితో, కావ్యమో పోనీ ఓ వర్ణనో వ్రాసారా? ఊ హు అస్సలు రాయరు. ఎందుకండి? నాటి ప్రబంధాల కాలంనుంచి నేటి ఆధునిక కవిత్వం వరకు మచ్చుకు ఒక్కటంటే ఒక్కటి కూడా మాపై లేవు. అన్నీ స్త్రీ వర్ణనలే!

మా మగ వాళ్ళకు కూడా ఉంటుంది కదా.. రాస్తే చదువుకొని మురిసిపోవాలని.. అర్ధం చేసుకోరూ.. సమానత్వం అంటే అన్నిట్లో ఉండాలిగా .. ఇక ఎలాగో మీరు రాయరని అర్ధం చేసుకొని.. ఒక స్త్రీ స్థానంలోకి పరకాయప్రవేశం చేసి మా వర్ణన, మా కవిత మేమే రాసుకుంటున్నాం!! కనీసం చదివి అయినా చెప్పండి..

మన్మథ మోహనం..
****************

నా చూపు..
నిశ్శబ్దంగా నిలిచిపోయిన నిమిషమది..!
ప్రపంచం నిశ్చలమై..
ప్రాణం అతని వైపు పరుగు తీసిన వేళ..
కళ్ళముందు నిలిచిన అతడి రూపం..
ఒక సజీవ కంచు విగ్రహమై నను సమ్మోహన పరుస్తోంది..!

తప్త కాంచన వర్ణపు అతడి దేహపు ఛాయ..
అపర మన్మథుడి సౌందర్య మంత్రం లా మెరుస్తుంటే..
గిరి శిఖరాల్లాంటి ఆ భుజ స్కంధములు
అలసిపోయిన నా మనసుకి సేదతీరే
అభయారణ్యాల్లా కనిపిస్తున్నాయి!

విశాలమైన అతడి వక్షఃస్థలం..
వేల యుద్ధాల గాయాల నైనా,
గుండె లోతుల్లోని ప్రేమ సముద్రాల నైనా,
ఒకేలా భరించగల ధైర్య శిలాపలకంలా కనిపిస్తుంది!

అతడి నడకలో..
వనదేవత పాదాల చెంత మ్రోగే
గంభీర దుందుభి శబ్దం ఆవిష్కృతమౌతుంది..
అతడి నల్లని ముంగురులు నుదుటిపై ఆడుతుంటే..
ఆషాఢ మేఘం ఆకాశంపై రాసిన మౌన విలాసంలా అగుపిస్తుంది..
తీర్చిదిద్దిన శిల్పంలాంటి అతడి నాసిక..
గౌరవానికి శిఖరంలా నిలిచిన శ్యామల వర్ణపు రాజసంలా ఉంది..
చూసే కొద్దీ లోతులకు లాక్కుపోయే
ఒక సౌందర్య సుడిగుండం అతగాడి సమ్మోహనం.!

ఆ కళ్ళలో..
ఎన్ని రహస్య నీలి సముద్రాలు దాగి ఉన్నాయో?
ఒక్కసారి ఆ కళ్ళలోకి చూస్తే చాలు..
గురి చూసి వదిలిన నయన బాణం గుండెను తాకినట్లుగా!
అతని అధరాలపై నిలిచిన ఆ గంభీరమైన మౌనం..
వేల అక్షరాలు చెప్పలేని ఒక అపరిచిత సందేశంలా అనిపిస్తుంది.!

శ్రమతో రాటుదేలిన అతగాడి అజానుబాహువులు చూడు
ప్రేమతో తాకితే వెన్నలా కరిగిపోయే పారిజాత శాఖలుగా ఎలా ఉన్నాయో!
అతని దేహం నుండి వీచే ఆ పురుషోచిత సుగంధం..
మంత్రించిన కస్తూరిలా నా శ్వాసను సమ్మోహన పరుస్తోంటే,
చెప్పలేని ఒక ఆరంభంలా,
అర్థం కాని ఒక అనుభూతిలా
మరచిపోలేని ఒక క్షణంలా నిలిచిపోయాను.!

నిజంగా…
అది ప్రేమ కాకపోవచ్చు …
కానీ
ప్రేమ పుట్టే మొదటి స్పందనలా అనిపించింది..!

ఏమాటకామాటే
అతడొక హిరణ్మయ కిరణుడు!
ప్రకృతి ఆరాధించే ఒక పురుష సూక్తం..
అతడి రూపం ముందు.. నా మౌనం ఒక సమర్పణలా..
నా చూపు ఒక నీరాజనంలా .. నిలువెల్లా కరిగిపోయింది.!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment