నాకు ట్రావెలింగ్ అంటే అమితమైన ఇష్టం.. ముఖ్యంగా హిల్ స్టేషన్స్ అంటే ఇంకా పిచ్చి.. ఇప్పుడంటే హిమగదుల్లో సిస్టం ముందు కూర్చుని కుదురుగా ఉన్నాను కానీ.. ఒకప్పుడు తిన్నగా ఒకచోట అసలు ఉండేవాడినే కాదు.. ఎన్నో ప్రయాణాలు చేసాను ఎన్నో ప్రదేశాలు చూసాను.. వాటిల్లో నేను చేసిన కొన్ని ప్రయాణాలు మాత్రం ఓ అద్భుతమనే చెప్పాలి. ఒక్క అమర్నాథ్ తప్పితే మిగతా కన్యాకుమారి నుంచి కేదార్నాథ్ వరకు మాక్స్ అన్ని కవర్ చేసేసాను. వాటిల్లో ఒక ఆద్యాత్మిక ప్రయాణం గురించి మీతో పంచుకుంటున్నాను.
జీవితం అంటే మనల్ని మనం వెతుక్కునే ఒక నిరంతర అన్వేషణ అని నేను బలంగా నమ్ముతాను. కొన్ని ఏళ్ల క్రితం అనుకోని ఓ ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది.. అది కూడా దాదాపుగా రెండు నెలలు.. కేవలం రెండు రోజులు ముందు నాకు తెలియడం చేత నేను ముందుగా ప్రిపేర్ కాలేకపోయాను అంతా హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది.. ఆ ప్రయాణం నన్ను ఉత్తర దిశగా, ఆ హిమగిరి శిఖరాల వైపు నడిపించింది. అది కేవలం ఒక ప్రయాణం కాదు.. నా జీవితంలో నేనెప్పటికీ మర్చిపోలేని ఒక 'అలౌకిక' అనుభూతి.
బండి కిటికీ బయట మారిపోతున్న దృశ్యాలను చూస్తూ కూర్చున్న ఆ మొదటి గంట నుంచే నా మనసులో ఏదో తాత్వికత ప్రారంభమైపోయింది. దక్షిణ భారతపు పరిచితమైన నేల, చెట్లు, గ్రామాలు, భాష ఇలా ఒక్కోటి వెనక్కి వెళ్ళిపోతుంటే మనసులో ఒక తెలియని అలౌకికానందం. రోజులు మారుతున్నాయి. స్టేషన్లు మారుతున్నాయి... భాషలు మారుతున్నాయి ... వాతావరణం కూడా మెల్లగా మారడం మొదలుపెట్టింది. మొదట గాలిలో చలి పెరిగింది. తర్వాత దూరంగా కనిపించే కొండలు దగ్గరవుతూనే వచ్చాయి. చివరికి పర్వతాలే ప్రపంచంలా కనిపించే ఒక ప్రాంతంలోకి అడుగుపెట్టినప్పుడు, నేను మరో లోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలిగింది. ఆ కొండల నిశ్చలత, ఆకాశం ఆ లోతు, గాలిలో ఉండే ఆ స్వచ్ఛత ఇవన్నీ కలిసి మనిషికి మాటలు తగ్గించి, అనుభూతులను అమాంతం పెంచేస్తాయి.
మేము ప్రయాణం చేస్తూ ఒక్కో ప్రదేశం దాటుతున్న కొద్దీ నాకు ప్రకృతి కొత్త రూపాల్లో దర్శనమిచ్చేది. కొన్ని చోట్ల నదులు రాళ్లను ఢీకొంటూ ఉరుకులు తీస్తూ ఉండేవి. వాటి శబ్దం కేవలం నీటి ప్రవాహం లా కాదు.. ఆది నుంచీ ఎవరో జపిస్తున్న మంత్రధ్వనిలా అనిపించేది. మరి కొన్ని చోట్ల పొగమంచు కొండల నడుమ అలా వాలిపోయి ఉండేది. దాన్ని చూస్తే, ప్రకృతి తన గుండెలో దాచుకున్న విశ్వరహస్యాలను అలా ముసుగులో దాచుకున్నట్టుండేది. ఉదయాన్నే తొలిసారి మంచుతో తడిసిన ఆకాశాన్ని చూస్తే, మన కళ్ల ముందే భూమి మరియు స్వర్గం కొద్దిసేపు కలిసిపోయినట్టనిపించేది.
ఉత్తర భారతం వైపు ప్రయాణం చేస్తూ నాకు బలంగా అనిపించిన విషయం అక్కడి ప్రజల జీవనశైలి. చలికి అలవాటు పడిన శరీరాలు, కొండల్ని ఇళ్ల ముందున్న మెట్లలా చూస్తూ నడిచే ఆ పాదాలు, తక్కువలో జీవిస్తూ కూడా తృప్తిగా కనిపించే ముఖాలు.. ఇవన్నీ మన జీవితం ఎంత అధికంగా భారమైపోయిందో నాకు బాగా గుర్తుచేశాయి. మనం నగరాల్లో పరుగులు తీసే ఆతురత అక్కడ కనిపించదు. అక్కడి నిశ్శబ్దంలో ఒక విధమైన స్థిరత్వం ఉంటుంది. అదే ఆ ప్రదేశాల ఆధ్యాత్మికతకు మొదటి అర్థం.
ఆ రోజు సూర్యోదయానికి ముందే నా ప్రయాణం కేదార్‌నాథ్ వైపు సాగింది.. ఆ దారి మాత్రం ఎప్పటికీ నా మదిలో నిలిచిపోయింది. నడవడం మొదలైన క్షణం నుంచే నాకు అర్థమైంది.. ఇది దర్శనానికి వెళ్తున్న దారి కాదు, ఇది పరీక్షకు వెళ్తున్న దారి. చలి, అలసట, ఎత్తు, ఊపిరి బరువు ఇలా ఒక్కొక్కటి మన శరీరానికి పరీక్ష పెడతాయి.. అప్పుడు అవే మనకు శత్రువులుగా మారుతాయి. కానీ అదే సమయంలో బుద్ది మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తుంది.. వద్దు ఇక చాలు వెళ్ళిపోదాం అంటూ.. కానీ మనసు మాత్రం సంకల్పంగా ముందుకు వెళ్ళమనే చెప్తుంది.. ఆ పర్వత దారుల్లో నడుస్తూ నేను నా గురించి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకున్నాను. ఎంతవరకు తట్టుకోగలనో, ఎంతవరకు భరించగలనో, ఎక్కడ అలసిపోతానో, ఎక్కడ మళ్లీ తిరిగి లేస్తానో ఇవన్నీ ఆ దారే నాకు నేర్పింది.
ఎన్నో గంటలు షుమారు 12,000 అడుగులు ఎక్కిన తరువాత దూరంగా మంచు కొండల మధ్య కేదార్‌నాథ్ క్షేత్రం తొలిసారి కనిపించిన ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను. అందరూ ఆ దేవాలయాన్ని చూసిన మరుక్షణమే కన్నీళ్లు ఎందుకు రాలుస్తారో అప్పుడు అర్థమైంది. అది కేవలం దేవాలయం కనిపించడం వల్ల కాదు. మన శ్రమకు, మన ఆశకు, మన ప్రార్థనకు ఒక రూపంలా కనిపించడం వల్ల. ఆ క్షణంలో శివుడు విగ్రహంలో కాకుండా వీచే గాలిలో కూడా ఆయన ఉన్నట్లుగా అనిపించింది.
కేదార్‌నాథ్‌లో నేను చూసింది అక్కడ మాటలు తగ్గిపోతాయి. మనసు తనంతట తానే మౌనమవుతుంది. ఆ మంచు పర్వతాల మధ్య నిలబడి ఉంటే మనిషి తనలోని తత్వాన్ని తప్పకుండా తనే గ్రహిస్తాడు. అదే ఆ క్షేత్ర మహిమ. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నాకు శివుడు అంటే కేవలం అభిషేకం, బిల్వదళం, మంత్రం లా కాకుండా ... భరించగలిగే నిశ్శబ్దం, నిలబెట్టే సహనం, మాటలకందని మహాశక్తిలా అనిపించాడు.
ఆ రోజు రాత్రి అక్కడే వుండి.. ప్రక్కరోజు వేకువనే దర్శనం చేసుకొని బద్రీనాథ్ వైపు ప్రయాణం సాగించాను.. కేదార్‌నాథ్ కఠిన తపస్సైతే, బద్రీనాథ్ ఒక మృదువైన ఆత్మశాంతి. ఆ ప్రాంతమంతా ఒక చల్లని ప్రశాంతతతో నిండి ఉంటుంది. అక్కడి గాలి తాకుడు కూడా ఓ స్పర్శ లా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే.. మన మనసులో చాలా రోజులుగా మోస్తున్న భారాన్ని అంతా ఒక్కసారిగా తగ్గించినట్టుంటుంది. బద్రీనాథ్ క్షేత్రం దగ్గరకు చేరుతున్నప్పుడు నాకు ఒక ఆలయం దగ్గరకు వెళ్తున్నట్టు కాకుండా, ఎంతోకాలం తర్వాత ఓ ఆశ్రమానికి చేరుతున్నట్టనిపించింది.
బద్రీనారాయణుడి దర్శనం నాకు చెప్పలేని ఓదార్పునిచ్చింది. ఎందుకో తెలియదు, అక్కడికి వెళ్లిన తర్వాత నా అంతరంగంలో ఎన్నాళ్లుగానో తిరుగుతున్న కొన్ని అలసటలు ఒక్కసారిగా సాంత్వన కలిగినట్లు అనిపించాయి.. శివక్షేత్రం నన్ను తన లోపలికి లాక్కున్నట్లు అనిపిస్తే.., బద్రీనాథ్ మెల్లగా ఆత్మీయంగా నన్ను అక్కున చేర్చుకున్నట్టు అనిపించింది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక దేవుడు గంభీరంగా మన ముందుంటే అది కేదార్‌నాథ్. ఒక దేవుడు మౌనంగా “వచ్చావా?” అని అడిగితే అది బద్రీనాథ్.
ఆ తరువాతి ప్రయాణం కాశీ వైపు సాగింది.. ఈ కాశీ అనుభవం మాత్రం పూర్తిగా వేరే దిశలో నన్ను ఆశ్చర్యపరిచింది. ఉత్తర యాత్రలో కాశీకి చేరుకునేలోపు నా మనసు ఇప్పటికే ఎన్నో అనుభవాలతో నిండిపోయింది. కానీ కాశీ లో అడుగుపెట్టిన వెంటనే మరో స్థాయిలో ఆలోచించడం మొదలైంది. ఆ నగరం గాలి కూడా వేరేలా ఉంటుంది. అక్కడి వీధులు అట్టడుగున కాలపు మూలాల్లో చిక్కుకున్నట్లు అనిపించాయి.. ఇరుకు సందుల్లో నడుస్తున్నప్పుడు, దేవాలయ ఘంటానాదం వినిపిస్తున్నప్పుడు, గంగాతీరానికి దిగుతున్నప్పుడు, మణికర్ణిక ఘాట్ లో మునకలేసినప్పుడు, హరిశ్చంద్ర ఘాట్ లో శవాల చితిమంటలను గంటలతరబడి చూస్తున్నప్పుడు మనిషి ఒక పాత నాగరికత నడుమ నడుస్తున్నాననే భావనకంటే, శాశ్వతత్వం ఎదుట నిల్చున్నాననే భావన కలిగింది.
కాశీ ఘాట్‌లు నా మనసులో చాలా లోతైన ముద్రలు వేశాయి. గంగను చూస్తే కాలం ప్రవహిస్తున్నట్టనిపించింది. ఒకవైపు దీపారాధన, మరోవైపు దహన సంస్కారాలు, ఇంకోవైపు జపంలో మునిగిన సన్యాసుల జీవితం, మరణం, భక్తి, విరక్తి అన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే చోటు ఈ భూమి మీద ఒక్క కాశీ మాత్రమే. అక్కడ నిలబడిన తర్వాత నాకు చాలా స్పష్టంగా అనిపించిన విషయం ఏమిటంటే, మనిషి చాలా విషయాలను అవసరానికి మించి పట్టుకుంటాడు. చివరికి గంగ తీరం చెబుతుంది తీసుకెళ్లేది ఏమీ లేదు, మిగిలేది చేసిన సాధన, మోసిన భావం, పలికిన ప్రార్థన అని.
తల్లి గర్భంలో ఉన్న తొమ్మిది నెలలకు గాను తొమ్మిది రోజులు కాశీ లోనే నేను ఉన్నాను. కాశీ విశ్వనాథుడి దర్శనం నాకు ఒక శాసనంలా అనిపించింది. శివుడు ఇక్కడ పర్వత నిశ్శబ్దంలో లేడు; ఇక్కడ ఆయన జన జీవితం మధ్యలో ఉన్నాడు. జనసందోహంలో ఉన్నాడు. ఘంటానాదంలో ఉన్నాడు. అగ్నిలో ఉన్నాడు. గంగలో ఉన్నాడు. మరణాన్ని భయంగా కాకుండా, మార్గమై అంగీకరించే బలం ఆ నగరంలో నాకు బలంగా కనిపించింది. అందుకే కాశీ కేవలం పుణ్యక్షేత్రం కాదు.. అది జీవితానికి మరియు అంతిమ సత్యానికి మధ్య నిలిచిన నగరం.
ఇలా రాసుకుంటూ వెళ్తే పేజీలకు పేజీలు నిండి పోర్లుతాయి.. అందుచేత ఇంకా ఎంతో చెప్పాలని వున్నా.. ఇక్కడితో కష్టంగా ముగిస్తున్నాను.. మీకు నిజంగా ఆసక్తి కనుక ఉంటే .. తదుపరి భాగం లో సమయాన్ని చూసుకొని మిగిలిన విషయాలు వివరిస్తాను.. అఘోరాలతో గడిపిన కొన్ని గంటలు.. సన్యాసులతో ముచ్చిటించిన ముచ్చట్లు.. శవాల మధ్య నేర్చుకున్న నిజాలు.. ఇరుకు దారుల్లో నేను చూసిన అద్భుతాలు.. సాయంత్రం అయితే గంగాహారతి దగ్గర జరిపే అందమైన అలంకరణాలు.. నెలవంకలా పారుతున్నగంగా ప్రవాహం.. ఇలా ఎన్నో మీతో పంచుకోవాలని ఉంది.. ఇక్కడితో ముగిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి..
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:
Post a Comment