Thursday, April 2, 2026

జీతం ముచ్చట్లు.. జీతగాడి 'గాలి' గోపురం..!


 నిజాలు ఒప్పుకోవాలి మరి.. ఆయ్!

ఒక కవికి అసలైన పరీక్ష 'హాస్యం'. ఎందుకంటే కన్నీళ్లు తెప్పించడం సులభం కానీ, పెదవులపై నవ్వు పూయించడం మహా కష్టం. హాస్యం నేను రాసి ఎన్నో సంవత్సరాలు అయింది.. ఒక మిత్రుని కోరిక మేరకు ఇవాళ రాయాల్సి వచ్చింది.
ఓ మిత్రమా! మీ కోసం నాలోని హాస్య కోణాన్ని కూసంత బూజు దులిపి ఝుళిపించాను.. ఎలా ఉందో చెప్పాలి మరి..

జీతం ముచ్చట్లు.. జీతగాడి 'గాలి' గోపురం..!
*******************************
అమ్మో... ఒకటో తారీఖు
అని ఎల్.బి. శ్రీరాం గారు గావుకేక ఎందుకు పెట్టారో
బాగా అర్ధం అవుతోంది!

జీతం రాగానే ఓ మహారాజులా
ఫీలవుతాము కానీ,
మరుసటి రోజే ఆ డబ్బులన్నీ..
'మాయాజాలం' లా మాయమవ్వడం చూసి
దడుచుకు చస్తాము!

జేబులో 'క్రెడిట్ కార్డు' ఉంటే..
అదొక 'అల్లావుద్దీన్ అద్భుత దీపం'
అనుకుంటాం బయ్యా..
తీరా బిల్లు చూశాక గానీ తెలియదు..
అది మనల్ని మింగేసే 'రాకాసి దీపం' అని!
"ఇప్పుడు వాడండి.. నిదానంగా కట్టండి"
అనే ఆ వల ఏదైతే ఉందో ..
మత్స్యకారుడు వేసే వల కంటే యమడేంజర్ బయ్యో!

సరుకుల లిస్టు చూస్తే..
మహాభారతం లా ఉంటుంది,
బియ్యం బస్తా రేటు పెరిగినప్పుడల్లా..
గుండె వేగం 'బుల్లెట్ ట్రైన్' కంటే
స్పీడుగా పెరుగుతుంది!
నూనె డబ్బా అయిపోతుంటే..
ప్రాణం పోతున్నంత 'వైరాగ్యం' వచ్చేస్తుంది!

ఇక ఈ EMIల గోల చెప్పనవసరం లేదు..
కారుకి ఒక కిస్తీ..
ఇల్లుకి ఒక కిస్తీ..
ఫోనుకి ఒక కిస్తీ..
ఆఖరికి కొన్న ఫ్రిజ్ కి కూడా కిస్తీ!
మనం బ్రతుకుతున్నది మన కోసం కానే కాదు..
బ్యాంకు వాడి 'లాభాల' కోసం అని అర్థమవ్వడానికి..
పెద్ద సమయమేమి పట్టదు బయ్యా!
కేవలం నెల పదో తారీఖు దాకా సరిపోతుంది!

సరే ఇవన్ని కిందా మీద పడి ఎలాగో సెట్ చేసి
హమ్మయ్యా.. అనుకుంటూ సాయంత్రం అయినా ప్రశాంతత
దొరుకుతుందనుకుంటే అది మన భ్రమే బయ్యా!
"స్కూల్ ఫీజు, రెంటు, గ్యాస్ సిలిండర్.."
ఇవే మనల్ని పలకరించే 'మధుర భోషాణాలు'!

ఆదివారం వస్తే చాలు..
హాయిగా నిద్రపోదామనుకుంటే,
"చుట్టాలు వస్తున్నారు.. అది తీసుకురండి!
ఇది తీసుకురండి" అని ఆర్డర్స్!
జేబులో ఉన్న 'గాంధీ తాత' గిలగిలలాడిపోతున్నాడు బయ్యా!

కరెంటు బిల్లు చూస్తే..
'షాక్' కొట్టిన కాకిలా ముందు మన గుండె ఆగుతుంది,
గ్యాస్ సిలిండర్ రేటు వింటే..
'మంట' పొయ్యిలో కంటే గుండెల్లోనే ఎక్కువ పుడుతుంది!

రాత్రికి పడుకుందామని కళ్లు మూస్తే..
రేపటి 'బాకీలు' కలలోకి వచ్చి కత్రినలా డాన్సు చేస్తాయి బయ్యా!
జీవితం అంతా ఒక 'ఇన్-స్టాల్-మెంట్' మయం..
కాసేపు అన్ని మర్చి పల్లికిలిద్దామనుకున్నా దానికి కూడా
'ట్యాక్స్' పడుతుందేమోనన్న భయం!

జీవితం అంతా ఒక 'ముక్కల ఆట' అయిపోయింది బయ్యా..
ఎంత కలిపినా చివరకి మిగిలేది..
'బ్యాలెన్స్ సున్నా' అనే పెద్ద కొటేషన్!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment