Monday, April 13, 2026

ఓ అమ్మాయి కథ...


టాపర్.. అనే పదాన్ని వినగానే మన మనసులో వారిపై ఒక ప్రత్యేకమైన గౌరవం పుడుతుంది కదా... క్లాస్‌లో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే విద్యార్థి అతను లేదా ఆమెను మనం సహజంగానే గొప్పగా భావిస్తాం. అలాంటి ఓ అమ్మాయి కథే ఇది.
స్కూల్ రోజుల నుంచే ఆమె ప్రతి క్లాస్‌లో టాపర్. టీచర్లు ఆమెను ఉదాహరణగా చూపించేవారు. ప్రతి ఫలితాల్లో ఆమె పేరు మొదట ఉండేది. మెడలో మెడల్స్, చేతిలో సర్టిఫికేట్స్, ఇవన్నీ చూసి ఆమె కుటుంబం గర్వపడేది. సమాజం ఆమెను విజయానికి ప్రతిరూపంగా చూసేది. “ఈ అమ్మాయి భవిష్యత్తు చాలా బ్రైట్” అని అందరూ చెప్పేవారు.

ఆమె కూడా అదే నమ్మింది. తాను చదివినదంతా నిజమైన జ్ఞానమే అనుకుంది.
ప్రతి పరీక్షలోనూ వందకు వంద మార్కులు సాధించడం ఆమెకు ఒక అలవాటుగా మారింది. పుస్తకంలోని అక్షరం పొల్లు పోకుండా కాగితం మీద పెట్టగలిగే ఆమె సామర్థ్యం ఆమెను ఒక మెమరీ మెషీన్ గా మార్చింది కానీ, ఒక మేధావి గా తీర్చిదిద్దలేకపోయింది.

కాలం గడిచింది.
చదువు పూర్తయింది.

మెడలో వేలాడిన మెడల్స్ తో, చేతిలో డిగ్రీలతో ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నించడం ప్రారంభించింది.

మొదటి ఇంటర్వ్యూ.. ఆమె చాలా నమ్మకంగా వెళ్లింది. కానీ అక్కడ అడిగిన ప్రశ్నలు పుస్తకాలలో ఉన్నట్టుగా లేవు. “ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలా పని చేస్తుంది?” “రియల్ టైమ్‌లో దీనిని ఎలా ఉపయోగిస్తారు?” అని అడిగినప్పుడు ఆమెకు మాటలు రాలేదు.

రెండో ఇంటర్వ్యూ…
మూడోది…
నాలుగోది…

అలా మూడేళ్లు గడిచిపోయాయి. కానీ ఒక్క కంపెనీ కూడా ఆమెను ఎంపిక చేయలేదు, సరికదా.. తనని, తన సర్టిఫికెట్స్ ని అస్సలు గుర్తించలేదు. మార్కులను చూసే ప్రపంచం నుంచి… మౌనం మాత్రమే సమాధానం ఇచ్చే ప్రపంచంలోకి ఆమె వచ్చేసింది. అప్పుడు ఆమెకు మెల్లగా రియాలిటీ అర్థమవడం ప్రారంభమైంది. ఎక్కడ లోపం జరిగిందో ఆలోచించింది. లోపం తన కష్టంలో లేదు, తను నేర్చుకున్న పద్ధతిలో ఉంది అని. సబ్జెక్టును బట్టీ పట్టడం ద్వారా పరీక్షలను గెలవవచ్చు, కానీ జీవితాన్ని గెలవలేము అని. టెక్నికల్ గా ఆమె వెనుకబడిపోవడానికి కారణం ఇదే. ఒక Formula ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న మూలం ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం ఏనాడు ఆమె చెయ్యలేదు.

పునాది లేకుండా కట్టిన ఎంతటి ఎత్తైన భవనమైనా సరే, ఒక్క భూకంపం వస్తే నేలమట్టం కావాల్సిందే. అలాగే, మూలాలు తెలియని జ్ఞానం కూడా ఇంటర్వ్యూ అనే చిన్న పరీక్ష ముందు పేకమేడలా కూలిపోతుంది. కంపెనీలకు కావాల్సింది కాగితం మీద ఉండే గోల్డ్ మెడల్స్ కాదు, రియల్ టైం లో క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను పరిష్కరించగల తెలివితేటలు. అక్షరాలను అప్పజెప్పే రామచిలుకలు మనకు ముచ్చటగా అనిపిస్తాయి కానీ, అవి స్వంతంగా బయట ప్రపంచంలో బ్రతకలేవు.
నిజానికి ఈ సమస్య ఆమె ఒక్కరిదే కాదు.. మార్కుల పరుగు పందెంలో పడి తమ బాల్యాన్ని కోల్పోతున్న ఒక తరం తాలూకు విషాదమిది. దీనికి తల్లితండ్రులు కూడా ఒక ముఖ్య కారణమే. వారికి కావాల్సింది కూడా కాగితం పై కనపడే మార్కులే.

ఈ అనుభవం ఒక పాఠం. చదువును కేవలం మార్కుల కోసం, హోదా కోసం కాకుండా, ఒక పరిపూర్ణమైన అవగాహన కోసం సాగించాలి. మనం చదివే ప్రతి వాక్యం మన లోపల ఒక ఆలోచనను రేకెత్తించాలి. ఏమిటి? అన్న ప్రశ్న కంటే ఎందుకు? మరియు ఎలా? అన్న ప్రశ్నలే జ్ఞానానికి అసలైన తలుపులు. Degree చేయడం ఎంత ముఖ్యమో, ఆ ప్రయాణంలో మనం సంపాదించిన అనుభవం కూడా అంతే ముఖ్యం. అక్షరాలను కేవలం కళ్లతో చదవకండి, వాటిని మనసుతో స్పృశించి, మెదడుతో విశ్లేషించండి. అప్పుడే మనం కేవలం పతకాలు పొందిన వ్యక్తులుగా కాకుండా, ప్రతిభ ఉన్న వ్యక్తులుగా ఈ ప్రపంచంలో నిలబడతాం.

టాపర్ అవ్వడం తప్పు కాదు, కానీ టాపర్‌గా నిలబడటానికి మాత్రమే చదవడం తప్పు.

చదువు అంటే గుర్తుపెట్టుకోవడం కాదు, చదువు అంటే అర్థం చేసుకోవడం. అర్థం చేసుకొని దాన్ని సరైన సమయంలో ఉపయోగించగలగడం.

లేకపోతే…
ఒక రోజు మీరు కూడా ఆ అమ్మాయిలానే నిలబడిపోతారు..

చేతిలో ఎన్ని బంగారు మెడల్స్ వున్నా.. మనసులో ఒకే ఒక్క ప్రశ్న (నిజంగా నేను ఏదైనా నేర్చుకున్నానా? లేక ఇన్నిరోజులు కేవలం చదివానా? అనే ప్రశ్న) మాత్రం మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది.

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment