Thursday, April 16, 2026

అరణ్యక...


 

ఎందుకో తెలియదు
ఆ రోజు మనసు అకస్మాత్తుగా
జన జీవితాన్ని విడిచి
చెట్ల మధ్యకు నడుస్తూ వెళ్ళింది!

అరుణోదయ కిరణాల హరిచందనపు పూతతో
మెల్లిగా మేల్కొంటున్నఅరణ్య మది..
నిశీధి వదిలిన నీలి తెరలను మెల్లగా తొలగిస్తూ
గిరిశిఖరాల పైనుంచి జాలువారే క్షీరధారలు
రాతి కంచముపై పడుతున్న స్ఫటిక మణుల
కింకిణీ నాదాల్లా ప్రతిధ్వనిస్తున్నాయి!

పొదరిళ్ళ మాటున వెదురు వెదుళ్లు
పిల్లగాలి తాకిడికి కృష్ణ వేణువులై మ్రోగుతుంటే
ఆ స్వరలయలకు అనుగుణంగా
లేలేత పచ్చిక మీద రాలిన మంచుబిందువులు
ముక్తాఫలాల్లా మెరుస్తూ పుడమికి
వేకువ స్వాగతం పలుకుతున్నాయి!

అరణ్య మధ్యన విరిసిన కడిమి పూల సువాసన
వనదేవత ధరించిన కస్తూరి లేపనంలా
నాసికను తాకుతూ మత్తెక్కిస్తుంటే..
మడవలలో ప్రవహించే నీటి గలగలలు
పాదాలకు అంటిన పారాణిని కడిగే
అభిషేక గీతాల్లా వినిపిస్తున్నాయి!

అటు చూడు..!
మొగ్గ తొడిగిన మాధవీ లత
ఒయ్యారాలు పోతూ గాలికి తలవంచుతుంటే
ప్రకృతి కాంత తన ముంగురులను
సవరించుకుంటున్న ఓ శృంగార చేష్ట లా ఉంది!
వికసించిన ఆ తామర రేకుల కన్నులలో
సూర్య రశ్మి ప్రతిబింబిస్తుంటే
అగ్ని కుండంలో ఉదయించిన
అపర సౌందర్యరాశిలా ఎంత అందంగా ఉందో!

నిజంగా..
ఈ మట్టి వాసనలో ఏదో మంత్రమూ,
ఈ పచ్చని ఆకులలో ఓ తంత్రమూ ఉందబ్బా..
పరిమళాల పల్లకిలో ఊరేగుతున్న
ఈ ప్రాతఃకాల సమయం..
నా కంటికి ఒక దివ్యమైన
శారదా నీరాజనంలా కనిపించింది!

వాయువు మోసుకొచ్చే ఈ వనమూలికల ధూపం
శ్వాసను తాకిన ప్రతిక్షణము
ఒక జన్మ చరితార్థమైనట్లుగా..
ప్రకృతి అనే మహాసభలో
నేనొక మూగ సాక్షిగా చూస్తూ మిగిలిపోయానలా!!

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment