ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణమే ఈ హస్తినాపురం.. ఒకప్పటి కురు సామ్రాజ్య రాజధానిగా ఇది వర్ణించబడినా, ఇక్కడి భూగర్భంలో దాగిన రహస్యాలు మాత్రం మనల్ని వేల ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళి అక్కడి నిజాల్ని నిలదీస్తున్నాయి.
1950-52 కాలంలో అప్పటి ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డా. బి.బి. లాల్ నేతృత్వంలో హస్తినాపురంలో తవ్వకాలు జరిగాయి. అప్పుడు బయటపడిన ఆధారాలు మట్టి పాత్రలే కాదు, అవి ఆనాటి వారి నాగరికతకు సజీవ సాక్ష్యాలు. హస్తినాపురం తవ్వకాల్లో ఒక ప్రత్యేకమైన శైలి కలిగిన బూడిద రంగు మట్టి పాత్రలు పెయింటెడ్ గ్రే వేర్ లభించాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఇవి క్రీస్తు పూర్వం 1100 - 800 నాటివని ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ, ఇతర ప్రాంతాల్లో దొరికిన ఆధారాలతో పోల్చినప్పుడు ఇవి మహాభారత కాలపు సాంకేతికతతో సరిగ్గా సరిపోతున్నాయి. అలానే మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఉంది. నిచక్షు మహారాజు కాలంలో గంగానది ఉప్పొంగి హస్తినాపురాన్ని ముంచెత్తడంతో, రాజధానిని కౌశంబికి మార్చారు. బి.బి. లాల్ గారు జరిపిన తవ్వకాల్లో హస్తినాపురంలోని ఒక పొర భారీ వరదల వల్ల కొట్టుకుపోయినట్లు స్పష్టమైన ఆనవాళ్లు దొరికాయి. ఇది పురాణాల్లో చెప్పబడిన భౌగోళిక మార్పుకు ఓ శాస్త్రీయ ధృవీకరణ. కురుక్షేత్ర మరియు హస్తినాపుర పరిసరాల్లో జరిపిన తవ్వకాల్లో ఇనుముతో చేసిన బాణాల మొనలు, బల్లేలు లభించాయి. ఇవి ఆ కాలంలో ఇనుప యుగం ఎంతటి పరిణితి చెందిందో అనడానికి ముఖ్య ఆనవాళ్ళు.
హస్తినాపురానికి సమీపంలో ఉన్న సినౌలీ అనే ప్రాంతంలో 2018లో జరిగిన తవ్వకాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. అక్కడ దొరికిన 'యుద్ధ రథాలు' చూసి ప్రపంచమే విస్తుపోయింది. రాగి పూత పూసిన చక్రాలతో ఉన్న ఈ రథాలు, కత్తులు, శిరస్త్రాణాలు చూస్తుంటే.. వ్యాసుడు వర్ణించిన యుద్ధ తంత్రం ఎంతటి ఉన్నతమైనదో అర్థమవుతుంది. ఇవి సుమారు క్రీ.పూ. 2000 ప్రాంతానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు. అంటే అప్పటికే మన భారతదేశంలో అద్భుతమైన యుద్ధ సంస్కృతి ఉండేదని ఇవన్ని నిరూపిస్తున్నాయి. ఇది మహాభారతంలోని యుద్ధ వర్ణనలకు మరింత బలాన్ని ఇచ్చే ముఖ్య సాక్ష్యం.
ఆ తరువాత మహాభారతంలో వందల సార్లు ప్రస్తావించిన సరస్వతీ నది ఒకప్పుడు కల్పితం అనుకున్నారు. కానీ, నేడు ISRO మరియు NASA ఉపగ్రహ చిత్రాల ద్వారా భూమి అడుగున ఎండిపోయిన మహా నది ప్రవాహ మార్గాన్ని గుర్తించారు. భౌగోళిక మార్పుల వల్ల ఆ నది క్రీ.పూ. 1900 కాలంలో అంతర్ధానమైందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది కూడా సరిగ్గా మహాభారత కాలపు భౌగోళిక వర్ణనలకు సరిగ్గా సరిపోతుంది.
ద్వారక సముద్రంలో ఉంటే, హస్తినాపురం నేల అడుగున ఉంది. ఒకటి మునిగిపోయిన నాగరికత గురించి చెబితే, మరొకటి కాలక్రమేణా రూపు మార్చుకున్న సామ్రాజ్యం గురించి చెబుతోంది. వ్యాస మహర్షి వర్ణించిన ఆ మేడలు, మిద్దెలు నేడు మట్టిలో కలిసిపోయి ఉండవచ్చు.. కానీ ఆ మట్టి అణువణువునా ఉన్న ఆనవాళ్ళు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
ఇప్పుడు మనం ఇంకో ఆసక్తికరమైన ఆధారాన్ని పరిశీలిద్దాం…మనం ఇప్పటివరకు సముద్ర గర్భంలో, ఆకాశంలో మరియు భూమి పొరల్లో ఆధారాలను వెతికాము. కానీ మహాభారతం నిజమని చెప్పడానికి మన ప్రాచీన గ్రంథాల్లో లిఖించబడిన 'వంశవృక్షాలు' అత్యంత బలమైన సాక్ష్యాలు. ఒక వ్యక్తి తన ఊహతో ఒక కథను సృష్టించగలడు కానీ, వందల తరాల వరకు విస్తరించిన రాజుల పేర్లను, వారి పాలనా కాలాలను, చరిత్రలను తప్పు లేకుండా సృష్టించడం ఎలా సాధ్యం ? అది అసాధ్యం కదా..
మహాభారత కథ ముగిసినా, ఆ వంశం ఆగిపోలేదు. పాండవుల తర్వాత కూడా కురు వంశం ఎలా సాగిందో మన పురాణాలు అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేశాయి. అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తు కురు సామ్రాజ్యానికి రాజు కావడంతో కలియుగం ప్రారంభమైందని మన లెక్కలు చెబుతున్నాయి. పరీక్షిత్తు తర్వాత ఆయన కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేసిన ఆ ప్రదేశమే నేటి తక్షశిల వంటివి అని భౌగోళికంగా గుర్తించబడ్డాయి. మహాభారత యుద్ధంలో పాల్గొన్న జరాసంధుడి వంశం మగధ సామ్రాజ్యం గురించి మన పురాణాల్లో స్పష్టమైన రికార్డులు ఉన్నాయి. బార్హద్రథ వంశం నుండి మొదలై మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్యుడు వరకు ఉన్న రాజుల జాబితా, వారి పాలనా సంవత్సరాలు చరిత్రకారుల లెక్కలతో సరితూగుతున్నాయి. భాగవత, మత్స్య మరియు వాయు పురాణాల్లో 'కలియుగ రాజవంశావళి' పేరుతో ఒక ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో మహాభారత యుద్ధం తర్వాత పాలించిన సుమారు 30 తరాల రాజుల పేర్లు ఉన్నాయి. ఒక కల్పిత కథలో ఇన్ని వందల ఏళ్ల చరిత్రలను, తరాలను ఎవరు పొందుపరచగలరు? ఇది సాధ్యమా ?
వంశవృక్షాలకు కేవలం పుస్తకాలే కాదు, శిలాశాసనాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. ఉదాహరణకు సా.శ. 634 నాటి ఈ ప్రసిద్ధ శిలాశాసనంలో బాదామి చాళుక్య రాజు పులకేశి-II, మహాభారత యుద్ధం జరిగి అప్పటికి 3735 ఏళ్లు పూర్తయ్యాయని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రాచీన భారతదేశంలో మహాభారత యుద్ధం అనేది అందరూ అంగీకరించిన ఒక చారిత్రక మైలురాయి.
నిజంగా ఇది కల్పితమే అయితే .. ఒక రచయిత ఇంతటి విస్తృతమైన వంశవృక్షాన్ని ఎందుకు సృష్టించాలి?
నిజంగా ఇది జరిగింది అయితే .. ఉన్న రాజవంశాల చరిత్రనే తరతరాలుగా కాపాడి, గ్రంథ రూపంలో అందించారా?
నా పాయింట్ అఫ్ వ్యూ లో .. ఇది పూర్తిగా కథ కాదు, అలా అని పూర్తిగా చరిత్ర కూడా కాదు… కానీ నిజానికి అత్యంత దగ్గరగా ఉన్న ఒక మహా ఇతిహాసం. వ్యాస మహర్షి లిఖించిన ప్రతి అక్షరం వెనుక ఒక సత్యం ఉంది. ప్రతి శ్లోకం వెనుక ఒక సాక్ష్యం ఉంది. మహాభారతం అనేది గతం కాదు, అది మన అస్తిత్వం! ఈ సత్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. నడిపిస్తూనే ఉంటుంది.
మరి మీ అభిప్రాయాలు చెప్పండి ..
ఈ వ్యాసాన్ని నేను కేవలం సమాచారంగా మాత్రమే కాకుండా ఒక చారిత్రక బాధ్యతగా తీసుకొని నా సరళిలో రాసాను. అందరూ అంగీకరించాలని కాదు. కానీ కొందరైనా ఇది కేవలం కల్పితం కాదు అనే పరిశీలన చేస్తారనే సదుద్దేశంతో రాసాను. చదివే వందమంది కోసం కాదు.. ఆలోచించే ఆ ఒక్కరి కోసమే నా ఈ అక్షరీకరణ.
~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina
Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:
Post a Comment