Monday, April 20, 2026

మహాభారతం కేవలం కథా? లేక చరిత్రా?


మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర మహాసంగ్రామం, శ్రీకృష్ణుడి గీతోపదేశం. కానీ, ఆధునిక కాలంలో చాలామంది దీనిని ఒక 'కల్పిత పురాణం' అని కొట్టిపారేస్తుంటారు. నిజానికి మహాభారతం ఒక కల్పిత కథా? లేక మన భారతీయ గడ్డపై నిజంగా జరిగిన చరిత్ర పుటలా?

భాగవతం చదివిన ప్రతిసారి అది ఒక కథలా అనిపిస్తుంది. ఆలోచించిన ప్రతిసారి అది ఒక సత్యంలా అనిపిస్తుంది.

యుద్ధాలు, వంశాలు, రాజ్యాలు, ప్రమాణాలు, ఇవన్నీ కలిసిన ఈ మహాగాథ, నిజంగా ఎక్కడో, ఎప్పుడో జరిగిందా? లేక మనిషి ఊహాశక్తి సృష్టించిన ఓ అద్భుత కావ్యమా?
ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి, మనము ఇతిహాసంలోకి కాకుండా కాసేపు ఆధారాల లోపలికి ప్రయాణిద్దాం.

మొదటగా, సముద్రపు నిశ్శబ్దంలో దాగి ఉన్న ఒక మహా నగరం ద్వారక గురించి మాట్లాడుకుందాం.

మహాభారత యుద్ధం ముగిసిన 36 ఏళ్ల తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని నిజం చేస్తూ గత కొన్ని దశాబ్దాలుగా జరిగిన పరిశోధనలు సంచలన నిజాలను బయటపెట్టాయి.
1980వ దశకంలో డా. ఎస్.ఆర్. రావు పరిశోధనలు The Pioneer మరియు ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డా. ఎస్.ఆర్. రావు ఆధ్వర్యంలో 'మెరైన్ ఆర్కియాలజీ యూనిట్' గుజరాత్ తీరంలోని బెట్ ద్వారకలో తేదీ 1983 నుండి 1990 మధ్య తవ్వకాలు చేపట్టింది. సముద్ర మట్టానికి 20-30 అడుగుల లోతులో భారీ కోట గోడలు, బురుజులు మరియు ఒక పురాతన ఓడరేవు అవశేషాలు దొరికాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ 'ముద్ర' ఒకటి వారికి లభించింది. మహాభారతంలో ద్వారకలో నివసించే వారు ఒక ప్రత్యేక ముద్రను ధరించాలని కృష్ణుడు అప్పట్లో ఆదేశించినట్లు పురాణాల్లో చెప్పబడింది.. దానికి సరిగ్గా సరిపోయే ముద్ర అక్కడ దొరకడం చరిత్రకారులను ఎంతో ఆశ్చర్యపరిచింది.

అలానే 2001లో NIOT సంచలన ఆవిష్కరణ The Gulf of Khambhat నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు కాంబే సింధుశాఖలో Gulf of Khambhat జరిపిన సర్వేలో అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2001 మే నెలలో అప్పటి కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషి ఈ ఆవిష్కరణను అధికారికంగా ప్రకటించారు. 'సోనార్' ఇమేజింగ్ ద్వారా సముద్రం కింద దాదాపు 9 కిలోమీటర్ల పొడవున్న ఒక నగరాన్ని వారు గుర్తించారు. అక్కడ దొరికిన ఒక చెక్క ముక్కను బ్రిటన్ మరియు హైదరాబాద్‌లోని ల్యాబ్‌లలో 'కార్బన్ డేటింగ్' చేయగా, అది క్రీస్తు పూర్వం 7500 ఏళ్ల నాటిదని తేలింది. అంటే నేటికీ సుమారు 9500 ఏళ్ల క్రితం అక్కడ మనం ఊహించని ఒక గొప్ప నాగరికత ఉండేదని అర్థం.

అంతేకాదు, అక్కడి తవ్వకాల్లో పదుల సంఖ్యలో త్రిభుజాకారపు రాతి నంగర్లు (Stone Anchors) దొరికాయి. ఇవి ఆ కాలంలో అంతర్జాతీయ వాణిజ్యానికి ద్వారక ఒక ప్రధాన కేంద్రమని నిరూపిస్తున్నాయి. ఇవి సిరియా మరియు సైప్రస్ వంటి ప్రాంతాల్లో దొరికిన నంగర్ల శైలిలో ఉన్నాయి. 2002 లో భారత తీరంలో ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం లభ్యం అని బిబిసి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం కూడా చేసింది & ద్వారకను ఒక ముఖ్యమైన సముద్ర గర్భ వారసత్వ ప్రదేశంగా యునెస్కో కూడా గుర్తించింది.

నిన్నటి వరకు ఇది కథ అనుకున్న కొందరికి 2001లో NIOT శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో సోనార్ కెమెరాలు పెట్టి చూస్తే కానీ తెలియలేదు... అక్కడ నిశ్శబ్దంగా నిద్రిస్తున్న ఒక మహానగరమే ఉందని.

ఇప్పుడు ఖగోళ ఆధారాలను కూడా పరిశీలిద్దాం.

ఈ ఖగోళ ఆధారాలు అనేవి మహాభారత కాలంలో అత్యంత శాస్త్రీయమైనవిగా పరిగణించబడ్డాయి. వ్యాస మహర్షి మహాభారతంలో సుమారు 150కి పైగా ఖగోళ సంఘటనలను (గ్రహణాలు, గ్రహాల కలయికలు, నక్షత్ర స్థితులు) నమోదు చేశారు. అలానే యుద్ధానికి ముందు, యుద్ధ సమయంలో మరియు యుద్ధం తర్వాత ఆకాశంలో జరిగిన మార్పులను ఆయన చాలా వివరంగా చెప్పారు.

మహాభారత యుద్ధానికి ముందు, 13 రోజుల వ్యవధిలోనే సూర్య మరియు చంద్ర గ్రహణాలు సంభవించాయని వారు పేర్కొన్నారు. ఇది ఖగోళ శాస్త్రం ప్రకారం అత్యంత అరుదైన సంఘటన. వీటిని ఆధునిక సాఫ్ట్‌వేర్ల ద్వారా విశ్లేషించినప్పుడు బయటపడిన సంచలన నిజాలు ఒకసారి చూద్దాం..

ప్రముఖ పరిశోధకుడు పుష్కర్ భట్నాగర్ 'ప్లానిటేరియం సాఫ్ట్‌వేర్' సాయంతో పరిశీలించగా, క్రీస్తు పూర్వం 3137, సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో సరిగ్గా ఇలాంటి గ్రహణాల కలయిక జరిగినట్లు తెలిపారు. సాధారణంగా 15 రోజులకు ఒకసారి వచ్చే గ్రహణాలు, కేవలం 13 రోజుల వ్యవధిలోనే రావడం అనేది ఒక వినాశనానికి సంకేతమని వ్యాసుడు ఆనాడే చెప్పడం, అది గణితపరంగా నిరూపితమవ్వడం పరిశోధకులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.

అలానే భీష్ముడు యుద్ధం ముగిసిన తర్వాత కూడా అంపశయ్యపై ఉండి, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే వరకు వేచి చూసి ప్రాణాలు విడిచారని మన అందరికీ తెలుసు. దీనిని పరిశోధించిన డా. నరహరి అచార్ వంటి శాస్త్రవేత్తలు, ఆ నాడు ఆకాశంలో ఉన్న గ్రహ స్థితులను విశ్లేషించి భీష్ముడు ప్రాణాలు విడిచిన ఆ రోజు 'మాఘ శుద్ధ అష్టమి' అని, ఆ సమయంలో రోహిణి నక్షత్రం మరియు ఇతర గ్రహాల స్థితి క్రీ.పూ. 3137 నాటి కాలమానంతో ఖచ్చితంగా సరిపోతున్నాయని నిరూపించారు.

వ్యాసుడు మహాభారతంలో శని గ్రహం 'రోహిణి' నక్షత్రం వద్ద, కుజ గ్రహం 'జ్యేష్ఠ' నక్షత్రం వద్ద వక్రగతిలో ఉన్నాయని వర్ణించారు. ఖగోళ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, యుద్ధం జరిగిన ఆ కాలంలో ఈ గ్రహాల స్థితి కచ్చితంగా అలాగే ఉంది. ఒక కల్పిత కథ రాసే వ్యక్తికి గ్రహాల వక్రగతి గురించి, నక్షత్ర మండలాల్లో వాటి స్థానాల గురించి ఇంతటి లోతైన అవగాహన ఉండటం ఎలా సాధ్యం. ఇది ఆ నాడు ఆకాశాన్ని గమనించి రాసిన 'లైవ్ రిపోర్ట్' అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

వేల ఏళ్ల క్రితం టెలిస్కోపులు లేని కాలంలో, ఒక రచయిత లక్ష శ్లోకాల గ్రంథంలో ఇన్ని వందల ఖగోళ సంఘటనలను తప్పు లేకుండా నమోదు చేయడం సామాన్యమైన విషయం కానే కాదు. దీనిని కేవలం కల్పిత కథ అని కొట్టిపారేయలేం.
తరువాత మనం ఉత్తర భారతదేశంలోని ఒక ప్రాచీన నగరానికి వెళ్దాం. దానిపేరే హస్తినాపురం.

దీని గురించి తదుపరి భాగంలో మరింత ఆధారాలతో దీన్ని కొనసాగిద్దాం...

ఏమంటారు ?

~~ త్రిశూల్ ~~
Written by: Bobby Aniboyina

Email: baburajendhra@gmail.com
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?igsh=MzNlNGNkZWQ4Mg==

No comments:

Post a Comment