Tuesday, January 24, 2017

“రంగుల ప్రపంచం”..




ఒక రైతుకు “వరి” శిక్ష... మరో రైతు నెత్తిన “పత్తి” కత్తి... ఇంకో రైతుకు నిలువెల్లా “కూర” గాయాలు... మరో రైతుకు భారంలా “వేరుశనగ”... ఘోరంగా “ఉల్లి”... చేదుగా “చెరుకు”... ఏ రైతును చూసినా కష్టమే.. ఏ సాగును చూసినా నష్టమే.. పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు ... ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు... ఇది ఒక్క ఏడాది కథ కాదు... ఎన్నో ఏళ్లుగా నిర్విరామంగా సాగుతున్న కన్నీటి వ్యథ... ఈ వ్యథను చుసిన, విన్న వారి కళ్ళు చమర్చక మానవు.. అలాంటి ఒక కన్నీటి బిందువే నా ఈ చిరు కవిత.. 

ఈ అశ్రువుల అక్షరాలను రైతుకి అర్పిస్తూ.. “రంగుల ప్రపంచం” రాస్తున్నాను.. చదివి అభిప్రాయం చెప్పగలరు.. 

“రంగుల ప్రపంచం”..
*************

పోగవుతున్న భావాలను 
పదిల పరిచేందుకు, 
పెన్ను, కాగితం తీసుకున్నా..! 
వసంతాన్ని కౌగిట చేర్చి,
చిగురాకుల సందుల్లో చిందులేస్తూ,
కానరాని కోకిలమ్మ
సరాగాలు పాడే తీరును 
రాద్దామనుకున్నా..!
కాని,
భుజాన నాగలిని నిలిపి..
ఒళ్లంతా కమిలిన గాయాలతో,
కాడెద్దులా మారి దున్నుతున్న
ఓ రైతు కనిపించాడు.. !
రక్తంతో తన పొలాన్ని తడుపుతూ.. 
కన్నీళ్ళతో చేనును దున్నుతూ ..
అన్నపూర్ణను అందరికీ అందించాలనే, 
తపనతో భగీరధునిలా మారిన ఆ 
సంకల్పబలాన్ని చూస్తున్న నాకు 
అన్నం “మేకు” అయిందనో, 
“ముద్ద” అయిందనో, 
ప్రక్కకు నెట్టే నేటి మనుషుల 
మనస్తత్వ పోకడలు ఒక్కసారిగా
జ్ఞప్తికి వచ్చాయి.. !!
నీటికోసం నింగివంకా, 
పంటకోసం నేలవంకా, 
ఆశపడుతూ..పరుగుపెడుతూ.. 
నేలతల్లిని నమ్ముకొని,
ఉన్నదంతా అమ్ముకొని, 
బిడ్డల కన్నా “చేనే” ప్రాణమనుకొని, 
పొలాల మధ్య తిరుగుతూ 
బక్కచిక్కిన ఈ కర్మలోకపు 
కర్షకుడి కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించట్లేదు .. ఈ నాడు .. 
నీరుతో తడవాల్సిన భూములు 
రైతుల కన్నీళ్ళతో తడుస్తున్నాయి.. 
పచ్చగా పలకరించాల్సిన పంటలు 
బీడులై దీన స్థితితో చూస్తున్నాయి.. 
నిజంగానే ఇదో “రంగుల ప్రపంచం”.. 
“విద్య” వ్యపారమౌతోంది.. 
“వైద్యం” అంగట్లో వస్తువౌతోంది.. 
“బంధాలు” సెంటిమెంట్లు అవుతున్నాయి.. 
“అమ్మ” అద్దెకు దొరుకుతోంది.. 
“నాన్న”కు చిరునామానే అవసరం లేదు..
“క్రమశిక్షణ మా ప్రత్యేకత” అన్న నినాదం.. 
“కంప్యూటర్ మా లక్ష్యం” గా మారుతోంది.. 
“జాతీయగీతం” పరదేశం ఆలాపన చేస్తుంది.. 
దేశాన్ని అమ్మేవారు “దేశభక్తులు” అయ్యారు.. 
పొలాలు “స్మశానాలు” అవుతున్నాయి.. 
ఇక్కడ 
అన్నం, నీళ్ళు దొరకవు.. 
సెల్ పోన్లు, కలర్ టీవీలు, 
టాబ్ లు, కార్లు చౌకగా దొరుకుతాయి.. 
ప్రేమ అమ్మబడుతుంది “తూకాని”కి.. 
రక్తం చిమ్మబడుతుంది “ఉత్త పుణ్యానికి” 
అదో మాయా ప్రపంచం.. 
అదే “రంగుల ప్రపంచం”..

Written by : Bobby

No comments:

Post a Comment