Wednesday, December 18, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 30th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఏమైంది ?? ఎందుకు ఏడుస్తున్నారు ??అంటూ ఆకాష్ … 

ఇది ఏడుపు కాదు… నా అనుకున్న వాళ్ళు ఇంకా సజీవంగానే ఉన్నారు.. వాళ్లను నేను వెంటనే చూడాలి వాళ్ల దగ్గరికి నేను వెంటనే వెళ్ళాలి అంటుంది ఉవిధ..

అసలు వారు ఎక్కడున్నారు ?? 

ఎక్కడి నుంచి వారి మాటలు మనకు వినపడుతున్నాయి? అడుగుతాడు ఆకాష్…

తరువాత ఏంటో చూద్దాం పదండి..
30th Part
వారు మనకి కొద్ది దూరంలోనే ఉన్నారు… అప్పటి వారి మేధోసంపత్తికి ఈ కట్టడం ఒక తార్కాణం .. కొన్ని గజాల దూరంలో నుంచే ఆ గదిలో మాట్లాడే మాటలను ఇక్కడ నిలబడి రహస్యంగా వినగలిగేలా దీన్ని ఏర్పాటు చేశారు... ఇది శబ్దశాస్త్రం లోని ఓ ముఖ్యమైన ఘట్టం… ఇది కూడా భారతీయ సంస్కృతి లోని ఒక భాగమే.. అంటుంది ఉవిధ..

ఇక్కడి కట్టడాలు నిర్మాణాలు చాలావరకు భారతీయ సంస్కృతికి చిహ్నాలు గానే ఉన్నాయి… మీ గ్రంధాలలోని మర్మాలను, అత్యంత రహస్యమైన విషయాలను ఎన్నింటినో ఇక్కడ ఉపయోగించారు… వీరు దొంగిలించింది కేవలం మీ యొక్క గ్రంథాలని మాత్రమే కాదు మీ పూర్వీకుల అపారమైన మేధోసంపత్తిని వాటి అనుభవాలను కూడా…

నా వాళ్ళు ఎంతమంది సజీవంగా వున్నారో నాకు తెలియట్లేదు.. కానీ ఈ గొంతులు విన్నాక కొందరైనా బ్రతికి వున్నారని అర్ధం అయింది.. ఇక మనం ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరాలి అంటూ ముందుకు వేగంగా కదుల్తుంది ఉవిధ.. 


ముందుకు వెళ్లేకొద్ది .. ఎన్నో ఏళ్ళ సంవత్సరముల క్రితం నేల మీద రాళ్ళు ఒకటి తరువాత మరొకటి పేర్చినట్లు కనిపిస్తుంది.. ఆ రాళ్ళు చాలా చల్లగా వున్నట్లు కాళ్ళకు అనిపిస్తుంది.. ఆ రాళ్ల మధ్యలో కాస్త గడ్డి మొలిచి నడిచేందుకు అనువుగా వుంది.

అలానే వెళ్తూనే వున్నారు.. ఆ దారి కిందకు వెళ్తున్నట్లుగా కాస్త పల్లముతో కూడుకొని వుంది.. దానివల్ల వారు మెల్లిగా వెళ్దాం అనుకున్నా.. వారి పాదాలు అందుకు సహకరించడం లేదు.. ఆ ముగ్గురూ చాలా వేగంగా ముందుకు కదుల్తున్నారు.. ఆ మార్గం పాతాళానికి వెళ్తున్నట్లుగా వారు భావిస్తారు.. 

వెళ్ళేకొద్దీ ఇంకా ఇంకా పల్లముతో ఆ నేలమారుతోంది... వేసే ప్రతీ అడుగు చాలా జాగ్రత్తగా వేస్తూ ముందుకు కదుల్తున్నారు ముగ్గురూ.. 

అంతలోనే ఉవిధ కంటే ముందుగా లోకేష్ అనుకోకుండా వేగంగా ముందుకు వెళ్తుండగా.. వెనుక నుంచి ఉవిధ తనని వారించేలోగా కుడిచేతిప్రక్క గోడలోంచి కొన్ని టన్నుల బరువున్న ఓ బలమైన రాయి తనని ఎడమవైపు గోడకు బలంగా అదుముతుంది .. తను అక్కడకు అక్కడే పడిపోతాడు.. వెనుక వచ్చే ఆకాష్, ఉవిధ లు ఆ రాయిని తప్పించుకొని లోకేష్ ను పక్కకు తీసుకొచ్చారు.. ఆకాష్ కళ్ళలో నీళ్ళు ..!! 

లోకీ.. లోకీ అంటూఏడ్చే ఆకాష్ రోధనకు ఆ ప్రదేశమంతా దుఃఖసాగరమై పోయింది స్తబ్దుగా .. 

కఠినమైన హృదయముగల (యక్షామి) ఉవిధ.. కూడా కన్నీటిపర్యంతమై లోకేష్ ని చూస్తూ తనలో తాను బాధపడుతూ అలానే ఉండిపోయింది…

తన సోదరుడైన లోకేష్ ను .. ఆకాష్ తన బాహువులపై వేసుకొని కన్నీరు కారుస్తూనే ముందుకు కదిలాడు..

అక్కడ ఓ విశాలమైన గది… ఆ గదిలో ఉక్కు సంకెళ్ళతో బంధించిన స్త్రీ లు కొందరు వున్నారు..ఆ ప్రదేశమంతా భరించలేని దుర్గంధముతో నిండివుంది.. నెలల తరబడి అక్కడి వారికి సరైన ఆహారం, నీటి వసతి లేనందువల్ల అడుగు తీసి అడుగు వేసేందుకు వీలు లేకుండా ఆ ప్రదేశమంతా నరకంలా మారివుంది.. 

వారి చేతికి, కాళ్ళకు వేసిన ఉక్కుసంకెళ్ళ వల్ల ఆ సంకెళ్ళు వేసిన ప్రాంతమంతా పుండు అయిపోయి ఆ సంకెళ్ళపై నెత్తుటి మరకలు చారలు చారలుగా కారి కనిపిస్తున్నాయి.. నేల అంతా వారి గాయాలనుంచి కారిన రసి తో అత్యంత జుగుప్సాకరముగా వుంది.. 

కానీ ఆ స్త్రీల నిస్సహాయతను, వారి స్థితి ని చూసి ఇద్దరికీ నోట మాట రాకుండా జాలిగా చూస్తూ ఉండిపోయారు అలానే.. 

ఆకాష్ తన బాహువులపై నుంచి తన సోదరుడిని మెల్లిగా కిందకు దించి ఏడుస్తూనే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.. కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు.. లోకేష్ గుండెపై తన చెవి పెట్టి చూడగా తను మరణించినట్లు ఆకాష్ గ్రహిస్తాడు.. బిగ్గరగా రోధిస్తూ పక్కనే వున్న గోడను తన పిడికెళ్ళతో కోపంగా కొడుతూ వున్నాడు ఆకాష్.. 

తన పిడికెళ్ళ నుంచి రక్తం కారుతున్నా తాను అలానే కొడుతూ వుండగా.. ఉవిధ వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టుకుంది.. 

ఎందుకు ఆపుతున్నారు నన్ను.. కన్నీరు కారుతూ ఎర్రబడిన తన కళ్ళను పెద్దవి చేసి కోపంగా అడుగుతాడు ఆకాష్.. 

రౌద్రముగా మారిన ఆకాష్ కళ్ళను చూసి ఒకింత వొణుకుపాటుకు గురై భయపడుతూనే .. 

ఆకాష్ .. !! నీ కన్నీళ్ళను నీ బాధను నేను గ్రహించగలుగుతున్నాను.. కానీ తాను మరణించి చాలాసేపు అయింది..ఆ విషయం నాకు ముందే తెలుసు.. కానీ నీకు చెప్పలేక అలా మౌనంగా ఉండిపోయాను.. అఘోరా చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకో.. 

తన కాలం ఇక్కడితో ముగిసిపోయింది.. 

గతించిన కాలాన్ని వెనక్కు తీసుకురాలేవు.. ఒక్కసారి నీ ముందువున్న వారిని చూడు.. వారి కన్నీళ్ళను, వారి పరిస్థితిని చూడు.. నువ్వు దేనికోసమైతే ఇంతదూరం ప్రయాస పడి వచ్చావో అది నీ ముందే వుంది.. ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ, బాధపడుతూ కూర్చుంటే మనమూ ఇక్కడ బంధీలుగా మారిపోతాము.. ప్రస్తుతం మనకు సమయం లేదు.. అడుగు దూరంలో గమ్యాన్ని పెట్టుకొని నువ్వు ఇలా నిరుత్సాహ పడితే నీ సోదరుని మరణానికి అర్ధమే లేకుండా పోతుంది.. ఒక్కసారి సావధానంగా ఆలోచించు.. అంటుంది ఉవిధ.. 

నా తండ్రికి, నా మిగతా సోదరులకు నేనేమని సమాధానం చెప్పాలి .. ?? 

తన రక్షణ నాదంటూ వాడికి నేను మాట ఇచ్చాను..కానీ రక్షించుకోలేక పోయాను.. కళ్ళముందే .. నా కళ్ళముందే నా సోదరుడు నిర్జీవుడై పోయాడు.. ఈ ఆలోచన నాకు నరకం కన్నా బాధిస్తుంది… ఈ బాధకు మరణమే నాకు సరైన మందు అంటూ.. రోధిస్తాడు ఆకాష్.. !!

ఆకాష్ నా మాట విను..ప్రమాదం ముంచుకొస్తుంది.. ఎక్కువసేపు మనం ఇక్కడ వుండకూడదు.. మనవల్ల ఇక్కడవారికి మరింత ప్రాణాంతకం అవుతుంది.. 

లే.. ముందు లే ఇక్కడ నుంచి అంటూ ఆకాష్ చేతిని పట్టుకొని బలవంతంగా పైకి ఎత్తుతుంది.. 

తన ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్న ఆకాష్ పైకి లేచి తన తమ్ముడను కాసేపు అలానే చూసుకొని.. కళ్ళు తుడుచుకుని.. ఆ స్త్రీల వైపుకు కదిలాడు.. ఉవిధ తెచ్చిన ఓ పరికరముతో ఇద్దరూ చాలా వేగంగా అక్కడ ఉన్నవారి అందరి సంకెళ్ళు విప్పుతారు.. మీరు నడవగలరా అంటూ ఉవిధ వారి బాషలో అడుగుతూ అందరినీ పలకరిస్తుంది.. దానికి అందరూ భయం భయంగా పొడి పొడి సమాధానాలు ఇస్తారు.. ఇక్కడ నుంచి మరో దారి ఏమైనా ఉందా అంటూ అందరికీ అడుగుతుంది ఉవిధ.. 

కొందరు మౌనంగా వుంటే మరికొందరు అటువైపు అని వారు వచ్చిన మార్గాన్నే చూపించారు.. అది కాకుండా మరో మార్గం ఉందా అని అడుగుతుంది ఉవిధ.. 

ఒక్కరు మాత్రం తన చూపుడు వేలును వెనుకభాగానికి చూపిస్తుంది.. ముందు నేను వెళ్ళి చూస్తాను అని ఆ వైపుగా పరుగెడుతూ వెళ్తుంది ఉవిధ.. 


కాసేపటి తరువాత తిరిగి వచ్చి ఇది సురక్షిత మార్గంలా అనిపిస్తుంది వెళ్దాం పదండి అంటూ పిలుస్తుంది అందరినీ.. 

మీరంతా ఇటు వెళ్ళండి.. నేను వచ్చిన దారిలోనే వెళ్ళి నా తమ్ముడిని తీసుకొని బయటకు వస్తాను అని చెప్తాడు ఆకాష్.. 

అది నువ్వు అనుకున్నంత సులువైన పని కాదు .. వచ్చిన మార్గం చాలా కష్టమైన మార్గం మరలా వెళ్ళడం అనేది బుద్దితక్కువ ప..ని దానివల్ల ప్రాణాలు పోతాయి అంటూ హెచ్చరిస్తుంది ఉవిధ.. 

నా తమ్మునికి నేను మాట ఇచ్చాను .. తిరిగి వస్తాను అని.. వెళ్ళాలి.. ఇప్పటికే ఒకరిని కోల్పోయాను అంటాడు ఆకాష్.. 

తనని వదిలెయ్యమని చెప్పట్లేదు.. మరో మార్గం గుండా వెళ్దాం అని చెప్తున్నాను .. లోకేష్ ని ఇలా భుజాన వేసుకొని ఒంటరిగా నువ్వు ఆ దారిలో వెళ్ళడం అసాధ్యమే కాదు ప్రమాదం కూడా అని వారిస్తుంది ఉవిధ… 

దానికి ఆకాష్ మౌనంగా లోకేష్ ని భుజానికి ఎత్తుకొని వారివెనుకనే నడవడం మొదలు పెట్టాడు..


To be continued …
Written by : BOBBY

Tuesday, December 17, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 29th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఈ నవ నిధులను సేకరించగలిగితే వారు కోరుకున్న అమరత్వమూ, యౌవనత్వమూ రెండూ దొరుకుతాయన్న అత్యాశతో ఇదంతా చేశారు…!! 

మరి వారు కోరుకున్నది దక్కిందా అని అడుగుతాడు లోకేష్.. 

అది అంత తేలికైన విషయం కాదు…ఆ నవ నిధులతో పాటు మరికొన్ని విధులు కూడా చేయాల్సి వుంది.. వారు అది చేయలేకపోయారు… 

ఏంటది ?? ఉత్సాంగా అడుగుతాడు లోకేష్…

తరువాత ఏంటో చూద్దాం పదండి..
29th Part

మత్స్యక శరీరం నుంచి వెలువడే ద్రవం ముఖ్యంగా కావాల్సి వుంది.. అది అత్యంత సుగంధ పరిమళములతో సువాసనలు వెదజల్లుతూ వుంటుంది.. వారు ఆనందం గా వున్నప్పుడు మాత్రమే ఆ ద్రవం వారి నుంచి విడుదల అవుతుంది.. 

వారు ఆనందం గా వుండటం అసాధ్యం..

వారు ఆనందం గా వున్నప్పుడు ఆ ద్రవాన్ని సేకరించడం ఇంకా అసాధ్యం..


ఇలాంటి చిక్కు సమస్యలు ఎన్నో వున్నాయి.. అందుకే అది అసాధ్యమని తెలిసి వారు మధ్యలోనే విడిచిపెట్టారు.. అని చెప్తుంది ఉవిధ.. 

ఓహ్ అందుకేనా కొన్ని సంవత్సరముల క్రితం ఆ జలకూనను పట్టుకునేందుకు వెంబడించి, అడ్డొచ్చిన వాసుర ను చంపేసింది.. అంటాడు లోకేష్… 


అవును.. అప్పటికే వారు నవ నిధులను సేకరించి జలకూన లేదా మత్స్యక కోసం వెతకనారంభించారు.. అప్పుడే ఈ జలకూన ఆచూకి దొరికింది.. తనని బంధించాలని అనుకున్నారు కానీ జలకూన తప్పించుకొని సముద్రగర్భంలోకి వెళ్ళిపోయింది.. అప్పుడే వాసుర, నక్షత్ లు ప్రాణాలు విడిచారు.. అని చెప్తుంది ఉవిధ.. 

మరి ఆ సముద్రపు దొంగలు అంతా ఎమైనారు.. ?

ఆ నిధి ఇంకా ఇక్కడే ఉందా ?? అని అడుగుతాడు ఆకాష్.. 

వారందరినీ ఇక్కడకు వచ్చి ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకున్న విదేశీయులు చంపేశారు.. కానీ వారు నిధిని ఎక్కడ దాచి పెట్టారో మాత్రం ఎంతవెతికినా కనుగొనలేకపోయారు .. కొందరు రహస్యంగా ఇంకా వెతుకుతూనే వున్నారు.. కానీ ఎవ్వరికీ అది ఓ అంతుచిక్కని ప్రశ్నలా అలా.. మిగిలిపోయింది.. అంటుంది ఉవిధ.. !!


సరే ముందు మనం ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అంటాడు ఆకాష్.. 

ఖచ్చితంగా దీన్ని ఆపేందుకు ఏదో ఒక మార్గం వుండే ఉంటుంది .. అదేంటో మనం కనిపెట్టాలి అని చెప్తుంది ఉవిధ.. 

ఈ గోడలలో కాస్త భిన్నంగా ఏదైనా ఉందేమో చూద్దాం అంటూ ముగ్గురూ వెతకడం మొదలు పెడతారు.. 

తలయెత్తి పైన చూడగానే .. ఏడు అడుగుల ఎత్తులో ఆ గోడలలో వున్న రాళ్ళకు భిన్నముగా నల్లని రాళ్ళు ఇరుప్రక్కలా పొడవుగా అవతలివైపు దాకా వున్నాయి.. ఖచ్చితంగా ఈ రాళ్లలోనే ఏదో మర్మం వుంది అంటుంది ఉవిధ.. 

వెంటనే వాటిని లోనికి నొక్కగానే .. మెత్తగా లోనికి వెళ్ళినట్లే వెళ్ళి ఒక బటన్ లా ఒక అడుగు వెడల్పుతో ముందుకు వచ్చింది.. 

బహుశా ఈ రాళ్ళను పట్టుకొని వేళ్ళాడుతూ వెళ్ళాలేమో అంటాడు ఆకాష్.. 

కానీ మధ్యలో ఒక్కో దాన్ని నొక్కుతూ వెళ్ళడం అసాధ్యం కదా అప్పుడు ఎలా అంటాడు లోకేష్.. 

ఇరు ప్రక్కలా వున్న రాళ్ళను ఒకేసారి నొక్కండి అని ఉవిధ అంటుంది.. 

సోదరులు ఇద్దరూ ఒకేసారి ఇరుప్రక్కలా నొక్కగానే ఆశ్చర్యంగా అన్నీ రాళ్ళు ముందుకు వచ్చాయి.. 

ఒక్కొక్కరుగా వేళ్ళాడుతూ నేల తగలకుండా అవతలివైపుకు చేరుకుంటారు.. 

అక్కడనుంచి దారి చాలా విశాలంగా పరిశుభ్రంగా వుంది.. కాస్త ముందుకు వెళ్ళగానే నేల మీద అంతా రంద్రాలుగా యాభై అడుగుల దూరం వరకు వున్నాయి.. 

బాబోయ్ ఏంటివి నేలమీద చక్కని రూపకల్పన ఏర్పాటు చేసి వున్నారు అంటాడు లోకేష్.. 

పొరపాటున ఆ రంద్రాలపై కాలు మోపావో అరక్షణంలో ఆ కాలులోంచి శూలాలు బయటకు పొడుచుకొని వస్తాయి.. అంటుంది ఉవిధ .. 

బాబోయ్ ఇన్ని ట్రాపులా అంటాడు లోకేష్.. 

మరి ఎలా దాటాలి ఇది అంటాడు ఆకాష్.. 

క్షణం కూడా అడుగు మోపకుండా పరిగెత్తడమే అంటుంది ఉవిధ.. 

అలా ఎలా అంటాడు ఆకాష్.. 

నేను ముందు వెళ్తాను చూసి మీరు అలానే రండి అంటుంది ఉవిధ.. అలాగే అంటారు ఇద్దరూ.. 

చాలా వేగంగా పరుగులు తీసింది ఉవిధ.. తను అడుగు తీయగానే మెరుపువేగంతో శూలాలు బయటకు వస్తున్నాయి.. ఆ దృశ్యాన్ని చూసి ఇద్దరికీ భయంతో చెమటలు పట్టాయి.. ముఖానికి అంటిన స్వేద బిందువులను తుడుచుకుంటూ ఇద్దరూ ఒకేసారి పరుగందుకున్నారు.. అవతలవైపునుంచి వేగంగా వేగంగా అంటూ అరుస్తూ వుంది ఉవిధ… 

ఎలాగోలా చిన్నగాయం కూడా అవ్వకుండా బయటపడ్డారు ముగ్గురూ.. 

మళ్ళి అక్కడనుంచి ఇరుకైన పురాతన మార్గం గుండా కొంత దూరం ప్రయాణించాక ఏవో కొన్ని మాటలు వినపడుతూ వున్నాయి.. ఒక్క క్షణం ముగ్గురూ ఆగి ఆ మాటలను జాగ్రత్తగా వినసాగారు.. అవి వారికి కుడిపక్కన వున్న రంద్రం నుంచి వినపడుతున్నాయి.. 

ముగ్గురు పరిశీలనగా చెవి దగ్గరకు పెట్టి ఆ మాటలు వినసాగారు… ఆకాష్ కి లోకేష్ కి ఆ మాటలు అర్థం కావట్లేదు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉవిధ వైపు చూసారు.. తన కళ్ళలో నీరు…

ఏమైంది ?? ఎందుకు ఏడుస్తున్నారు ??అంటూ ఆకాష్ … 

ఇది ఏడుపు కాదు… నా అనుకున్న వాళ్ళు ఇంకా సజీవంగానే ఉన్నారు.. వాళ్లను నేను వెంటనే చూడాలి వాళ్ల దగ్గరికి నేను వెంటనే వెళ్ళాలి అంటుంది ఉవిధ..

అసలు వారు ఎక్కడున్నారు ?? 

ఎక్కడి నుంచి వారి మాటలు మనకు వినపడుతున్నాయి? అడుగుతాడు ఆకాష్…

To be continued …
Written by : BOBBY

Monday, December 16, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 28th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఆ మార్గం ఎలా వుందంటే.. ఆకాష్ మోహన్ లు వారు వచ్చిన దీవిలో ఓ వింత ఆకారాన్ని వెంబడిస్తూ వెళ్ళినప్పుడు నిప్పుకు స్పందించే రాయి ద్వారా లోపలకు ప్రవేశించిన మార్గంలా ఆకాష్ కు అనిపిస్తుంది.. పది అడుగులు ఎత్తు నాలుగు అడుగులు వెడల్పుతో ఏర్పాటు చేసి వున్న ఆ మార్గం కారాగారము వలె వారికి అనిపిస్తుంది.. ఆ మార్గంలో మధ్య మధ్యలో సన్నని వెలుగుతో లాంతర్లు మిణుకు మిణుకు మని వెలుగుతున్నాయి.. 

ఆ చీకటిని, ఆ ప్రదేశాన్ని చూస్తుంటే భయంతో ఊపిరి కూడా భారముగా మారిపోయింది వారికి..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
28th Part

కొంచం ముందుకు వెళ్ళగానే.. మూడు మార్గాల కలయికతో మధ్యభాగం వస్తుంది.. ఏ వైపున వెళ్ళాలో అర్ధం కాక అలానే నిల్చుండి పోయారు అందరూ.. యక్షామీ (ఉవిధ) మాత్రం కళ్ళు రెండూ గట్టిగా మూసుకొని పెదవులు కదిలిస్తూ తన చేతిని ఎడమవైపు గల మార్గానికి చూపిస్తుంది.. అందరూ తను చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తారు.. 

వెళ్ళే కొద్ది ఆ మార్గం మరింత చీకటిగా, దట్టంగా పేరుకుపోయిన పాచితో.. రెండు వైపులా వున్న గోడలకు చెట్ల వేర్లు బయటకు తన్నుకొచ్చి భయంగొలిపే విధంగా వుంది.. 

ఏంటి ఈ ప్రదేశం మరీ ఇంత దారుణంగా ఉంది అంటాడు చిన్నోడైన సంతోష్.. 


ఇది ఒకప్పటి రహస్య మార్గం అంటుంది యక్షామీ (ఉవిధ)... 

దీని తర్వాత ఏముంటుంది అని ప్రశ్నిస్తాడు ఆకాష్.. 

మీరే చూస్తారుగా అంటుంది యక్షామీ (ఉవిధ) … 

కొంతదూరం వెళ్ళగానే.. ఇనుపచువ్వలతో గేటు మూసివేయబడి వుంది.. చచ్చాము పొండి.. ఇక ఇక్కడనుంచి దారి లేదు అంటాడు చిన్నోడైన సంతోష్..

ఇక ఇక్కడ నుంచి మనమంతా చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి ముఖ్యంగా ఆ గేటు దాటిన మొదటి అడుగునుంచే అంటుంది యక్షామీ (ఉవిధ)..

అలాగే కానీ గేటు ఎలా దాటాలి అంటాడు లోకేష్.. 

ఇక్కడకు ఎవరూ రాకుండా, ఇక్కడనుంచి ఎవరూ వెళ్ళకుండా కొన్ని ప్రాణాపాయ ఉచ్చులు ఏర్పాటు చేసి ఉన్నారు.. వాటిని కనుక మనం తాకితే.. మన శరీరానికి తీవ్రమైన గాయాలు కావచ్చు లేదా చనిపోవచ్చు కూడా.. అందుకని నన్ను అనుసరిస్తూ రండి.. అంటుంది యక్షామీ (ఉవిధ)... 

ఈ గేటు ని తెరవడం పెద్ద సమస్య కాదు.. కానీ ఆ గేటు దాటి ముందుకు వెళ్లడమే పెద్ద సమస్య.. ఇక్కడ కాస్త భిన్నంగా కనిపించిన దేన్నీ మీరు ముట్టుకోకండి.. అంటుంది యక్షామీ (ఉవిధ) … 

తప్పకుండా మీరు చెప్పినట్లే వింటాము అంటారు మిగతా వారంతా.. 

అయితే నా వెనుకే ఒక్కొక్కరుగా రండి అంటుంది యక్షామీ (ఉవిధ) … 


మరి ఈ గేటు తెరవడం ఎలా అడుగుతాడు సంతోష్.. 

మనకు రెండు ప్రక్కలా గోడలపై సూర్య, చంద్రుల ఆకారం గల గుర్తులు ఉన్నాయిగా .. వాటిని ఒకే సమయంలో గట్టిగా లోనికి నొక్కాలి.. నొక్కి పెట్టివున్నంత వరకు మాత్రమే ఆ గేట్లు తెరవబడి వుంటాయి.. చెయ్యి వదిలామా.. కిందకు పడిపోతుంది.. మరో విషయం.. ఆ గేటుకు మొదళ్ళలో కత్తి వంటి ఆకారంతో చాలా పదునుగా వుంటాయి.. గేటు పూర్తిగా తెరుచుకున్నాకనే ఒక్కొక్కరుగా జాగ్రత్తగా వంగి వెళ్ళాలి.. అలా వెళ్ళేటప్పుడు గేటు నొక్కి పెట్టినవాళ్ళు కనుక వదిలేస్తే ఎంతటి మనిషి అయినా సరే రెండుగా తెగి పడిపోతారు .. అంటుంది యక్షామీ (ఉవిధ) … 

కళ్ళు రెండూ పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా ఉవిధనే చూస్తారు సంతోష్, లోకేష్ ఇద్దరూ.. 

మరి ఇక్కడ ఎవరు ఉంటారు ఒంటరిగా ?? అని అడుగుతుంది యక్షామీ (ఉవిధ) … 

చిన్నోడు అయిన సంతోష్ .. నేను ఇక్కడే వుంటాను.. మీరు వెళ్ళిరండి అని అంటాడు.. 

తన తమ్మునికి ఆకాష్, లోకేష్ లు తగు జాగ్రత్తలు చెప్పి ధైర్యంగా ఉండమని హెచ్చరించి.. మేము మళ్ళి ఇక్కడకు నీకోసం త్వరగా వస్తాము అని వాగ్దానం చేసి అక్కడ నుంచి అవతలి వైపుకు వెళ్ళారు ముగ్గురూ..

ఉవిధ వేసిన అడుగులలోనే మిగతా ఇద్దరు సోదరులు అడుగులు వేస్తూ .. ముందుకు వెళ్తున్నారు.. 

కొంచం దూరం వెళ్ళగానే తేలికగా వున్న నేల భాగం కనిపిస్తుంది.. 

వెంటనే వెనక్కు వచ్చి ఇక్కడ మాత్రం ఎత్తి పరిస్థితుల్లో కాలు వెయ్యకండి అని చెప్తుంది ఉవిధ.. 

ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు ఆకాష్.. 

మీరే చూడండి అంటూ పక్కన వున్న చిన్న రాయిని విసురుతుంది.. నేల అడుగు భాగంలోనుంచి ఓ పదునైన పెద్ద కత్తి బయటకు వచ్చి మెరుపువేగంతో ఆ రాయిని ముక్కలుగా చేసి యధాప్రకారం మామూలుగా స్థితికి మారిపోయింది.. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది.. 

సోదరులు ఇద్దరూ నోర్లు తెరిచి, కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు…

ఇదేంటి సెన్సార్ లా వుందే .. అప్పటి రోజుల్లోనే సెన్సార్ లు ఉండేవా అని అడుగుతాడు లోకేష్.. 

మీరు అన్నది నాకు తెలియదు కానీ.. ఇక్కడ ఉన్నటువంటి నేల తెలికపాటిగా ఉండేందుకు సున్నపు పూతతో తయారుచేసారు.. ఆ నేల అడుగు భాగాన ఒక సన్నని బలమైన దారం వంటి పరికరాన్ని గిలకద్వారా అమర్చి వున్నట్లు తెలుస్తోంది.. ఆ నేల పై కాస్త బరువు పడగానే ఆ తాడు కదిలి వ్యతిరేక దిశలో వేగంగా ప్రయాణించి ఆ పదునైన కత్తిని బయటకు వచ్చేలా ఏర్పాటు చేసినట్లు వున్నారు అంటుంది ఉవిధ… 

తప్పదు దీన్ని మనం దాటే వెళ్ళాలి.. మరో మార్గం లేదు అని చెప్తుంది ఉవిధ.. 

అసలు ఈ మార్గం ఏంటి.. ఎందుకింత గోప్యంగా భయంకరమైన ఉచ్చులతో ఎవరూ వెళ్లేందుకు వీలు లేకుండా ఎర్పాటు చేసారు ??? అంటాడు ఆకాష్.. 

మనం వున్నది నేల అడుగు భాగాన ఉన్నటువంటి సొరంగ మార్గంలో.. ఎన్నో వందల ఏళ్ళనాటి పురాతన మార్గం ఇది.. ఒకప్పటి సముద్రపు దొంగలు ఏర్పాటు చేసిన అత్యంత రహస్యమైన మార్గం ఇదంతా… 

సముద్రం లో ఈ దీవి వైపుగా వెళ్ళే ఎన్నో నౌకలను కొల్లగొట్టి విలవైన ఆభరణాలను, వజ్రాలను, ధనమును దొంగలించి వాటన్నిటినీ ఇక్కడ దాచిపెట్టి.. వారు తప్ప ఇంకెవ్వరూ ఈ ప్రదేశానికి రాకుండా ఈ ఉచ్చులు ఏర్పాటు చేసారు.. ఇలాంటి మార్గాలు వున్నాయని నాకు తెలుసు.. కానీ ఎప్పుడూ వెళ్ళలేదు అని చెప్తుంది ఉవిధ.. 


అంతే కాదు.. ఈ సముద్రపు దొంగలు చాలా పురాతనమైన వారు .. వారు కేవలం దొంగతనమే కాకుండా భారతీయ శాస్త్రాలలోని విషయాలను ఆధారంగా చేసుకొని కొన్ని విలువైనవాటిని సేకరించేవారు.. 

భారతీయ శాస్త్రాలలోనివా అని అడుగుతాడు లోకేష్.. 

అవును.. ఇక్కడ వుండే చాలా నిధులు పురాతన భారతదేశానికి చెందినవే అంటుంది ఉవిధ.. 

విలువైనవాటిని సేకరించేవారా ?? ఎంటవి అని అడుగుతాడు ఆకాష్.. 

సముద్రపు దొంగలు కొన్ని విషయాలను ముఖ్యంగా నమ్మేవారు.. 

నాటి నుంచి నేటి వరకు మనిషి కోరుకునేది రెండే రెండు.. యౌవనత్వం, అమరత్వం.. ఈ రెంటికోసం మనిషి తన ఆలోచనా పరిధిని దిశదిశలకు వ్యాప్తి చేస్తూనే వున్నాడు.. అలానే ఈ సముద్రపు దొంగలు కూడా.. మనిషిని అమరులుగాను, సంపన్నులుగాను ముఖ్యంగా యౌవనులు గాను తీర్చిదిద్దేవి తొమ్మిది నిధులు అని వారు విశ్వసించారు.. వాటినే నవ నిధులు అంటారు.. ఇవి సాక్ష్యాత్తు భగవత్ స్వరూపం… ఇవన్ని భారతీయ గ్రంధాలలో లిఖించబడి వున్నాయి.. 

అవి 1. మహాపద్మ, 2. పద్మ, 3. శంఖ, 4. మకర, 5. కచ్చప, 6. ముకుంద, 7. కుంద, 8. నీల, 9. వర. ఇవన్నీ దేవతా స్వరూపాలని ఇక్కడి వారు విశ్వసిస్తారు.. ఆరాధిస్తారు.. అందుకే భారతీయ బ్రహ్మలిపి కూడా ఇక్కడ అత్యంత ప్రాచూర్యం పొందింది..

ఈ నవ నిధులను సేకరించగలిగితే వారు కోరుకున్న అమరత్వమూ, యౌవనత్వమూ రెండూ దొరుకుతాయన్న అత్యాశతో ఇదంతా చేశారు…!! 

మరి వారు కోరుకున్నది దక్కిందా అని అడుగుతాడు లోకేష్.. 

అది అంత తేలికైన విషయం కాదు…ఆ నవ నిధులతో పాటు మరికొన్ని విధులు కూడా చేయాల్సి వుంది.. వారు అది చేయలేకపోయారు… 

ఏంటది ?? ఉత్సాంగా అడుగుతాడు లోకేష్…

To be continued …

Written by : BOBBY

Saturday, December 14, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 27th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

జాగ్రత్త .. తొందరపడి వేటినీ ముట్టుకోకు.. ఇది ఓ ప్రయోగశాల అని గుర్తుపెట్టుకో అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అలాగే అంటూ తల ఆడిస్తూ .. మీరు ఓ విజ్ఞానశాస్త్ర అధ్యాపకులు కదా మీకేమనిపిస్తుంది దాన్ని చూస్తుంటే అడుగుతాడు మోహన్.. 

దాని దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూస్తూ, ఆ సీసాను అటు ఇటు కులికించి నెమ్మదిగా వాసన చూస్తాడు.. ప్రసన్నకుమార్ భాటియా..


తరువాత ఏంటో చూద్దాం పదండి..
27th Part
ఇది చాలా ప్రత్యేకమైన రసాయనము.. మనిషిలోని భావోద్వేగాలను ప్రేరేపించి తనకు తెలియకుండానే, తన ప్రమేయమేమీ లేకుండానే కన్నీరును తెప్పించే రసాయనము ఇది.. ఇలాంటిది ఒకటి వుందని కూడా నాకు తెలియదు.. మొదటిసారి చూస్తున్నాను అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. అంటే ఇది భావోద్వేగపు రసాయనమా అంటాడు మోహన్.. 

కావాలంటే నా కళ్ళు చూడు .. వాసన చూసినందుకే ఎలా కన్నీరు వస్తుందో .. అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అయితే ఈ రసాయనం ద్వారానే అందరి కన్నీళ్లు వారు సేకరిస్తున్నారు.. ఇంకొంచం ముందుకు వెళ్దాం పదండి..ఇంకేమైనా తెలుస్తాయేమో అంటూ ఆ రసాయనపు సీసాను.. చేతుల్లోకి తీసుకుంటాడు మోహన్.. 

వెళ్దాం కానీ ఇదెందుకు మళ్ళి అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

తరువాత చెప్తానులే .. ఇది నా దగ్గర ఉండనివ్వండి అంటాడు మోహన్.. 

మరోగదిలోకి వెళ్ళారు ఇద్దరూ.. 

అక్కడ ఓ సన్నని కర్రలాంటి ధృడమైన ఇనుపకడ్డీ పది అడుగులు ఎత్తు వుంది.. దానికి కొన్ని బలమైన తాళ్లు కట్టి వున్నాయి.. అక్కడక్కడా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి .. దూరాన పచ్చిగా రక్తం కారుతున్న కొరడా ఒకటి పడి వుంది.. ఆ ప్రదేశం నరకానికి ప్రవేశ ద్వారంలా కనపడుతోంది.. 

దాన్నే చూస్తూ.. బహుశా ఇక్కడే ఆడవారిని కట్టేసి చిత్రహింసలు చేసి వారి కన్నీరును సేకరిస్తారేమో.. యక్షామీ కూడా ఈ గదినే చూసి వుంటుంది.. అంటాడు మోహన్.. 

ప్రసన్నకుమార్ భాటియాకు ఆ దృశ్యాలను చూస్తూ నోట మాట రావట్లేదు.. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి.. ఒకింత వొణుకుపాటుకు గురౌతున్నాడు.. 

అది గమనించిన మోహన్ .. మీకేం కాలేదుగా.. అని అడుగుతాడు.. 

తడారిన గొంతుకతో ఓ గుటక వేసి.. ఊపిరి గట్టిగా తీసుకొని ఒక్కసారిగా వదుల్తాడు ప్రసన్నకుమార్ భాటియా… 

వణుకుతున్న స్వరంతో.. ఏం కాలేదు..అంటాడు సన్నగా.. 

నేల మీద తడి తడిగా చాలా జుగుప్సగా వుంది ఆ గది అంతా.. వారి ఎడమ చేతి వైపున ఓ పెద్ద గాజు సీసాలో సగం వరకు వున్న నీటిని చూస్తాడు మోహన్.. 

ఇవే కన్నీళ్ళు అనుకుంటా.. ఇంకా వెచ్చగా వున్నాయి అంటాడు మోహన్.. వాటిని తాకుతూ.. !

భగవంతుడా … ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అంటూ తన ముఖానికి అంటిన స్వేద బిందువులను చేత్తో తుడుచుకుంటూ అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

మనం వచ్చే ముందే ఎవరినో ఒక ఆమెను ఇక్కడ భయంకరంగా హింసించి తీసుకెళ్లినట్లు వున్నారు.. దానికి సాక్ష్యాలే పచ్చిరక్తం కారుతున్న ఆ కొరడా, సీసాలో వున్న వెచ్చని కన్నీరు.. ఆ గోడలపై చిప్పిల్లిన నెత్తుటి మరకలు .. అంటాడు ప్రసన్నకుమార్ భాటియా .. 

అవును మీరు చెప్పింది నిజమే.. అక్కడ చూడండి అంటూ ఓ దృశ్యాన్ని చూపిస్తాడు మోహన్.. ఎవరో ఈడ్చుకెళ్ళినట్లుగా రక్తపు చార చాలా దూరం వరకు ప్రస్పుటంగా కనిపిస్తుంది.. !

ఆ రక్తపు చార వెంబడే నడుచుకుంటూ వెళ్ళారు ఇద్దరూ.. 

కొన్ని గజాల దూరంలో.. కాళ్ళు ముడుచుకొని నగ్నంగా ఓ స్త్రీ నేలపై వుండటం గమనిస్తారు ఇద్దరూ.. తన దేహమంతా చిట్లిపోయి రక్తం కారుతూ..ఓ మాంసపు ముద్దలా వికృతంగా పడివుంది.. 

అడుగులో అడుగు వేసుకుంటూ మెళ్ళిగా.. భయం భయంగా ముందుకు వెళ్లారు ఇద్దరూ…! 

అంతలో పక్క గదిలో నుంచి ఓ చప్పుడు వినపడుతుంది...టక్కున ఇద్దరూ పక్కనే వున్న పరదా వెనుకకు వెళ్లి దాక్కున్నారు.. ఎవరివో మాటలు అర్థం కాని భాషలో వినపడుతున్నాయి.. వాళ్ళ మాటలను బట్టి చూస్తుంటే అక్కడ ఓ ఐదు మందికి పైనే ఉన్నట్లు అర్థమవుతుంది… ఇద్దరు జాగ్రత్తగా సైగలు చేసుకుంటూ అక్కడే నిలుచుండి పోయారు..

స్ స్ స్ మంటూ ఏదో లాగుతున్న శబ్ధం వినిపిస్తుంది.. 

ఏం శబ్ధం అది …. అన్నట్లుగా చేతులతో సైగ చేస్తాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఆ అమ్మాయిని లాక్కెళ్తున్నట్లు వున్నారు.. అంటూ సైగ చేస్తాడు మోహన్… 

కాసేపటికల్లా నిశ్శబ్దం ఆవరించింది.. మెల్లిగా పరదా తొలగించి తల సగమే బయట పెట్టి చూస్తాడు మోహన్.. ఎవరూ లేరు అన్నట్లుగా తల వూపుతూ బయటకు నడుస్తాడు.... ఇందాక మాటలు వినిపించిన ఆ గదివద్దకు అడుగులో అడుగులు వేస్తూ వెళ్లారు ఇద్దరూ… !

ఆ గదిలో వందల సంఖ్యలో చుట్టూరా చిత్రాలు అంటించి ఉన్నాయి… వాటినన్నిటినీ తీక్షణంగా చూస్తూ వుండగా.. ప్రసన్నకుమార్ భాటియా దృష్టి.. రెండు శ్వేత మీనాలపై పడుతుంది…

ఆ చేపలేనా ఇవి అంటూ ప్రసన్నకుమార్ భాటియా చెవి దగ్గరకు వచ్చి మెల్లిగా అడుగుతాడు మోహన్.. సందేహం లేదు అవే ఇవి అంటాడు.. 

ఇక్కడ వున్నటువంటి ప్రతీ చిత్రానికి ఓ అర్థం పరమార్థం వుంది.. కనిపించే ప్రతీ చిత్రం మనల్ని హెచ్చరిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఇక ఇక్కడనుంచి వెళ్ళి ముందు ఏముందో చూడాలి అంటాడు మోహన్.. 

కాస్త ముందుకు వెళ్ళగానే కుడిచేతి ప్రక్క మరో మలుపు కనిపించింది.. ఇద్దరూ ఊపిరి బిగబట్టి గుండెను అరచేతిన పట్టుకొని భయం భయంగా అడుగులేస్తారు… 

అది చాలా పొడవాటి గది.. ఆ గదికి అటు ప్రక్కన ఇటు ప్రక్కన అరలు అరలుగా ఏర్పాటు చేసి వున్నారు.. వాటిలో వందల సంఖ్యలో పెద్ద పెద్ద గాజు సీసాలు వున్నాయి.. వాటి అన్నింటిలోనూ కన్నీళ్లే వున్నాయి.. అవన్నీ చూస్తూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి వుండిపోయారు ఇద్దరూ… భగవంతుడా ఇంతమంది ఆడవారి కన్నీరా ఇది.. ఈ దృశ్యాన్ని చూస్తుంటేనే హృదయం ద్రవించిపోతోంది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అసలు మనుషులేనా వీరు.. అంటాడు మోహన్.. 

ఇటుచూడు మన కుడిచేతి ప్రక్కన వున్న కన్నీరు ఒకరంగు వుంటే .. యెడమ చేతి కన్నీరు మరో రంగులో వుంది.. బహుశా రెండు వేరు వేరు జాతుల స్త్రీ కన్నీరు ఏమో అంటాడు ప్రసన్నకుమార్ భాటియా… 

ఇక్కడ కనిపిస్తున్న ఒక్కో కన్నీరు సీసా ఒక్కో స్త్రీ నిండు జీవితం.. వీరి ఏడుపు అరణ్య రోదన అయిపోయింది .. ఇప్పటికైనా మనం ఇది ఆపకపోతే ఇంతమంది కన్నీళ్ళకు అర్థమే లేదు అంటాడు మోహన్..! 

కానీ ఎలా.. ఎలా ఆపాలి అని మనసులో అనుకుంటుండగా .. 

దూరం నుంచి ఎవరో వస్తున్నట్లు కొన్ని అడుగుల చప్పుళ్ళు వినపడగానే .. ఇద్దరూ వెనక్కు వెళ్ళి .. వారు వచ్చిన చిత్రాల గదిలో మరో పరదా వెనుకన దాక్కున్నారు.. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ కన్నీళ్ళ గదిలోకి వచ్చినట్లు వీరు గమనిస్తారు.. చాలాసేపుగా ఏవో మాటలు వినిపిస్తూనే వున్నాయి.. కానీ ఏ ఒక్కటీ అర్ధం కావట్లేదు.. 

వీరి మాటలను బట్టి చూస్తుంటే నాకు ఒక్కటి అర్ధం అయింది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఏంటది అంటాడు మోహన్.. 

ఇక్కడ ఉన్నటువంటి కన్నీరును వీరు చంద్రిక కొలను దగ్గరకు తరలిస్తున్నట్లు నాకు అర్ధమయ్యింది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 


అవును నిజమే.. వారి మాటల్లో పలుమార్లు చంద్రిక కొలను అని అన్నారు.. కన్నీరును వారి అరబిక్ బాషలో అన్నట్లు వున్నారు.. సరే నిజంగా మనం అనుకున్నట్లు వీరు ఆ కన్నీరును తరలిస్తారా లేదా అనేది మనం ఇక్కడే వేచి వుండి గమనించాలి అంటాడు మోహన్.. 

అయితే ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి మనం వెళ్ళి దాక్కుందాం అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

రెండవ బృందమైనటువంటి యక్షామీ (ఉవిధ), ఆకాష్, లోకేష్, సంతోష్ ఈ నలుగురూ మరో మార్గం గుండా లోపలకు ప్రవేశించారు.. 

ఆ ప్రదేశమంతా కనిపించి కనిపించని చీకటిగా.. భరించలేని దుర్గంధమును వెదజల్లుతూ, నేల కాస్త తడిగా, కాస్త జిగురుగా బంకవలె అతుక్కుంటూ అడుగుతీసి అడుగెయ్యడానికి ఇబ్బందికరముగా వుంది.. యక్షామీ (ఉవిధ) తన మంత్రముగ్ధముచే సజీవంగా వున్న ఆడవారిని కనిపెట్టి మిగిలినవారికి దారి చూపిస్తోంది.. ఆ మార్గం ఎలా వుందంటే.. ఆకాష్ మోహన్ లు వారు వచ్చిన దీవిలో ఓ వింత ఆకారాన్ని వెంబడిస్తూ వెళ్ళినప్పుడు నిప్పుకు స్పందించే రాయి ద్వారా లోపలకు ప్రవేశించిన మార్గంలా ఆకాష్ కు అనిపిస్తుంది.. పది అడుగులు ఎత్తు నాలుగు అడుగులు వెడల్పుతో ఏర్పాటు చేసి వున్న ఆ మార్గం కారాగారము వలె వారికి అనిపిస్తుంది.. ఆ మార్గంలో మధ్య మధ్యలో సన్నని వెలుగుతో లాంతర్లు మిణుకు మిణుకు మని వెలుగుతున్నాయి.. 


ఆ చీకటిని, ఆ ప్రదేశాన్ని చూస్తుంటే భయంతో ఊపిరి కూడా భారముగా మారిపోయింది వారికి..
To be continued …

Written by : BOBBY

Saturday, December 7, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 26th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

తన మెడలోని హారాన్ని తీసి ఆ పాపకు ఇచ్చింది ఆ అమ్మాయి.. ఇచ్చింది తీసుకోవడానికి కాదు అక్కా అంటూ తిరిగి తన మెడలోనే వెయ్యబోతుండగా జలకూన చేతి స్పర్శకు ఆ హారం అందరికీ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.. ఆశ్చర్యంగా ఆ హారాన్నే చూస్తూ నిస్తేజంగా ఉండిపోతారు అందరూ..


తరువాత ఏంటో చూద్దాం పదండి..
26th Part
ఈ రాత్రికి మీరంతా ఇక్కడ నుంచి విడి విడి బృందాలుగా విడిపోయి కొన్ని పనులు చెయ్యాల్సి వుంటుంది. ముందుగా ప్రసన్నకుమార్ భాటియా మీరు మరియు నా ప్రియ శిష్యుడు మోహన్ కలిసి ఆ కన్నీరు సేకరించే చోటుకు వెళ్ళి ఆ కన్నీరును ఎక్కడ భద్రపరుస్తున్నారో తెలుసుకోండి..

యక్షామీ (ఉవిధ) నీతోపాటు ఆకాష్ ని తన ఇద్దరు సోదరులను తీసుకునివెళ్ళి ఆడవారి అందరినీ ఎక్కడ బంధించారో తెలుసుకోండి.. వారిని అక్కడ నుంచి ఎలా రక్షించాలో కనుగొనండి.. మరేదైనా రహస్య మార్గాన్ని అన్వేషించండి.. 

మిగిలిన మీరు ముగ్గురూ (వారితో వచ్చిన అమ్మాయి, జలకూన, నౌకలోని చిన్న పిల్లాడు) కలసి చంద్రిక కొలను దగ్గరకు వెళ్ళండి.. కుదిరితే ఆ రెండు మీనాలతో మాట్లాడటానికి ప్రయత్నించండి… ఇక్కడ జరిగిన విషయాలను జరగబోయే విషయాలను మీనాలకు వివరించండి...అంటాడు అఘోరా.. 

నేను ఈ గ్రంధాన్ని మరొకరికంట పడకుండా పాతాళంలో దాచిపెట్టేందుకు వెంటనే వెళ్ళాలి.. మీ అందరితో నేను అక్కడనుంచే మాట్లాడుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు అఘోరా.. 


అందరి ముఖాల్లో ఏదో సాధించబోతున్నామన్న విజయ గర్వం కనిపిస్తుంది.. రేపటి అస్తమయానికి ఏదైనా జరగొచ్చు.. ఎవరికీ ఏమీ కాకూడదు అని అందరూ భగవంతున్ని ప్రార్ధించారు.. మళ్ళి ఇలా కలుస్తామో లేదో అనే భయంతో అందరూ ఆ రోజు ఒకరికొకరు సరదాగా గడిపారు..

ప్రసన్నకుమార్ భాటియా మోహంలో ఒక్క రక్తపు చుక్క లేదు…తన పిల్లల గురించి చాలా కంగారుపడుతూ పైకేమో మల్లె పువ్వులా నవ్వుతూ కనిపిస్తున్నాడు..

ఆకాష్ ని ఆ అమ్మాయి క్షణం కూడా విడువకుండా తన కళ్ళనిండా అతని రూపాన్నే నింపేసుకుంటూ రెప్ప వేయకుండా చూస్తూనే వుంది..


ధైర్యం చేసి ఆకాష్ ఆ అమ్మాయికి తన మనసులో మాట చెప్పాలని తన దగ్గరకు వస్తాడు.. 

ఎప్పుడూ ధైర్యంగా ఆకాష్ కళ్ళలోకి చూసే ఆ అమ్మాయి ఆకాష్ రావడం చూసి తలవంచుకొని మౌనంగా నిలబడి వుంది.. 

ఆకాష్ తనకు మరింత సమీపముగా ఆమె పాదాలు తన పాదాలకు తగిలేంతలా చేరువయ్యాడు..

ఆకాష్ శ్వాస తన నుదురుకు వెచ్చగా తాకుతోంది.. 

ఆ అమ్మాయిలో కంగారు మొదలైంది.. 

ఆ కంగారులో తన కాలి బొటనవేలు ఆకాష్ పాదాలకు తాకింది.. అంతే.. 

ఆమె వొళ్ళు ఝల్లుమంది, గుండె వేగం పుంజుకుంది.. చేతులు వణకడం మొదలయ్యాయి.. నాలుకతో తన పెదవులను తడుపుతూ తన రెండు చేతుల మునివేళ్ళను నొక్కుకుంటూ వుంది.. ఆమె శ్వాస ఆకాష్ గుండెలకు తాకుతోంది.. 

ఆకాష్ తనకు మరింత దగ్గరగా వచ్చాడు.. తన నుదుటిపై పడుతున్న కేశములను ఆకాష్ తన ముంజేతి వేళ్ళతో పక్కకు తీస్తూ మరో చేత్తో ఆ అమ్మాయి చేతిని అందుకుంటాడు.. 

ఆమె దేహం వణికిపోతూ వుంది.. అది గమనించిన ఆకాష్ ఆమె చెవి దగ్గరగా తన పెదవులను పెట్టి 

“నా మరణం ఎక్కడో లేదు.. నీవు విడిచే కన్నీటి బిందువులోనే దాగుంది... దాన్ని ఎప్పటికీ రానివ్వకుండా చూసుకుంటాను” నీకు ఇష్టమేనా అని అడుగుతాడు.. 

తన మాట ముగియక ముందే ఆమె అతని గుండెలపై తలవాల్చి కన్నీరు కారుస్తూ తనని లతలా అల్లుకుపోయింది.. 

కొన్ని క్షణాలు అలానే గడిచిపోయాయి.

ఈ క్షణం ఇలానే ఆగిపోతే ఎంతబాగున్నో అనుకుంటూ ఇద్దరూ బిగికౌగిటలోని తమకాన్ని ఆస్వాదిస్తూ వున్నారు.. 

వారిది ఎంత గొప్ప ప్రేమ అంటూ సన్నని స్వరంతో అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ఎవరిది ? అని అడుగుతాడు ఆకాష్.. 

అదే.. వాసుర, నక్షత్ 

అవును చాలా గొప్ప ప్రేమికులు వారు.. ఇన్ని శతాబ్దాలు అయినా కూడా వారిని మనం ఇంకా గుర్తు చేసుకుంటున్నాం అంటే నిజంగా వారు అమరులే అంటాడు ఆకాష్.. 

హ్మ్మ్ .. అంటూ ఆకాష్ గుండెలమీద తలఆన్చి ఆ గుండెలపై తన మునివేళ్ళతో ఏదో రాస్తూ వుంది.. 

రేపు నువ్వు చంద్రిక కొలను దగ్గర చాలా జాగ్రత్తగా వుండాలి ..ఖచ్చితంగా కొందరు అక్కడ గమనిస్తూ ఉండొచ్చు.. అందుచేత మీరు వేసే ప్రతీ అడుగు ఎంతో జాగ్రత్తగా వెయ్యాలి అని తనకు జాగ్రత్తలు చెప్తాడు ఆకాష్.. 

కళ్ళు మూసుకొనే .. హ్మ్మ్ అన్నట్లు ఓ నిట్టూర్పు విడుస్తుంది ఆ అమ్మాయి.. 

ఏమైంది ? ఎందుకలా వున్నావ్ ? అడుగుతాడు ఆకాష్… 

ఏం లేదు…. భయమేస్తుంది.. 

నీకేం కాకూడదు..ఒకవేళ జరగరానిది నీకేమన్నా జరిగితే .. అదే నా చివరి క్షణం అవుతుంది .. అంటుంది ఆ అమ్మాయి.. 


ఎప్పుడూ చంద్రిక కొలను అంటే ఎంతో ఇష్టంతో వెళ్ళేదాన్ని.. ఇవాళ చాలా కష్టంగా వెళ్తున్నాను.. నిన్ను వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది ఆమె.. 

వాసుర, నక్షత్ లు వారి జీవితాలలో ఎంత బాధ్యతగా వున్నారో విన్నావుగా.. మనకూ ఓ బాధ్యత ఇచ్చారు.. దాన్ని నిర్వర్తించాలి.. తరువాతే ఏదైనా.. మన ప్రాణం పోయినా సరే మన పేర్లు నిలిచిపోవాలి అంటాడు ఆకాష్.. 

ఆ అమ్మాయి కనురెప్పల తడి ఆకాష్ గుండెలకు తాకుతుంది.. 

వెంటనే ఆకాష్ .. 

హే ఏడుస్తున్నావా ? అంటూ తన రెండు చేతుల మధ్యలోకి ఆమె ముఖమును తీసుకుని ఆమె కళ్ళలోకి చూసాడు.. 

రుధిరము పులుముకొని ఆ రెండు నేత్రాలు ఎర్రగా మారి వున్నాయి.. 

బుగ్గలేమో కందిపోయి గులాబీ వర్ణాన్ని పులుముకొని వున్నాయి.. 

నీ నుంచి ఇంత ప్రేమ దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ తనని లాక్కొని మరింత గట్టిగా హత్తుకుంటాడు ఆకాష్..!!

ఇప్పటికైనా చెప్పవే.. నీ పేరేంటి అని అడుగుతాడు ఆకాష్.. 

తల్లి చనుబాలు చంటి బిడ్డ చుంబించునట్లుగా ఉమ్.. అని మూతి పెట్టి 

చెప్పను పో.. అంటుంది అమ్మాయి.. 

అబ్బా.. ఎంత కోపమో.. అంటూ గోముగా తన తలను నెమురుతాడు ఆకాష్.. 

ఆ స్పర్శకు ఆ అమ్మాయి ఆకాష్ వెచ్చని కౌగిళ్ళలో వెన్నముద్దలా కరిగిపోతుంది..!!

అంతలో .. మెల్లిగా చీకటి పడటం మొదలైంది.. 

అఘోరా చెప్పినట్లుగా అందరూ సంసిద్దమౌతారు .. మూడు బృందాలుగా ఏర్పడి ఎవరికి వారుగా ఆలింగనాలు చేసుకొని, తగు జాగ్రత్తలు చెప్పుకొని ఆ చోటును వదిలి వెళ్ళారు.. 

ముందుగా ప్రసన్నకుమార్ భాటియా, మోహన్ లు ఆ కన్నీరు సేకరించే ప్రదేశానికి ఎవరికంటా పడకుండా చేరుకుంటారు.. ఆ గది మొత్తం చాలా పరిశుభ్రం గా మంచి పరిమళములు వెదజల్లుతూ సువాసనా భరితముగా ఆ ప్రదేశమంతా చాలా చల్లగా వుంది.. వారి కుడిచేతిప్రక్కన గాజుతో తయారు చేసిన టేబుల్ వంటి ఆకృతి పై ఓ గాజు సీసాలో పసుపు రంగు రసాయనమును వారు గమనిస్తారు.. 

ఏంటిది ఈ రంగులో వుంది అంటాడు మోహన్..

జాగ్రత్త .. తొందరపడి వేటినీ ముట్టుకోకు.. ఇది ఓ ప్రయోగశాల అని గుర్తుపెట్టుకో అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అలాగే అంటూ తల ఆడిస్తూ .. మీరు ఓ విజ్ఞానశాస్త్ర అధ్యాపకులు కదా మీకేమనిపిస్తుంది దాన్ని చూస్తుంటే అడుగుతాడు మోహన్.. 

దాని దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూస్తూ, ఆ సీసాను అటు ఇటు కులికించి నెమ్మదిగా వాసన చూస్తాడు.. ప్రసన్నకుమార్ భాటియా..


To be continued …
Written by : BOBBY

Friday, December 6, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 25th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఆ మరుసటిరోజునే నక్షత్ ప్రయాణం మొదలైంది.. తనని పశ్చిమ  దిక్కున సముద్రం మధ్యలో వున్న సొకోట్ర అనే ప్రాంతానికి వెళ్ళమని ఇక్కడే  తన గ్రంధాన్ని రాసి జాగ్రత్తగా భద్రపరచమని చెప్తుంది.. ఆత్మాశి..


తరువాత ఏంటో చూద్దాం పదండి..
25th Part
ఆ తరువాత చంద్రిక కొలనుకు వచ్చిన ఉపద్రవం ఏంటో, ఆత్మాశి ఎలా చనిపోయిందో.. 

వాసుర, నక్షత్ లు ఏమయ్యారో తదితర విషయాలు ఏమీ ఈ గ్రంధంలో లేవు అని చెప్తాడు అఘోరా.. !!

అంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు అన్ని నక్షత్ రాసిన ఆ గ్రంధం లోనివా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆకాష్.. !!


అవును అని తల ఊపుతాడు అఘోరా.. 

నిజంగా వారి త్యాగం అనిర్వచనీయము అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

గురువు గారు మీ దృష్టితో వారు ఎమైనారో చుడలేరా అని మోహన్ అడుగుతాడు.. 

ఈ గ్రంధాన్ని పూర్తి చెయ్యడానికి నక్షత్ కి చాలా ఏళ్ళ సమయం పట్టింది.. అందుకు కారణం వాసుర జ్ఞాపకాలు .. తనని ఉక్కిరిబిక్కిరి చేసేవి.. ఓ దశలో తను పిచ్చిపట్టిన వాడిలా కూడా మార్పుచెందాడు.. తరువాత తనని తాను తెలుసుకొని.. సత్యాన్ని దర్శించి గ్రంధంపై దృష్టి కేంద్రీకరించి నిద్రాహారాలు మాని అహోరాత్రులు మేల్కొని గ్రంధాన్ని పూర్తి చేసాడు.. 


తరువాత వాసుర వద్దకు ఉత్తర దిశగా ప్రయాణం చేసి తనను కనిపెడతాడు.. కానీ అప్పటికే సమయం చేజారిపోయింది.. దానికి మునుపే సముద్రపు దొంగలు జలకూన, వాసుర వున్న స్థావరాన్ని ఎన్నో రోజులుగా గమనిస్తూ, జలకూన గోప్యతను కనిపెట్టి తనని బంధించాలని అనుకుంటారు.. ఆ ప్రయత్నంలో వాసురకు ఓ విషపు బాణం తాకి సముద్రపుటొడ్డున కొన ఊపిరితో కొట్టుకుంటూ వుంటుంది.. నక్షత్ రాగానే తనను కళ్ళారా చూస్తూ, నవ్వుతూ తన ప్రాణాన్ని విడుస్తుంది.. చివర సమయంలో కలిసి వుండటం అంటే ఇదేనా అని వాసురను తన ఒడిలో పెట్టుకొని ఆకాశానికి చూస్తూ బిగ్గరగా రోధిస్తాడు నక్షత్.. 

అలా రోధిస్తూనే ఒడిలో వాసురను హత్తుకొని తన ప్రాణాన్ని విడుస్తాడు నక్షత్..!!

అలా వారి మరణాలను చూసి ఆకాశం కొన్ని వారాలపాటు ఏడ్చి ఏడ్చి తన కన్నీటితో వారిని సముద్రంలోకి తీసుకెళ్ళిపోయింది.. అంటూ కళ్ళల్లో నీరు తుడుస్తూ చెప్తాడు అఘోరా..!! 

మరి ఆత్మాశి అదే మత్స్యక ఏమైంది... ఆ వచ్చిన ఉపద్రవం ఏంటి ? 

జలకూన వాళ్ళకు చిక్కిందా ?? తనేమైంది.. ?? 


అని అడుగుతాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

లేదు వాళ్ళకు చిక్కలేదు.. తను సముద్రగర్భంలోకి వెళ్ళిపోయింది.. కొన్ని శతాబ్దాలు ఎవ్వరికీ కనపడకుండా అజ్ఞాతంగా గడిపింది.. ఎన్నో విషయాలు నేర్చుకుంది.. ఒంటరిగానే సముద్రం మీద ఆదిపత్యం సాధించింది.. తన శక్తిని తాను గ్రహించింది.. సముద్రాన్ని వదిలి బయటకు రాకూడదని .. అలా వస్తే తన మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని తను భావించింది.. 

ఆత్మాశి కుటుంబంలో తరానికి ఒక్కరే జీవించి ఉంటారు.. మత్స్యక ది నాల్గవ తరం .. తను ఒక పాపకు జన్మనిచ్చే వరకే తన జీవితం.. జన్మనిచ్చాకా తను ప్రాణం విడవాలి .. వారు కలయిక లేకుండా పిల్లల్ని కనగలరు.. వారి జాతిలో మగ అనేది లేదు.. అందరూ ఆడవారే.. ఆ మీనాలకు రక్షణగా వున్న ఆకుపచ్చని వలయం వారి ఒక్కో తరంలోని ఒక్కో పూర్వీకురాలిది.. తను కూడా ఆ ఆకుపచ్చని వలయంలో కలిసిపోయింది..ఆ రక్షణా వలయాన్ని మరింత శక్తివంతంగా మార్చి తనవంతు బాధ్యతను పూర్తి చేసింది..నిజానికి తను అప్పుడే ప్రాణం విడవాల్సింది కాదు.. కొందరు మనుషులకు ఈ మీనాల సంగతి తెలిసింది.. కానీ వాటి శక్తుల గురించి తెలియలేదు.. మనిషికి సముద్రాలను శాసించవచ్చని తెలిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి అందుకే ఆత్మాశి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.. తన ప్రాణాన్ని ఆ రక్షణా వలయానికి అర్పించి దాన్ని మరింత శక్తివంతంగా చేసింది..!


అని సమాధానమిస్తాడు అఘోరా.. !!

ఇప్పుడంతా అర్ధం అయింది .. కానీ ఒక్క విషయం ఇంకా సందేహంగా మిగిలి వుంది అంటుంది వారితోపాటు వచ్చిన ఆ అమ్మాయి.. !!

ఇక్కడివారు కన్నీరును ఎందుకు సేకరిస్తున్నారు ?? 

అది కూడా ఇన్ని సంవత్సరములనుంచి ?? 

ఇంత కన్నీరును వారు ఏం చెయ్యాలనుకుంటున్నారు ? అని ప్రశ్నిస్తుంది.. 

ఆత్మాశి చెప్పింది గా.. పవిత్రమైన, స్వచ్చమైన కన్నీరు ఆ చంద్రిక కొలనులో పడితే ఆ మీనాలకు వున్న ఆకుపచ్చని రక్షణా వలయం తొలగిపోతుందని.. బహుశా ఆత్మాశి చనిపోయి ఆ రక్షణా వలయం మరింత శక్తివంతంగా మారింది అనుకుంటా.. అందుకే దానికి సరిపడా కన్నీరును వీరు సేకరిస్తున్నారు అని అంటాడు మోహన్.. !!

అయితే ఇక్కడివారికి ఆ కొలను అందులోని మీనాల గురించి బాగా తెలిసుండాలి.. ముఖ్యంగా వాళ్ళు నక్షత్ రాసిన ఈ గ్రంధాన్ని చదివి అర్ధం చేసుకొని ఉండాలి అని అంటాడు ఆకాష్.. !! 

మీరు చెప్పింది అక్షర సత్యం.. ఈ గ్రంధాన్ని వారు ఎన్నో ఏళ్ళ క్రితమే కనిపెట్టారు .. కొన్ని సంవత్సరములకు ముందు సోకోట్రా కార్స్ట్ ప్రాజెక్ట్ యొక్క బెల్జియన్ స్పెలియాలజిస్టుల బృందం సోకోట్రా ద్వీపంలోని ఒక గుహను పరిశోధించింది. అక్కడ, వారు పెద్ద సంఖ్యలో శాసనాలు, డ్రాయింగ్లు మరియు పురావస్తు వస్తువులను చూశారు. క్రీ.పూ 1 వ శతాబ్దం మరియు క్రీ.శ 6 వ శతాబ్దం మధ్య ఈ ద్వీపంలో మనుగడ సాగించిన ఆటవిక తెగవారు వీటిని విడిచిపెట్టారని వారి పరిశోధనలో తేలింది. చాలా గ్రంథాలు భారతీయ బ్రహ్మా లిపిలో వ్రాయబడ్డాయి అని వారు చెప్పారు.. బహుశా ఆ బృందంలో ఎవరో ఈ గ్రంధాన్ని చదివి ఇలాంటి దారుణమైన పనులను చేస్తున్నారని నాకు అనిపిస్తుంది .. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

సరే ఇక మాటలకు సమయం లేదు.. వారి ప్రయత్నాన్ని మనం ఆపాలి అంటూ అఘోరా అంటాడు.. 


ఇంతలోనే యక్షామీ (ఉవిధ) తను జలకూనను తీసుకొచ్చింది.. ఆ పాప వచ్చీ రాగానే వారితో వచ్చిన ఆ అమ్మాయిని చూసి, అక్కా అంటూ, అమాంతంగా హత్తుకుంది.. జరిగిన విషయాలన్నీ ఆ పాపకు వివరించాడు ఆ అఘోరా.. తన తల్లి చనిపోయిందన్న విషయాన్ని చెప్పినా, తన గతాన్ని వినిపించినా ఆ జలకూన కంటి నుంచి ఓ చిన్న కన్నీటి బిందువు కూడా రాకపోవడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది.. 

తన మెడలోని హారాన్ని తీసి ఆ పాపకు ఇచ్చింది ఆ అమ్మాయి.. ఇచ్చింది తీసుకోవడానికి కాదు అక్కా అంటూ తిరిగి తన మెడలోనే వెయ్యబోతుండగా జలకూన చేతి స్పర్శకు ఆ హారం అందరికీ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.. ఆశ్చర్యంగా ఆ హారాన్నే చూస్తూ నిస్తేజంగా ఉండిపోతారు అందరూ..


To be continued …
Written by : BOBBY

Thursday, December 5, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 24th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

కాలానికి అనుగుణంగా నడుచుకోవాలే కానీ.. దాన్ని మార్చాలని ప్రయత్నించకూడదు.. ప్రయత్నించలేము కూడానూ .. “ప్రియమైన వారిని విడిచి వెళ్ళడం అంటే కేవలం దేహాన్ని వారికి దూరం చెయ్యడమే.. జ్ఞాపకాలను కాదు”.. అంటుంది మత్స్యక..వారి ఇరువురి కన్నీరును తుడుస్తూ..!


తరువాత ఏంటో చూద్దాం పదండి..
24th Part
మీ ఇద్దరికీ కొన్ని బాధ్యతలు అప్పగించాలి .. మీరు స్వీకరిండానికి సిద్దంగా వున్నారా ? 

అడుగుతుంది మత్స్యక..!

మీ మాట అంటే మాకెప్పుడూ ఆజ్ఞాపనమే..!! 

దానికి ఎప్పుడూ కట్టుబడే వుంటాము.. అని అంటారు వాసుర, నక్షత్ లు..!

ముందుగా నక్షత్ .. నువ్వు చాలా ప్రత్యేకమైనవాడివి.. పుట్టుకతోనే నీకు ఈ ప్రత్యేకత వచ్చింది.. ఆ ప్రత్యేకత ఏంటి అంటే.. నీకు తెలియని విషయాన్ని కూడా నువ్వు చాలా గొప్పగా వివరించి చెప్పగలవు.. నీ బుద్దికి అది తెలియదు కానీ నీ జ్ఞానానికి మాత్రం అన్ని తెలుసు.. ఎప్పుడో ఎక్కడో చూసినట్లు, చదివినట్లు అనిపిస్తుంటుంది కానీ నిజానికి నువ్వు ఈ జన్మలో వాటిని చూసి, చదివి వుండవు..

బుద్దేమో ఇది తప్పు అని నీతో ఎప్పుడూ వాదిస్తుంటుంది.. ఎందుకంటె దానికి తెలియదు కాబట్టి.. 

నీ జ్ఞానం మాత్రం సంశయించకుండా చెప్పమని ప్రోత్సహిస్తుంటుంది.. కారణం దానికి అన్ని తెలుసు కాబట్టి.. 

దేవతల భాష బ్రహ్మలిపి నీకు తెలియకపోయినా స్వతహాగా నీలో ఆ జ్ఞానం వుంది.. అందుకే నేను ఒక్క అక్షరం నేర్పిస్తే నువ్వు దానికి సంబంధించిన మరికొన్ని అక్షరాలు చెప్పేవాడివి..


మనుషులకు తెలియకుండా ఎన్నో శతాబ్ధాల నుంచి నిగూఢముగా వస్తున్నటువంటి ఈ బ్రహ్మలిపిని ఈ నాల్గవ శతాబ్దంలోనే మనుషులకు నీ ద్వారా ఈ లిపి అనేది ఒకటి వుందని తెలుస్తుంది.. ఇదే శతాబ్దంలోనే నీ తరువాత ఇది కాలం చెల్లుతుంది.. ఈ బ్రహ్మలిపి ఒకటి ఉందన్న విషయాన్ని మనుషులకు తెలియజేసే గ్రంధకర్తవు నీవు అవుతావు .. నీ కళ్ళముందు జరిగిన, జరుగుతున్న ప్రతీ విషయాన్ని పేర్లుతో సహా నువ్వు బ్రహ్మలిపిలో ఓ గ్రంధాన్ని రాయాలి.. ఇదే నీకు నేను అప్పగించే బాధ్యత అంటుంది ఆత్మాశి (మత్స్యక).

నా జీవితానికి ముఖ్యమైనది ఈ గ్రంధమే అయితే తప్పకుండా ఈ గ్రంధాన్ని పూర్తిచేస్తాను.. అంటాడు నక్షత్.. 

ఇక వాసుర నువ్వు .. ఈ పాపను ఉత్తర దిశగా తీసుకెళ్ళి అరణ్యము, సముద్రము కలిసే చోటున నాకు తెలిసిన రహస్య స్థావరం ఒకటి వుంది.. అక్కడ తనని జాగ్రత్తగా పరిరక్షించాలి .. పరులు ఎవరైనా తనని చూస్తే తన ప్రాణానికే ప్రమాదం.. అని అంటుంది ఆత్మాశి (మత్స్యక).

మీరు చెప్పినట్లే చేస్తాను.. కానీ నేను నక్షత్ ఒకదగ్గర వుండమా ? అంటుంది వాసుర .. 

రెండు దిక్కులు ఒకేచోట కలవడం మీరు చూసారా ? 

మీరూ అంతే .. నక్షత్ పశ్చిమ దిక్కుకు వెళ్ళాలి.. అంటుంది ఆత్మాశి.. !!వాసుర, నక్షత్ ఇద్దరు మౌనంగా తలదించి వుండిపోయారు.. ఇద్దరి కళ్ళలో కన్నీరు .. ఆ చంద్రిక కొలనులో బొట్లు బొట్లుగా రాలుతోంది.. 

ఏడవకండి .. మీ కన్నీరు చాలా పవిత్రమైనది, స్వచ్ఛమైనది.. పవిత్రమైన కన్నీరు చంద్రిక కొలనులో పడి కింద నున్న శ్వేతమయ మీనములకు తాకితే అవి ఆ వలయం నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చి తిరుగుతాయి.. వాటిని కనుక మనుషులు చూస్తే సముద్రాలను శాసించగలరు.. దానివల్ల ప్రపంచ వినాశనము కలుగుతుంది.. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.. అంటుంది. ఆత్మాశి ..


బాధపడకండి … మీ ప్రేమ అజరామరం .. కానీ ఇది విధి.. మీ బాధ్యతలు తీరిపోయాక చివరి రోజుల్లో మీరు కలిసే ఉంటారు.. అంటుంది. ఆత్మాశి..!!

ఉపద్రవం అన్నారు .. అది ఎప్పుడు ? ఎలా రాబోతుంది ? అడుగుతారు వాసుర నక్షత్ లు 

అవి నాలో రహస్యంగానే వుండాలి.. మీకు చెప్పలేను అని సమాధానమిస్తుంది ఆత్మాశి..!

కొన్ని రోజులు గడిచాయి... 

ఓ వైశాఖ పౌర్ణమి రోజున నిండు వెన్నెలలో చంద్రిక కొలనులో జలకూనకు జన్మనిస్తుంది ఆత్మాశి .. 

ఆ జలకూన జననానికి సంద్రం అంతా ఆనంద కెరటాలతో నిండిపోయింది.. జలచరాలన్నీ సంద్రం పై ఎగిరెగిరి గంతులేశాయి.. ప్రతీ పౌర్ణమికి ప్రకాశించే వెన్నెలకన్నా ఆ రోజు పదిరెట్లు ప్రకాశవంతంగా ఆ కొలను వెలిగిపోయింది… 

తల్లి పొత్తిళ్ళలో ఓ రోజు కూడా గడవకముందే తన పాపను ఉత్తర దిక్కుకు తీసుకెళ్ళమని వాసుర కు చెప్తుంది ఆత్మాశి..

తాను చెప్పినట్లే మరుసటిరోజు ఓ ప్రాతఃకాల సమయంలో వాసుర ఆ జలకూనను తీసుకెళ్తూ ఓ ప్రశ్నను అడుగుతుంది.. 

మా వంద సంవత్సరముల వయస్సు మీకు ఒక్క సంవత్సరం తో సమానం కదా..నేను ముదుసలి అయినా కూడా ఈ పాప ఇలానే పొత్తిళ్ళలో వుంటే ఎలా.. ?? నా తరువాత తన బాధ్యత ఎవరిది ?? అని అడుగుతుంది వాసుర .. 

మంచి ప్రశ్న .. 

నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను.. 

తన జ్ఞానరంద్రం మూసి వేయబడి.. తనకు తానుగా స్వతహాగా నిర్ణయాలు తీసుకున్న రోజున తన శక్తి ఏంటో తనకు తెలుస్తుంది.. తన శక్తులను ఎప్పుడైతే తెలుసుకొని తన మనుగడ సాగిస్తుందో అప్పటివరకు తను మామూలు పిల్లలవలె ఉంటుంది .. వారిలా మాములుగానే ఎదుగుతుంది.. అందుచేత నువ్వు భయపడాల్సిన పనిలేదు.. జాగ్రత్తగా వెళ్లిరా అంటూ తన పాపను చివరిసారిగా చేతుల్లోకి తీసుకొని ముద్దులు కురిపిస్తుంది ఆత్మాశి…

ఇంత బాధలో కూడా ఆత్మాశి కళ్ళలో ఓ చుక్క కన్నీరు రాకపోవడాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అక్కడ నుంచి పాపను తీసుకు వెళ్ళిపోయింది.. వాసుర.. 

ఎప్పుడూ కాంతివంతమైన ముఖముతో వుండే నక్షత్ అమాస చంద్రునిలా వెలవెలబోతున్నాడు.. తన నవ్వులన్నీ వాసుర పట్టుకెల్లిపోయిందనే బాధతో.... ఆ మరుసటిరోజునే నక్షత్ ప్రయాణం మొదలైంది.. తనని పశ్చిమ  దిక్కున సముద్రం మధ్యలో వున్న సొకోట్ర అనే ప్రాంతానికి వెళ్ళమని ఇక్కడే  తన గ్రంధాన్ని రాసి జాగ్రత్తగా భద్రపరచమని చెప్తుంది.. ఆత్మాశి..
To be continued …
Written by : BOBBY