Friday, July 13, 2018

నీలో నేను, నాలో నువ్వు..


నీలో నేను, నాలో నువ్వు..
******************

తనని చూచిన మొదటి క్షణం 
నయనములు మతాబులై పూసిన వేళ
స్తబ్ధుగా నన్ను నేను మరిచిపోయాను 
యుగాల నిరీక్షణకేదో తెరపడినట్లుగా
అనిపించింది ఆ క్షణమున ..!!

ఓకింత ఆశ్చర్యం,
ఓకింత ఆనందం,
ప్రతిఫలంగా కళ్ళలో ఓ వెచ్చని కన్నీటి ధారలు 
టప టప మని రాలుతున్నాయి.. పాదాలపై..!!

మధుర అధరములు మూగబోయి
సప్తస్వరాలు హృదయాన్ని మీటుతున్నాయి 
సప్తవర్ణాలు చెక్కిలినంటుతున్నాయి 
ఇంద్రచాపమై వెలిగిపోతున్నది ఈ మోము.!
నవనీతమై కరిగిపోతున్నది నా ఉల్లము..!!

ఊపిరాడనంత దగ్గరగా తను, 
ఊపిరాగిపోయేంతగా దూరంగా నేను,
తను ముందుకు, 
నే వెనక్కు, 
కరములు జాచి, 
బాహువుల మధ్యన, 
లతలా నను చుట్టుకుపోయింది,
మల్లెలా అల్లుకుపోయింది..!!

శంఖంవంటి ఆ మెడ పై నూ నూగు మీసాలు
ముద్దు పెడుతుంటే మైసూరుపాకు తిన్నాక 
మిరపకాయ బజ్జి కొరికినట్లు ఏం బాగుందో .. 
మెడ వంపుల్లో సన్నగా శ్వాస ఊదుతుంటే 
వయ్యారాల పైరు పై పిల్లగాలి లా 
తనపై నేను..అధర తాళపత్రములపై, 
మధుర సంతకములు గావిస్తూ,
ముంజేతి వేళ్ళతో నాభీమండలమును మీటుతూ, 
పూర్ణవికసిత కుసుమములా తను,
మకరంధము గ్రోలు తుమ్మెదనై నేను,
ప్రాతఃకాలమునుంచి గోధూళి వేళవరకు 
నీలో నేను, నాలో నువ్వు..!!

Written by : Bobby Nani

Thursday, July 12, 2018

“రవి” కాంచని చోటు కూడా “కవి” కాంచును“రవి” కాంచని చోటు కూడా “కవి” కాంచును అని ఊరికే అనలేదు పెద్దలు .. అంతే కాదు “కవి” మొండివాడు, చండశాసనుడు కూడానూ.. సమాజం బాగుపడాలన్నా, బ్రష్టు పట్టాలన్నా ఇతడిచేతుల్లోనే ఉంటుంది.. “రవి” “కవి” వచనం లోనూ, వాస్తవికతలోనూ ఇద్దరిదీ ఓ సముచిత పాత్ర.. అందుకే ఇద్దరినీ ఉద్దేశిస్తూ ఓ చిరు మినీ కవిత..! 


ప్రకృతిని పరిరక్షించేది రవి.. 
సమాజాన్ని సంస్కరించేది కవి.. 
ప్రకృతికి అనుకూలంగా మారుతుంది, 
రవి కిరణంలోని వెచ్చదనం. 
సమాజానికి అనుకూలంగా మారుతుంది, 
కవి కవనములోని చురుకుదనం..! 
రవి కిరణం, 
కవి కవనం, 
మానవాళికి మూలధనం..! 
కవి కలము కదలిన పెదవులు మెదలిన, 
చదువరుల ఎదల్లో వినేవారి వీనుల్లో, 
కవి పదధ్వని పరవళ్ళు ద్రొక్కుచూ, 
విందులు చేయుచూ విలయ తాండవం, 
ఆడినప్పుడే, 
మనసులోని మలినాలు నలిగిపోయి, 
మనిషిలోని మానవత్వం వెలికి వస్తుంది..!! 
తలచుకుంటే సత్కవి.. 
సాధ్యము కానిది లేదీభువి..!!

Written by : Bobby Nani

Thursday, July 5, 2018

ప్రణయము


ప్రణయము 
********

తెల్లవారుఝామున,
పడతి పాన్పు వీడి లేవఁబోతూ,
జారిన కోక ముడిని బిగించుచున్నది..!!

నెచ్చెలి నాభీ మండలము సరసి జోదర 
సోదరముగ మారి..
చూపు మరల్చక సమ్మోహనము
గావించుచున్నది..!!

తల కొప్పును చుట్టుటలో, 
బాహులతికలెత్తిన సమయమున 
కుచ సౌందర్యము పాల పొంగులా మారి 
అధర ఆహ్వానము మధురమున మొనర్చఁగ.. !!

జీరాడు కుచ్చిళ్ళను నాభిన దూర్చి
పమిట కొంగును నడుమున కూర్చి 
సుతిమెత్తని పాద పద్మములతో. 
పురివిప్పిన శ్వేత మధుకములా 
ఒయ్యారాలు చిలకరిస్తూ, 
కోనేటి గట్టున కొచ్చి
నలుగు స్నానార్ధమై కూర్చుంది..!!


గతరాత్రి జరిగిన ఏకాంత శృంగార
సమరమేదో తలంపుకొచ్చినట్టుంది, 
ఈ చిగురుబోడి వదనముపై 
తళుక్కుమని ఓ చిరునవ్వు 
చిలిపిగా మొలిచింది.
చిరునవ్వుతో కూడిన ఆమె మోము 
పసిడి పద్మములా మెరిసింది..!!

ఆదమరిచిన ఆమె భుజస్కందములపై 
బలమైన కరములు లతల్లా చుట్టుకుపోయాయి
ఆ స్పర్శను గమనించిన ఆమె 
తన పరిణేతయని తన్మయత్వము నొందినది.
అతని అధరములు ఆమె మెడపై 
మధుర నాట్యములాడుతున్నాయి.. 
అతడి మునివేళ్ళు నడుము 
నొక్కులను సరిచేస్తూ, 
ఆమెను రెండు కరములతో పాన్పుగ పైకెత్తి 
మరో సుదీర్ఘ సంగ్రామమునకు లోనికెళ్ళి గెడియపెట్టే..!!

Written by : Bobby Nani

Monday, July 2, 2018

ఆత్మహత్య మహా పాపం .. దాన్ని ఆపే భాద్యత మన అందరిదీ ..
సమస్యని చూస్తే పారిపోయేవారు నేటి కాలంలో బాగా ఎక్కువ అయ్యారు.. ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువయ్యారు. చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేక చనిపోవడానికి కూడా వెనకాడటంలేదు.
అసలు ఎందుకు ఇలా పిరికితనంగా మారిపోతున్నారు నేటి యువత ?

దీనికి ముఖ్య కారణం తల్లితండ్రులనే చెప్పాలి... !!

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చదవు, లేదంటే ఆటలు, లేదంటే టి వి చూడటం, లేదా మొబైల్ పట్టుకొని సోషల్ నెట్వర్కింగ్ లలో కాలయాపన చేస్తున్న పిల్లలతో కొంతసేపు గడిపి వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నమే చేయడంలేదు. అసలు మనకి సంబంధించి కొన్ని గ్రంధాలు ఉన్నాయని పిల్లలకే కాదు కొందరి పెద్దలకి కూడా తెలియకపోవడం నిజంగా విచారించాల్సిన విషయం.
ఆ గ్రంధాలు చదవడం చదివించడం వల్ల జ్ఞానంతో పాటు జీవితాన్ని, అందులో ఎదురయ్యే సమస్యలని ఎలా ఎదుర్కొని నిలబడాలో తెలుస్తుంది. 

ఒక సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా సమస్య మీద పోరాటం చేయకండి. లేనిపోని సమస్యలు వస్తాయి. ఆ సమస్య పునాదిని వెతకండి.. అసలు సమస్య ఎలా ప్రారంభం అయ్యిందో తెలిస్తే సమస్యని పూర్తిగా తొలగించవచ్చు. 

ఉదాహరణకి : మీకు ఒక మంచి స్నేహితుడు వున్నాడు అనుకోండి. అనుకోని పరిస్థితుల్లో వ్యసనాలకి లోనై పడిపోతున్నాడు. దీనికి మాములుగా ఎవరైనా చేసే పని స్నేహితుడిని మందలించడం. ఇక్కడే సూక్ష్మం దాగుంది.. మీరు అలా తిడుతుంటే ఇంకా ఎక్కువగా చేస్తాడు కానీ తగ్గించడు.. ఇక్కడ మీరు చేయాల్సిన పని వాడి స్నేహితులని, వాడి చుట్టూ ఉన్న పరిస్థితులని మార్చండి. తనకు మానసికంగా దగ్గరయ్యి తనలో మనోవికాసాన్ని నింపాలి.. క్రమ క్రమంగా తనలో తప్పకుండా మార్పు వస్తుంది.. వచ్చితీరుతుంది.

అలాగే పిల్లలకి ప్రతి విషయాన్నీ వివరించి చెప్పండి.. చీటికి మాటికి విసుక్కుంటే భయపడి అసలు అడగాల్సినవి అడగటం, చెప్పాల్సినవి కూడా చెప్పకుండా మానేస్తారు.. అలాగే చదువు, చదువు అని తెగ రుద్దేస్తున్నారు.. ప్రతి పిల్లాడికి (మనిషికి) ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలు ప్రతీ మనిషి అద్బుత సృష్టే.. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి.. చదవొద్దు, చదివించొద్దు అని చెప్పట్లేదు.. ఎంతవరకు అవసరమో అంతవరకు చదివించండి చాలు ... ఇది స్పీడ్ యుగం, చదవకపోతే వెనకపడిపోతాడు అనేది మీ తెలివితక్కువతనం.. మీ మూర్ఖత్వం... 

ఎంతోమంది ఎన్నో కనిపెట్టారు.. వాళ్ళందరూ MBA, MCA, Degree, PG ఏమి చదవలేదు.. ఎంత అవసరమో అంత అవసరమైన మేర మాత్రమే చదివారు ఆ విజ్ఞానంతో అద్బుతాలు సాదించారు.. ఎవరో ఏదో చేశారని వాళ్ళని చూసి మన పిల్లల్ని, వాళ్ళ జీవితాలని నాశనం చేయకండి..!! 90 శాతం అధికమైన ఒత్తిడివల్లె మన ఆరోగ్యాలు అనారోగ్యపాలౌతున్నాయని మీకు తెలుసా.. ?? ఎలాంటి సమస్య అయినా సరే ఇగోలు వదిలి పిల్లలు, పెద్దలు మనస్పూర్తిగా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం.. కావాలంటే ఓ సారి ప్రయత్నించండి.. ఒకరికొకరు మనస్పూర్తిగా మాట్లాడక పోవడం వల్లే సమస్య పుడుతుంది.. మధ్య వర్తుల సలహాలు, సహకారాలు అవసరం లేదు.. మీ వారికోసం ఏం కాస్త తగ్గించుకోలేరా .. ఇక్కడ తగ్గించుకుంటే మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్తు రెండూ బాగుంటాయి...!!
రేపు మాట్లాడుదాం లే అని అనుకుంటే అలాంటి రోజులు గడిచిపోతూనే ఉంటాయి.. 
ఇప్పుడే మాట్లాడండి..!!
రేపటితరానికి ఓ భరోసా, మేమున్నామనే ధైర్యం వారికి మీరు ఇవ్వండి..!!
ఆత్మహత్య మహా పాపం .. 
దాన్ని ఆపే భాద్యత మన అందరిదీ ..
అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ.. 

స్వస్తి.. __/\__

Written by : Bobby Nani