Monday, April 23, 2018

ఎదురు చూపులాపని అవిరామ ప్రేయాంసుడనై ..!!అర్ధం తెలియని బాధలో అస్పష్టంగా సంభాషించే నేను.. 
ఎల్లలు లేని ఈ ప్రపంచాన్ని నీ కళ్ళతో తప్ప 
మరే కళ్ళతో కొలవను.. ?? 
నీకు దూరమై అంచెలంచెలుగా బరువెక్కుతున్న 
ఈ హృదయ క్షేత్రము పై 
ఎన్ని అశ్రువులని రాల్చను.. ?? 
దూరం దూరంగా పోతున్న నిన్ను ఏ అయస్కాంత హస్తాలతో 
నా వైపు అమాంతం లాక్కోను ..?? 
ఎన్ని కాలాలైనా ఖర్చవ్వనీ, 
ఎన్ని పున్నమిలైనా ప్రసవించనీ, 
గడచిన వసంతం ... కళ్ళ వెనుక మెదుల్తున్నంత సేపూ 
నాకు మరణం లేదు.. 
శిలువ వేసినా మళ్ళి మళ్ళీ మొలవగల 
అనంత కాంతి కిరణాన్నై రేపటి ఉషోదయానికి తిరిగి స్వాగతం చెప్తాను..!!


నీరసంగా ఊగుతున్న మునివేళ్ళనడుగు.. 
నీ గురించి ఎన్ని కాగితాలు ఊపిరి పోసుకున్నాయో చెప్తాయి.. !
రెప్ప వేయని నా నయనములనడుగు.. 
ఎదురు చూచి చూచీ నా ఆశల ఆవిర్లు 
ఎలా ఎగచిమ్ముతున్నాయో చెప్తాయి..!
నన్ను మాత్రం అడక్కు 
నీ కవిత్వం ఎప్పుడు ఇంకిపోతుందని ..??
నా నరాలలో యెర్రని సిరా ఎప్పుడు ఆవిరౌతుందో నాకే తెలియదు.. !!

నా చెంపలకు రవి కిరణం తగిలిన ప్రతీ సారీ 
ఓ గిలిగింత, ఓ తుళ్ళింత ..
నీ అధర తొనలు నా చెక్కిలిపై ముద్రలు కురిపిస్తున్న 
మధుర ఉలికిపాటు..
నీకు గుర్తుందా ..!!
నిను చూచింది ఆనాడే.. 
నిను కలిసింది ఆనాడే.. 
నాటి చతుర్ధశి చంద్రోదయపు మన కలయిక 
జాజిమల్లె, సన్నజాజి పెనవేసుకున్న రెండు లతల్లా
నువ్వూ, నేనూ ఏకాంత మందిరములో 
మళ్ళి నూతన జన్మను ఆపాదమస్తకం సందర్శించాం... !!


నీవు వీడిన క్షణము నుంచి పున్నమి నాటి చంద్రుణ్ణి 
చంకలో పెట్టుకుని రాత్రి సంద్రంలో మునకలేస్తున్నా, 
తీవ్రంగా అలలు మళ్ళీ తీరానికే నను తోసుకొచ్చి పడేస్తున్నాయ్ .. 
నలుగురిలో వున్నా నేను నగరం నాగరికత నుంచి వంటరితనాన్ని 
ఆత్మకు అలంకరించుకున్న వాణ్ణి ..!
ఒక రహస్య నది నాలో ఉరకలు వేస్తూ ప్రవహిస్తోంది.. 
ఏకాంతంగా నీ రెండు కళ్ళ మధ్యా నన్ను నేనే నిర్భంధించుకొని 
రేపటి ప్రభాత వేళకు మళ్ళీ సిద్దమయ్యా, 
ఎదురు చూపులాపని అవిరామ ప్రేయాంసుడనై ..!!

Written by : Bobby Nani

Saturday, April 21, 2018

మా ఇంటి పెరటి..మా ఇంటి పెరటి.. 
************


నా హృదయం 
దుమ్ము పట్టిన పెరటి మామిడాకై 
గుమ్మానికి రెప రెపలాడుతోంది ..!! 

వానాకాలం వస్తే కాని నా పెరట్లో పూలన్నీ మొక్కలు కావు.. 
ఏనాటినుంచో అలవాటైన ఈ కాలుష్యపు వాయువు 
పొరపాటున నా ముక్కును తాకుతుందేమోనన్న గగుర్పాటు ఉంది నాలో.. 
నా పసి జాడలన్నీ ఈ నేల బురదలోనే దాగున్నా,...
ఈ తీగలే నా ఆత్మ స్తంభం చుట్టూ అల్లుకున్నా.. 
ఈ పశు దుర్గంధ పచ్చని వాయువునే 
నేనింకా శ్వాసిస్తున్నానేమోనన్న అతిశయం నాకు ..!!

ఈ పెరటి మందారాన్నై, 
చిక్కుడు నూగునై, 
ములగ చెట్టునై, 
పూయని అగ్నిపూల మానుపై ఇక్కడే నేను యౌవ్వనించినా.. 
ఈ జ్ఞాపకాలే నన్నేప్పటికప్పుడు పునర్జీవింపజేసినా, 
పల్లెటూరి సౌందర్యం నా ఒంటిని ఇంకా వదల్లేదేమోనన్న 
మహా భయం నాలో ఉంది.. !!

ఈ పంచ భూతాలు నాకు జన్మనిచ్చినా, 
నా పాతికేళ్ళ విత్తనాల, పూల, పళ్ళ వేళ్ళన్నీ 
ఈ మారుమూలే నాటుకొని ఉన్నా,
నా మెట్రోపాలిటన్ మనసెందుకో 
ఈ వాతావరణాన్ని హర్షించలేకపోతోంది.. 
కాలుష్యం, కాలుష్యం అని అరవకుండా ఉండలేక పోతూంది.. 
రేపటితరం ఎలా మనుగడ చేస్తుందోనన్న దిగులు వదలకుంది.. 
నా ఓనమాలు ఒక్కటై కవిత్వాలై, వెల్లువలైనా 
ఈ ఉత్తుత్తి తెలుగు చదువులకి 
నా మస్తకమెందుకో మనసొప్పుకోవడం లేదు.. 
పెరటి ఆకు గుమ్మం దాటితే చెత్త అవుతుందని తెలిసినా 
నా సిటీ జీవితాన్కి రంగులనద్ది 
కృత్రిమ పచ్చదనాన్నెక్కించి 
మరో చోట పూలకుండీ చెయ్యాలని మనసు లాగుతోంది..!!
Written by : Bobby Nani

Thursday, April 19, 2018

అర్ధమౌతోందా నీకు.. !కడలి కెరటాలు కాళ్ళకు తగిలిన ప్రతీసారి 
ఏదో సాధించామన్న తృప్తి.. 
గగనమందు మేఘము ఛత్రము పట్టిన ప్రతీసారి 
నేనేంటో తెలుసుననే నమ్మకం.. 
కానీ 
నాకు తెలియని రెండు కళ్ళు 
పదే పదే నన్ను గమనిస్తూ ఉంటాయి.. 
స్ప్రుసించని కొన్ని మునివేళ్ళు 
అదే పనిగా నాపై అక్షరాలు కుమ్మరిస్తూంటాయి.. 
మౌనంతో పోరాటం చేస్తున్నా బిగ్గరగా రోదిస్తూ.. !!
వ్యధల కారాగారంలో,
సమస్యల యజమానికి బానిసగా పడివున్నా.. 
ఈ జన్మకు విడుదలా లేదు.. 
ఈ జీవితానికి వేకువా లేదు.. 
చీకటి సంధ్యలు రాలుతున్నా.. 
నా హృదిలో నిశీధికి మాత్రమే చోటు.. !!

అర్ధమౌతోందా నీకు.. !

పారాణి కోసం పాదాలను.. 
కాటుక కోసం నయనాలను వదులుకోకు.. 
విరబూసిన పండు వెన్నెల నీ నవ్వు.. 
మసిబారిన పొగమంచు నా జీవితం.. !! 
అస్తమించిన రవిలో కిరణాలు వెతుకుతున్నావ్.. 
భరించరాని వేదన తప్ప మరేదీ మిగలదు.. 
అందుకే వెళ్తున్నా 
వెలుతురు లేని చోటుకు.. 
నీ నవ్వుల పువ్వులు పరిమళించని చోటుకు.. 
నీ అందియల చప్పుళ్ళు వినిపించని చోటుకు.. 
నీ లలాట లావణ్యము కనిపించని చోటుకు.. !!

కోరిక తీరగ ఒక్కసారి నీ రూపాన్ని దర్శించి 
రేపటి సంధ్యాస్తమయానికి కనుమరుగౌతున్నా...!!

Written by : Bobby Nani

Monday, April 16, 2018

లోపాముద్ర


కలువలు నడిరేయినే వికసిస్తాయి.. అలానే స్త్రీ సహజ సౌందర్యం కూడా నడిరేయినే ఉదయిస్తుంది.. నిజమైన ఆమె సౌందర్య కాంతిని దర్శించాలంటే ఆమెను నడిరేయినుండి మొదటి జాము లోగా చూడాల్సిందే.. అలాంటి ఓ దర్శన సౌందర్యాన్ని కాస్త పాత పద్దతులను అనుసరించి ఆనాటి ఓ కొత్త లోకానికి తీసుకెళ్ళే చిరు ప్రయత్నమే ఈ కవిత.. 

వేదంలో మంత్ర ద్రష్టలయిన స్త్రీలు కొందరు ఉన్నారు.. వారినే ఋషీకలంటారు. వారు చాలా నిష్టాతులు మరియు అపరిమిత సౌందర్యులు కూడా.. వారిలో ఒకరి పేరే ఈ “లోపాముద్ర” చదివి అభిప్రాయాలు చెప్పాలి మరి.. 

లోపాముద్ర 
**********


అదో ప్రభాతసమయము
మయూరి వనమున
నేనో యవ్వన భ్రమరమునై తచ్చాడువేళ..
శ్వేత హంసలు .. రెక్కల సందున 
తలలు దూర్చి నిదురించు వేళ..
ఏపైన వరి పైరు వయ్యారాలు పోయే వేళ.. 
తీగమల్లెలు గుప్పుమని పరిమళాలు చిందించు వేళ.. 
తుమ్మెదల జుంజుముల ధ్వనితో అటు తిరిగిన నాకు 
స్నానార్ధపు దిగుడు కోనేరు గట్టున,
పసిడికాంతుల దేహమునకు, 
పలుచైన వస్త్రమును చుట్టి, 
కస్తూరి, పసుపు, చందనాదుల లేపనము 
బాహువులకు అతి సున్నిత పూత లలుకు
“లోపాముద్ర” పాణి పై దృష్టి నిలిచింది.. !!


ఆమె సౌందర్య సౌష్ఠవము కోనేరున పడి 
కోటికాంతుల వెండి వెలుగులై నల్దిశలా ప్రసరిస్తున్నాయి.. 
లేపనము అలికిన ప్రతీసారీ ఆమె చేతి గాజుల గలగలలకు 
నీటి బాతులు రెక్కలనాడిస్తూ కొలనును 
ఊయలలూయిస్తున్నాయి.. 
ఆమె చేతికంటిన పసుపు తగిలి 
వాటి రెక్కలు పసిడి కాంతి ముద్దులొలుకుతున్నాయి.. 
అదో అందమైన దృశ్యం.. 
వర్ణించలేని అద్బుతమైన అదృశ్య దర్పణం..!!


అప్పుడే మొదలైంది.. 
ఢమ ఢమల ఉరుములతో, 
ధగ ధగ ల మెరుపులతో .. 
ఆమెను ఆక్రమించాలనే తపనలతో 
వరుణుడు ఆగమేగాలపై లంఘించుచున్నాడు.. 
తన అకాల ఆగమనమును గుర్తెరిగిన ఆమె 
ఏక ఉదుటున లేచి నిల్చున్నది.. 
ఆ పడతి సౌందర్య రక్షణకు మయూరములే పురివిప్పి నిల్చున్నవి.. 
పుడమిని ముద్దాడే ఆమె నీలి కేశములు 
వ్రేల్లాడే లతల్లా ఆమె హృదయ గోపురముల పై 
నుంచి జాలువారి ఉన్నాయి.. 
మయూరముల చాటున పదయారు గజముల చీరను చుట్టి.. 
ముత్యాల హారాలు ముత్తైదుగ పెట్టి..
కస్తూరి తిలకము కడు రమ్యముగ రాసి.. 
కాటుక కన్నులతో, 
నేరేడు కనుపాపలతో, 
నెలవంక కనుసోగలతో, 
శంఖపు మెడ వంపులతో, 
మధుర తొనల అధరములతో,
లయనానందకరిలా,
పురివిప్పిన శ్వేత మయూరములా.. 
గులాబీ వర్ణ పాద సౌకుమార్యముతో.. 
చెంగు చెంగున పసిడి లేడిలా కొంగైకెత్తుకొని 
సప్త స్వరాల అందియలను మీటుతూ కళ్ళముందే కదలిపోయింది.. !!


లిప్త కాలములో జరిగిన ఆ సౌందర్య దృశ్యం
ఆఖరి కట్టె కాలేవరకు కళ్ళముందే కదులుతూ ఉంటుంది..!!

Written by : Bobby Nani

Monday, April 9, 2018

లక్షల కోట్లు ప్రజాధనం గుంటనక్కులు గుమిగూడి మేస్తున్నాయి... ఏమీ చెయ్యలేమా ??


ప్రజాస్వామ్య దేశం.. వహ్ వినడానికి సమ్మగా వుంది... ప్రజలను పాలించాల్సిన వాళ్ళు ఖరీదు కట్టలేని హిమ గదులమధ్యన... వారిని ఎన్నుకొన్న ప్రజలేమో మురికి వాడల్లో... 

లక్షల కోట్లు ప్రజాధనం గుంటనక్కులు గుమిగూడి మేస్తున్నాయి... ఏమీ చెయ్యలేమా ?? 

ఈ ప్రశ్న వయసుకు వచ్చిన ప్రతీ ఒక్కరిలో మెదలాలి... 
ఈ మధ్యకాలంలో పేపర్ లో వస్తున్న వార్త A.C.B. (ANTI-CORRUPTION BUREAU) వారు వీళ్ళను పట్టుకున్నారు... వాళ్ళను పట్టుకున్నారు అని .. వినడానికి చాలా బాగుంది .. కాని ఎప్పుడు విన్న, కన్నా పలానా గవర్నమెంట్ ఉద్యోగి ఇంత మొత్తం తీసుకుంటూ దొరికిపోయాడు, అక్రమ లావాదేవీలు లెక్కకు మించి అతనివద్ద వున్నాయి అని చట్టానికి అప్పగిస్తున్నారు.. ఈ విషయంలో A.C.B. (ANTI-CORRUPTION BUREAU) వారిని ప్రశంసించాల్సిందే ...

దానికి ముందు నాదో చిన్న సందేహం..

ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగే ఇంత డబ్బు కూడబెడుతున్నప్పుడు ఒక నాయకుడు ఇంకెంత కూడబెట్టాలి.. ??
ఇప్పటివరకు ఒక నాయకుని దగ్గర ఇంత అక్రమ లావాదేవీలు వున్నాయని ఏ అధికారి అయినా కనీసం తెలుసుకోగలిగాడా ?? 
ఆ ధైర్యం చెయ్యగలిగాడా ?? 
ఏం ?? 
నాయకుని తాకాలంటే ప్రోటోకాల్ అడ్డు వస్తుందా ??
ఆ ప్రోటోకాల్ కోసమే కదా తన ఆస్తులను కాపాడుకోవడానికి కోట్లు రూపాయలు బిస్కెట్స్ ప్రజలకు వేసి, ప్రగల్భాలు పలికి నిచ్చెన ఎక్కి కూర్చుంటున్నారు .. 

ఒక ఇంగ్లీష్ శాస్త్రవేత్త మన ఇండియన్స్ గురించి అన్న ఒక మాట “ఒక గొర్రె ముందు పోతుంటే మిగిలిన గొర్రెలు కూడా దానివెనుక ఏమీ తెలుసుకోకుండా వెళ్ళడం” మనల్ని గోర్రెలుగా ఇందుకే అన్నాడేమో 
కులంపేరుతో ఓట్లు, 
ప్రాంతం పేరుతో ఓట్లు, 
మతం పేరుతో ఓట్లు, 
సారా బుడ్డిలకోసం, 
సాని దొరసానుల కోసం, 
పచ్చనోటు కోసం మనం వేసే ఓట్లు మనకు మనమే గోతులు తీసిపెడుతున్నాయి.... ఒక సామాన్య నిరుపేద కుటుంబానికి నాయకులు ఇచ్చే నోట్లు ఆ సమయానికి వారికి ఏంతో అవసరం. దానివల్ల వారు ఇలాంటి ఓట్లు వెయ్యాల్సి వస్తుంది.. మన బలహీనతలు వారికి బాగా తెలుసు ...

“ఎద్దు పుండు కాకికి ఫలహారం అంటే ఇదే”.. ఈ ఒక్కరోజు పబ్బం గడిపేందుకు మనం కక్కుర్తి పడుతున్నాం .... ! 

దాన్ని వారు 5 ఏళ్ళ పాలనకు పెట్టుబడిగా వాడుకుంటున్నారు.. 
ఎవరిలో వుంది నిజాయితి ఇక్కడ.. ?? 

మనం ఇలా ఉన్నంతసేపు వారు అలానే వుంటారు అది వారి నైజం.. 
మన బుద్దే మారాలి.. 

ఒక కూలి ఎండనక వాననకా రెక్కలు ముక్కలై కష్టపడి పనిచేస్తే సంధ్యాస్తమ సమయానికి వాడికి ఇచ్చేది 400 అక్షరాలా నాలుగు వందల రూపాయలు.. అది కూడా రోజూ ఉంటుందా ?? ప్రశ్నార్ధకమే ...
అవినీతి అనే పురుగు మన స్వతంత్ర భారతదేశాన్ని కొంచం కొంచం తినేస్తూ వుంటే ఒక సామాన్యమానవునిగా మింగుడు పడట్లేదు ... ఇక్కడ ఇలా ఈ పోస్ట్ నేను రాయడం అర్ధంలేని వ్యర్ధం అని తెలుసు కాని హృదయంలో రగులుతున్న అగ్ని ఆరనంటోంది .. 

నిన్నట్నుంచి చూస్తున్న ఎవరి టైంలైన్ లో చూసినా సినిమాల గురించే .. సినిమా టిక్కేట్లుకు పడ్డ శ్రమను మీరు పై విషయాల మీద కేంద్రీకరించి వుంటే మన దేశం మరోలా ఉండేదేమో.. అదేమంటే కూసంత కళా పోషణ వుండాలి అని ఎదవ సెటైర్లు .. కళా పోషణ అనేది ఉండాలి. అది హద్దులలో వుండాలి అనేది నా అభిప్రాయం.. సినిమా తీసేటోల్లు, యాక్ట్ చేసేటోల్లు అందరూ బాగుంటారు నాకిపోయేది మనమే .. !! 

సొ సినిమాను సినిమాలానే చూడండి .. అందులో మనకు కావాల్సిన మంచి విషయాన్ని మాత్రమే గ్రహించండి.. మిగతాది వదిలెయ్యండి.. నిజ జీవితంలో మన మధ్య ఏం జరుగుతుందో కూసంత పట్టించుకోండి .. భాద్యతాయుత పౌరులుగా మెలగండి.. ఈ దేశం నీకు ఏమీ ఇవ్వలేదు అనుకోకండి.. నిన్ను ఎన్నో సంవత్సరములు భరిస్తుంది అదే ఎక్కువ.. మనమే ఈ దేశానికి ఎమివ్వగలమో ఆలోచిద్దాం.. మన రాబోవు తరాలవారికి ఒక మార్గాన్ని, నిర్దేశాన్ని అందిద్దాం..

స్వస్తి.. ../\...

Written by : Bobby Nani
 

Tuesday, April 3, 2018

నేటి సమాజంలో నవసంబంధాలు...


నేటి సమాజంలో నవసంబంధాలు 
మానవీయవిలువలను కోల్పోయి 
మార్కెట్ విలువలు ప్రతిష్టింపబడుతున్నాయి. 
కావలసినది పొందటం, 
ఎటువంటి దానికోసం అయినా, 
ఎంతటి నీచానికైనా దిగజారటం...!!

భౌతిక సుఖాలను పొందటమే పరమలక్ష్యం గా 
సాగుతున్న ఈ చదువుల ఫలితాలు నేడు 
ఆధునిక అలంకారాలుగాను, 
ఊరకుక్కల్లా కన్నేసిన ప్రతీవారిని 
చిన్నా, పెద్దా, 
వావి, వరస అనే బేధాలు లేకుండా 
అనుభవించే పాశ్చాత్య సంస్కృతిని,
స్వేఛ్ఛాజీవనానికి సంకేతంగానూ మార్చివేశాయి..!!

ఎనిమిదేళ్ళ వయస్సులో 
పక్కనింటి అంకుల్ గట్టిగా బుగ్గ గిల్లాడని 
తల్లికి చెప్పలేకపోయింది ఓ పసితనం .. !
తల్లి కోప్పడుతుందని.. !!

బడిలో ఓ కామ పంతుల వెకిలి చేష్టల్ని 
మనసులోనే అణిచివేసింది ఆ ఆడతనం.. !
ఇంట్లో తెలిస్తే చదువుకు ఇక సెలవంటారని ...!!

బజారులోని దుకాణం దారుడు, 
రోజు వెళ్ళే బస్సులోని కండెక్టర్, 
ఇంటి సందు చివరన కుర్రకారు గుంపు, 
ట్యూషన్ మాస్టారు కొడుకు... 
ఇలా ఎన్నో ఎన్నెన్నో వేదింపులు.. !!

అన్నీ అవమానాలను దిగమింగుకొని 
కన్నిటితోనే కలిసికట్టుగా జీవిస్తోంది.. !!

ఈవ్ టీజింగ్ ని మునిపంట నొక్కి, 
ర్యాగింగ్ లకు దాసోహం చేసి, 
అగ్నిగుండాల వంటి ఎన్నో సంద్రాలను 
దాటుకొస్తుంది ఆ ఆడతనం ...!! 

ఉద్యోగంలో పై అధికారి దుర్భుద్ది 
బయటపెడితే గుట్టుగా మందలించింది... 
వింటే ఎవరైనా తనమీద 
నిందమోపుతారేమో అని భయపడి.. !!

చివరికి భర్త క్రూరత్వాన్ని, 
కర్కశత్వాన్ని భరించడంలో 
తానింకా భూదేవి పాత్రనే ధరిస్తూ వుంది...!!

ఇలా పురిటిపిల్ల దగ్గరనుంచి 
పీనుగయ్యే వరకు 
ఒకటా, రెండా ఎన్ని అడ్డంకులను 
దాటుకు వస్తుందో.. 
కామేంద్రుల వెకిలి 
వికటాట్ట హాసాల విరుపులలో 
తను ఒక తునిగిన తునక.. 
అదే ఆనందమని, 
విజయమని, 
స్వంతమని, 
ఆక్రమించామని, 
బలవంతంగా అందుకున్నామని ఆ 
కామేంద్రులు విర్రవీగితే... 
వారి వెనకనున్నది కూడా 
మరో స్త్రీ నల్లని నీడ మాత్రమే...!!!!

ఇలాంటి వారికి భయం ...భయం...
భయం... కావాలి ...

తప్పు చెయ్యాలనే ఆలోచన రావడానికే వణుకుపుట్టేంత భయం కావాలి. ... 
నిర్ధాక్షిణ్యంగా తప్పుడుపనులకు తెగబడె వారి తలలు నేలకు రాల్చాలి....
మానభంగం చేసినవాడికి మర్మాంగాలను కోసివేయడం....
దొంగతనం చేసినవాడికి వేళ్ళు తెగనరకడం....
ప్రజలను దోచుకున్నవాడికి బహిరంగంగా శిరచ్చేదన చేయడం ....
కంటికి కన్ను, చెయ్యికి చెయ్యి, అంగాని అంగం 
దేనితో ఏ తప్పుకు పాల్పడ్డా దాన్ని బహిరంగంగా కత్తిరించాలి.. 
ఇలా ఉండాలి శిక్షలు అంటే.. 
ఒకప్పటి మన శిక్షలు ఇవే... 
కాని మనమే వాటిని ప్రజాస్వామ్య దేశం అంటూ మరిచిపోయాం... 
ప్రక్క దేశాలవారు ఇలానే చేస్తున్నారు..... 
అందుకే అన్యాయాలపై వారి శాతం స్వల్పం ..... మన శాతం అమితం ...
ఎంతత్వరగా ఈ చట్టాలు రావాలంటే. 
మరో చిన్నారి, మరో చెల్లి, తల్లి బ్రతుకులు అన్యాయం కాకుండా 
ముందుగానే కావాలి, రావాలి ...
మన రాజ్యాంగంలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా చాలా సవరణలే చేసారు ... 
కాని అవి చాలవు, ఇంకా ఖటినతరం చెయ్యాలి... 
ఉదయం పేపర్ చూసింది మొదలు రాత్రి వార్తలు విన్న వరకు ఏదో ఒక మూల ఎక్కడో ఒకదగ్గర పలానా మృగం ఇలా చేసింది అనే రాతలు చూసి తట్టుకోలేకపోతున్నాం.. !!

Written by : Bobby Nani

Monday, April 2, 2018

హరి – హరిణకవితలెప్పుడూ మగ భావాలనుంచేనా.. కాస్త ఆడవారి భావనల నుంచి రాస్తే ఎలా ఉంటుంది.. 
ఆ ఆలోచనతోనే మొదలైంది ఈ చిరు కవిత.. 

హరి – హరిణ 
**********

విశాలమైన నీ వక్షస్థలం మీద 
విహరించే నా చూపులు 
నా కంటి పాపల తెరలమీద 
నాకలోకాలు సృష్టిస్తున్నాయి 
నీ ఉద్దండ బాహా దండాలమీద 
ఊగిపోతున్న నా ఊహలు 
నీ విస్తుల మస్తకం మీద 
వాస్తవాలై మెరుస్తున్నాయి.. 

నాథా .. నాథా ... !! అంటూ 
నా నాలుక నాట్యం చేస్తున్నది 
నీ వజ్ర దంత వేదిక మీద 
పారవస్యపు పరదాల వెనుక 

నీ చైతన్య శక్తి బిందువులు 
నా నిశ్చిలతా సింధు శుక్తిలో రాలి 
మన బాధా ముక్తి ముక్తాఫలాలై 
మధురానుభూతి కలిగిస్తున్నవి 

నా నరహరివి నీవు.. 
నీ మనోహరిని నేను.. 
నీవు “హరి” నేను “హరిణ” 
ఆటో వేటో తెలియని 
అనుబంధం మనది.. !!

Written by : Bobby Nani

Saturday, March 31, 2018

అధరామృతము..


అలిగిన చెలి అధర రుచిని ఎంత మంది చవిచూసారో తెలియదు.. ఆ మాధుర్యం ఎలా ఉంటుందో చెప్పే చిరు ప్రయత్నమే ఇది.. 
ఇది చదివాక ఎలా పడితే అలా ప్రయత్నించకండి.. వికటిస్తే అధరాలు శిధిలాలౌతాయి.. 
జాగ్రత్త సుమీ.. !!

అధరామృతము.. 
************

పొద్దుగూకే వేళ
జాజి తోట గుప్పుగుప్పుమను సమయాన 
ఆరుబైట, నులక మంచెపై 
అలకపాన్పునెక్కి 
మూడు పదుల కోమలాంగి
మూతి ముడుచుకు కూర్చుంది.. !!

అలిగిన చెలి 
అధర రుచి చవిచూచిన 
పరిణేత ఆవురావురుమని 
ప్రణయిని చెంతకు పరుగెత్తుకు వచ్చే 
గమ్మునుండక సూది మొనల 
చూపులతో నిలువెల్లా తనువంతా 
గ్రుచ్చి గ్రుచ్చి తమిడి తమిడి 
రంజింపజేసే.. !!

వలపు చూపుల తాళలేక 
కాళ్ళు ముడిచి పవళించె .. ఆఁ
భంగిమ జూచిన పరిణేత 
మధువు కోసం తల్లడిల్లే తుమ్మెదాయే 
నడుము నొక్కులు సవరిద్దామని 
మునివేళ్ళను ముందు పంపే.. !!

గరుకు మునివేళ్ళ మీటునకు 
మెత్తని చెలి సొగసు ...ఉలికి, కులికి 
మునుపంటిన పెదవి బిగించే..
మునివేళ్ళనాపి అరచేతిన 
నడుమందాలను ఒక్క ఉదుటున బంధించే..
ఊహించని పరిణామముకు 
రెప్పలు రెండూ హద్దులు దాటి మూతలు పడె.. 
యెవ్వన ప్రాయములు ఉప్పొంగి లేచె 
ఇక తాళలేక మధుర అధర తొనలను 
ద్వారముగ మలచి జత పెదవులను స్వాగతించే.. 
జోడి అధరముల ఘాటైన పెనుగులాట 
శ్వాస కూడా జొరబడనివ్వని ప్రణయ ఘట్టం.. 
కొన్ని క్షణాల అవిరామ నిశ్శబ్దం
అమృత జలమును ఒకరినొకరు జుర్రుకుంటున్న క్షణం.. !!

అధర మధురిమలకు చెలి అలక చిన్నబోయే.. 
అలిగిన చెలి అధర రుచులకు పరిణేత పునీతుడయ్యే ..!!
మరోసారి 
ఆమె అలకకై నిరీక్షించే..!!

Written by : Bobby Nani

Friday, March 30, 2018

సాహిత్యంలో స్త్రీ పాత్ర.. మరో కోణంలో నా చిరు వివరణ..


సాహిత్యంలో స్త్రీ పాత్ర.. మరో కోణంలో నా చిరు వివరణ.. 
***************************************


మన సాహిత్యం చాలా గొప్పది .. కానీ కొందరు కవుల వల్ల ఆ సాహిత్యం అంగడిలో ఆటవస్తువు అయింది.. అశ్లీలత, విశృంఖలత్వాన్ని వారు ప్రోత్సహించారు.. శృంగార రసాన్ని మితిమీరి చిందించారు.. అయినా వారు గొప్పవారే, వారి సాహిత్యం గొప్పదే.. ఎందుకో నాకైతే కొంచం ఎబ్బేట్టుగా అనిపించింది.. శృంగార వర్ణన చెయ్యడం నాకూ ఇష్టమే.. కానీ దానికి నాకంటూ హద్దులు ఉన్నాయి.. మనకు ఏదైనా ఇష్టం ఉంటే దాన్ని పదే పదే చేస్తూనే ఉంటే ఒకానొక సందర్భంలో దీనికోసమా మనం ఇంత ఇష్టాన్ని పెంచుకుంది అనే భావన తలెత్తుతుంది. అది జరగకుండా ఉండాలంటే ఏదైనా హద్దులలో వుండాలన్నది నా ఉద్దేశం.. మన ప్రాచీన సాహిత్య గ్రంధాలను చదివాక వాటిల్లో ముఖ్యమైనవి నచ్చినవి, నచ్చనివి రెండూ రాస్తున్నాను.. ఇకా చాలా రాయాలనుకున్నాను.. కానీ సమయమూ, సందర్భమూ రెండూ అనుకూలించలేదు.. నా వయస్సు వారు కాకపోయినా పెద్ద వయస్కుల వారు ఈ వ్యాసాన్ని తప్పక చదువుతారనే నమ్మకం ఉంది.. చదివి మీ అభిప్రాయాలు వెలిబుచ్చాలని కోరుకుంటూ.. __/\__


ప్రాచీన హిందూ సంస్కృతికి మూల పురుషుడైన మనువు సృష్టికి మూలవిరాట్టు అయిన స్త్రీని ఒక వ్యక్తిగా చూడలేకపోయాడు.. “అసత్యం అంత చెడ్డది స్త్రీ అని అంటాడు”.. మనువు వంటి బుద్ది తక్కువవాడు ఈ సృష్టిలో మరొకడు లేడనుకుంటాను .. హిందూ సంస్కృతికి మూల పురుషుడని చెప్పుకోవడం మన దురదృష్టకరం.. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్దాప్యంలో కొడుకుల సంరక్షణలో స్త్రీ ఉండాలే కాని స్వేచ్చా స్వతంత్రాలతో హాయిగా, ఆనందంగా, ఒక వ్యక్తిగా జీవించడానికి వీలులేదని శాసించాడు.. ఇంతకన్నా తెలివైన మూర్ఖుడు మన సమాజంలో వుండడనుకుంటాను .. మనువును ప్రాచీన హిందూ సంస్కృతికి ఆద్యుడు, ఆరాధ్యుడని చెప్పుకోవడం, మనుస్మృతిని భారతీయ ధర్మ శాస్త్రంగా కొనియాడటం మన జాతికే తగును.. 


మన గ్రంధాలు స్త్రీ లోని ఉత్తమ గుణాల్ని కీర్తిస్తూ, స్త్రీ ని గౌరవించాలని పేర్కొంటూ కట్టుబానిసలుగా తయారుచేసాయి.. 


పురాణ సాహిత్యమంతా స్త్రీలు ఇష్టపూర్వకంగా బానిసత్వాన్ని వరించే పద్దతిని భోదించింది.. పాతివ్రత్యానికి, పవిత్రతకు, స్వామి భక్తికీ, నాటి స్త్రీ ప్రతీక అయింది.. నల దమయంతులు, సీతారాములు, సావిత్రీ, సత్యవతుల కథల్లో స్త్రీ భర్త యెడల విధేయతతో ప్రవర్తించాలని, త్యాగం చెయ్యాలని నాటి సాహిత్యం నిర్దేశించింది.. నాటినుంచి దమయంతి, సావిత్రి, సుమతి, అహల్య ఆదర్శ మహిళలుగా పొగుడుతున్నారు.. పతివ్రతగా మాత్రమే ఆనాటి స్త్రీ కి వ్యక్తిత్వముండేది.. అగ్నిలో దూకమంటే దూకింది.. భర్త ఆజ్ఞాపిస్తే కొడుకును చంపబడింది.. భర్తను వేశ్య వద్దకు మోసుకెళ్ళింది.. పంచభర్తృక అయింది పాంచాలి.. భర్త కోసం గ్రుడ్డిగా జీవించింది గాంధారి.. భర్త కామంకోసం శర్మిష్ట కన్యగా జీవితాంతం బ్రతికింది.. సతిగా నాటి స్త్రీ సహగమనం చేసింది.. ఇలా వందల వేల సంఖ్యలో పతివ్రతలుగా పేరుపొందిన ఆదర్శ మహిళలు ఉన్నారు.. అసలు స్త్రీ కి పతి సేవ తప్ప ఏ కోరికా ఉండరాదనే పవిత్ర ధర్మమైంది.. సతీ సహగమన కాలమునకు పూర్వము నుంచి నేటి వరకు నలిగేది, నలుగుతున్నది స్త్రీ మాత్రమే..


ప్రాచీనాంద్ర కావ్య సాహిత్యంలో స్త్రీ పతివ్రతగా, శీలవతిగా, గుణవతిగా చిత్రీకరించబడింది.. ప్రభంధ యుగం వచ్చేసరికి కవులు స్త్రీ ని ఆటవస్తువునిగా, అంగడి బొమ్మగా చిత్రించారు.. ఈ యుగం నాటి కవులు రాజుల్ని ఆశ్రయించి వారి అభిరుచులకు అనుగుణంగా అడుగులకు మడుగులొత్తుతూ తమ కావ్యాలను కడురమణీయంగా వ్రాశారు.. ఈ యుగంలో కవులందరూ ఇదే పని చేసారు.. ఎంతసేపూ రాజును, వాళ్ళ ప్రియురాళ్ళను గోరంతల్ని కొండంతగా చేసి భూతద్దంలో చూసి కీర్తిస్తూ అక్షర భజన చేయడమే వీరి పనిగా మారింది.. తమ రాజ్యాన్ని, తమ ప్రియ రాండ్రల్ని ప్రశంసలతో ఎత్తి ముంచెత్తిన వారికే కనకాంబరాలు ఇచ్చి గండపెండేరాలు తొడిగి ఘనంగా సత్కరించి గొప్ప కవులుగా పరిగణించారు.. స్త్రీ ని నఖశిఖ పర్యంతం అంగాంగ వర్ణనల్ని చేస్తూ అతిగా వర్ణిస్తూస్త్రీ ని శల్య పరీక్ష చెయ్యడానికి ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.. 


ప్రముఖ విమర్శాగ్రేశ్వరుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు ప్రబంధ సాహిత్యంలోని స్త్రీ గురించి వ్రాస్తూ ఇలా అన్నారు.. “నాయిక వివాహానంతరం ఆమె చెలికత్తెలైనా తమ చెలిని శోభనపు గది తలుపుల చెంత వదులుతారేమో కాని, కవి మాత్రం అరక్షణం కూడా ఆమెను వదలడానికి అంగీకరించడని” చెప్పారు.. ఇది నూటికి నూరుపాళ్ళు పచ్చి నిజం.. కవులకే స్వేచ్చా, స్వతంత్రాలు లేనప్పుడు స్త్రీ లకు ఎలా ఉంటుంది.. 


తిమ్మన గారు స్త్రీ హృదయం ఎరిగిన వారు స్త్రీ సహజ గుణాలను, కోపతాపాలను, ఈర్ష్యాసూయలద్వేషాలను తిమ్మన గారు తప్ప మరెవ్వరూ వ్రాయలేరేమో.. తిమ్మన గారు స్త్రీ పక్షపాతి.. తెలుగువారికి అత్యంత ప్రియమైన నాయిక సత్యభామను మొదటిసారిగా కావ్య రంగ ప్రవేశం చేయించిన కీర్తి తిమ్మన గారికే దక్కుతుంది.. పురాణంలోని సత్యభామకంటే కావ్యంలోని సత్యభామే రమ్యాతి రమ్యంగా చిత్రించబడింది.. స్త్రీ సహజ గుణాలను కాచి, వడపోచిన సంపూర్ణ స్త్రీ మూర్తి సత్య భామ.. సత్యలో సహజ సౌందర్యం, సహజమైన స్త్రీ మనస్తత్వం, రసిక ప్రియత్వం, కొంటె చిలిపితనం కొట్టి వచ్చేటట్లు కనబడతాయి.. ఆత్మాభిమానం పేరుతో అడుగడుగునా అలకపాన్పు ఎక్కుతూ అనుకున్న పని సాధించిన నారీ శిరోమణి సత్యభామ.. 


చేమకూర వెంకట కవి గారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఉలూచి, చిత్రాంగద, సుభద్రలు మువ్వురు నాయికలు కామశాస్త్ర సూత్రాలకు ప్రతీకలని చెప్పవచ్చు.. విచారకరం ఏంటంటే స్త్రీ లు రాసిన కావ్యాలలోనే ఎక్కువ శృంగారం చోటు చేసుకోవడం ఉదాహరణకు ముద్దుపళని, రాధికా స్వాంతనంలో పచ్చి శృంగారం పరాకాష్టకు చేరుతుంది.. 


శీలవతి, గుణవతి, సంస్కారవతి అయినా స్త్రీ ని వేమన గారు పవిత్ర భావనతో చూశారు.. దుశ్యీల వతుల్ని, గయ్యాళితనాన్ని దుయ్యపట్టడంలో ఏ మాత్రం వెనుకంజ వెయ్యలేదు.. సుగుణవంతురాలు భార్య ఉన్నప్పుడు గృహమే స్వర్గసీమగా ఆదర్శ దంపత్యసుఖాన్ని అందించు ఇల్లాలే ఇంటికి జ్యోతిగా భావించాడు వేమన .. 


ఆంద్ర సాహిత్యంలో స్త్రీ జనోద్దరణకు మొట్టమొదట దీక్షా కంకణం కట్టుకొన్న మహోన్నత మూర్తి కందుకూరి గారు.. వారు స్త్రీ అభివృద్దిని కాంక్షిస్తూ ప్రత్యేకంగా స్త్రీ లకోసం పత్రికలు స్థాపించారు.. “సత్యవతీ చరిత్ర” నవలను స్త్రీల కోసం వ్రాశారు .. “స్త్రీలను పురుషులతో సమానంగా గౌరవించుచున్నంత కాలమును మనదేశమెంతో యున్నత స్థితి యందే యుండినది .. అట్లు గౌరవించుట మాని విద్య చెప్పించుట వదిలి వారిని దాసీజనుల వలె జూడ మొదలుపెట్టిన తరువాతనే మనదేశమున కిట్టి దౌర్భాగ్యదశ యారంభమైనది” అని కందుకూరి వారు వాపోయేవారు.. 


తల్లి కడుపులో తప్ప స్త్రీ కి రక్షణ, విలువ లేదని ఆవేదన వ్యక్తం చేసారు కొల్లూరి వారు.. ఈరోజుల్లో ఆ గర్భంలో కూడా స్త్రీ కి రక్షణ లేకుండా పోయింది.. 


తమ స్వార్ధ ప్రయోజనాల కోసం స్త్రీ అందచందాలను, ఒంపు సొంపుల్ని, సోయగాల్ని. హొయల్ని వ్యాపారాభివృద్ది నిమిత్తం వాడుకోవడం మగజాతిని మరింతగా దిగజారుస్తుంది.. 


స్త్రీ సనాతన మూఢాచార సంప్రదాయ ముసుగులో నత్త నడక నడుస్తోంది.. పురుషునితో సమానంగా స్త్రీ ఏనాడైతే ముందుకు నడుస్తుందో ఆనాడే దేశం బాగుపడుతుంది. ఇందుకు అన్నీ వర్గాల వారు ముఖ్యంగా నాయకులు ముందుకు రాగలగాలి .. 
స్త్రీ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి,, 
స్త్రీ మాతృ మూర్తియే కాదు.. మానవతా మూర్తి కూడా.. 
అర్ధం చేసుకోండి.. __/\__

Written by : Bobby Nani
 

Tuesday, March 27, 2018

ఒక ప్రేమికుడు అడిగిన కోరిక.. తన ఆవేదనను అక్షరాలుగా మలచమని.. !!ఒక ప్రేమికుడు అడిగిన కోరిక.. తన ఆవేదనను అక్షరాలుగా మలచమని.. !!


దూరంగా ఉంటే దూరమైపోతావనుకున్నవా 
నీ పిచ్చి గాని.. 
కరిగే కాలమూ, 
కదిలే కెరటాలు 
ఎవరికోసమూ ఆగవు.. 
అవిశ్రాంతంగా ముందుకు 
పయనిస్తూనే ఉంటాయి.. !!


అలానే నీపై నాప్రేమ 
విశ్రమించని ఎదురు చూపులే... 
వికసించని కుసుమ పరిమళములే... 
కన్నీరింకని నయన జలపాతములే.. !!


ఓ ప్రాణ సఖీ.. !!
నా ప్రస్థాన త్రయ పాండిత్యం 
నీ గంభీరనతనాభి లోయలో కూలిపోయినది.. 
నా సకల శాస్త్ర విజ్ఞాన సర్వస్వం 
నీ శిరోజ నీలి శిఖరాలముందు వెలవెలబోయింది.. 
దిక్కుతెలియని దిగంబరుడనై చిక్కుకున్నా
ద్వి శరీరాలింగనైక శ్రీ కారాకారాదిమ బంధంలో..
అవర్ణనీయమై పోయాయే నా వర్ణనలన్నీ.. 
నీ అదృశ్యముతో.. !!


ఓ ప్రాణ సఖీ.. 
నా ఆశాకాశ పూర్ణచంద్రముఖీ..
ఎన్నో అభివర్ణించిన వాచస్పతిని 
నేడు మన దూరాన్ని వివరించలేక పోతున్నా.. 
ఎన్నోన్నో అనుభవించిన కళామతిని.. 
నిన్ను అభినయించలేకపోతున్నా.. 
శ్రీకార శిఖరాల మీద 
నా ఆత్మానుభూతిని ఎగరవేయడానికి 
నేనే ఓ బావుటాన్నై..నీ సరళవక్ర 
రేఖాగణిత గుణిత జనిత 
అగణిత రూపాలను 
అవగాహన చేసుకుంటున్నాను.. 
కాలాన్ని నా కన్నులలో మోడ్చి 
అనంతాకాశం వైపు శిరస్సెత్తి ఎదురుచూస్తున్నాను...
లిప్తపాటులోనైనా నీ రూపం దరసించుననే విశ్వాసముతో..!!

Written by : Bobby.Nani

Saturday, March 24, 2018

చిరకాల బంధీనేనే నీ కౌగిళ్ళలో..నేను లిరిక్స్ వ్రాసింది చాలా తక్కువే .. ఎందుకో అటువైపు వెళ్లాలనిపించదు .. కారణం ఒక్కటే అయివుండొచ్చు.. ఆ లిరిక్స్ కి స్వరాలు కూర్చితేనే అవి అందంగా తయారవుతాయి.. ఆ స్వరాలు కూర్చడం అనేది ఓ అందని ద్రాక్షే.. అందుకే ఈ కవితలతో, కావ్యాలతోనే సరిపెట్టేసుకున్నాను.. వీటికి స్వర మాధుర్యం అక్కర్లేదు.. సహజంగానే సౌందర్యంగా ఉంటాయి.. అందుకే ఇవి అంటే కాస్త మక్కువ ఎక్కువ.. కానీ అప్పుడప్పుడు వాటినీ ఓ పట్టు పడుతూ ఉంటాను... అలా ఓ షార్ట్ ఫిల్మ్ కి అని వ్రాసిన ఓ రొమాంటిక్ లిరిక్సే ఇది.. ఒకరి కోరిక మేరకు వ్రాయాల్సి వచ్చింది.. ఇప్పుడు వారే అందుబాటులో లేరు... అందుకే వారి జ్ఞాపకంగా, వారు మళ్ళి తిరిగి రావాలని వారిని గుర్తు చేసుకుంటూ ఇది పోస్ట్ చేస్తున్నాను.. 


చిరకాల బంధీనేనే నీ కౌగిళ్ళలో..
అవిరామ శ్రామికుడనే నీ సౌఖ్యములో..
నా కలల ఇంద్ర ధనుస్సుల మీంచి 
నడిచిరా ఆంగికాభినయంతో నా అర్ధాంగివై ..!!


విరబోసుకున్న నీ కురుల మధ్యన 
నా లే .. లేత కోరిక వ్రేళ్ళాడు సమయాన..
పురివిప్పిన మయూరము నువ్వై 
పరితపించే పరిణేతుడు నేనై .. 
నీ పెదవిపై పూచిన నవ్వుల పువ్వులలో..
ఒదిగి నలిగి పోమా... !!

!! చిరకాల బంధీనేనే నీ కౌగిళ్ళలో!!

పసిడి మోము శోభణివై 
ఏడేడు జన్మల బంధానివై 
మూడు ముళ్ళ దాంపత్యముతో 
ముచ్చటైన మల్లెల పర్యంకముపై 
సృష్టి కార్యానికి సన్నద్దమవుదాం.. 
పాతికేళ్ళ పరువానికి పరదాలు తొలగిద్దాం.. !!

!! చిరకాల బంధీనేనే నీ కౌగిళ్ళలో!!

గాండీవమంటి నడుమును చుట్టి.. 
కన్నె సొగసులను శరముగా పట్టి.. 
సంధిస్తున్నా ఉద్రేకామామృతములను
వేణువై, విపంచివై, నాదమువై, నిస్వనమై
నన్నేలవే నా భావ గీతికవై.. 
నా హృదయ కోవెల కన్నికవై .. !!

!! చిరకాల బంధీనేనే నీ కౌగిళ్ళలో!!

వెచ్చని కౌగిళ్ళ మధురిమల నడుమన 
సరస సయ్యాటల సమర ఖేళిలో 
రసోద్బవ సరస మధురిమల పరిష్వంగములలో... 
తుంటరి నిట్టూర్పుల తో.. 
ఇరువురి ఓటమిని ఒప్పుకుంటూ.. 
స్వేదములతో తడిచిపోమా.. 
శ్వాసలతో ఏకమై పోమా.. !!

Written by : Bobby Nani

Tuesday, March 20, 2018

నా ప్రియ నేస్తమా.. !విరహ కవిత్వం రాయడం కవి యొక్క నైపుణ్యతను, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.. విరహంలో కూడా చుట్టూ వున్న ప్రకృతిని మిళితం చేస్తూ రాయడం వల్ల ఆ కవితకు మరింత సౌందర్యాన్ని చేకూర్చవచ్చు.. ఇందులో ఆమె ప్రస్తావన లేకుండా కేవలం ఆమెపై గల భావాలను మాత్రమే ఉద్దేశించి రాయడం జరిగింది.. అందరికీ కాకపోయినా విరహంలో వున్న కొందరికైనా నా ఈ కవిత మనసుకు తాకుతుందని ఆశిస్తున్నాను.. చదివి అభిప్రాయం చెప్తారు కదూ..


దుఃఖసాగరం ఆవలి వైపున్న నా 
ప్రియ నేస్తమా.. !
నన్నూ ఆ దరికి చేరమంటున్నావా .. ?? 

రావాలనే ఉంది కానీ .. 
నువ్వెక్కిన వయ్యారి నావ 
నేనేక్కితే తిరగబడతా నంటోంది.. 
తన శరీరం మీద పడ్డ 
నీ చరణార విందాల జాడలు 
చెరిగిపోతాయనేమో ..!!

నువ్వెళుతుంటే 
హృదయాన్ని చీల్చుకొని 
తారల్ని రాల్చిన ఆకాశం 
నే బయలుదేరుతుంటే 
చిమ్మ చీకటి ముసుగేసింది..!!

నీ ముఖ చంద్రబింబం వాడుతుందేమోనని 
మబ్బులచాటుకెళ్ళిన సూరీడు 
నాపై నిప్పుకణికల్ని విసురుతున్నాడు.. !!


అయినా 
వాటి పిచ్చిగానీ 
నేనటువైపున ఎందుకు లేను.. 
ఎలానో నా హృదయం నీతోనే ఉందిగా.. !!

ఉగాదులొచ్చినా, 
యుగాలు దాటినా, 
నీకై ఎదురుచూస్తూ
కాలపు సంకెళ్ళను 
లెక్కపెడుతూ ఉండిపోతానలా..!!

అప్పటికీ 
ఇప్పటికీ 
ఎప్పటికీ 
నాకు దూరం నీ దేహం మాత్రమే 
మనసెప్పుడూ నీతోనే.. నీలోనే.. !!

Written by : Bobby Nani

Saturday, March 17, 2018

ఆరితేరిన వేటగాడు ..


జన సంఘర్షణల్లోంచి 
మనోగర్షణల్లోంచి 
జనియించేదే జీవ కవిత్వం.. !
విశ్వమే దాని పరివాహక ప్రాంతం..!
సత్యమే దాని ప్రాకృతిక సూత్రం..!
అది 
సామాజిక మంత్రదండం 
వైజ్ఞానిక కమండలం ..!!

మరి కవిత్వం అంటే.. ?? 
కుతంత్రాలను విప్పి చెప్పేది.. 
కరకు కరవాలాన్కి పని కల్పించేది.. 

మరి కవి.. 
జీవితపు లోతుల్ని తాకి చూసేవాడు.. 
అమృత విషాల్ని గ్రోలి తెలిపేవాడు.. 

అతడెలా ఉంటాడు .. ?? 
అనుభవాలలో ఆరితేరిన వేటగాడు 
అతను పంపే ఒక్కొక్క పదం
పులి గుండెల్లో లోతుగా పాతుకుపోయే 
పదునైన బాణం లా 
భావకుల హృదయాలలోకి చొచ్చుకుపోతుంటుంది.. !!

Written by : Bobby Nani

Friday, March 16, 2018

ప్రణయాన్వితం ..


మనసులు కలిసిన ఇద్దరి మధ్య ప్రణయం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పే ప్రయత్నమే ఇది.. 
ఇది ప్రణయ కవిత్వం.. ఇంచుమించు భావ కవిత్వానికి దగ్గరపోలిక ఉన్నా మజ్జిగనుంచి కమ్మని వెన్న బయటపడినట్లు ఈ ప్రణయం ఉత్పన్నమౌతుంది.. అదో మధురానుభూతి.. రెప్పలు రెండూ తమకముతో, తన్మయత్వముతో మూతపడే క్షణాలు రాలుతూ ఉంటాయి.. స్త్రీ, పురుషుల నిష్కల్మషమైన, అచంచలమైన ప్రేమకు గుర్తుగా ఈ ప్రణయాన్ని వ్రాసాను.. సాహిత్య ధోరణితో చదివి.. ప్రణయి, ప్రణయినిలా అభిప్రాయం చెప్పమని ఆశిస్తున్నాను.. 

ప్రణయాన్వితం .. 
*************

ఆరోజు ఇంకా గుర్తుంది.. 
అదో ప్రాతఃకాల సమయం.. 
రాత్రంతా నక్షత్రాలతో క్రీడించిన చంద్రుడు 
అలసినట్లు కనిపిస్తున్నాడు.. 
నదీ కెరటాలపై పున్నమి వెన్నెల 
నవనీతపు నాట్యం చేస్తోంది.. 
భూదేవి గాఢ నిద్రలో ఉంది.. 
అప్పుడే పూసిన కొన్ని పువ్వులకు 
వన దేవతలు రంగులు అద్దుతూ, 
చిట్టచివరి నాజూకు నొక్కులు నొక్కుతున్నారు.. 
పచ్చగా, మెత్తగా, వొత్తుగా పెరిగిన గరిక మీద 
శ్వేత, నీల నాగులు పెనవేసుకున్నట్లు 
నీవు, నేను ఉన్నాము.. !!

పైనుంచి పున్నాగ, పారిజాత కుసుమాలు పడ్డప్పుడల్లా 
నీ వొళ్ళు పులకరించేది.. 
నీ ప్రతీ గగుర్పాటుకు నే ముద్దులిచ్చే వాడిని.. 
అలా కొన్ని గడియలు మన్మధ క్రీడలో 
పూల పరిమళంతో కలిసి మన ప్రేమ 
సౌరభం ఆ వనమంతా ఆవరించింది.. !! 

చంద్రుడు పశ్చిమానికి జరుగుతున్నాడు.. 
మా ఈ ఏకాంతం ఇంకా వీడలేదు.. 
దూరాన గచ్చ పొదల్లోంచి ఓ కుందేలు 
అకస్మాత్తుగా బైటికి దుమికింది.. 
దాని చప్పుడుకు నెమళ్ళు భయపడి గట్టిగా అరిచాయి.. 
వాటి అరుపులతో వనమంతా మేల్కొంది .. మాతో సహా.. !!

ఆమె మనసులో ఆలోచనలు రేగాయి..!!
వెంటనే నాపై కుమ్మరించిందిలా..!!

ఈ రాత్రి ఏ కరుణ దేవతో నా చెవి దగ్గర చేరి 
విశ్వ రహస్యం చెప్పి, నా మనసును ఉద్రేకపరిచి, 
నీ దగ్గరకు పంపించిందేమో .. !!
గతరాత్రి మర్చిపోలేని మధుర జ్ఞాపకాన్నందించావు 
ఆ క్షణాన నువ్వు నన్ను స్వీకరించక పోయివుంటే 
నా బాధను, 
అంధకారాన్ని, 
విరహాన్ని, 
నిరాశను, 
నిర్జీవత్వాన్ని, 
అభిమానాన్ని 
ఎలా భరించి నేను జీవించగలిగేదానను.. ??
సెలయేళ్ళకు తన ప్రణయి ... సాగరుడున్నాడు.. !!
పువ్వులకు ... తుమ్మెదలున్నాయి ..!!
చకోరానికి ... చంద్రుడు వున్నాడు.. !!
నాకు ?? ... నువ్వు తప్ప ఇంకెవ్వరున్నారు ? 
అంటూ ఆమె దీనత్వానికి కన్నులు రెండూ 
రెప్పవేయక చూస్తూ వుండిపోయానలా ..!!

చెట్ల ఆకుల్లోంచి చంద్రుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు.. 
చంద్రుణ్ణి చూస్తూ .. 
ఓ ప్రణయీ..!!
ఇలా నీకోసం విరహపడి, మధనపడి
విదినీ, లోకాన్నీ తిడతాను కానీ 
అసలు నీ ప్రేమను పొందిన నా జీవితం 
ఎంత ధన్యమైనదో, ఎంత ఔన్నత్యాన్ని పొందినదో..
ఎంత ఆనందాన్ని అనుభవించినదో .. 
ఒక్కసారైనా ఆలోచిస్తానా.. ?? 
అందాన్ని, ఆనందాన్ని, 
ప్రేమను, ప్రణయాన్ని, 
మోహాన్ని, శృంగారాన్ని 
వాటి అంచుల వరకు నీ నుంచి రుచి చూసి 
అనుభవించిన నేను 
ఈ బాధా, 
ఈ వియోగం,
ఈ విరహం ఎంత నన్ను 
నలిపి, చంపి, కాల్చి, భస్మం చేస్తున్నా 
జ్వలించే నీ ప్రేమలో నా జీవితం 
ప్రజ్వలిస్తూనే ఉంటుంది..!!
అంటూ నా ముఖవంక తదేకంగా చూస్తూ .. 

నీ రూపాన్ని ఆరాధిస్తున్నంత కాలం, 
నీ ప్రేమను అనుభవిస్తున్నంత కాలం, 
నేను నవజీవనాన్ని పొందుతాను.. 
ఈ పూర్ణ వికసిత పుష్పంలో ఇన్నాళ్ళూ 
నిశ్చలంగా, నిర్మలంగా, నిగూఢంగా 
దాగివున్న మధువును ఎప్పుడు, ఏ 
తుమ్మెదొచ్చి ఆస్వాదిస్తుందా ?? అని ఎదురు చూసాను.. 
గత రాత్రితో నా ఆశ, ప్రయత్నం పరిపూర్ణత చెందాయి.. 
ఈ క్షణం మరణం నన్నావరించినా 
చిరునవ్వుతూ స్వీకరిస్తానలా...!!

Written by : Bobby Nani

Friday, March 9, 2018

SOCOTRA (The Mysterious Island) from Bobby... 17th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఎమ్మా నీ కేమనిపిస్తుంది అని ప్రసన్నకుమార్ భాటియా ఆ అమ్మాయిని ప్రశ్నిస్తాడు..

అయ్యో .. నాకేమి తెలియదండి.. నాకు బయటి ప్రపంచం గురించి తెలియదు… కాని ఈ కట్టడం నాకు కోవెలలా అనిపిస్తుంది అని చెప్తుంది..

కోవెల.. అంటూ అందరూ వెటకారంగా నవ్వడం ప్రారంభిస్తారు..

నవ్వకండి అని కోపంగా ప్రసన్నకుమార్ భాటియా అందరినీ వారిస్తాడు..

ఆమె చెప్పింది అక్షరాల నిజం .. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..

ఆ మాటతో ఆశ్చర్యపోయిన వారంతా ఎలా చెప్పగలిగారు అని ఆమెను ప్రశ్నిస్తారు..
ఏమి లేదు ఈ ప్రదేశం చూడటానికి చాలా ప్రశాంతంగా, చుట్టూరా విశాలంగా వుంది.. అదికాక సముద్రమట్టానికి చాలా ఎత్తులో వుంది..ఇక్కడనుంచి చూస్తే చూట్టూరా చాలా మైళ్ళు దూరంవరకు మొత్తం కనిపిస్తుంది.. కోవెలను ఇలానే నిర్మించేవారు నాటి రోజుల్లో .. అన్నిటికన్నా ముఖ్యం ఆ గోడలపై మన భారతదేశం యొక్క బ్రహ్మలిపి చెక్కబడి వుంది.. ఈ లిపి కేవలం పవిత్రమైన గోడలపైనే చెక్కుతారని శాస్త్రం చెప్తోంది.. కోవెల కన్నా పవిత్రత మరేమి ఉంటుంది .. ఇలా నాకు అనిపించింది అని ఆ అమ్మాయి సమాధానం ఇస్తుంది..

ఇవి విన్న వారంతా కళ్ళు అలానే పెద్దవి చేసి ఆమెనే చూస్తూ ఉండిపోయారు ..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
17th Part

మరి మీరెలా చెప్పగలిగారు అని మోహన్ ప్రసన్నకుమార్ భాటియాను ప్రశ్నిస్తాడు.. 

చెప్తాను అందరూ ఇలా రండి అని అక్కడ వున్న మరో గోడను చూపిస్తాడు. 

అది సూర్య, చంద్రుల గుర్తులతో అనంత విశ్వాన్ని చూపెడుతోంది.. ఇక్కడ చూసారా సూర్య, చంద్రుల మధ్యన ఈ రాతి గుట్ట ఆకారంలో ఈ నిర్మాణం వుంది.. 

పక్కన చూసారా అందరూ ఈ రాతిగుట్టను రెండు చేతులతో మ్రోక్కుతున్నట్లుగా ఒకరివెంట మరొకరు నిలబడి వున్నారు.. అదీకాక ఈ “SOCOTRA” దీవిలో కొన్ని శతాబ్ధాలకు మునుపు ఇక్కడ కనిపించే సూర్య, చంద్రులను మాత్రమే ఆరాధించేవారు అని చదివాను.. అందుకే ఇక్కడ విగ్రహాలు ఉండవు .. ప్రతిమలు ఉండవు అని సమాధానం ఇస్తాడు.. 

మాకు తెలియకుండా మీరు ఇక్కడి విషయాలన్నీ బాగా పుస్తకాల రూపంలో చదివి వచ్చారన్నమాట అని ఆకాష్ అంటాడు.. పిల్లల్ని తీసుకొని ఓ తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ పరిస్థితులన్నిటినీ తెలుసుకోవద్దూ ... అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఇంకా ఏం తెలుసు మీకు అని అడుగుతాడు మోహన్.. 

దీనికింద ఓ పెద్ద నేలమాలిగ వున్నట్లు చదివాను.. కాని అది అత్యంత ప్రమాదకరమైనది అని రాసుంది.. 

నేలమాలిగ … !!

అయితే తప్పకుండా అదేంటో తెలుసుకోవాలి… !!


ప్రమాదం అన్నారంటే తప్పకుండా అందులో ఏదో ఉండే ఉంటుంది ..అని మోహన్ అంటాడు.. 

అన్ని తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు.. కాని ఆ తెలుసుకునే ప్రయత్నం ప్రాణాలను బలితీసుకునేంతలా ఉండకూడదు అని నా అభిప్రాయం.. అని ప్రసన్నకుమార్ భాటియా అంటాడు.. 

క్షమించండి … అని మోహన్ సమాధానమిస్తాడు.. 

నాకు చాలా దాహంగా వుంది అని ఆ అమ్మాయి ఆకాష్ ని అడుగుతుంది .. వారు తెచ్చుకున్న నీరు చాలా తక్కువ మోతాదులో వుంది..అందులోనుంచి కాస్త నీరు ఆమె నోటిలోకి పోస్తున్నాడు ఆకాష్.. 

ఆమె రెండు దోర పెదవులను దూరంగా చేసి తలపైకెత్తి నీరు త్రాగుతున్న దృశ్యం ఆకాష్ నవనాడులలో నూతన స్పందనలను కలిగిస్తున్నాయి.. పెదవి కొసల నుంచి జాలువారిన నీటి బిందువులు ఆమె గవుదము నుంచిగా మెడమీదకు చేరుకొని అక్కడనుంచి క్రిందగా పయనించి హృదయ వేదికపైకి చేరుకొని కనుమరుగౌతున్నాయి .. shhhh.. ఈ క్షణం ఆ నీటి బొట్టులా మారినా నా జన్మ ధన్యమే కదా అని అనుకుంటూ .. వెళ్లి ప్రక్కన కూర్చుంటాడు.. సుకుమారంగా ఆమె తన పారాణి హస్తములతో అధరములకంటిన నీటి బిందువులను పమిట కొంగుతో తుడ్చుకుంటూ చకోరిలా ఆకాష్ వైపే చూస్తూ సమ్మోహన బాణాలను వడి వడిగా సంధిస్తోంది.. 

వీరిద్దరి చూపులకు తాళలేక ప్రసన్నకుమార్ భాటియా కాసేపు అందరం ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం … మళ్ళి మనకు ఇలా విశ్రాంతి దొరుకుతుందో లేదో.. అని అంటాడు… 

అలా అనడమే ఆలస్యం.. అందరూ తమతమ వస్తువులను ప్రక్కనపెట్టి కాసేపు నడుము వాలుస్తారు.. అలానే మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు మోహన్.. ఇంతకుముందు మోహన్ కి వచ్చిన కల మళ్ళి పునరావృతం అవుతుంది.. “అఘోరా” మళ్ళి కనిపిస్తూ .. నాకు చాలా సమీపానికి వచ్చావ్ … పైన ఏముందని కూర్చుని వున్నావ్.. పాతాళానికి రా.. నేనిక్కడే వున్నాను.. నీ ఊపిరి నాకు తగుల్తోంది.. నాలో నూతన ఆనందాన్ని ఉసిగొల్పుతోంది.. అని అంటాడు… ఉలిక్కిపడి మేల్కొన్న మోహన్ ను ఏమైంది అంతలా భయపడ్డావ్ అని అడుగుతాడు ప్రసన్నకుమార్ భాటియా.. 


నా…నా ....కు.. నాకు.. నాకు మళ్ళి ఆ …ఆ .. కల వచ్చింది.. మా గురువు గారు నాకేదో చెప్తున్నారు.. అర్ధం కావట్లేదు.. అని వణుకుతున్న తన స్వరంతో సమాధానమిస్తాడు.. ఆయనేమన్నారు అని అడుగుతాడు … నా ఊపిరి ఆయనకు తగుల్తుందంట .. పాతాళానికి రమ్మన్నారు అని చెప్తాడు.. పాతాళం ఇక్కడ ఎక్కడ వుంది… ఊపిరి తగలడం ఏంటి నాకేమి అర్ధం కావట్లేదు అని చిన్నోడైన సంతోష్ అంటాడు.. ఆ .. గుర్తొచ్చింది.. ఆయన మరొకటి కూడా అన్నారు.. పైన కూర్చుని ఏం చేస్తావ్.. పాతాళానికి రా నేనక్కడే వున్నాను.. అని అన్నారు.. అంటే నాకిందనే వున్నారనే గా అర్ధం.. ఇక్కడ నేల మాలిగ కూడా ఉందని మీరేగా చెప్పారు .. అయితే నేను వెంటనే అక్కడకు వెళ్ళాలి అని మోహన్ అంటాడు.. సరే నీతో పాటు మేమూ వస్తాం పదా.. అని ప్రసన్నకుమార్ భాటియా అంటాడు.. ఇక అందరూ వారి వారి సామాగ్రిని సర్దుకొని నేల మాలిగ లోనికి దారి కోసం వెతుకులాట ప్రారంభిస్తారు.. 

అందరూ ఎంతో సేపటినుంచి వెతుకుతూనే వున్నారు కాని వారెవరికీ కిందకు వెళ్ళే మార్గం దొరకలేదు.. ఇక అందరూ అలసి ఆ పెద్ద రాయిపై కూర్చుంటారు.. అలా అందరూ కూర్చుని ఆలోచిస్తూ వుండగా.. కళాఖండాలను నిశితంగా పరిశీలిస్తుంది ఆమె.. అది గమనించిన ప్రసన్నకుమార్ భాటియా… 

అమ్మా… అంతలా చూస్తున్నారు మీకేమైనా అర్ధం అయిందా అని అడుగుతాడు … అర్ధం అయిందో లేదో తెలియదు కాని ఆ కలాఖండంలో అందరూ ఈ రాతిని మొక్కుతున్నట్లుగా వుంది.. బహుశా ఈ రాయిలోనే ఏదో విషయం దాగుంది అని చెప్తుంది.. 

ఆ మాట చెప్పిన వెంటనే అందరూ ఒక్కసారిగా ఆ రాయిమీద నుంచి లేచి నిల్చుంటారు.. ఆకాష్, మోహన్ లు ఆ రాయికి దగ్గరగా వెళ్ళి నిశితంగా పరిశీలిస్తున్నారు.. దాన్ని ప్రక్కకు జరపడానికి, కదపడానికి చాలా ప్రయత్నిస్తున్నారు .. కాని ఇసుమంత కూడా అది కదల్లేదు … మళ్ళి వారికి నిరాశే ఎదురైంది.. 

కొన్ని క్షణాలు అందరిలో మౌనం … 

అప్పుడే ఆకాష్ లేచి నిల్చొని నాకు ఒక ఆలోచన వచ్చింది..అని అంటాడు.. మన చుట్టూ ప్రక్కల రకరకాల కలాఖండాలతో కొన్ని చెక్కి వున్నారు… కొన్ని శిధిలమై వున్నాయి.. కొన్ని విరిగి పడి వున్నాయి.. వాటి అన్నిటినీ మనం సేకరించి పరిశీలిస్తే తప్పకుండా ఈ నేలమాలిగ గురించి ఏదో ఒక దానిలో ప్రస్తావించి ఉంటారు.. మనం తెలుసుకోవచ్చు.. మన ముందు వున్నది ఇది ఒక్కటే దారి అని చెప్తాడు.. 

ఆకాష్ మాటలు వారికి నచ్చి అందరూ వెంటనే పని మొదలు పెడతారు… ఇలా కొన్ని గంటలు వెతుకుతూనే వుంటారు.. మెల్లిగా చీకటి పడటం మొదలైంది.. ఈ రాత్రికి ఇక్కడే వుండాలని వారు భావిస్తారు.. 

మంటకు కావాల్సిన వంట చెరుకు సమకూర్చుకుంటారు.. మంచి చోటు చూసి మంట వెయ్యడం మొదలు పెడతారు.. అందరూ మంటకు దూరంగా కూర్చుని మాట్లాడుకుంటూ వుండగా.. చిన్నోడు అయిన సంతోష్ తగ్గుతున్న చిన్న మంటను గమనించి మరిన్ని పుల్లలు వేస్తాడు.. టప టపమనే శబ్దంతో మంట కాస్త పెద్దదిగా ఒక్క క్షణం మండి తగ్గుతుంది.. ఆ ఒక్క క్షణంలో వారు ఉంటున్న రాతిగుట్టలో ఎన్నో రాతలు, బొమ్మలు పసిడికాంతులతో ఒక్కసారిగా వెలిగి ఆరిపోయాయి. 

ఆశ్చర్యచికితుడైన సంతోష్ .. వెంటనే .. మీరు ఇది గమనించారా అని అంటాడు.. 

నిజానికి ఎవ్వరూ ఆ పసిడికాంతులను చూడలేదు.. 

ఏమైంది రా అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

నాన్నా .. నేను ఇక్కడ ఎండు పుల్లల్ని వెలిగించగానే ఇక్కడ మన చుట్టూ వున్న రాళ్ళపై యేవో కాంతులు కనిపించాయి.. అంటూ చాలా ఆశ్చర్యంగా తన రెండు కళ్ళూ పెద్దవిగా చేసి చెప్పాడు.. 

అందరూ సంతోష్ కి దగ్గరగా వచ్చి.. నిజమా.. ఏది మళ్ళి మంట పెద్దదిగా వెయ్యి అని మోహన్ అంటాడు… 

ఈ సారి మరిన్నిపుల్లలు వెయ్యగానే ఆ రాతి గుట్ట మొత్తం పసిడికాంతులతో నిండిపోయింది.. చుట్టూరా ఏవేవో రాతలు, ఆకారాలు, గుర్తులు, బొమ్మలు ఇలా ఎన్నో… అందరూ ఆశ్చర్యపోయి నోర్లు ఎల్లబెట్టి చూస్తూ వుండిపోయారు.. అలానే మంటను మండిస్తూనే వుండు సంతోష్ .. మనకు కావలసినవి తప్పక ఇక్కడ ఉంటాయి అని అంటాడు మోహన్… 

ఇదంతా చూస్తున్న ప్రసన్నకుమార్ భాటియాకు ఒక్క విషయం అర్ధం అయ్యి ఇలా అంటారు.. 

ఇక్కడ వున్న కళాఖండాలు చాలా అద్బుతంగా రూపొందించినవి .. సృష్టి ఆవిర్భావం మొదలు, అంతం అయ్యే వరకు ఈ కళాఖండాల రూపంలో ఆనాటి పండితులు పొందుపరిచారు.. ఆనాటి వారల మేధోసంపత్తి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది...అని అంటూవుండగానే.. ఆ పసిడి కాంతులలో వారికి సమీపమున ఉన్నటువంటి రాతిగుట్ట కనిపిస్తుంది.. ఆ రాతిగుట్టపై సూర్యుని అరుణవర్ణ కిరణాలు పడుతున్నట్లుగా ఉంది.. అది చూచిన వారందరికీ విషయం అర్ధం అవుతుంది… 


చూసారా సూర్య కిరణాలు ఆ రాతిగుట్టపై పడి ఏదో నిఘూడ అర్ధాన్ని మనకు చెప్తున్నట్లు ఉన్నాయి.. అని మోహన్ అంటాడు .. 

బాగా గమనించు మోహన్ .. ఆ సూర్య కిరణాలు నేరుగా ఆ రాతిగుట్టపై పడట్లేదు.. ఒక 7 అడుగుల మనిషి నిలుచుకున్న దానికన్నా కాస్త ఎత్తునుంచి ఆ కిరణాలు రాతిగుట్టపై పడుతున్నాయి.. ఇది అసాధ్యం.. దాదాపుగా 3 డిగ్రీల కోణంలో ఉండొచ్చు.. ఈ కోణంలో కిరణాలు పడటం ఎలా సాధ్యం అని ప్రసన్న కుమార్ భాటియా అంటారు.. 

ఎందుకు సాధ్యం కాదు నాన్న గారు.. మీరన్నట్లు 7 అడుగుల మనిషి కన్నా కాస్త ఎత్తు.. 3 డిగ్రీల కోణం రెండూ షుమారుగా ఓ తొమ్మిది అడుగుల ఎత్తునుంచి పడుతుండొచ్చు .. అంటే సూర్య కిరణాలు ఏటవాలుగా ఒక తొమ్మిది అడుగుల బింబం మీద పడి అక్కడనుంచి నేరుగా ఈ రాతిగుట్టపై ప్రతిబింబంగా పడుతున్నాయోమో .. ఆలోచించండి.. అని ఆకాష్ అంటాడు.. 

చాలా గొప్పగా చెప్పావ్ ఆకాష్ అని మోహన్ అంటూ.. ఇక్కడ మనం మరోటి కూడా ఆలోచించాలి .. ఆ ఏటవాలు సూర్య కిరణాలు ఏ సమయంలో ఆ బింబం పై పడుతున్నాయో మనం కనిపెట్టాలి.. అంతే కాదు.. ఎంత సమయం ఆ బింబంపై ఉంటాయో కూడా చూడాలి.. ఇదంతా మనకు తెలియాలంటే ముందు మన చుట్టూ 9 అడుగుల ఎత్తులో వున్న ప్రతీ చోటును మనం వెతకాల్సి ఉంటుంది.. వెంటనే మొదలు పెడదాం రండి అంటూ మోహన్ అంటాడు.. 

అనుకున్నదే తడువుగా అందరూ వెతకనారంభించారు.. చూట్టూ గోడలపై తలోదిక్కూ వెతుకుతున్నారు..కానీ ఫలితం శూన్యం.. ఎక్కడా చిన్న ఆచూకీ కూడా దొరకలేదు... నిరాశా, నిస్పృహల మధ్యన, నిద్రాభంగంతో, అలసిన నయనాలతో తలోదిక్కున అందరూ సతికిలపడ్డారు.. 

మెల మెల్లగా తెల్లవారుతోంది… అందరిలో అసహనం తాండవిస్తోంది…. అనవసరంగా మనమంతా ఇక్కడకు వచ్చామేమో అనే ఒత్తిడి వారిలో తారాస్థాయికి చేరుకుంది.. ఆ సమయంలో వారి ఆలోచనా ధోరణి మొద్దుబారిపోయింది.. గత కొన్ని రోజులుగా నిద్ర, ఆహారం లేని కారణంగా, అలసిన దేహంతో చెయ్యి కూడా కదుపలేని స్థితిలో వారు ఉన్నారు.. 

To be continued …

Written by : BOBBY

Saturday, March 3, 2018

మళ్ళి రావా..


ఈ మధ్య కాలంలో నేను చూసిన అన్నీ చిత్రాలలో నా మనసుకు హత్తుకున్న చిత్రం .. “మళ్ళి రావా” ..

మహా మహుల చిత్రాలు వచ్చినప్పటికీ వాటి అన్నిటిలో లేనిదేదో ఇందులో ఉంది అనే భావనను ఈ చిత్రం నాకు కలిగించింది.. 

నాలుగు చెత్త డైలాగ్ లు, 
మూడు డబల్ మీనింగ్ మాటలు 
రెండు గాల్లో ఎగిరే ఫైట్స్ 
ఒక ఐటమ్ సాంగ్ ఇదే సినిమా అనుకునే నేటి ప్రజానీకానికి ఒక్క ఫైట్ లేకుండా, ఒక్క ఐటమ్ సాంగ్ లేకుండా, చెత్త డైలాగ్ లు, డబల్ మీనింగ్ మాటలు లేకుండా అద్బుతమైన కథా, కథనం తో గౌతం తిన్నానూరి గారు గొప్ప సాహసమే చేసారని చెప్పొచ్చు.. 

నక్కా రాహుల్ యాదవ్ గారు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి, శ్రావణ్ భరద్వాజ్ గారు చక్కని సంగీతాన్ని సమకూర్చి చిత్రం చూస్తున్నంత సేపూ మనల్ని ఓ క్రొత్త లోకానికి తీసుకువెళ్ళగలిగారు.. 

ఇక హీరో.. సుమంత్ గారు.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, గోదావరి, గోల్కొండ హై స్కూల్ వంటి అద్బుతమైన చిత్రాలతో మనలను అలరించి ఈ చిత్రంలో ఏకంగా ఆయన నట విశ్వరూపాన్ని చూపించేశారు.. ముఖ్యంగా ఆయన ముఖ కవళికలు ఈ సినిమాకు మరింత ఆకర్షనీయం.. 

హీరొయిన్ – ఆకాంక్ష సింగ్ .. తన అమాయకత్వంతో, పొడి పొడి మాటలతో, కలువల చూపులతో యువకుల గుండెలను ఒడిసి పట్టుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు... 

చిత్రం పరంగా ... జరిగింది, జరిగేది మర్చి మర్చి చూపిస్తూ, అద్బుతమైన టేకింగ్ తో ఎక్కడా కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లియర్ గా తను ఏవిధంగా మనకు చూపాలనుకున్నారో అలానే చూపగలిగారు.. ఓ డైరెక్టర్ గా తను ఇక్కడ విజయం సాధించారు.. చక్కని మాటలకూర్పుతో, చూడచక్కని ఫోటో గ్రఫీ తో వీక్షించే వారిని మరింత ఆకట్టుకున్నారు.. 

ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నిజంగా ఇంతలా ప్రేమిస్తాడా.. ?? 

ఇన్ని సంవత్సరముల తరువాత చూస్తే కూడా కళ్ళలో అదే ఆత్మీయ మాధుర్యాన్ని చూపిస్తాడా.. ?? 

మొదటి ప్రేమ ఎంత బాగుంటుందో.. ఎంత గొప్పదో అంతే అందంగా ఆవిష్కరించారు.. 

చిన్నతనంలో ఆ పిల్లాడు అన్న మాట నాకు చాలా బాగా నచ్చింది.. “అమ్మా, నాన్న అంటే ఇష్టం.. నా స్నేహితుడు బంటి అంటే ఇష్టం అలానే మీ అమ్మాయి అన్నా కూడా ఇష్టం” అందరూ నాకు ఒక్కటే అనే మాట నిజంగా మనసును గెలుచుకుంది.. కార్లో హీరో తన బాధను హీరోయిన్ కు చెప్పే సందర్భం ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణ.. అలానే ఇందులో మరో డైలాగ్ హీరో ఫ్రెండ్ హీరోయిన్ తో “నువ్వు ఉన్నప్పుడు వాడు ఎలా ఉంటాడో నీకు తెలుసు... కాని నువ్వు వెళ్ళాక వాడు ఎలా అయిపోతాడో నాకు మాత్రమే తెలుసు..” కళ్ళలో నీరు గిర్రున తిరుగుతాయి ఈ మాటకు.. అన్నిటికన్నా ముఖ్యం హీరో స్నేహితునికి, హీరో కి మధ్య సాగే స్నేహం.. నభూతో న భవిష్యతి .. 

చిన్ననాటినుంచి వారి మధ్య ఎంత గొప్ప స్నేహం ఉందో కళ్ళకు కట్టినట్లు చూపగలిగారు.. ప్రేమికులు ఎలా ఉండాలో, ఒక భార్య భర్త ఎలా ఉండకూడదో అద్బుతంగా చూపారు.. ఇలా చెప్పుకుంటూ పోతే రెండున్నర గంటలో క్షణానికో గొప్పతనం ఉంది ఈ చిత్రంలో.. 

ఇది కేవలం నా భావన మాత్రమే.. 

సినిమాకు రివ్యూ రాసేంత గొప్పవాడిని కాను.. 

నా మనసుకు అనిపించిన భావాలను ఇలా మీ ముందుకు దొర్లించాను.. 
మంచి విలువలు వున్న చిత్రం.. చూసిన వారు ఉంటే తప్పక మీ అభిప్రాయాలను పంచుకోండి..

చూడని వాళ్ళు మాత్రం ఓ మంచి చిత్రాన్ని కోల్పోయారని చెప్పుకోవచ్చు.. 

స్వస్తి __/\__

Written by : Bobby Nani